ఒంటరితనంతో సహవాసం చేసేవాడికి సమాజంపై విపరీతమైన అసహ్యమైనా ఉంటుంది. లేదా జాలితో కూడిన ప్రేమైనా కలుగుతుంది. పురుషోత్తం ఎప్పట్నుంచో ఒంటరి. అరవైకి దగ్గరవుతోన్న ఒంటరి. సమాజాన్ని ప్రేమించడం అతనికి ఈ ఒంటరితనమే ఎలాగో అలవాటు చేసింది. జీవితాన్ని అతను ఇష్టపడతాడు. నాగేశం కూడా ఒంటరివాడే. పెళ్లైన ఒంటరివాడు. పెంచిన కూతురు ప్రేమ పేరుతో వెళ్లిపోవడం, పై చదువులకని వెళ్లిన కొడుకు పరదేశంలోనే స్థిరపడిపోవడం, అతని దురదృష్టమో, ఆమె అదృష్టమో అతని భార్య ఏకంగా పరలోకానికే వెళ్లిపోవడం అతణ్ని ఒంటరివాడ్ని చేశాయి. పురుషోత్తం, నాగేశం ఇంచుమించు ఒకే వయస్సు వారు. ఒకే కాలనీలో ఉంటారు. చాలాసార్లు ఎదురుపడి ఉంటారు ఒకరికొకరు.
ఇద్దరి జీవితాల్లోకి ఒకరోజు...
ఆరింటికి అలారం మోగగానే పురుషోత్తం నిద్రలేస్తాడు. ఇవ్వాళ ఆరుకు ముందే ఎవరో తలుపు తడుతున్న చప్పుడు. లేచి తలుపు తెరిచాడు. రమేశ్. ఏదో టెన్షన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ‘‘రమేశ్.. ఇంత పొద్దున్నే ఏంటి? ముందు లోపలికి రా! ఎందుకలా టెన్షన్ పడుతున్నావ్?’’ అన్నాడు పురుషోత్తం.‘‘సార్ అదీ,’’ రమేశ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. పురుషోత్తం రమేశ్‌ను శాంతపరిచాడు. ‘‘సర్! ఒక పన్నెండు వేలు కావాలి. మళ్లీ రేపు ఉదయం ఆరింటికల్లా ఇచ్చేస్తాను,’’ అడిగాడు రమేశ్. మళ్లీ అతనే కొనసాగిస్తూ – ‘‘బాబుకి యాక్సిడెంట్ అయింది. చాలా క్రిటికల్‌గా ఉంది. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోలేదు,’’ రమేశ్ ముఖంలో టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు. పురుషోత్తం మారు మాట్లాడకుండా వెళ్లి బీరువాలోంచి డబ్బు తీశాడు.‘‘రేపు బాబు బాగున్నాడనే మాట చెప్పి డబ్బు తిరిగిస్తావు కదూ!’’ అంటూ రమేశ్ అడిగిన డబ్బును అతని చేతిలో పెట్టాడు. రమేశ్ ఆ డబ్బును అందుకొని కృతజ్ఞతగా పురుషోత్తం వైపు చూస్తూ, అక్కణ్నుంచి వేగంగా వెళ్లిపోయాడు. ముందురోజు డాక్టర్ రాసిచ్చిన మందులు కొనాలనే తన అవసరం కంటే రమేశ్ కొడుక్కి అత్యవసరమైన వైద్యానికి తన డబ్బు ఉపయోగపడుతున్నందుకు పురుషోత్తం చిన్న ఆత్మసంతృప్తి పొందాడు. వాతావరణం వర్షానుకూలంగా తోచడంతో వర్షం రావడం కంటే ముందు తనే ఆఫీస్‌కెళ్లాలని డైలీ రొటీన్‌లో పడిపోయాడు. నాగేశం నిద్ర లేవగానే అతని మనసంతా చిరాకుగా, చిందరవందరగా ఉంది. పక్కనే బల్లపై ఉన్న చీటీపాట పుస్తకాన్ని అందుకుని, తనకు డబ్బు ఇవ్వాల్సిన వారి చిట్టాని రాస్కుని లెక్క సరిగ్గా చూసుకోవడంతో మనసులోని చిరాకు తగ్గటంతో పాటు తనరోజు కూడా మొదలైంది.
వర్షం మొదలైంది. గొడుగు తీస్కొని ఆఫీస్‌కి బయల్దేరిన పురుషోత్తానికి ఇంటిముందు రోడ్డు మీద ఒక చిన్న బుజ్జి కుక్కపిల్ల చలికి వణుకుతూ కనిపించింది. ఆగిపోయాడు. పదుల సంఖ్యలో వాహనాలు పరిగెత్తుతున్నా కుక్కపిల్ల అదృష్టమో, లేక వాహనాలు నడిపేవారు చాకచక్యంగా ఉన్నారో ఆ కుక్కపిల్లను మాత్రం తప్పించి నడుపుతున్నారు. ఆ కుక్కపిల్లను రోడ్డు మధ్యలో చూస్తుంటే పురుషోత్తం మనసు చలించిపోయింది. ఆలస్యం చేయకుండా రోడ్డు మధ్యలోకి వెళ్లి దాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇంటి వరండాలోని బల్లకింద పాత మసిగుడ్డల మధ్యలో ఉంచాడు. ఇప్పుడది ప్రశాంతంగా ఒకదగ్గర కూర్చుంది. ఆఫీస్ చేరుకున్న నాగేశం అడుగు లోపల పెట్టగానే ప్యూన్ వేణు, చేతిలో ఒక డబ్బాతో ఆఫీస్‌లోని ఒక్కో క్యాబిన్‌కూ తిరుగుతుండటం చూశాడు. విషయమేంటో లాగటానికి పక్క క్యాబిన్ లింగరాజును కదిలించాడు నాగేశం. ‘‘ఏమోయ్ లింగరాజు! వేణు ఏదో డబ్బా పట్టుకొని అంతలా తిరుగుతున్నాడు! ఏంటి అతగాని సంగతి?’’ ‘‘మీకు ఇంకా విషయం తెలీదా? మన పక్క బిల్డింగ్ అకౌంట్ సెక్షన్‌లోని విశ్వనాథం నిన్న సాయంత్రం చనిపోయాడు. అతని కుటుంబానికి ఆర్థిక సాయంగా మన ఆఫీస్ స్టాఫ్ తోచినంత డబ్బు ఇవ్వమని మేనేజ్‌మెంట్ సూచన....’’ ఇంకా ఏదో చెప్తోన్న లింగరాజు మాటలు నాగేశం చెవులను చేరట్లేదు. ముఖం దీనంగా పెట్టడానికి ప్రయత్నిస్తూ లోపల విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నాడు. నెలరోజుల ముందు తన కూతురి పెళ్లికని దాచిన డబ్బుని వడ్డీకి విశ్వనాథం నాగేశానికివ్వటం, ఆ డబ్బుని అంతకంటే ఎక్కువ వడ్డీకి బయట వేరేవాళ్లకు ఇవ్వడం, విశ్వనాథం దురదృష్టం కొద్దీ ఈ విషయం వీరిద్దరికీ తప్ప ఎవ్వరికీ తెలియకుండటం జరిగాయి. నాగేశం ఆనందానికి అవధుల్లేవు. వేణు చేతిలోని ఫండ్ డబ్బాలో తన తరఫున వంద రూపాయలు వేశాడు. తన మాటలు వింటున్నాడో లేదో పట్టించుకోకుండా విశ్వనాథం గురించి చెప్పుకుపోతున్న లింగరాజు, నాగేశం డబ్బాలో వంద వేయడం చూసి ఆశ్చర్యపోయాడు.మధ్యాహ్నం భోజనం ముగించుకొని తన కుర్చీ వద్దకు చేరుకున్న పురుషోత్తానికి నాలుగు కుర్చీల ఆవల ఒక ముసలావిడ కనిపించింది. రెండు గంటల నుంచి అక్కడే ఉందని స్ఫురణలోకి వచ్చి ఆమెను గమనించాడు. ఆ ముసలావిడ అభ్యర్థనను పట్టించుకోకుండా బల్లకింద తన చేతిని తృప్తి పరుస్తున్న వారి పత్రాలను మాత్రమే పరిశీలిస్తూ పనిలో నిమగ్నతను నటిస్తున్న వరుణ్‌ని ఏమనాలో పురుషోత్తానికి అర్థంకాలేదు. ముసలావిడని తన బల్ల వద్దకు పిలిపించుకొని రెండొందల రూపాయలు ఆమె చేతిలో ఉంచి చెవిలో ఏదో చెప్పి మళ్లీ వరుణ్ దగ్గరకు పంపాడు పురుషోత్తం. వరుణ్ బల్ల ముందుకు చేరిన ముసలావిడ బల్ల కింద చేయి ఉంచింది.
‘‘ఇదిగో మీరడిగిన డబ్బులు సారూ!’’ ఆశ్చర్యపోయాడు వరుణ్. ‘‘ఇప్పటివరకూ లేని డబ్బు ఇప్పుడెలా వచ్చింది?’’ ‘‘ఎలాగో అలా.. నా పని మాత్రం చేసి పెట్టండి సారూ!’’ ఆమె మాటలు అతణ్ని తప్పునైనా సరిగ్గా చేయమని ఆదేశిస్తున్నట్లుగా అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన పురుషోత్తాన్ని చూసిన వరుణ్ నిల్చున్నాడు. కూర్చోమని సైగ చేస్తూ పక్కనే తనూ కూర్చున్నాడు పురుషోత్తం.‘‘ఆ రెండొందలు ఇచ్చింది నేనే! దొంగనోట్లేం కాదయ్యా. ఆమె ఇస్తే తీసుకునే డబ్బుకి ఎంత విలువుందో నేనిచ్చే డబ్బుక్కూడా అంతే విలువుంటుంది.’’ ‘‘సార్! సారీ సర్..’’ ఒక్కక్షణం ఆగాడు పురుషోత్తం. ‘‘ఇప్పుడు బల్లకింద తీస్కునే డబ్బుతో ఏది కొన్నా ఆలోచించో, అవసరమయ్యో కొనవు. కొన్నాక అది నీ జీవితంలో ఎక్కువ రోజులు ఉండదు కూడా. కానీ ఇలా వచ్చే డబ్బు కోసం డెబ్భై ఏళ్ల ముసలావిడని ఇన్ని గంటలపాటు నిల్చోబెట్టి పట్టించుకోకపోవడం మాత్రం ఆమెకి మిగిలిన జీవితం మొత్తం గుర్తుంటుంది..’’ ‘‘ఒకరికి మంచి చేయమని నేను చెప్పట్లేదు. వరుణ్! నీ పని నిన్ను చేయమంటున్నానంతే’’. తన కుర్చీ వద్దకు వెళ్లిపోయాడు పురుషోత్తం. వరుణ్ కళ్లలో సన్నటి నీటి చెమ్మ. సాయంత్రం నాలుగ్గంటలకే ఆఫీసు నుంచి బయల్దేరిన నాగేశం తనకు ఇవ్వాల్సిన వారి నుంచి చీటీ డబ్బుల్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్కొని అటునుంచి అటే మద్యం దుకాణానికి వెళ్లాడు. ఒంటరిగా కూర్చుని తన ఒంటరితనాన్ని తనే పంచుకుంటున్నాడు. గ్లాసులో మందు ఖాళీ అయ్యేకొద్దీ మత్తు ఎక్కుతూ ఉంది. చివరి గ్లాసు తాగేసి బయటకి వచ్చిన నాగేశానికి తన బైక్‌కు అడ్డంగా పడుకున్న ఒక కుక్క కనిపించింది. విచక్షణని మత్తు కమ్మేయడంతో ఆ కుక్కని బలంగా ఒక్క తన్ను తన్నాడు. అది నాలుగు అడుగుల దూరంలో ఎగిరిపడింది. దాని మూలుగు శబ్దాన్ని కూడా పట్టించుకోకుండా బండిపై వెళ్లిపోయాడు నాగేశం.
ఆకాశాన్ని విపరీతంగా కమ్మిన మబ్బులు వర్షం తీవ్రతని సూచిస్తుండటంతో పాటు వెలుగును తొందరగా సన్నబరుస్తున్నాయి. ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరిన పురుషోత్తం ఈరోజుకి హోటల్లో బిర్యానీ పొట్లాన్ని కొని ఇంటికెళ్లాడు. పురుషోత్తం వెళ్లిన రెండు నిమిషాలకు అదే హోటల్‌లోని చివరి బిర్యానీ పొట్లాన్ని నాగేశం కొనుక్కొని ఇంటికి బయల్దేరాడు. వర్షం క్షణక్షణానికీ ఉధృతంగా మారిపోతోంది. ఇంటికి చేరుకున్న పురుషోత్తం స్నానం చేసి తినడానికి కూర్చున్నాడు. పొట్లం విప్పి తినబోతున్న అతనికి ఒక్కసారిగా వరండాలో బల్లకింది కుక్కపిల్ల గుర్తొచ్చింది. హడావుడిగా అక్కడికెళ్లి చూశాడు. చలికి వణుకుతూ, ఆకలికి మూల్గుతున్న బుజ్జి కుక్కను చూసి వెంటనే తాను తెచ్చుకున్న పొట్లాన్ని దాని మూతికి అందించాడు. ముక్కుతూ మూల్గుతూ తింటున్న దాన్ని చూసి చిన్న నవ్వు నవ్వుకుని టీవీ ముందుకొచ్చాడు. ‘ఓ నిండు చందమామ’ అంటూ వస్తున్న పాటను వింటూ వెనక్కి ఒరిగి కళ్లు మూసుకున్నాడు. ఎప్పటిలాగే తన లక్ష్మి గుర్తొచ్చింది. చిన్ని చిరునవ్వు నోటి మీదకొచ్చింది. సహారా ఎడారిలో ఉన్నా కూడా మనసును మంచుతో నింపే ఆమె జ్ఞాపకాలంటే పురుషోత్తానికి ప్రాణం. ప్రాణంగా ప్రేమించిన లక్ష్మి తనని కాదనడానికి ఎన్నైనా కారణాలుండొచ్చు. కానీ ఇన్నేళ్ల తన ఒంటరితనాన్ని ఆమె జ్ఞాపకాలు ఎంత మధురంగా చేశాయో తనకు తెలుసు. అందుకే ఆమెంటే ఎప్పటికీ ప్రేమే. కానీ ఎందుకో తెలీదు ఈరోజు తను ఎక్కువగా గుర్తొస్తోంది. ఆలోచిస్తూనే పురుషోత్తం మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
మరోవైపు అదే వీధిలో పురుషోత్తం ఇంటికి నాలుగు ఇళ్ల ఆవల ఉన్న తన ఇంట్లోకి చేరాడు నాగేశం. హోటల్ నుంచి తెచ్చుకున్న చివరి బిర్యానీ పొట్లం అవ్వడం వలన మసాలా బాగా ఎక్కువ మోతాదులో ఉన్నా ఆకలి నకనకలాడుతుండటంతో ఫుల్లుగా లాగించేశాడు. భుక్తాయాసంతో మంచం పైకి చేరి ఒక్కసారి తనకు రావాల్సిన చీటీ పద్దులు లెక్క చూసుకొని అలాగే మంచం పైకి ఒరిగాడు. భార్య చనిపోయి ఇన్నేళ్లయినా మామ తనకు ఇవ్వాల్సిన కట్నాన్ని సగానికి పైగా ఎగ్గొట్టినందుకు ఆయన్ను, తన డబ్బుతో చదువుకొని విదేశాలకు వెళ్లి ఒక్కపైసా కూడా పంపనందుకు కొడుకునీ, తన ఇష్టంతో సంబంధం లేకుండా వేరేవాణ్ని చేసుకున్నందుకు కూతుర్నీ.. ఇలా అందర్నీ తిట్టుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారిపోయాడు నాగేశం. అర్ధరాత్రి పన్నెండు అవుతోంది. ఆరిపోయే దీపపు వెలుగులా వర్షం తన ప్రతాపాన్ని పెంచింది. గాఢ నిద్రలో ఉన్న పురుషోత్తం, నాగేశంల గుండెల్లో ఏదో చిన్న రాయి కదిలినట్టు సన్నని నొప్పి. ఆ నొప్పి పెరుగుతూ పెరుగుతూ నిద్ర గాఢతను తగ్గిస్తోంది. ఇద్దరూ పూర్తిగా మేల్కొనేసరికి వారి ఎడమ చేయి గుండెపై, కుడి చేయి పక్కన దొరికిన వస్తువును బలంగా పట్టుకున్నాయి. ఆ అర్ధరాత్రి వారి శరీరాన్ని ప్రకృతికి అప్పగించి వెళ్లిపోవడం తప్ప చేసేదేమీ లేదని వారి మెదడు సూచిస్తూనే ఉంది. కుంభవృష్టిలా కురిసిన వర్షం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టి ఆగిపోయింది. అప్పటివరకూ వేగంగా కొట్టుకున్న శరీరాలు కదలడం ఆగిపోయి మెల్లగా చల్లబడటానికి సిద్ధమయ్యాయి.
సెంచరీ కొట్టడానికి ఉపయోగపడే చివరి పరుగు ఎంత అమూల్యమైందో రమేశ్‌కి తెలుసు. అందుకే తన కొడుకు వైద్యానికి కావాల్సిన చివరి చిన్న మొత్తాన్ని సర్దిన పురుషోత్తం ఇంటి తలుపును చెప్పిన సమయానికి తట్టాడు. ఉదయం ఆరు గంటలకు ఠంచనుగా నిద్రలేచే అలవాటున్న పురుషోత్తం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోకి చూసిన రమేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కాసేపటికి ఆ వీధి, ఇంకాసేపటికి ఆ కాలనీ కూడా ఉలిక్కిపడ్డాయి. మరోవైపు సమాజం అవసరాలతో సంబంధం లేకుండా బతికే నాగేశం ఇంటివైపు ఎప్పట్లానే ఎవ్వరూ వెళ్లలేదు. వెళ్లరు కూడా. రక్త సంబంధీకుల రాకపోకలు కూడా ఉండకపోవటంతో అతని ఇల్లు కిటికీలు, తలుపులున్న అతిపెద్ద సమాధిలా ఉంది. చూస్తుండగానే పురుషోత్తం ఇంటిముందు చేరిన జనం సంఖ్య ముందురోజు పడిన వర్షపు చినుకుల సంఖ్యను తలపిస్తోంది. ఒకరికి తెలియకుండా ఒకరికి అతను చేసిన సహాయాలను ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఒక సంఘజీవి చనిపోయాడంటూ మనస్ఫూర్తిగా బాధ పడుతున్నారు. అంతిమ యాత్ర మొదలైంది. పురుషోత్తం శరీరాన్ని ఒకరితర్వాత ఒకరు పోటీ పడుతూ శ్మశానానికి కదులుతున్న జనాల్ని చూస్తుంటే అంతిమ యాత్ర కూడా ఒక అద్భుతంగా కనిపిస్తోంది. ఆ జనాలతో పాటే తనకు తెలిసో తెలీకో ఒక చిన్న కుక్కపిల్ల ముందురోజు రాత్రి సగం తిన్న బిర్యానీ పొట్లాన్ని వదిలేసి వారితో పాటు వెళ్తూ ఉంది. ఆ కుక్కపిల్లతో పాటు అంతిమ యాత్రలో పాల్గొన్న చాలామందికి తెలియదు, పురుషోత్తం ఏదో ఒక సమయంలో వారికి సాయం చేశాడని. పురుషోత్తం, నాగేశం చనిపోయి పన్నెండు గంటలయింది. పురుషోత్తం శరీరం శ్మశానంలో నిశ్శబ్దంగా కాలిపోతోంది. నాగేశం శరీరం ఎవ్వరి పట్టింపూ లేక అంతే నిశ్శబ్దంగా, భయంకరంగా కుళ్లిపోతోంది.
అంతిమ యాత్ర
Published Sun, Apr 15 2018 12:22 AM | Last Updated on Sun, Apr 15 2018 12:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment