పంచభూతాధికారి | Funday Sai Patham   Antarvedam 23 | Sakshi
Sakshi News home page

పంచభూతాధికారి

Published Sun, Oct 28 2018 1:12 AM | Last Updated on Sun, Oct 28 2018 1:12 AM

Funday Sai Patham   Antarvedam 23 - Sakshi

ఎంతో ఎత్తులో ఉన్న నక్షత్రాలని లెక్కించడం ఎంత కష్టమో.. ఎంతో దగ్గరగానూ ఎదురుగానూ ఉన్నా కూడా ఓ చెరువులోని నీటి బిందువుల్ని ఎలా లెక్కించడం కష్టమో.. అలాగే తనకి తానే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తున్నా ఓ రోజులో ఎన్నిమార్లు గాలిని పీల్చి విడిచామో చెప్పడం ఎంత కష్టమో.. అదే తీరుగా సాయి గురించి ఎన్ని విశేషాలనీ లీలలనీ విన్నా ఆయన తత్త్వమేమిటో వాటి అంతరార్థమేమిటో సంపూర్ణంగా చెప్పగలగడం అసాధ్యం. పరిచయం ఏ మాత్రమూ లేనివాణ్ణి పిలిచి మరీ దక్షిణ అడుగుతాడు. దక్షిణ ఇయ్యబోయిన పరిచయస్తుడ్ని ఇయ్యవద్దంటాడు. ఎవరైనా తమంత తాము దక్షిణనీయబోతే ఇంతమాత్రమే చాలంటాడు. మరికొందరు దక్షిణనిస్తూంటే ‘ఇంతకాదు. అంత ఇస్తావా? ఇయ్యగలవా?’ అంటాడు. తీరా దక్షిణని ఇచ్చాక దాన్ని వాళ్లకీ పంచేస్తాడు పోనీ! అందరికీ సమానంగానా? అంటే అదీ కాదు. ఒకరికి కొంత, మరొకరికి ఇంకోకొంత, ఆ వేరొకరికి ఊహించనంత. ఇదేమి దక్షిణ విధానమో? పోనీ! ప్రవర్తనని చూద్దామా? ఒకసారి చెప్పలేనంత ప్రేమతో ఓ తండ్రి లాలించినట్లుంటాడు. ఇంకొకసారి రాళ్లతో కొట్టడానికి పరుగెత్తివస్తూ రాతిని విసురుతాడు. ఆకాశం దద్దరిల్లేలా అరుస్తాడు. ఇంకొకసారి కంటితడి పెట్టుకుంటాడు. ఇదేమి ప్రవర్తన విధానమో? ఒకర్ని కావాలని తన వద్దకి రావలసిందిగా కబుర్లు పంపుతూనే ఉంటాడు. కావాలని దర్శిద్దామని షిర్డీకి వచ్చిన కొందరికి దర్శనమే ఈయడు. పైగా ‘తన వద్దకి అతడ్ని తేవద్దు. అతనిని రానీయవద్దు’ అంటాడు. ఇదేమి దర్శన అనుగ్రహ విధానమో?ఒకరోజున అసలు భిక్షానికే వెళ్లాడు. మరొకరోజున 4 నుంచి 8 మార్లు భిక్షాటన చేస్తాడు. ఆ తెచ్చిన రొట్టెలని కుక్కలకీ ఇతర జంతువులకీ ఇస్తాడు. ‘మా ఇంటికి ఆతి«థ్యానికి రండి’ అని పిలిస్తే సరేనంటాడు. ఏ పశువూ లేదా జంతువూ లేదా కీటకరూపంలో తిని– భోజనం బాగుందని వంటకం వివరాలతో సహా చెప్తాడు. ఇదేమి భిక్షాటన విధానమో? మరి ఎందుకు కొలవాలి? ఇంత అయోమయంగానూ లోఅర్థం తెలియకుండానూ ఉన్న సాయి చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి? సంపూర్ణ ఆనందాన్ని పొందకుండానూ పొందవీల్లేని స్థితిలోనూ, ఈ సాయి చరిత్ర ఉన్నప్పుడు ‘ఆయన్ని ఎందుకు కొలవాలి?’ అనే సందేహం ఎందరికో కలుగుతుంది కదా! ఏ భయంతోనో వ్యతిరేకించినా, దుర్విమర్శ చేసినా, ఏమైనా కీడు జరుగుతుందేమో అనే ఆందోళనతోనూ సాయి చరిత్ర పారాయణం చేయడం ఎందుకు? అనే ఆలోచన కూడా కలుగుతుంది ఎవరికైనా.

సమాధానం ఒక్కటే. ఇలా పైన అనుకున్న తీరుగా ఊహించుకున్నది నిజమే అయ్యుంటే ప్రతి సంవత్సరంలోని రోజుకీ మరో రోజుకీ భక్తజనుల సంఖ్య ఎందుకు పెరిగిపోతోంది? సాయిదేవాలయాల సంఖ్య కూడా ఎందుకు ఎదిగిపోతోంది? ప్రతిసాయి భక్తుడూ అనుకోకుండా మరొకర్ని సాయి భక్తునిగా చేసెయ్యగలుగుతున్నాడు? డబ్బిచ్చి.. ప్రలోభపెట్టి కాకుండా వీరు సాయి గురించి చెప్పగానే అవతలివారు కూడా తాను మాత్రమే కాకుండా సకుటుంబంగా షిర్డీకి ఎందుకు వెళ్లొస్తున్నారు?కారణం ఒక్కటే! ఒక కత్తిని గరుకునేలమీద ఎంత రాస్తే మరెంతగా రాస్తే (నూరితే) అంతగా అది పదునెక్కిపోతుందో అలా అర్థం కాలేదనుకుంటున్న సాయి చరిత్రని ఎన్నిమార్లు చదువుతూ ఎన్నిమార్లు వింటూ ఎన్నిమార్లు సాయిదర్శనాన్ని చేస్తూ ఉంటే అంతగానూ సాయికి దగ్గరైపోతూ ఎవరి అనుభవానికి వాళ్లకి పైననుకున్న అసందర్భ ప్రవర్తనలన్నింటికీ లో–విశేషాలు వాళ్ల వాళ్ల స్థాయికి అర్థమైపోతూ ఉంటాయి. అవన్నీ అసందర్భాలు అయోమయాలూ అనిపించవు.పంచదార తియ్యగా ఉంటుందని చెప్తాం. మరి బెల్లం కూడా అదే తీపిదనంతో ఉంటుందా? అంటే కొద్ది తేడా ఉందని చెప్తాం. వివరించవలసిందని చెప్తే.. కుదరడం లేదని చెప్పేస్తాం. ఇదీ అంతే! ఎవరి అనుభవం వారిదే! నదికి వెళ్లేటప్పుడు మనం ఎంత పరిమాణం గల జలపాత్రని తీసుకెడితే అన్ని నీళ్లని మాత్రమే తెచ్చుకోగలిగినట్లుగా, ఎవరెంత భక్తితో సాయిని సేవిస్తారో వారికి అంతలోతుగానూ లో–అర్థం స్పష్టంగా తెలిసి, వారు మరింత దగ్గరైపోతారు సాయికి.ఒక్కమాటలో చెప్పాలంటే నేడు మహాభక్తులైన అందరూ కూడా సాయిని నమ్మనివారూ. ఎవరి బలవంతం మీదనో మొదట్లో షిర్డీకి వచ్చినవాళ్లేనూ అనేది నిర్వివాదాంశం.‘ఇదంతా ఎందుకు? అంటే ‘సాయి పంచభూతాలకీ అధికారి ఎలా అవుతాడు? కాగలడు?’ అని వాదం చెయ్య బుద్ధి వేస్తుంది అందరికీ. అయితే ‘కొన్ని స్పష్టమైన స్వయమైన అనుభవాలని పొందాక అది నిజమే సుమా!’ అని అనిపించకమానదని తెలియజెప్పడానికీ! కాబట్టి సాయి చరిత్రని చదవండి. చదువుతూ ఉండండి. చదువుతూనే ఉండండి! ఈ నేపథ్యంలో ఆయన పంచభూతాల మీదా ఎలా అధికారం కలవాడయ్యడో చూద్దాం!

పృథ్వి మీద అధికారం
‘నెలకి ఇంత!’ అని ఈ తీరుగా జీతాన్ని నిర్ణయించిన పక్షంలో ప్రతి సేవకుడూ యజమానికి అనుగుణంగా పనిచేస్తాడనేది అనుభవంలో కనిపించే అంశం. అలా సేవకుడొకడు తనకంటూ వచ్చినప్పుడూ పని చేస్తున్నప్పుడూ ఈ జీతాన్నిచ్చే వ్యక్తీ.. పని చేయించుకుంటున్న వ్యక్తీ ఓ అధికారి ఔతాడు. ఇది నిజం కదా!మరి సాయి ‘పంచభూతాలకీ అధికారి’ అని చెప్పుకోబోతున్నాం కదా! ఈ పంచభూతాలనీ ‘ఈయన ఏ తీరుగా పోషిస్తున్నాడని ఆ పంచభూతాలూ ఈయన కింద సేవకులుగా ఉండాలి?’ అనేది గట్టి సంశయం కదా! ఇలా ఆలోచించినప్పుడే యదార్థం తెలుస్తుంది. తత్త్వం అర్థమవుతుంది కూడా! ముందుగా పృథ్వి(భూమి)ని ఎలా తనకి సేవ చేయించుకుని ఆ పృథ్వికి అధికారి అయ్యాడో, భూమికి స్వాధీనం(స్వ+అధీనం – తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం) చేసుకున్నాడో తెలుసుకుని ఎలా అది సాధ్యమయిందో ఆ తర్వాత తెలుసుకుందాం.

పచ్చికుండల్లో నీళ్లు
సాయి ఒక ప్రత్యేకమైన తోటని(వెండీ అని దాని పేరు) ఎంతో ఇష్టంగా పెంచుతూండేవాడు. ప్రతిరోజూ స్వయంగా తానే పచ్చికుండలలో నీళ్లు నింపుకుని ఆ నీటితో ఈ తోటలోని మొక్కలకి నీళ్లని పోస్తూండేవాడు. ఇదేదో అభూతకల్పనలతో నిండిన చరిత్ర కాదు. అందరూ ప్రతినిత్యం గమనించిన కళ్లకి కనిపించిన యదార్థం. కుండ అనేదాన్ని మట్టితో చేస్తారు. ఆ పచ్చికుండని ఆములో పెట్టి బాగా కాల్చిన తర్వాత అది గట్టిపడి కొద్ది బరువైన పదార్థాన్ని మోయగల స్థితికి వస్తుంది. అదే మరి పచ్చికుండ అయితే దానిలో నీళ్లు నింపి పైకి ఎత్తబోయేసరికే ఆ నీటి బరువుకి విచ్చిపోతుంది. పైగా సాయి ఆ కుండని తన భుజానికెత్తుకుని రెండు మూడు మార్లు నీళ్లు నింపి మొక్కలని తడిపి తిరిగి వస్తూండేవాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా?ఆ పృథ్వి (కుండ ఏ మట్టితో చేయబడిందో ఆ పృథ్వి) తనకి వశమై ఉంది కాబట్టే కుండ విచ్చిపోకుండానూ తోట ఎండిపోకుండా నీరు పోసేందుకు సాధనంగానూ ఉపయోగపడింది. సాయికి తెలియకుండా.. సాయిని శ్రమకి గురి చేయరాదనే ఉద్దేశంతో ఎందరు ప్రయత్నించినా అలా పచ్చికుండతో నీళ్లు పట్టడం భుజానికెత్తుకోవడం తోటవరకూ వెళ్లగలగడం మొక్కలకి పోయడమనేది సాధ్యం కాలేదు ఏ ఒక్కరికీ. అంటే సాయికొక్కనికే పృథ్వి సహకరించిందని కదా అర్థం! ఎందుకు సహకరించిందో తెలుసుకునే ముందు మరో వృత్తాంతాన్ని కూడా చూద్దాం!

నేలమాళిగలో 12 ఏళ్లు
సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అయితే అకస్మాత్తుగా సాయి 16 ఏండ్ల యువకునిగా ఓ వేపచెట్టు కింద కనిపించాడు. ఎప్పుడూ తపఃసమాధిలో ఉంటూండటం, అల్లాహ్‌ హో మాలిక్‌! అంటూ అనేక పర్యయాలు అంటూండటం, ఏ సౌకర్యాన్నీ కావాలని ఎవరినీ కోరకపోవడం పైగా ఎవరైనా వచ్చి తమ అనారోగ్యాన్ని వివరించి చెప్పుకుంటే కొంతదూరం వెళ్లి ఏదో చెట్టు ఆకు పసరు తెచ్చి ఇయ్యడం, అవతలివారిని ఆరోగ్యవంతుల్ని చేయడం... ఆయనలోని గొప్పదనం అర్థమవుతూ ఎవరింటికి తీసుకుపోదలిచి ప్రార్థించినా వెళ్లకపోవడమనే ఇన్నింటినీ గమనించిన జనులంతా ఆయన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఖండోబా దేవాలయంలో ఒకనికి పూనకం వస్తే ఈ బాలుడ్ని గురించి అడిగారు అక్కడి వారంతా. ఆ పూనకం వచ్చిన వ్యక్తి ఓ గునపాన్ని (గడ్డపార) తెమ్మనీ ఓ స్థలాన్ని చూపించి అక్కడ తవ్వవలసిందనీ చెప్పాడు. తవ్వి చూస్తే ఓ పెద్ద రాయి కనిపించింది. దాన్ని తొలిగించి చూడవలసిందన్నాడు. అలా చూస్తే ఓ పెద్ద భూగృహం, ఇంకా వెలుగుతూనే ఉన్న 4 దీపాలు, కర్ర బల్లలూ, జపమాలలూ, జపం చేసుకునేందుకు వీలైన ఓ చిన్న వేదిక వంటి ఎత్తు స్థలం కనిపించింది. ఇది అందరూ చూస్తూండగా బయటపడిన యదార్థం ఈ సొరంగంలోనే ఆ బాలుడు ఒకటి కాదు రెండు కాదు 12 ఏండ్ల పాటు తపస్సు చేసి సిద్ధుడయ్యాడని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి.

ఇప్పుడాలోచిద్దాం!
పృథ్వికి అంటే నేలకి ప్రతి వస్తువునీ తనలో కప్పేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఏ వస్తువునైనా కొన్నినాళ్ల పాటు నేలమీదనే విడిచేస్తే క్రమంగా కప్పబడిపోతుంది. మరి ఇది పృథ్వి కుండే సహజలక్షణమవుతుంటే ఎలా ఆ భూమిసొరంగంలో ఒకటి కాదు రెండు కాదు అది కూడా నెలలు కాదు సంవత్సరాలు. ఆ సంవత్సరాలు కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరాల పాటు ఆ సొరంగంలో ఉండిపోవడం సాయికి ఎలా సాధ్యమయింది? పోనీ ఏ సొరంగానికి ఏదైనా ఓ మార్గముందేమో అనుకునే వీలులేదు. దానికి కారణం ఆ పూనకం వచ్చిన వ్యక్తి తాను మైమరచిన స్థితిలో ఓ ప్రదేశాన్ని చూసి తవ్వవలసిందన్నప్పుడు గదా తవ్వి చూసి ఈ సొరంగ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు అందరూ! కాబట్టి ఆ సొరంగమనేది ఎటూ ప్రవేశంలేని ఎవరూ ప్రవేశించలేని నేలమాళిగే తప్ప రాకపోకలకి వీలైనది కానేకాదు గదా! ఇక తగినంత గాలి లేని పక్షంలో ఏ దీపం వెలుగదనేది మనకి తెలిసిన అనుభవ సత్యమవుతూంటే అకస్మాత్తుగా హఠాత్తుగా తవ్వి చూస్తే అక్కడ నాలుగు దీపాలు వెలుగూ కనిపించడమా? ఇక భూమికి ఉండే మరో గుణం. ఎంతటి వస్తువునైనా నల్లబడిపోయేలా చేయడం. దానికి కారణం గాలి ఏ మాత్రమూ తగలని కారణంగా వేడిమి పుట్టడం. భూమిలో నల్లని బొగ్గు ఇంకా నల్లబడిన రాక్షసిబొగ్గు ఇంకా నల్లబడి లోహాలూ... ఇలా ఇన్ని లభించడానికి కారణం విపరీతమైన వేడిమి మాత్రమే. పెద్ద బండరాయి కప్పబడిన భూమి సొరంగంలో అంతకాలం ఉండడమనేది సాధ్యమా? కొన్ని గంటలయ్యేసరికి నీళ్లు మరికొన్ని గంటలయ్యేసరికి తిండీ ఇంకాకొన్ని గంటలయ్యేసరికి తగినంత గాలీ వెలుతురూ ఆవశ్యకమా? కాదా? ఎలా ఉండగలిగాడు సాయి? అదికూడా 12 ఏళ్ల పాటు. పోనీ! ఇదంతా అసత్యం ఓ కట్టుకథ అంటూ కొట్టిపారేద్దామా? అంటే అందరి సమక్షంలో గదా ఆ భూమి సొరంగం తెరవబడింది. ‘తత్ర గంధవతీ పృథ్వి’ అని భూమి లక్షణం. భూమికి వాసన ఉండటమనేది సహజ లక్షణమని దీనర్థం. ఇది నిజమని నిరూపిస్తూ వాన చినుకు పడగానే ఓ చక్కని వాసన నేల నుండి మనకి వస్తుంది గదా! ఆ వాసనే భూమి నుండి మొక్కని రప్పించగల శక్తి ఉన్న పదార్థం కదా! మరి ఇన్ని సంవత్సరాల పాటు మూసివేయబడ్డ నేలలో ఏ విధమైన దుర్వాసనా ఎందుకు రాలేదు? మనమే మన ఇంటిని ఓ వారం పాటు పూర్తిగా గాలి చొరకుండా మూసి ఉంచితే వచ్చే ఓ తీరు మాగుడు వాసన 12 ఏళ్ల పాటు గాలీ వెలుతురూ లేని భూ సొరంగం నుండి ఎందుకు రాలేదు? ఇలా అనేక ఆశ్చర్యకర అంశాలు మనకి కనిపిస్తాయి. సరే ఇంతకీ సాయికి పృ«థ్వి ఎందుకు సహకరించి పైతీరు ఇబ్బందులు లేకుండా ఆయనని అధికారిగా భావించి ఎందుకు తన సహజధర్మం నుండి పక్కకి వచ్చి సాయికి అధీనురాలు అయింది! లేదా కావలసివచ్చింది? గమనిద్దాం!

ఇదీ కారణం!
భూమి అని మనందరం పిలుస్తాం కానీ, సంప్రదాయం హిందూ ధార్మిక వ్యవస్థా ఆ భూమిని భూమాత అని, పుడమి తల్లి అని పిలుస్తుంది. తల్లి ఎలా తన సంతానానికి సకాలంలో అన్నాన్ని పెట్టి రక్షిస్తుందో, పెద్దగా వరదలోస్తే ఎలా సముద్రం వైపు పరుగెత్తేలా చేస్తూ కొంత నీటిని తానే స్వయంగా తాగేసి తన మీద ఉన్న ప్రాణులకీ అప్రాణులకీ కూడా నష్టాన్ని కలిగించకుండా చూస్తుందో అంతటి ఉత్తమురాలు భూమి(భూదేవి). అంతే కాదు. పెద్దపెద్ద మానులున్న వృక్షాల భారాన్ని భరిస్తుంది. అసలు వృక్షాలు అంతంత పెద్దగా ఎదగడానికి తాను నీరు తాగి ఆ నీటిని ఒకప్పటి ఆ మొక్కలకి అందించి ఆ మొక్కల్ని చెట్లుగానూ ఆ చెట్లని పెద్దపెద్ద వృక్షాలుగానూ ఎదిగేలా చేసింది కూడా ఈ పృథ్వియే. ఇలా చేసే లక్షణాలున్న పృథ్వి పనిని ఎవరైనా గానీ చేస్తే ఆ పృథ్వి తాను చేస్తున్న పనినే చేస్తూ తనకి పరోక్షంగా సహకరిస్తున్నాడు ఫలానా వ్యక్తి అనే భావంతో తప్పక ఆ పృథ్వి. ఆ వ్యక్తికి సహకరిస్తుంది. లోకమంతా ‘ఈ వ్యక్తి అధీనంలోనే భూమి ఉంది’ అనేంత అభిప్రాయాన్ని కలిగిస్తుంది జనులకి. ఇంతకీ సాయి ఆ పృథ్వి చేసిన ఏ పనుల్నీ చేశాడట? భూమిమీద ఏ 84 లక్షల జీవరాశులున్నాయో ఆ జీవరాశులన్నింటికీ ఆహారాన్ని అందేలా చేయాలనుకుంటూ కేవలం అనుకోవడమే కాకుండా షిర్డీకి వచ్చిన వ్యక్తులకి అన్నాన్నీ క్రిమికీటకాలకి తీపి పదార్థాలనీ పక్షులూ మొదలైన వాటికి తిండి గింజలనీ భూమి మీద మొక్కలకి నీటినీ, కుక్కలూ మొదలైన జంతువులకి తాను భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారపదార్థాలనీ చేపలూ మొదలైన వాటికి వాటి ఆహారాన్నీ ఇలా భూమి ఏ తీరుగా అన్నాన్నీ అందిస్తూ ఉంటుందో ఆ పనినే సాయి చేశాడు. చేస్తూ ఉన్నాడు ప్రతిరోజూ. ఆ కారణంగా భూమి పరమానందాన్ని పొందింది.

శ్రీమద్రామాయణంలో జటాయువు రెక్కల్ని రావణుడు నరికేస్తే... ఇంకా దాన్ని బాగా హింసిస్తే చావుబతుకుల స్థితికొచ్చేసింది ఆ పక్షి. ఆ సందర్భంలో సీతమ్మ జటాయువుని కౌగిలించుకుందంటాడు వాల్మీకి.సీతమ్మ భూమికూతురు. భూమి నుండి ఓషధులు మొక్కల రూపంలో పుడతాయి. ఆ మాటకొస్తే మన్ను పుట్టమన్ను ఇసుకతో కూడిన మన్ను నీటి అడుగున ఉండే బురద ఒండ్రుమన్ను... ఇవి కూడా ఔషధాలే. సీతమ్మ భూమికి కూతురై ఔషధి లాంటిది కాబట్టే ఆమె కౌగిలించుకున్న కారణంగా అంతగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న జటాయువు కూడా రామలక్ష్మణులొచ్చేంతవరకూ జీవించి సీతాపహరణ విషయాన్ని చెప్పగలిగాడు.  సాయి కూడా భూమి నుంచి ఏ మొక్క ఏ వ్యాధికి ఔషధమో గమనించి భూదేవి చేస్తున్న పనిని తాను కూడా నిస్వార్థంగా చేస్తున్నప్పుడు భూదేవి సాయికి ఎందుకు సహకరించదు? స్వాధీనురాలు కాకుండా ఉంటుంది? భూదేవి తట్టుకోలేనిది పాపుల భారాన్ని. అందుకే శ్రీహరిని వేడుకుంటూ పాపభారాన్ని తగ్గించవలసిందని ప్రార్థిస్తుంది. సాయి కూడా కొందర్ని అసహ్యించుకుంటూ కొందరికి జ్ఞానబోధ చేస్తూ కొందరికి దర్శనాన్నే ఈయక... ఎవరి తప్పుని వారు వారికి వారు తెలుసుకునేలా చేస్తూ పాపి అయినవారిలోని పాపగుణాన్ని ఆలోచనల్నీ తొలగిస్తూ ఉండటంతో భూదేవి ఆయనకి స్వాధీనురాలయింది. దేవతలు ఎప్పుడూ సజాతీయులు(తమ వంటి గుణలే ఉన్నవారు) అయినవాళ్లకి సహకరిస్తూ ఉంటారు తప్ప హోదా ప్రధానమని అనుకోరు.ఈ క్రమంలో పంచభూతాల్లో రెండు మూడు నాలుగూ ఐదూ అయిన నీరు తేజస్సు వాయువూ ఆకాశమూ కూడా ఎందుకు సాయికి అధీనులైపోయాయో గమనించుకుందాం!
 – సశేషం
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement