వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు!‘‘స్పెసిఫిక్‌గా దెయ్యాలు ఈ భూమ్మీద చేసే పనేదైనా ఉంటుందా అని నాకో సందేహం’’ అన్నాడు శ్రీజన్ నవ్వుతూ. ‘‘స్పెసిఫిక్‌గా అంటే?’’ అన్నాడు విక్రమ్. ‘‘హెచ్‌ఆర్‌కి హెచ్‌ఆర్ పనులు, అకౌంట్ సెక్షన్‌కి అకౌంటింగ్ పనులు ఉన్నట్లు దెయ్యాలకు సపరేట్‌గా ఏదైనా జాబ్ ఉంటుందా అని’’ అన్నాడు శ్రీజన్. విక్రమ్ నవ్వాడు. ‘‘నేననుకోవడం మనుషుల్ని పీక్కుతినడం వాటి పనేమోనని’’ అన్నాడు. శ్రీజన్ నవ్వాడు. మనుషుల్ని పీక్కుతినడానికైతే మేనేజర్‌లు, సెక్షన్ హెడ్‌లు ఉన్నారుగా.. భూమి నిండా! దెయ్యాలు పనిగట్టుకుని తిరగడం ఎందుకు?’’ అన్నాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. విక్రమ్ కొంచెం ఎక్కువగా నవ్వాడు. శ్రీజన్ దెయ్యాల్ని నమ్ముతాడు. విక్రమ్ దెయ్యాలంటే నవ్వుతాడు. అందుకే కొంచెం ఎక్కువగా నవ్వాడు.
శ్రీజన్, విక్రమ్ ఇద్దరూ రూమ్మేట్స్. రూమ్మేట్సే కానీ, వాళ్లను రూమ్మేట్స్ అనేందుకు లేదు. ఆ రోజు ఉదయమే వాళ్లు రూమ్ తీసుకున్నారు. వర్కింగ్ మెన్స్ హాస్టల్‌లోని షేరింగ్ రూమ్ అది. ఇద్దరుండే రూమ్. ఇద్దరూ బ్యాచిలర్స్. ఇద్దరివీ వేర్వేరు ఉద్యోగాలు, వేర్వేరు ఆఫీసులు. హాస్టల్ రూమ్ కోసం వెతుక్కుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒకరికొకరు పరిచయం అయ్యారు. మొదట రూమ్స్ ఏమీ ఖాళీగా లేవన్నాడు హాస్టల్ మేనేజర్. వాళ్లేం ఉసూరుమనలేదు. ఇది కాకపోతే ఇంకోటి అన్నట్లు మాటల్లో పడిపోయారు.‘‘ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఈ నెలాఖరుకు ఒక రూమ్ ఖాళీ అవుతుంది’’ అన్నాడు మేనేజర్. ‘వేరే చూద్దాం’ అన్నట్లు చూశాడు విక్రమ్.. శ్రీజన్ వైపు. ‘ఇక్కడైతే బాగుండేది’ అన్నాడు శ్రీజన్. ‘‘అవును’’ అన్నాడు విక్రమ్. ఆ హాస్టల్ ఇద్దరి ఆఫీసులకీ దగ్గరగా ఉంది. ఆ వయసులో ఉన్నవాళ్లు నడుచుకుంటూ వెళ్లి, నడుచుకుంటూ వచ్చేంత దగ్గరగా.‘‘పోనీ, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటారా.. ఒక గది ఖాళీగా ఉంది’’ అన్నాడు మేనేజర్. వీళ్లిద్దరి మాటలూ వింటున్నాడతను. ‘‘ముందు లేదన్నారు?!’’ అన్నాడు విక్రమ్. ‘‘సెకండ్ ఫ్లోర్ హాస్టల్ కిందికి రాదు. సపరేట్ రూమ్ అది. ఒకటే ఉంటుంది. ఎవరైనా ఇమీడియట్‌గా కావాలి అన్నప్పుడు ఇస్తుంటాం. నచ్చితే మీరు మళ్లీ రూమ్ మారనవసరం లేదు అక్కడే ఉండొచ్చు’’ అన్నాడు మేనేజర్. అడ్వాన్స్ ఇవ్వడానికి ముందు.. రూమ్‌ని ఒకసారి చూసి వచ్చి, ఆఫీస్‌కి వెళ్లిపోయారు శ్రీజన్, విక్రమ్. రూమ్ శుభ్రంగా ఉంది. ఒకటే ఫ్యాన్. రెండు సింగిల్ కాట్ బెడ్‌లు. గదిలోకి చక్కగా గాలి వీస్తోంది. ఒక కిటికీ ఉంది. గాలి కోసం దాన్నైతే తీసే అవసరం లేదు. పగలు సిటీ లైఫ్‌నీ, రాత్రిపూట సిటీ ౖలైట్స్‌నీ చూడాలనుకుంటే ఆ కిటికీలోంచి చూడొచ్చు. రూమ్‌కి ఎటాచ్డ్‌గా వాష్‌రూమ్ ఉంది. అందులో గోడకు చక్కటి ఫ్రేమ్ ఉన్న అద్దం బిగించి ఉంది. అద్దం కింద సింక్. ఇద్దరికీ ఆ రూమ్ నచ్చింది. ఆ రాత్రి బయటే మీల్స్ చేసి హాస్టల్‌కి వచ్చారు. హాస్టల్‌లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. మూడూ ఉంటాయి. అయినా, బయటే తిని వచ్చారు. రేపట్నుంచీ ఎలాగూ ఇక్కడే తినాలి కదా అనుకుని ఉండొచ్చు.
