
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం 'వీర ధీర సూర'. తంగలాన్ లాంటి సూపర్ హిట్ తర్వాత చియాన్ విక్రమ్ నటించిన సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ గురువారం రోజే బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఓవర్‌సీస్ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ తగిలింది. ఈ మూవీ మార్నింగ్ షోలు ఓవర్‌సీస్‌లో రద్దైనట్లు తెలుస్తోంది. అలాగే మనదేశంలోనూ పలు మల్టీప్లెక్స్‌ల్లోనూ మార్నింగ్ షోలు పడలేదు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మార్నింగ్ షోలు రద్దు కావడంతో డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ ఆయా థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు సందేశాలు పంపించారు.
అయితే ఈ మూవీ విడుదల ఆగిపోవకడానికి ఓటీటీ హక్కులే కారణంగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ విషయంలో నిర్మాతలు క్లారిటీ ఇవ్వకపోవడంపై వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఓటీటీ హక్కులు విక్రయిస్తామంటూ చేసుకున్న ఒప్పందాన్ని నిర్మాతలు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. నిర్మాణ సంస్థ అయిన హెచ్‌ఆర్ పిక్చర్స్‌తో తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు విడుదల ఆపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా.. ఈ చిత్రంలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు, సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించారు.