ఆభిజాత్యం | Funday story of the week | Sakshi
Sakshi News home page

ఆభిజాత్యం

Published Sun, Sep 21 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

ఆభిజాత్యం

ఆభిజాత్యం

సాయంత్రం ఆ నంబరు నుంచి కాల్ వచ్చింది. ఒక్క ఉదుటన ఎత్తింది అలేఖ్య. కానీ మాట్లాడలేదు. ప్రభాత భానుడు తూర్పున తన పయనం ఆరంభించిన చాలాసేపటికి బద్దకంగా లేచింది అలేఖ్య. ఇంతకుముందు ఆమెకు ఈ వెసులుబాటు ఉండేది కాదు. కొడుకును స్కూలుకు తయారుచేసి, భర్తను ఆఫీసుకు పంపడానికి భానుడి కంటే ముందే లేచేది. పక్షం క్రితం భర్త పోవడంతో ఆమె దైనందిన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. మొన్న దినం జరిగే నాటివరకూ ఇంటి నిండా అయినవాళ్ల హడావుడికి తోడు పలకరింపులకు వచ్చే పోయే వాళ్లతో సమయం గడిచిపోయేది. ఇప్పుడు గత రెండు రోజులుగా ఆమె, అత్తామామలూ తన కొడుకూ  మిగిలారు ఆ ఇంట. ఇంటి పనులు వేగంగా చక్కబెడుతూనే ఓ కన్ను వీధిగుమ్మం మీద వేసి ఉంచింది. ఆమె ఎవరికోసమో ఎదురుచూస్తుంది. భానుడు నడి నెత్తికి చేరాడు. ఆమె ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.
   
 మెలకువ వచ్చి గడియారం చూసేసరికి 8 గంటలయ్యింది. పిల్లాడి స్కూలు బస్సు ఇంకో పావుగంటలో వచ్చేస్తుంది. భర్త ఉంటే సెల్‌ఫోనులో అలారం పెట్టి లేపేవాడు. ఆయన టూరుకు వెళ్లాడు. తనను తాను తిట్టుకుంటూ కొడుకును లేపి హడావుడిగా తయారుచేసి, పాలు తాగించి, వీధి చివరి టిఫిన్ సెంటర్లో ఇడ్లీ కట్టించుకు వచ్చేసరికి బస్సు వెళ్లిపోయింది. ఆటోలో వాడిని స్కూలు వద్ద దించి వచ్చి టీవీ పెట్టింది అలేఖ్య.
 ‘షిర్డీ యాత్రలో విషాదం: అర్ధరాత్రి జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 32 మంది ప్రయాణికుల దుర్మరణం’. వార్తా ఛానళ్లు అన్నీ అదే చూపిస్తున్నాయి. ‘సాయినాథా...’ ఒక్కసారి అనుకొని సినిమా ఛానలు పెట్టుకుంది ఆమె. కొంతసేపటికి ముందుగా అన్న వచ్చాడు. శనివారం సెలవు కావటంతో చూసిపోవటానికి వచ్చాడనుకుంది తను. వెనుక ఇంకొంతమంది బంధువులు, మిత్రులు వచ్చారు. ఏదో మాట్లాడుతున్నారు. మనసు ఏదో కీడు శంకించింది. టీవీలో మృతుల పేర్లు చెపుతున్నారు. తన భర్త పేరు విని మూర్ఛపోయింది అలేఖ్య.
 
 ప్రతి నెలలాగే బెంగళూరు హెడ్ ఆఫీసుకు టూర్ వెళుతున్నానన్న ఆయన, షిర్డీ బస్సు ప్రయాణంలో మరణించడం నమ్మబుద్ధి కాలేదు. కానీ శవం వద్ద దొరికిన ఆధారాలతో పోలీసులు మృతి చెందింది సంతోషేనని తేల్చారు. అన్నింటికంటే అశనిపాతం ఏంటంటే ట్రావెల్స్ వారి దగ్గర ఉన్న ప్రయాణికుల వివరాలలో మిస్టర్ అండ్ మిసెస్ అని తన భర్త పేరుమీద రెండు టికెట్లు జారీ చేయబడి ఉండటం! ఆయనతో వెళ్లిన ఆ రెండో మనిషి ఎవరో తెలియలేదు. అర్ధరాత్రి హైదరాబాదుకు చేరిన శవాన్ని తీసుకొని, తమ ఊరు పయనమయ్యింది అలేఖ్య.
   
 మూడోనాటి నుంచే ఆ రెండో మనిషి గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది ఆమె. పోలీసులు ప్రమాదం జరిగి తెల్లవారాక చిన్న చిన్న గాయాలతో బయటపడిన వారు తమ తోవ తాము చూసుకున్నారని, అందరి వివరాలు దొరకడం కష్టమన్నారు. భర్త పనిచేసే కంపెనీవాళ్లు ఆనాటి ఆ బస్సులో ఆ సంస్థవారు ఇంకెవ్వరూ ప్రయాణించలేదని తెలిపారు. పరిచయస్తులందరినీ ఎవరితోనైనా చనువుగా ఉండేవారా అని అడిగి చూసింది. ఆఫీసులో కానీ బయట కానీ ఎటువంటి ఆధారమూ దొరకలేదు.
 
 సామాజిక నెట్‌వర్క్‌లలో అతని ఎకౌంట్లు వెదికితే, బాల్యమిత్రులు మొదలు, ఇప్పటి సహోద్యోగుల వరకూ దాదాపు పదిహేను వందల మంది స్నేహితులుగా నమోదై ఉన్నారు. పాస్‌వర్డ్ తెలీక, ప్రొఫైలు మాత్రమే చూడగలుగుతుంది. వారి మధ్య సాగిన సంభాషణలు ఏవీ చూడలేకపోయింది. ఆయన పర్సనల్ ఈమెయిల్, పాస్‌వర్డ్ లేక మొరాయించింది. ఆఫీసువాళ్లు అఫీషియల్ మెయిల్ వివరాలు బయటకు ఇవ్వడం కుదరదన్నారు. ప్రమాద స్థలంలో మొబైల్ ఫోన్ దొరకలేదు కానీ, అతని వ్యక్తిగత నంబర్ తాను మళ్లీ తీసుకుంది. ఆ సిమ్ వేరే ఫోన్‌లో వేసి పెట్టింది.
 
 అలాగే భర్త ఆఫీస్ నంబర్, వ్యక్తిగత నంబర్ల యొక్క గత ఆరు మాసాల కాల్ డేటాను సంపాదించి పరిశీలించింది. ముఖ్యంగా చివరి రెండు రోజులలో అతనికి వచ్చిన, అతను చేసిన నంబర్లన్నింటికీ కాల్ చేసింది. చాలామంది ప్రతిస్పందించారు కానీ, కొందరు దొరకలేదు. ఆఫీస్ నంబరుతో మాట్లాడినవారందరూ సిబ్బంది, క్లయింట్లు కాగా, వ్యక్తిగత నంబర్‌కు చేసినవారందరూ తనకు తెలిసినవారే. సంతోష్‌కు డైరీ రాసే అలవాటు లేదు. అప్పుడప్పుడు బ్లాగులో, ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టి, వాటి గురించి ఏదో కామెంట్ చేసేవాడు కానీ, అవన్నీ తమ పర్యటనలు, బాబుకు సంబంధించినవే. అత్తా మామలను అడిగితే తమకు తెలీదన్నారు. ఏమీ పాలుపోక తీవ్రంగా ఆలోచించింది. అయితే పెద్దకర్మ దగ్గరపడటంతో ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టింది.
   
 రెండు రోజులలో కర్మ అనగా అర్ధరాత్రి 12 గంటలకు భర్త నంబర్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఇంకా నిద్రపోని అలేఖ్య, అది చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఉచిత ఎస్సెమ్మెస్ సర్వీసు ద్వారా వచ్చిన ఆ సందేశం, ‘హ్యాపీ బర్త్‌డే బంగారం!’ అని. ముందు పంపిన వారి నంబర్, తరువాత ఆ సందేశం చూసి వెంటనే ఆ నంబర్‌కు డయల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా అటు వైపు ఫోన్ ఎవరూ లేపలేదు. భర్త నంబర్ నుంచే తిరిగి మెసేజ్ పెట్టింది ‘థాంక్యూ బంగారం’ అని. అయినా రెస్పాన్స్ రాలేదు. మిగతా రాత్రంతా ఆమె ఆ ఫోన్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
 