పక్కపక్కనే, కాస్త ఎడంగా ఉన్న కాట్‌ల మీద వెల్లకిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు శ్రీజన్, విక్రమ్.. చాలాసేపటిగా. వాళ్లకా రూమ్ బాగా నచ్చింది. కనీసం ఏడాది పాటైనా ఆ రూమ్ మారకూడదని అనుకున్నారు. అంతగా నచ్చింది. అది హాస్టల్ రూమ్‌లా లేదు వాళ్లకు. శ్రీజన్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో విక్రమో, విక్రమ్ వాళ్ల గెస్ట్ హౌస్‌లో శ్రీజనో ఉన్నట్లుగా ఉన్నారు. వాళ్లలా మాట్లాడుకుంటూ.. ఎప్పుడు వెళ్లిపోయారో, ఎందుకు వెళ్లిపోయారో తెలీకుండానే దెయ్యాల టాపిక్‌లోకి వెళ్లిపోయారు! దెయ్యాలు ఉన్నాయనీ, లేవనీ వాళ్లేం వాదించుకోలేదు. ఊరికే దెయ్యాల గురించి మాట్లాడుకున్నారంతే. ఆ తర్వాత ఎప్పటికో గాని వాళ్లకు నిద్రపట్టలేదు.‘‘ఖాళీ చేస్తున్నాం’’ అన్నాడు విక్రమ్, ఆ మర్నాడే! ‘‘ఏమైంది?’’ అన్నాడు మేనేజర్. ‘ఏమైంది?’ అని అన్నాడే గానీ, ఏమైందో తెలుసుకోవాలన్న ఆసక్తి అతడిలో లేదు. ‘‘రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. వాళ్లకు తెలిసిన వాళ్లిళ్లు ఖాళీగా ఉందట. ముగ్గురం కలిసి ఉందాం రమ్మన్నాడు’’ అని చెప్పాడు శ్రీజన్. ‘‘అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేం’’ అన్నట్లు చూశాడు మేనేజర్. హాస్టల్ రిసెప్షన్ నుంచి బయటికి వచ్చి నిలుచున్నారు శ్రీజన్, విక్రమ్. వాళ్ల ముఖాల్లో రిలీఫ్ కనిపిస్తోంది. ‘‘సార్.. రాత్రే చెబుదామనుకున్నాను మీకు. ఆ రూమ్ మంచిది కాదు సార్’’ అన్నాడు హాస్టల్‌లో వీళ్లకు కనిపించిన మనిషి, దగ్గరికొచ్చి. రూమ్మేట్స్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘ఇప్పుడిది మెన్స్ హాస్టలే కానీ, మొదట్లో ఉమెన్స్ హాస్టల్. ఇప్పుడు మీరు దిగిన రూమ్‌లోనే అప్పుడు ఒకమ్మాయి ఉండేది. తనొక్కతే ఉండేది. ఓ రోజు ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచీ ఆ గదిలోనే ఉంటోంది’’ అన్నాడు ఆ మనిషి. ‘‘నువ్వేం చేస్తుంటావ్ ఇక్కడ’’ అన్నాడు విక్రమ్. ‘‘వాచ్‌మేన్‌ని సార్, ఉమెన్స్ హాస్టల్‌గా ఉన్నప్పట్నుంచీ నేనే వాచ్‌మేన్‌ని’’ అన్నాడు ఆ మనిషి. శ్రీజన్, విక్రమ్ ఆ రోజు సాయంత్రం మళ్లీ కలుసుకున్నారు.‘‘నీకెందుకలా అనిపించింది?’’ అడిగాడు శ్రీజన్. ‘‘రాత్రి వాష్‌రూమ్‌కి లేచినప్పుడు అద్దంలో చూశాను’’ అన్నాడు విక్రమ్. ఉలిక్కిపడ్డాడు శ్రీజన్. ‘‘నాకూ ఆ అద్దంలోనే’’ అని చెప్పాడు. ‘‘ఏం చూశావ్.. అద్దంలో?’’ విక్రమ్ అడిగాడు. ‘‘నువ్వు కనిపించావ్’’ అన్నాడు శ్రీజన్. ఈసారి విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘మరి నీకు?’’ అడిగాడు శ్రీజన్. ‘‘నాకేం కనిపించలేదు’’ అన్నాడు విక్రమ్. ‘‘మరి!’’‘‘అద్దంలో చూసుకుంటున్నప్పుడు నాకు నేనైనా కనిపించాలి కదా’’ అన్నాడు విక్రమ్.
- మాధవ్ శింగరాజు
ఇద్దరు ధైర్యవంతులు
Published Sun, Apr 15 2018 12:27 AM | Last Updated on Sun, Apr 15 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment