![Funday new story of the week nov 11 2018 - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/11/Talakimdulu-small.jpg.webp?itok=eiPWwiTi)
ఎండాకాలమనే స్పృహ లేకుండా, మబ్బులన్నీ తలోమాటా అనేసుకొని రాత్రి చీకటిని మోసుకొచ్చాయి మధ్యాహ్నం పూటే. పది సంవత్సరాలైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగులోనే కూరుకుపోయిన మా శర్మ గాడికి, వాడి ఫ్రస్ట్రేషన్ చూపించుకోడానికి ఒక కారణం దొరికింది ఇవాళ. తెల్లని కాగితాల్లో, నల్లగా ఇరుక్కున్న మా జీవితాలను, ఎర్రగా ఖూనీ చేసి, ట్యూబ్ లైట్ వెలుతురులో, మాడిపోయిన మా మొహాలను చూసి కసిగా నవ్వుతూ, ఫస్ట్ ఇంటర్నల్ పేపర్స్ ఇస్తున్నాడు.ఈ ఏడు ఎలాగైనా గట్టెక్కేయాలని, వేణుగాడు మునుపెన్నడూ లేని విధంగా ముందు బెంచి పుస్తకాల కళ్లజోడులను సవరిస్తున్నాడు ఈ సెమిస్టరు మొదటి రోజు నుండే. ‘‘ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్’’ అనేది వాడి తీరు. సార్ పేపర్ ఇచ్చిందే తడవుగా, నిక్కర్‌కి పిర్రకాడ బొక్కపడితే చొక్కాతో కవర్ ఎలా చేసుకుంటామో, అలా ఆ ఆన్సర్ షీట్‌ని వెంటనే వాడు ఒక ముద్దలా చుట్టి బ్యాగ్‌లోకి దొబ్బాడు. క్లాస్ లో నక్కి ఉండే వీడు, బయట మాత్రం ఒక ‘ఫెరోసియస్’ విద్యార్థి నాయకుడు. మెస్‌లో మధ్యాహ్నం తిన్న తియ్యటి సాంబార్ కి నిద్రవస్తునట్టు ఉంటే, జీన్స్ ప్యాంటుకి బొక్క పడేంతగా తొడని మాటిమాటికీ గిచ్చుకుంటున్నా. నా నంబర్ పిలిచాడు అకస్మాత్తుగా. చివరిబెంచిలో కూర్చునే నా నల్లటి చెమట వాసనని ఎన్ని సార్లు పీలవలేదు, తలెత్తకుండానే నన్ను గుర్తు పట్టినట్టున్నట్టు, ముక్కును సవరించుకుంటున్నాడు. ఇందాక స్టూడెంట్ క్యాంటీన్‌లో సిగరెట్ తాగటం చూసాడనుకుంటా, మా ట్యూబ్ లైట్ నీడలు దగ్గరవుతున్నకొద్దీ చేతులు వింతగా ఆడిస్తున్నాడు, ఇంకా తగలబెట్టని పచ్చి శవం మీద వాలే ఈగలను అదిలిస్తున్నట్టు ‘‘షుడ్ ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్’’ అని గట్టిగా అరచి, ఎడంచేత్తో పేపర్ పారేసి, ఇంకా మిగిలిన గొర్రె పిల్లల మెడలు కొరకడానికి అందంగా నోరు తెరిచాడు.
‘‘ఖాతా ఐనా తెరిచావా?’’ అన్న వేణుగాడి వెకిలిచూపులకి సమాధానంగా, నా పేపర్ వాడి బల్లమీద వేసి, శర్మగాడు మిగిల్చిన పంటి గుర్తులను లోపలనుండి తడుముకుంటూ వెళ్లి కూర్చున్నా. రెండు గంటల విందు భోజనం తరువాత, తేన్చుకుంటూ, పొట్టమీద కుడిచేత్తో నిమురుకుంటూ వెళ్ళిపోయాడు.మళ్ళా క్యాంటీన్‌కి పోయినం, రెండు జేబుల్లో ఇంకొన్ని కబుర్లు నింపుకోవడానికి. గోధుమరంగు వేడి నీళ్ల పొగని, ఎండిపోయిన నారింజరంగు పెదాలతో తాగడం మొదలెట్టాను. బెంగాలీ ‘బోల్చి’ గాడి బీడీ ముద్దు పెట్టుకున్న ఘాటుకు, దగ్గొచ్చి, పొరలు పొరలుగా మాట్లాడుతుంటే, ఎందుకో నాన్న గుర్తుకు వచ్చాడు.పదో తరగతిలో అనుకుంటా, జెండాపండుగ ముందు రోజు ఇంటిబెల్లు ముందు పీరియడ్‌లో క్విజ్ పోటీ పెట్టారు. దానిలో మొదటి ప్రైజ్ వచ్చిందని నాన్నకి ఆ రాతిరి చెపుతుంటే, ‘‘మన రాష్ట్రానికి ఆర్థికశాఖ మంత్రి కూడా ఎవడో తెలియదరా, నా కొడకా?’’ అంటూ, జుట్టు పట్టుకొని, సారాయి ఘాటుని, నా మొఖంపై పిడికిలి గుర్తుగా విడిచిపెట్టాడు. ఆ రోజు ఈ ప్రశ్న ఒక్కటే మా గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేయనిది. ఫలితంగా, ఆ సంవత్సరం లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల పేర్లు, ఢిల్లీ మంత్రుల పేర్లు నోట్స్ అట్టల మీద, బచ్చల కాయల రసంతో రాసుకున్నా, ఎప్పటికి చెరిగిపోకూడదని.నేను ఫెయిల్ కావడమే ఇష్టం లేనివాడు, రీకోర్సు మీద రీకోర్సు చేస్తున్నాడు అని తెలిసి ఉంటే, ఏమి చేసి ఉండేవాడో ఇప్పుడు. పాపం, చనిపోయి బతికిపోయాడు.
వేణుగాడు కూడా మాతో పాటే కూర్చున్నాడు. అసలు వాడి చుట్టూ ఎప్పుడూ, రసి కారే పుండు మీద గియ్యిన వాలే చిన్ని చిన్ని నల్ల దోమల్లాగా ఇద్దరు, ముగ్గురు, క్యాంపస్ సచ్చు రాజకీయ సొదని తగరపు శబ్దాల్లా మోగిస్తుంటారు. వీడేమో, పెంటకుప్పపై అక్కడక్కడా మొలిచే పిచ్చిమొక్కల్లా ఉన్న గడ్డాన్ని ఎడంచేత్తో బరుక్కుంటూ, మనుషుల పునాదుల్లో దాక్కున్న అమానుషత్వపు తెరలకు కారణం ఏమైఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నట్టు స్ఫురించేలా ఓ పనికిమాలిన పోజు పెట్టి, చెట్ల గుబుర్లోకి తీక్షణంగా చూస్తూన్నాడు.అటుగా వెళ్తున్న ‘నార్త్’ జూనియర్ వీడిని చూసి, ఒక మొహమాటపు నవ్వు తగిలించుకొని మావైపు వచ్చింది. వీడు కూడా, తెగిపడినట్టుండే కింద పెదవితో ఓ ‘నవ్వు’లాంటి శబ్దాన్ని చాలా కష్టంతో ‘సహజంగా’ వదిలాడు. అప్పుడు వాడి మొహం, మట్టి రోడ్డు మూల మలుపులో మెల్లగా నోరు తెరుచుకుని కాచుకునుండే రాళ్ళ బావిలాగా ఉంది.‘‘రేపు అడ్మినిస్ట్రేషన్‌లో నీ సర్టిఫికెట్స్ ప్రాబ్లమ్స్ నేనొచ్చి మాట్లాడతా’’ అని చెప్పి, ఇంకా తన మోచేతి నీళ్లు తాగి ఎంత మంది ఈ యూనివర్సిటీలో బతుకు లాగిస్తున్నారో అని ఓ లెక్కల చిట్టా విప్పాడు. ‘‘యూ ఆర్ ఏ కైండ్ పర్సన్’’ అన్న తన మాటలకి అడ్డుపడి, ‘‘యూ డోంట్ హ్యావ్ టు బీ థ్యాంక్ ఫుల్ టు మీ. ఐయామ్ డూయింగ్ వాట్ ఐయామ్ సపోజ్డ్ టూ డు’’ అని అన్నాడు. వాడి తీయని ఆ ఇంగ్లీష్ మాటలు, ఆ చేతి విరుపులు అచ్చం నీరుకట్ల పాము బుసలు కొడుతున్నట్టే. ఆ అమ్మాయి చేయి చాచి కృతజ్ఞత చెపుదామనుకుంటే, వీడేమో ఒక నమస్కారం పెట్టి తన ‘‘సంస్కారాన్ని’’ ప్రసవించాడు.
ఈ శుక్రవారం ఏదో పండగ వచ్చి సెలవులు ఎక్కువగా వచ్చేసరికి, ఇంటికి పోవాలనుకున్నా, లోపల పేరుకున్న చెత్తైనా వదులుతుందేమో అని. రెండువందల కిలోమీటర్లని, ఐదు గంటల్లో తినేసిన ట్రైన్ ఇంజిన్ నన్ను మా మండలంలో విసర్జించింది. ఇంకొక ఆరు కిలోమీటర్లలో ఉన్న మా ఊరు పోవాలంటే, ఖాండ్రుఖాండ్రుమంటున్న ఆటోలే దిక్కు. రెండు గంటల కాలయాపన ఉక్కపోతల తరువాత, ఎనిమిది మంది అప్పీ ఆటోలో ఎక్కితే గాని, పోయినసారి ఎలెక్షన్ల హామీలకు గుర్తుగా మిగిలిన చిరుగులు రోడ్డు మీదకు టైర్లు కదలలేదు. కంకర కంటే గుంతలు ఎక్కువున్న రోడ్డు ఎగుడు దిగుడులకు, నెత్తి బొప్పికట్టకుండా, చెమట పట్టిన చేత్తో సైడ్ కడ్డీ పట్టుకొని,పైకి కిందకి జారుతున్నా.అరగంట తరువాత ఏదో జ్ఞాపకం వచ్చినట్టు బ్రేకు వేయగానే, యూనివర్సిటీ తాలూకా నిరాశను బ్యాగ్ లో పడేసి, చెప్పుల తపతపల్లో రేగిన జుట్టు గాయాలను సవరదిద్దుకుంటూ ఇంటికి నడిచినా.నాటుకు పొయ్యొచ్చి, పళ్ళు గట్టిగా బిగించి అరిగిపోయిన మోచిప్పలను చేత్తో కుదుపుతూ, ఇంకొక చేత్తో కొంగుకంటిన బురదని దులుపుకుంటుంది అమ్మ. శబ్దం చేయకుండా బ్యాగ్ ని మొత్తల్లో పడేసి, గాబుకాడికి పొయ్యా, మొఖానికి రాత్రి అంటిన రమ్ మరకలు ఎక్కడ అమ్మ చూసేస్తుందన్న భయంతో.కండవతో పైచెక్కులన్నీ వొలుచుకొని, ముసుగులన్నీ తుడుచుకున్న తరువాత, ప్లాస్టరింగ్ ఇంకా చేయని గోడకతికించిన అద్దంలో, అయిదేళ్ల క్రితం హైద్రాబాద్ పోయిన అప్పటి ‘నేను’ కనిపించాను.
ఆ చీకట్లోనే నాకిష్టమైన చింత చిగురు దూసుకొచ్చి, ఉల్లిగడ్డలతో కలిపి వండి, కూర సట్టి ముందు పెట్టి, అంతవరకూ నా మీద పెట్టుకున్న ఆశలన్నీ పళ్లెంలో అన్నంలా తోడింది. హాస్టల్ కూరలు బాగోక, పచ్చడి కలుపుకున్న రాత్రులు తెచ్చిన అల్సర్ మంటలు అమ్మకి తెలియనీయకుండా, సగం వదిలేసిన ఆ అన్నం పెడ్డకి, ప్రయాణిక బడలిక కారణం అని అబద్ధం చెప్పా.ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ, మంచంలో పడుకున్న నా పక్కనొచ్చి కూర్చుంది. చిన్నప్పుడు ఆటల్లో తల్లో చిక్కుకున్న ఇసుకను తీస్తునట్టుగా, నా జుట్టులో వేళ్ళు కదుపుతూ– ఇటు చూడరా నీకొక మాట చెప్పాలనంది.‘‘చిన్నీ, నీ సావాసగాడికి కూడా మొన్న ఉద్యోగమొచ్చే. ఇప్పుడు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. మరి నువ్వు కూడా ఇంగ ఎదో ఒకటి చూస్కో నీ పొట్టకి’’ అని, ఆ చీకట్లో వేడిగానున్న నా మూసివున్న కళ్ళను పదే పదే తడుముతుంది.పుల్లిగాడు, నేను పదోతరగతి వరకు క్లాస్మేట్లం. మా స్కూల్ సెకండ్ ర్యాంక్ వాడిని, టీటీసి దారుల్లోకి లాక్కొనిపోతే, నాకొచ్చిన మండల సెకండ్ ర్యాంక్, మా ఊర్లో డబ్బులున్న ఆసామి ‘దాతృత్వానికి’’ ఆకర్షించబడింది. ఆయన ‘చలువ చేత’, ఒక ప్రయివేటు ఇంటర్ కాలేజ్ ఇంగ్లిష్ మీడియం కోరలకు చిక్కుకొని, అత్యాచారానికి లోనయ్యా.రెండు సంవత్సరాల ర్యాంకుల కొలిమిలో కాల్చబడి తెచ్చుకున్న ఏఐయియియి, ఎంసెట్ సీట్లకు ఫీజుకట్టే స్తోమత లేక, బడి పండుగల్లో ‘‘ఆ పిల్లగాడి చదువు ఖర్చు మొత్తం మేమే భరిస్తున్నాం’’ అని బాకా ఊదిన కమ్మోరి సెల్ ఫోన్ కూడా బదులివ్వక, ఇదిగో ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్‌లో జాయిన్ అయ్యా.
వాస్తవిక రొదలకి, ఆదర్శాల రొచ్చులకు మధ్యనున్న భూమికి, మూడు అడుగుల ఎత్తులో తొణుక్కుంటూ నడిచేదే యూనివర్సిటీ జీవితం. నిరసనలు, ఆత్మహత్యలు, హత్యలు, మానసిక అలజడులు, పుస్తకాల బూజులు, శారీరక దాడులు, సెక్సువల్ అసల్ట్‌లు, పుట్టుక నుండే మెదళ్లలో రుద్దే కొన్ని గజ్జి చీదర్లు, ఇవన్నీ వాటాలు వాటాలుగా స్టూడెంట్స్‌ని పంచుకుంటాయి కసికసిగా.జాయినైన మొదటి సంవత్సరంలో, నాది కాని ఈ రంగుల కల్చర్‌కి ఇమడలేక, లైబ్రరీ చెక్క కుర్చీల మధ్య రోజులంతా గడిపా. రెండో ఏడాది ఒకానొక రాత్రుల్లో, నిషా ఎక్కిన కళ్ళతో ‘విప్లవాల’ జోలపాటలకు బందీనై, తరువాత యేడు బాధిత పక్షాల నిరసనలకు, నేనెవరో తెలిసొచ్చి, కొత్త జెండా ఎత్తుకొని అరిచా, గొంతు బొంగురుపోయేదాకా. చివరకు, పోయినేడాది, సొంత జీవితపు ఎదుగుదలకు ఉద్యమాల రెక్కలనే విరిచేసిన ఈ క్యాంపస్ నాయకుల కపటత్వాన్ని చీదరించుకునేలోపే, యూనివర్సిటీ జీవితం ఒక అడుక్కి వచ్చిందనే సత్యం తెలిసొచ్చింది.పొద్దున్నే డొంకలోకి లోటాపట్టుకొని పోతుంటే, దారిలో ఎదురై, రెండు సంవత్సరాలు రికార్డులు రాయడానికి, ఇంకొక రెండేళ్లు కోచింగ్ సెంటర్‌లో ప్రాక్టీస్ బిట్ల బరువులకి బలైపోయి, పీలగా వేలాడుతున్న చేతివేళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు పుల్లిగాడు. పెళ్లి చేసుకొని ఇక ‘పెద్దోళ్ల’ గుంపులో కలిసిపోతున్నాడని చెప్పి, ‘‘హైదరాబాద్‌లో చదువుతున్నావ్, మాలాగా కాకుండా పెద్ద జాబ్ నువ్వు కొట్టాలిరా’’ అని, ఉరుకులాంటి నడకతో సంసార జీవితంవైపు నడిచాడు.ఎంత దూరం చదువుకుంటుంటే, అంత పెద్ద ‘ఉజ్జోగం’ వస్తుందని మా వాళ్ళ లెక్క.ఇంకొక సెమిస్టరులో కోర్స్ అయిపోతుందనే ఊహకి, బయట నిరుద్యోగ పోటీలో నెగ్గుకురాగలమా అనే భయానికి మధ్య, ఎన్నో రోజులు డిప్రెస్సివ్ రాత్రులతో ఘర్షణ పడలేక ఇంటికి వస్తే, ఊరు పెట్టుకున్న ఆశలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దొడ్డికి పొయ్యెచ్చి బురదకాళ్లని కడుక్కుంటుంటే, ‘‘తుంటోడా.. తుంటోడా’’ అని అరుసుకుంటూ, ‘దానేల’ మాయ్య వచ్చిండు. మొఖం పుల్ల వేసుకొని వెళ్లి పక్కన సతికిలబడితే చెప్పుకుంటూ పోతున్నాడు– ‘‘ఏమి లేదురా, మన రవి గాడిని, నువ్వు చదివేకాడికి పరిచ్చ రాపిద్దామనుకుంటున్నా. అదేదో పెద్ద ఇనివెర్సిటీ అంట కద రా! పైగా నువున్నకాడ ఉంటే, నీకు మల్లె పయోజకుడు అవుతాడు. ఆ నెట్టిలో నువ్వే అప్పలయి చెయ్ మరి’’ అని గడ్డం పట్టుకున్నాడు. మాయ్యకి కొంచెం నత్తి. చెప్పలేనంత ప్రేమో, కోపమో వస్తే ఇలా చేతులకి, కాళ్ళకి పనిచెప్తూ ఉంటాడు.
మాయ్య చిన్నకొడుకు రవిగాడు. మాయ్యకి అసలు ఇద్దరు కొడుకులున్నారని మొన్న రేషను కార్డు ఫోటోలు దిగిందాకా ఊళ్ళో వాళ్లకి తెలియదు. చిన్నప్పటి నుండి చదువు పిచ్చితో హాస్టల్‌లోనే పెరిగాడు వీడు. నేను ఏ సంగతయిందని మల్ల ఫోను చేసి చెప్తలే మాయ్య అని లోపలికెళ్ళి బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటున్నా.అప్పుడే బర్రెపాలు తెచ్చి టీ పెడ్తున్న అమ్మొచ్చి ‘‘ఏంది బిడ్డా, ఇంతలోకే పోతున్నావ్? ఇంటికాడ మనసు నిలవట్లేదా?’’ అని, నా పెద్ద గ్లాస్‌లో వేడి టీ పోసి ఇచ్చింది.అమ్మ కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పే ధైర్యం లేక, ఏదో అర్జెంటు క్లాస్ ఉందని మెస్సేజి వచ్చిందిలే అని బాగ్ లోపల తలదూర్చా, కన్నీళ్ళని ఆపుకోవడానికి. ఉతకని బట్టలమీద రెండు, మూడు కన్నీళ్ల చుక్కలు పడి, కంపు వాసన బయటకి రాబోతుంటే, గబ గబా జిప్ వేసేసాను.ఈసారెందుకో ఊరికి, యూనివర్సిటీకి మధ్య ఉన్న దూరం చాలా తక్కువనిపించింది. నిన్నటి నుండి ఒకటే నోరు పీకుతుంటే, ఒక సిగరెట్ ముట్టించా మెయిన్ గేట్ దగ్గర. పక్కనున్న యూకలిఫ్టస్ చెట్టుకి వేలాడుతున్న గబ్బిలానికి నేను ‘తలకిందులుగా’ కనిపిస్తున్నానేమో ఇప్పుడు.ఇంకొక సిగరెట్‌తో ఓ ఐదారు రోజుల ఆయుష్షు తగ్గించుకొని, హాస్టల్ వైపు బయల్దేరా. సెల్లార్‌లో మొన్న జాయినయిన జూనియర్ గాడు అటు ఇటు తిరుగుతున్నాడు. నన్ను చూసి దగ్గరకొచ్చి, ‘‘వేణన్నా, మా ఫ్రెండ్ నన్ను ఇక్కడ ఉండమని లోపలికెళ్లారు. రేపు ప్రొటెస్ట్ మీటింగ్ స్పీచ్ రాయాలి లైబ్రరీ కి పొయ్యి మేము ఇప్పుడు’’ అని, కలుషితం కానీ తన భావజాలాన్ని నాముందు పరచాడు.యూనివర్సిటీకి వచ్చిన రెండేళ్లలో వేణు గాడు నేర్చిన మాటలు గుర్తొచ్చాయి–ఏముందిరా, ఒంట్లో వేడి ఉన్నంతకాలం పోరాటం, ఆకలి, సమాజం అని మాటలు చెప్పి, వీలైనంత మందితో పక్కబట్టలమడతల్లో చలి కాచుకోవడమే. నాటకం అయిపోయిన తరువాత రంగు కడిగేసుకొని ఇక్కడ నుండి వీరుడిగా బయటకు పోవడమే మన పని.ఈ జూనియర్గాడి గురించి నాకెందుకులే అని లోపలికి పొయ్యి ఒక గంట తరువాత పని చేసుకొని బయటకు వచ్చినా, ఇంకా అక్కడే ఉండి బిక్కుబిక్కు మంటూ పెచ్చులూడిన గోడలను చూస్తున్నాడు. వీడిని చూస్తుంటే నాకు మా దానేల మాయ్య కొడుకు రవి గాడే గుర్తొచ్చాడు.సరిగ్గా అప్పుడే మాయ్య ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేశా, ఒక నిశ్చయానికి వచ్చినట్టు.
మేడి చైతన్య
Comments
Please login to add a commentAdd a comment