 పోయిన ఏడాది భర్త పుట్టినరోజు వేడుకను తలుచుకుంటూ ఉదయాన్నే మళ్లీ ఆ నంబర్‌కు ప్రయత్నించింది. ఈసారి తన, మామగారి, ఇంటి ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి కూడా చేసింది కానీ, ఉపయోగం లేదు. కొంతసేపటికి అవతలి ఫోన్ స్పందించడం మానేసింది. బ్యాంకులు, ఇన్సురెన్స్ సంస్థలతో పాటు కొంతమంది విషయం తెలీనివారు సంతోష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలేఖ్య అందరికీ తిరిగి ఫోన్ చేసి మాట్లాడింది. కానీ రాత్రి 12 గంటలకు ముందుగా ‘బంగారం’ అని విష్ చేసినవారు మాత్రం ఆమె ఫోన్‌కు గానీ, మెసేజ్‌కు గానీ సమాధానం చెప్పలేదు. తరువాతి రోజు కార్యక్రమానికి వచ్చినవారందరినీ ఆ నంబర్ గురించీ, ఆ రోజు భర్తతో ప్రయాణించినామె గురించీ అడిగింది. ఆమె వలవలు వివర్ణం అయ్యాయి కానీ ఎటువంటి వివరాలూ తెలియరాలేదు.
   
 కార్యక్రమం పూర్తయ్యాక పుట్టింటివారు, అత్తింటివారే మిగిలారు. బాబు చదువు, తన భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. సంతోష్‌కు ఒక్కడే కొడుకు కాబట్టి పెద్ద గొడవలు లేవు. అలేఖ్య మాత్రం ఆ నంబరుకు ట్రై చేస్తూనే ఉంది. చివరికి ఆ నంబరు నుంచి ఒక ఎస్సెమ్మెస్ వచ్చింది. ‘ఎవరు మీరు?’ (హూ ఈజ్ దిస్) అని. వెంటనే డయల్ చేసింది అలేఖ్య, మళ్లీ స్పందన కరువయ్యింది. కానీ ఆమె తన ప్రయత్నం ఆపలేదు. చివరికి ఒక టెక్స్‌ట్ పంపింది - ‘నేను శ్రీమతి సంతోష్. ఒక్కసారి మీతో మాట్లాడాలి’ అని. ఫోను చేత పట్టి ఎదురు చూడసాగింది.సాయంత్రం ఆ నంబరు నుంచి కాల్ వచ్చింది. ఒక్క ఉదుటన ఎత్తింది అలేఖ్య. కానీ మాట్లాడలేదు. ఓ క్షణం తరువాత అటు నుంచి ఓ ఆడగొంతు ‘హలో’ అంది. ఏదో అర్థం అయిన అలేఖ్య, ‘‘నేను సంతోష్ భార్యనండీ! మీరూ..?’’ అంది. ‘‘నేను అతని ఫ్రెండ్‌నండీ’’ దిటవుగానే చెప్పింది అవతలి ఆమె. గొంతు పోల్చుకునే ప్రయత్నం చేస్తూ, ‘‘ఆయన ఈ మధ్యన...’’ చెప్పలేకపోయింది భార్య.
 
 ‘‘తెలుసండీ’’ స్నేహితురాలి గొంతులో బాధ ధ్వనించింది. ‘‘ఆ రోజు ఆయనతో కలిసి ప్రయాణించింది... మీరేనా?’’ అడిగేసింది. అటు నుంచి సమాధానం రాలేదు.మళ్లీ తనే, ‘‘చూడండీ! నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎవరినీ ఏమీ అనలేను. ఆయన గురించి తెల్సుకోవాలి అంతే. మీరేనా లేక ఇంకెవరన్నానా? మీకు తెలిస్తే చెప్పండి ప్లీజ్!’’ అటు నుంచీ ముక్కులు ఎగరేస్తున్న శబ్దం వినబడుతుంది అంటే అవతలామె దుఃఖిస్తుంది. అలేఖ్యకు జవాబు దొరికింది.
 
 ‘‘ఆయన గురించి ఒక్కసారి మీతో మాట్లాడాలి.’’‘‘ఇంకేముందండీ మాట్లాడటానికి? ఇక్కడితో వదిలెయ్యండి. మళ్లీ ఫోన్ చేయకండి. ప్లీజ్, సారీ!’’ అని పెట్టేసింది అవతలి ఆమె. అలేఖ్య మళ్లీ మళ్లీ కాల్ చేస్తూనే ఉంది. విసిగి ఒక మెసేజ్ పంపింది, ‘‘ఈ నంబరు సాయంతో నిన్ను వెదికి పట్టుకోగలను. నిన్ను వేధించే ఉద్దేశం నాకు లేదు. ఒక్కసారి నిన్ను కలిసి మాట్లాడాలి అంతే. దయచేసి అర్థం చేసుకో.’’ కొంతసేపటికి అవతలి నుంచి ఫోన్ వచ్చింది... ‘‘చెప్పండి!’’ ‘‘ఆయన గురించి మాట్లాడాలి. ఫోన్‌లో కాదు, మనం కలవాలి. ఒకే ఒక్కసారి. మళ్లీ జీవితంలో నిన్ను డిస్టర్బ్ చేయను. ఏ ఊరో అడ్రెస్ చెప్పండి’’ సూటిగా అడిగింది అలేఖ్య. కాసేపు తటపటాయించిన అవతలామె చివరికి తనే సంతోష్ ఇంటికి వచ్చి కలుస్తానంది.
   
 తన మగని జీవితంలోని చీకటి కోణం మీద వెలుగు పొడ సోకేది నేడే. అందుకే ఆమె ఎదురుచూపులు. పొద్దుట నుంచీ ఏ వాహనం అలికిడి అయినా మనసు ఉద్వేగానికి గురవుతుంది. ఊళ్లోవాళ్లు, చుట్టాలు ఎవరెవరో వచ్చి వెళ్తున్నారు. కానీ తాను ఎదురుచూస్తున్న మనిషి రాలేదు. భానుడు పడమటింట తన పయనం ముగించే సమయంలో పక్కింటి రామారావుగారి కుమార్తె భావిక, చేతిలో స్వీటు డబ్బాతో వచ్చింది. అత్తగారు ఆమెతో ముందు గదిలో మాట్లాడుతుంటే, అలేఖ్య లోపలి గదిలో అసహనంగా తిరుగాడుతుంది. కొద్దిసేపటి తరువాత భావిక తనను సమీపించి నిలబడింది. గత పక్షం రోజులుగా అలవాటైన విధంగా నిట్టూర్చి, ఆమెకు దారి చూపిస్తూ ముందు గదిలోకి నడిచింది అలేఖ్య. ‘‘మాట్లాడాలన్నారు’’ మెల్లగా అంది భావిక. అర్థంకాక చూస్తున్న తనతో, ‘‘ఫోన్ చేశారు కదా. మాట్లాడాలనీ...’’ ఒక్కో మాటా కూడగట్టుకు పలుకుతుంది ఆ అమ్మాయి.‘‘ఆ ఫోను చేసింది నువ్వా? భావీ... ఆ నంబరు నీదా? అంటే...’’ అయోమయంతో మాట పెగలలేదు అలేఖ్యకు. తల నిలువుగా ఆడిస్తూ కన్నీరు పెట్టింది తనకు పెళ్లినాటి నుంచీ పక్కింటి అమ్మాయిగా తెలిసిన భావిక.
 
 ‘‘ఎంసెట్టు ఒకేసారి రాశాం. నాకు సీటు వచ్చింది. సంతోష్ లాంగ్ టర్మ్ చేశాడు. మరుసటి యేడాది అతనికి సీటు వచ్చినా మా కాలేజీలోనే చేరాడు. ఒకే ఊరివాళ్లం కాబట్టి బుక్స్, హాస్టల్ వంటి వివరాలతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. చదువులు అయ్యాక, పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ కులాల అడ్డుగోడలు, ఆస్తిపాస్తుల అంతరాలతో పెద్దవాళ్లు కాదన్నారు’’ చెప్పుకుపోతుంది భావిక. నిశ్చేష్ఠురాలై వింటోంది అలేఖ్య.
 
  ‘‘క్యాంపస్ సెలక్షన్స్‌లో అతనికి ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కానీ మా అనుబంధం కొనసాగింది. ఖాళీగా ఉన్న నన్ను కంప్యూటర్ కోర్సు చేస్తే మంచి ఉద్యోగం వస్తుందని సిటీకి తీసుకెళ్లి ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చాడు. అది పూర్తయ్యాక, పూణేలోని ఓ కంపెనీ ఇంటర్వ్యూ వచ్చింది. డెరైక్ట్ బస్సు దొరక్క, షిర్డీ వెళ్లి వెళ్దాం అని ఆ రోజు ఇద్దరం బయలుదేరాం. కానీ సగం దారిలోనే...’’ వెక్కిళ్లు పెడుతుంది భావిక. అసంకల్పితంగానే అలేఖ్య ఆమెను ఓదార్చింది.
 
 ‘‘నాకూ తలకు దెబ్బ తగిలింది’’ నుదుటి మీద గాయంపై చెయ్యి పెట్టి చూపి, ‘‘కానీ తెల్లారాక తెలివొచ్చింది. సంతోష్‌లో మాత్రం చలనం లేదు. స్పృహ కోల్పోయాడనుకున్నా. అక్కడకి చేరుకున్న డాక్టర్లు పరీక్షించి ప్రాణం పోయిందని చెప్పారు. నాకు చెమటలు పట్టాయి. కాళ్లు, చేతులు ఆడలేదు. భయం వేసింది. ఏడవడం తప్ప ఏమీ చేయలేకపోయా. అలాగని అతన్ని వదిలేసి పోలేదు. అంకుల్‌కు, వాళ్ల ఆఫీస్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చా. షోలాపూర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయి, అంబులెన్స్ బయలుదేరే వరకూ అక్కడే ఉన్నా. కానీ మీ ముందు రాలేకపోయా...’’ కొంగుతో ముఖం తుడుచుకుంది భావిక. ‘‘నన్ను క్షమించండి. సంతోష్‌ను నేను ఎప్పటికీ మరువలేను.’’‘‘అందుకే పోయినవాడికి బర్త్‌డే విషెస్ చెప్పావు’’ నిష్ఠూరంగా అంది అలేఖ్య. ‘‘నేనా? లేదే...’’ వెంటనే అంది భావిక. ‘‘మొన్న ఆయన పుట్టినరోజు నాడు, రాత్రి 12 గంటలకు వచ్చింది ‘బంగారం’ అని. అసలు దాని ద్వారానే నీ నంబర్ తెలిసింది’’ అని ఫోన్ చూపించింది.‘‘మర్చిపోతానని నెలలో పుట్టినరోజు ఉన్నవాళ్లందరికీ ఫస్టు తారీఖునే సిస్టమ్‌లో మెసేజ్ షెడ్యూల్ చేసి పెడతాను. ఇది ఆటోమేటిక్‌గా అలా వచ్చిందే తప్ప, మిమ్మల్ని బాధపెట్టాలని కాదండి. అసలు జరిగినదానికి మీ కన్నా ఎక్కువ...’’ ఎప్పుడొచ్చిందో తెలీదు అత్తయ్య భావికను చాచి లెంపకాయ కొట్టింది.
 
 ‘‘ఎంత పని చేశావే దౌర్భాగ్యురాల. నా కడుపున చిచ్చుపెట్టి నంగనాచిలాగా మళ్లీ నా ఇంటికే వస్తావా? ఎంత ధైర్యమే నీకు...’’ అంటూ జుట్టు పట్టుకొని చెంపలు వాయించేసింది. వెంటనే అలేఖ్య అడ్డం వెళ్లి వాళ్లను విడదీసింది. భావిక రెండు చేతులూ జోడించి ఏడుస్తుంది. అత్తగారు ఆవేశంతో ఊగిపోతుంది. ‘‘వెళ్లు భావీ! మీ ఇంటికి వెళ్లిపో! ఈ విషయం ఇక్కడితో మర్చిపో’’ ఆమెను వీధి గుమ్మం వైపు తోసుకుపోయింది అలేఖ్య. పరిగెడుతున్న భావిక మీదకు లంఘించిన అత్తగార్ని జబ్బపట్టి వెనక్కు లాగింది కోడలు. ‘‘ఎందుకు వదిలేశావమ్మా దాన్ని. నీకెంత అన్యాయం చేసింది అది’’ ఉద్రేకంతో అంది అత్త.
 
 ‘‘ఆమెను ఏం చేస్తే మాత్రం పోయిన నీ కొడుకు తిరిగొస్తాడాత్తయ్యా?’’ ‘‘అది కాదు అలేఖ్యా! మరి నువ్వే కదా ఆ రెండో సీటు మనిషి ఎవరో కనుక్కోవాలని గొడవ చేశావు.’’‘‘తెలుసుకోవాలనుకున్నానత్తయ్యా. నేను ఏం లోటు చేశానని మీ అబ్బాయి ఇంకో స్త్రీకి చేరువయ్యాడో అడిగి తెలుసుకుందామనుకున్నాను. కానీ ఇది నాతో పెళ్లికి ముందే ఏర్పడిన బంధం. దాన్ని కొనసాగించారు అంతే. ఇందులో నా తప్పేమీ లేదు. నాకు ఆ అవగాహన చాలు’’ కళ్లు తుడుచుకుంటూ స్థిరంగా చెప్పింది అలేఖ్య.
 - అనీల్ ప్రసాద్ లింగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement