దాని  | funday story to in this week | Sakshi
Sakshi News home page

దాని 

Published Sun, Apr 1 2018 2:00 AM | Last Updated on Sun, Apr 1 2018 2:00 AM

funday story to in this week - Sakshi

సమాధుల తోట మెయిన్‌ గేటులోంచి లోపలికి వస్తున్న అతణ్ని ఆమె పలకరించింది. ‘‘తెల్లవారుజామున వస్తే సరిపోయేది కదా, ఇంత ముందుగానా?’’ అంది. ‘‘ముందుగానే చూద్దామని,’’ అన్నాడు. అతను ఎవరితో మాట్లాడాడో తెలియక పక్కనున్న వాళ్లు దిక్కులు చూశారు. ‘పెద్దవాడు. మతిస్థిమితం లేదు.’ అని నిశ్చయించుకున్నారు. ఎదుటలేని మనిషితో మాట్లాడుతూ లోనికి పోతున్నాడు. ‘‘ఈస్టర్‌ పండగ రోజు ఉదయం నా సమాధిలోంచి లేచి, నన్ను వెంటబెట్టుకొని తీసుకుపోవడానికి వచ్చిన నా తండ్రితో కలిసి వెళ్లిపోతాను. ‘‘ఆ రోజే ఎందుకు?’’ అతను అడిగాడు. ‘‘సిలువ వేయబడ్డ తన కుమారుణ్ని బతికించి, తీసుకుని పోయింది ఆరోజునే. తన పిల్లలందరినీ నా తండ్రి ఆ రోజే తీసుకొని పోతాడు.’’ ‘‘సమాధిలోంచి లేచి, నువ్వు నీ తండ్రితో వెళ్లిపోయావని నాకెట్లా తెలుస్తుంది?’’ ‘‘నా సమాధి నాప బండ, తొలగి, పగిలి ఉంటుంది.’’ 

ఈ సంభాషణ హాస్పిటల్‌ బెడ్‌ మీద చావు బతుకుల్లో ఉన్న భార్యాభర్తల మధ్య జరిగింది. ‘‘మనిద్దరం కలిసే చనిపోదాం’’ అన్నాడు భర్త. ‘‘అలా కుదరదు. నాకు పిలుపు వచ్చింది. నీకు రాలేదు. నేను వెళ్లక తప్పదు.’’‘‘నేను ఒంటరిగా ఉండాలా?’’ ‘‘కొద్దిరోజులే! నీకూ పిలుపు వస్తుంది. నాతోనే స్వర్గంలో శాశ్వతంగా ఉంటావు’’ ‘‘నీ తండ్రి నన్ను నీ దగ్గరకు రానిస్తాడా? ఉండనిస్తాడా?’’ ఆమె ఆలోచనలో పడింది. ఏభై ఏళ్ల క్రితం వాళ్లిద్దరూ పెళ్లి చేసుకొని ఆమె తండ్రి ఇంటికి పోతే, కూతుర్ని ఇంట్లోంచి నెట్టేశాడు. తల్లీ, చెల్లి, తమ్ముడూ అడ్డంపడి ఆమెను లోనికి తీసుకుపోయారు. అతణ్ని వీధిలోనే నిలబెట్టాడు ఆమె తండ్రి. ‘‘కులం మతం లేని వాడి ముఖం నేను చూడను. నా గడప తొక్కరాదు’’ అన్నాడు. ఆమె ఇల్లు, ఊరు వదిలివచ్చి ఏభై ఏళ్లయింది. ఈ జీవితమంతా వాళ్లిద్దరూ సుఖంగానే ఉన్నారు. ‘‘ఈ లోకం తండ్రికి, ఆ లోకం తండ్రికి తేడా ఉంది. ఈయన సమాజం మనిషి. ఆయన స్వర్గం దాత. మనల్ని ఈ లోకంలో ఏకం చేసినట్టే ఆ లోకంలోనూ కలిపి ఉంచుతాడు,’’ ఆమె చెప్పింది. ‘‘నేనొక్కణ్నే ఇక్కడ ఉండను. నీతో వచ్చేస్తా, ఇప్పుడే’’ ‘‘ఆ సమయం రాలేదు. నీ చిట్టచివరి మనుమరాలి పెళ్లి చేసిందాకా నీకు పిలుపు రాదు’’ ‘‘అంతదాకా నేను ఒంటరిగా ఉండాలా? ఉండను!’’ ‘‘పిచ్చికన్నా! నీకు పని ఉంది. అందాకా ఉండాలి. ఇప్పటికీ నా తండ్రిని చాలాసార్లు బ్రతిమిలాడాను. సాకులు చెప్పి చెప్పి విసిగిపోయాను. నన్ను వెళ్లనివ్వు!’’‘‘నావల్ల అవుతుందా, వెళ్లు అనటానికి’’ ‘‘నువ్వు ఊ అనందే నేను ఈ బంధం తెంచుకోలేను.’’‘‘నువ్వు వెళితే, నేను ఒంటరిగా, నువ్వు ఒంటరిగా..’’ ‘‘తప్పదు. ఇరవై ఏళ్లు మనం ఒంటరి వాళ్లమే కదా, ఆపైనేగా జంటగా మారింది. ఇక కొంత కాలం ఎడబాటు, తర్వాత కలయిక, అన్యోన్య జీవనం శాశ్వతంగా’’ ఆమె మౌనంగా ఉంది. అతని కన్నీరు కదిలింది. ఉన్నట్టుండి అడిగాడు. ‘‘నువ్వు ఇప్పుడే చనిపోకపోతే ఏం?’’ ‘‘సమయం మన చేతుల్లో ఉందా? తండ్రి ఇష్టం.’’ 

పదేళ్ల కిందట, హాస్పిటల్‌ బెడ్‌ మీద, చేయి పట్టుకొని కన్నీళ్లు తుడిచి నవ్వింది. ‘‘మళ్లీ కలుద్దాం’’ అని కళ్లు మూసుకొంది. మళ్లీ కళ్లు తెరవలేదు. అదే ఆఖరు నవ్వు. అతనికి సమాధుల తోటలో ఆమె సమాధిని ఎన్నిసార్లు చూచినా తనివి తీరదు. ఆమెను చూచినట్లే ఉంటుంది. ప్రతి ఈస్టర్‌ రోజు రాత్రంతా ఆమె సమాధి పక్కనే కూర్చుంటాడు.  ఆమె సమాధిలోనే ఉంటే దుఃఖ జీవి. లేచి తండ్రితో వెళితే ఆనంద జీవి. అందుకే ఆమె దుఃఖ విముక్తి కలగాలని తండ్రిని చేరుకోవాలని కోరుకుంటాడు. ఎప్పుడు సమాధి నాపబండ పగులుతుందా, తొలగుతుందా అని ఎదురుచూస్తుంటాడు.ఆమె తండ్రి దగ్గరకు పోయేటప్పుడు తనకు కనబడుతుందో లేదో, ఏ రూపంలో ఉంటుందో ఏమో, ఏమీ రూపం లేకుండా ఉండిపోతుందో ఏమో, తండ్రి కనిపిస్తాడో లేడో, ఇద్దరూ పవిత్ర ఆత్మ రూపంలో ఉంటారో ఏమో! అతణ్ని ఆమె గుర్తుపడుతుంది. పైగా ప్రతి ఈçస్టర్‌ రోజున పెళ్లినాటి బట్టలే కట్టుకోమంటుంది. అన్నీ తెల్లటి బట్టలే. చిరుగులు పట్టినా, చిమటలు కొట్టినా, రంధ్రాలు పడ్డా, ఆ బట్టలే, ఆ తెల్లటి బట్టలే కట్టుకోమంటుంది.ఆమెకిష్టం కదా, అవీ కట్టుకొంటాడు. ఆమె అతణ్ని గుర్తుపట్టటం తేలికే! ఏభై ఏళ్ల క్రితం అతను ఆమె చేయి పట్టుకొన్నాడు. ఆమె నవ్వింది. ‘‘నా చేయి పట్టుకొన్నావు’’ అంది. ‘‘అవును’’ అన్నాడు. ‘‘ఈ చేయి వదలవుగా’’ అని అడిగింది. ‘‘వదలను’’ అన్నాడు. ‘‘నిజం?’’ ప్రశ్నించింది. ‘‘నిజం, నేను చనిపోయినా వదలను’’ అన్నాడు. అప్పుడామె నవ్వింది. ‘‘మరి నువ్వూ?’’ అన్నాడు. ‘‘చనిపోయాక కూడా నీ చేయి వదిలిపెట్టను’’ అని నవ్వింది. ఆ నవ్వు ఏభై ఏళ్లు అతణ్ని బతికించింది. తోడుగా ఉంది.
 
పదేళ్ల క్రితం హాస్పిటల్‌ బెడ్‌మీద, చనిపోయే ముందు నవ్వింది. అద్భుతమైన నవ్వు. అది పదేళ్ల నుంచి అతణ్ని బతికిస్తూ ఉంది.  అప్పుడామె ధైర్యంగా ఉంది. నవ్వుతూనే ఉంది. అతను గుర్తు చేశాడు.‘‘చనిపోయినా నా చేయి వదలనన్నావు కదా’’ గుర్తుచేశాడు. ‘‘అవును. అన్నాను. నిజమే!’’ అంది. ‘‘మరి నన్ను విడిచి, మన పిల్లల్ని, పిల్లల పిల్లల్ని వీడి నువ్వు వెళతానంటున్నావే?’’     నవ్వింది. అంత అనారోగ్యంలో కూడా ఎంత చక్కగా నవ్విందో. ‘‘నేను ఇచ్చిన మాట తప్పటం లేదు’’ అంది. ‘‘మరి?’’ రెట్టించాడు. ‘‘నా తండ్రి  రమ్మంటున్నాడు తండ్రిమాట జవదాటగలనా?’’ వెంటనే అడిగాడు. ‘‘నాకిచ్చిన మాట తప్పుతావా?’’ ‘‘తప్పాలని లేదు. నేను బలహీనురాలిని. ఏం చేయను? నీ బిక్కముఖం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నన్ను, నా తండ్రితో వెళ్లనివ్వు’’ ‘‘కాదు, నేనూ, నీతో వస్తాను’’‘‘సంతోషమే. ఎన్నడూ ఆటంకపెట్టని నువ్వు, ఎప్పుడూ అనుమతించిననువ్వు, ఎల్లప్పుడు నన్ను అనుసరించిన నువ్వు, ఇప్పుడూ అనుసరిస్తానంటే ఆనందమే. కానీ, నువ్వు చేయవలసిన పనులు చాలా ఉన్నై. నా తండ్రి నువ్వేం చేయాలని సంకల్పించి నిన్ను సృజించాడో, అవి నెరవేర్చిందాకా నువ్వురాలేవు. సంతోషంగా ఉండు. నిన్ను ఈ లోకం మీదికి ఆ లోకపు తండ్రి ఎందుకు పంపాడో అది తీరిందాకా నీకు పిలుపు రాదు. పిలుపు రానంతకాలం నువ్వు బయలుదేరలేవు. నువ్వు చేయవలసినవి, నువ్వే చేయవలసినవి, ఎన్నో పనులు ఉండి ఉంటాయి. నువ్వో పువ్వువు. పరిమళం పంచటమే నీ పని. కాలం తీరిందాకా పువ్వు వాడదు. రాలదు. పువ్వు రాలే సమయం వస్తే ఏ బంధమూ ఆపదు. ఆ గడియ వచ్చాక ఎవరూ ఉండరు. నా మాటేంటంటావా? నా తండ్రి నాకు అప్పగించిన పని సంపూర్ణంగా, నిర్విఘ్నంగా నెరవేర్చాను. నా తండ్రి నన్ను చెయ్యమన్న పనులన్నీ చేయటానికి నువ్వు అన్ని విధాలా సహకరించావు. నా తండ్రి నా కోసం నిన్ను సృష్టించాడు. నా పని అయిపోయింది. నన్ను తీసుకుపోతున్నాడు. నీ పనికాలేదు. నిన్నిక్కడే ఉంచుతున్నాడు.’’‘‘ఎంతకాలం, ఇలా.. ఒంటరిగా?’’‘‘నాకేం తెలుసు. నా తండ్రికి తెలుసు. నువ్వు వచ్చేముందు నా తండ్రి నాకు చెబుతాడు. నీకోసం చూస్తూ ఉండే నేను, నీకు ఎదురుగా వస్తాను. చేయి పట్టుకుంటాను. వెంట తీసుకుపోతాను. తండ్రికి చూపుతాను. దగ్గర కూర్చోబెడతాను. ఈ లోకంలో నా తండ్రి ఇంట్లోకి నిన్ను తీసుకొని పోలేకపోయాను. కానీ ఆ లోకంలో నా తండ్రి దయా సన్నిధిలో నిన్ను కూర్చోబెడతాను. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ చేయి ఎప్పటికీ విడిచిపెట్టను’’ఆమె ఓదార్పు వింటుంటే, దుఃఖం తగ్గి అతనికి ఎంతో ఉపశమనం కలిగింది.‘‘నిన్ను నాకిచ్చినట్లే ఇచ్చి, ఇంతలోనే తీసుకుపోవటం ఏమిటి?’’‘‘ఇవ్వటం, తీసుకోవటం తండ్రి ఇష్టం. కొడుకునిచ్చాడు. కొడుకు సిలువ మీద రక్తం చిందించాడు. మనల్ని పునీతుల్ని చేశాడు. ఆ దైవరక్తమే మనకు రక్షణ, నిరీక్షణ ఇచ్చింది. ఈ లోకంలో రక్షణ. ఆ లోకంలో నిరీక్షణ. నేను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను.’’

‘‘ఇది నీకు న్యాయంగా ఉందా?’’‘‘అది నా తండ్రి నిర్ణయం. దానికి తిరుగులేదు. నీకు పిలుపు రాగానే నువ్వు వచ్చి నాతో కలిసి ఉంటావు.’’సమాధుల తోటలో పండువృద్ధుడు, ఎనభై ఏళ్లవాడు ఆమె సమాధి చుట్టూ తిరిగాడు. చుట్టూ చూశాడు.చిమ్మ చీకటి. అర్ధరాత్రి. నిశ్శబ్దం సమాధులతోటను పరిపాలిస్తూ ఉంది. సమాధి చుట్టూ కొవ్వొత్తులు వెలిగించాడు. వెలుతురులో సమాధిని చూశాడు. నాపబండ ఏదీ పగట్లేదు. సమాధి చెక్కు చెదరకుండా ఉంది.తండ్రిరాలేదు. ఆమె వెళ్ళలేదు. ఈ లోకంలోనే విశ్రాంతిగా ఉంది. అతను నిశ్చయించుకొన్నాడు.ఆమె పల్చటి మనిషి. గుత్తులపూల చెండ్లు బరువని ఒక్క గులాబిపెట్టుకొనేది. వేలెడు కనకాంబరాల మాల తలలో చెక్కుకొనేది.ఆమెకు సొమ్ములిష్టంకాదు. చీరెలిష్టంకాదు. పూలిష్టంకాదు. కాని భర్త ఏం తెచ్చినా, ఇచ్చినా పెట్టుకొనేది. కట్టుకొనేది. అలంకరించుకొనేది.
గులాబీలు, కనకాంబరాల మాలలు తెచ్చాడు. సమాధిని అలంకరించాడు. ఆమెను చూసుకున్నట్లుగా ఉంది. సమాధిలోంచి ఆమె సమ్మతిని తెలుపుతూ తల ఊపి ఉంటుంది.అలంకరింపబడ్డ సమాధిని తనివి తీరా చూసుకోవటానికి పెద్దకొవ్వొత్తులు వెలిగించాడు. సమాధి దేదీప్యమానంగా వెలిగింది. తను సంతృప్తిగా నిలబడ్డాడు.అతనికెప్పటికీ అర్థంకాని సంగతి, ఆమె ధైర్యం! మృత్యువు ముఖంమీదికి వచ్చినా నవ్వగలగటం. అద్భుతంగా నవ్వగలగటం ఆమెకే చెల్లు. పైగా భర్తను ఓదార్చటం! చావును అంత ధైర్యంగా ఆహ్వానించేవాళ్లు అరుదు. ఆమె అరుదైన స్త్రీ.

‘‘నీకు భయంలేదా?’’ అని పదేళ్ల క్రితం, మృత్యుముఖంలో ఉన్న ఆమెను అడిగితే నవ్వుతూ చెప్పింది – ‘‘నాకేం భయం! ఇక్కడ నువ్వున్నావు! అక్కడ నా తండ్రి ఉన్నాడు’’.ఆమె మాటలు అతనికి ధైర్యమిచ్చాయి. ఆమె ఓదార్పు గొప్పవరం. ‘‘ఇదిగో నువ్విచ్చిన పువ్వు’’ అని తలలోని గులాబీని తడిమింది. ‘‘ఇది నీ ప్రేమ. ఇది నా సౌభాగ్యం. దీంతో నా తండ్రి దగ్గరకుపోవటం, ఎంత ఆనందం!’’ నవ్వింది.పూవును తడిమితే పరిమళం తుట్టెరేగినట్లు లేచింది. ఆమె అంతా పరిమళమయింది. ఆమె ఏమీ కోరేదికాదు. ఇది లేదు, అది లేదు అని విసుక్కొనేది కాదు. ఏమీ లేకపోయినా, సుఖంగా సంతోషంగా ఉండేది. సంసార సాగరంలో మునిగి తేలుతూ, ఒక్క నీటి చుక్క కూడా అంటకుండా ఉండటం ఆమెకే చెల్లు.ఆమె సమాధి చుట్టూ పూలు అలంకరించి, నాపబండ మీద పూల మాలలుంచి, కొవ్వొత్తులు వెలిగిస్తే అతనికి తృప్తి! సాంబ్రాణి కడ్డీలు కాలిస్తే వచ్చే పరిమళం ఆమె ఇష్టపడేది. ఇష్టపడేదని ఎలా తెలుసునంటే, పరిమళం ఆఘ్రాణిస్తూ కూర్చునేది.అలంకరించిన సమాధి కొవ్వొత్తులు వెలిగించి అగరొత్తులు కాలిస్తే వచ్చే పరిమళం సమాధుల తోటలో చాలా దూరం వ్యాపించింది, పొగతో పాటు. ముసలిప్రాణం అలసి పోయింది. నిలబడలేకపోయాడు. సమాధిమీద కూర్చోబోయాడు. అపచారమనిపించింది. సమాధి నాపరాతి బండనానుకొని నేల మీద కూర్చొని, తల సమాధి మీద పెట్టుకొన్నాడు. ఆమె చేతుల్లో తన తలపెట్టుకొన్నట్లు ఆనందించాడు. అగరబత్తీల పొగ తలలోకి దూరి, ఆమె సుతారంగా తల నిమిరినట్లు అనిపించింది. మగతగా ఉంది. కళ్ళు మూసుకుపోయాయి. మాగన్నుగా నిద్రపట్టేసింది.

నిద్రలోనే, నేల మీదికి, దుమ్ములోకి, ధూళిలోకి, దూగరలోకి జారిపోయాడు. సమాధి బారుగా దానిని ఆనుకొని, దానిమీద చేయివేసి, బక్కప్రాణి నిద్రపోయాడు. ఆమె పక్కలో ఉన్నట్లు, తన చేయి ఆమె పైన వేసినట్లు సుఖంగా నిద్రపోయాడు.అమావాస్య అర్ధరాత్రి. పైగా సమాధులున్న చోటు. అటు రాత్రి మనుషులు రారు. ఈస్టరు తెల్లవారుజాము నుంచి పలచగా, తెల్లవారాక దట్టంగా జనసంచారం ఉంటుంది. నాపబండ చిట్లినట్లు అనిపించింది. కొద్దిక్షణాల్లోనే ఫటిల్లుమని పగిలిన శబ్దం. ఆమె సమాధిలోకి ప్రాణవాయువు ఊదినట్లు చిన్న శబ్దం వినవచ్చింది. అంతలో గాలి పీల్చినట్లు అలికిడి.బండకదిలింది. సమాధిలోంచి ఆమె వెలుపలికి వచ్చింది. అతన్ని చూచింది. ఆమె అతని దగ్గరకు రాలేదు. అతను ఆశించినట్లుగా ఆమె అతని తల నిమరలేదు. కాని చెప్పింది. ‘‘నా తండ్రి వచ్చాడు. నేను నా తండ్రితో స్వర్గానికి వెళుతున్నాను’’‘‘నా చేయి పట్టుకోవా?’’‘‘నేను మాటనే కాని, మనిషిని కాదు. నాకు నా సహజరూపంలేదు. నేనిప్పుడు నా ఆత్మస్వరూపం. నా తండ్రి స్వరూపం. నేన్నీకు కనబడను. నేను నీతో మాట్లాడగలగటం మన అన్యోన్య దాంపత్యానికి గుర్తు. ఈ దివ్యదేహంలో మనిషి మాటలు ఇంకా ఎంతోకాలం ఉండవు.’’‘‘నన్ను తాకవా?’’ – ‘‘తాకలేను.’’‘‘చేయి పట్టుకోవా?’’ –  ‘‘పట్టుకోలేను’’‘‘నా తల సవరించవా?’’ –  ‘‘సవరించలేను.’’‘‘ఏం? ఎందువల్ల? ఇష్టంలేదా?’’ – ‘‘ఇష్టంలేక కాదు. ఇప్పుడు నేన్నీ భార్యనుకాదు. నా తండ్రి కూతుర్ని. నాకు దేహం లేదు. నా తండ్రితో వెళుతున్నాను.’’‘‘నీ తండ్రి వచ్చాడా?’’ – ‘‘వచ్చాడు. నా చేయి పట్టుకొన్నాడు. నేను పసిపిల్లలాగా నడుస్తున్నాను. పడిపోవటం లేదు. ఎక్కువసేపు నీతో మాట్లాడితే పడిపోతానేమో.’’

‘‘నీకు ప్రయాణం ఖర్చుకు డబ్బు కావాలి కదా! వస్తూ డబ్బు తెచ్చాను. ఇదిగో తీసుకో, దగ్గరుంచుకో..’’ – ‘‘నాకెందుకు డబ్బు?’’‘‘ఎందుకైనా మంచిది. తీసుకో’’ – ‘‘నాకు నా తండ్రి చేయి ఉండగా డబ్బెందుకు, ఎవరికైనా ఇవ్వు.’’‘‘కాదు నీకే ఇస్తా’’ – నీ చేయి లేదు. వెలుతురులాగా పొగలాగా, అస్పష్టమైన ఆకారం నీది. ఇదిగో డబ్బు ఇక్కడే పెడుతున్నా.’’ – ‘‘నీ ఇష్టం.’’డబ్బు తీసి, సమాధిమీద పెట్టి, దానిమీద పూల బరువు ఉంచి, ఆపైన ఆమె కుట్టిన ఎంబ్రాయిడరీ చేతి గుడ్డపెట్టి చూశాడు. గాలికి కొట్టుకొని పోదు అని నిర్ధారించుకొన్నాడు.ఆమె కావాలనుకొంటే ఈ డబ్బు తీసుకుపోతుంది. వద్దనుకొంటే వదిలి వెళ్ళిపోతుంది అనుకొన్నాడు.ఇంక ఆమె మాట కూడా వినిపించటంలేదు. స్వర్గానికి వెళ్ళిపోయింది కాబోలు, ఈ లోకపు బందిఖానా అయిన డబ్బును ఆ లోకపు స్వేచ్ఛాప్రాణికి ఇవ్వబోయి అపచారం చేశానా అని దిగులుపడ్డాడు.అంతలో ఆమె మాట మళ్లీ వినిపించింది. ‘‘నా తండ్రి పిలుస్తున్నాడు. నేను వెళతాను.’’ –‘‘వెళ్లొస్తానను’’– ‘‘అనలేను’’ – ‘‘నేనూ నీ వెంట వస్తాను’’ – ‘‘నా ఇష్టం ఏముంది?’’
‘‘దేనికీ అడ్డుచెప్పేదానివి కాదుకదా! అన్నింటికి అవును, సరే, నీ ఇష్టం, అలాగే అనేదానివి కదా, ఇప్పుడు ఎందుకు నా ఇష్టానికి మాటకు, ఆలోచనకు అందకుండా ఉన్నావు’’‘‘అప్పుడు నీ భార్యను – ఇప్పుడు నా తండ్రి కూతురును’’‘‘నీ కొర్కెలన్నీ తీరాయా!’’‘‘నాకు కోర్కెలు లేవు. నా తండ్రి కోరిక, నీ కోరిక తీరటమే నాకు ముఖ్యం. మరి నేను వెళ్ళనా?’’‘‘మళ్ళీ ఎప్పుడో, ఎక్కడో, ఎలాగో మనం కలుసుకొనే రోజు?’’‘‘నా తండ్రి పిలుపు మేరకు నువ్వు వచ్చినప్పుడు మనది శాశ్వతమైన కలయిక.’’‘‘అందాకా నేను ఒంటరినా?’’ ‘‘నువ్వు ఎన్నుకోబడ్డ విత్తనానివి. నువ్వెట్లా మొక్కై, మానై, పుష్పించి ఫలించాలో అది నా తండ్రి ఇష్టం. నీ చేత ఇంకా ఏం చేయిస్తాడో ఆ తండ్రికి తెలుసు. ఆ పథకం పరిపూర్ణమయ్యేదాకా నీకు పిలుపురాదు. తండ్రి ఆహ్వానం ఉండదు. నిన్ను నా తండ్రి ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు. నీకూ తెలియదు. ఈ తెలియనితనమే ఈ లోకంలో మన జీవితం. తండ్రి ఉద్దిష్టం నెరవేరితే, నీ పని అయిపోయినట్లే! అప్పుడు ఈ లోకానికి నీ అవసరం ఉండదు. నా తండ్రి పిలుపు వచ్చేదాకా ఆగు.’’‘‘మళ్ళీ నిన్ను చూచేరోజు?’’‘‘నా తండ్రి ఏర్పాటు చేసే ఉంటాడు.’’

ఆమె రూపం మసకబారింది. మంచులాగా విడిపోయింది. పొగ లాగా తేలిపోయింది. ఆమె ఆకారం లేదు. మాటలేదు. అర్ధరాత్రి అమావాస్య. నిశ్శబ్దం. శూన్యం.గాలి తేలి, ధూళి లేచి, సమాధి నాపబండకు తగిలి నేల మీద పడింది. నేల మీద ఉన్న అతని ముఖాన్ని తాకింది. నిద్ర చెడింది. లేచి కూర్చున్నాడు. కల గుర్తుకు వచ్చింది. వాస్తవమేమో అని భ్రాంతి కలిగింది. ఆమె తండ్రితో వెళిపోయిందన్న భావన స్ఫురించటంతో చటుక్కున లేచి నిలబడ్డాడు. సమాధిని చూశాడు. దాని చుట్టూ తిరిగాడు.పెట్టిన పూలు చెదరలేదు. వేసిన మాలలు కదలలేదు. చేసిన అలంకారం మారలేదు. కొవ్వొత్తులు ఆరిపోలేదు. అగరొత్తులు కాలిపోలేదు. పొగ ఆగలేదు.నాపబండ పగిలి, ఆమె లేచి, తండ్రితో వెళుతూ మాట్లాడిన మాటలు గుర్తుకు రాసాగాయి.గబగబా సమాధి చుట్టూ చూశాడు. నాపబండ పగల్లేదు. సమాధి ఒరగలేదు. 
ఆలోచించసాగాడు. ఆమె తండ్రితో వెళ్ళిపోవటం కలా, నిజమా?అతను ఊడిపోయిన పంచె కట్టుకొన్నాడు. లుంగలు చుట్టుకుపోయిన జుబ్బా సరిచేసుకొన్నాడు. కిందపడి గాలికి రెపరెపలాడుతున్న పై పంచె తీసి భుజాన వేసుకొన్నాడు.చేతిగుడ్డ కింది పూలు, వాటి కింది డబ్బుకాగితాల పొత్తి, చెక్కుచెదరకుండా స్ధిరంగా ఉంది.తెల్లవారుతూ ఉంది. సమాధుల తోటలో ఉన్న తమ ఆత్మీయుల, బంధువుల, అయినవాళ్ళ స్మృతి జెండాలుగా జనం వస్తున్నారు. అతను వెలుపలికి పోసాగాడు. అంతకు ముందే, అప్పటిదాకా నిద్రపోయిన సమాధుల తోట సంరక్షకుడు, లేచి, ముఖం కడుక్కొని, సమాధుల చుట్టూ తిరిగి చూచి వచ్చి విధి నిర్వాహణకు బయలుదేరాడు.ఆమె సమాధి కాంతి, పరిమళం ఆకర్షిస్తే అటు నడిచాడు. ఈమె బంధువులు వచ్చి వెళ్ళినట్లున్నారు అనుకొన్నాడు.తాను తెల్లవారుజామున లేచి చూచినప్పుడు ఆ సమాధి దగ్గర తెల్లటి ఆకారం కదులుతున్నట్లుగా ఉండటం గుర్తుకువచ్చింది.సమాధి మీద చేతిగుడ్డ, పూలు, డబ్బు కాగితాల పొత్తి చూశాడు. డబ్బు పైకి తీశాడు. లెక్కబెట్టాడు. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. ఇంత డబ్బా? అనుకొన్నాడు. ఆనందం ఆగలేదు. తన సంవత్సర జీతమంత! ఇంత డబ్బు దేవుడి దానమే! జేబులో పెట్టుకొన్నాడు. తెల్లటి ఆకాశం గుర్తువచ్చింది.ఆగలేకపోయాడు.ఆవేశంతో ఊగిపోసాగాడు. పెద్దగా కేకలు పెడుతున్నాడు. 

‘నా తండ్రి వచ్చాడు. నాకు దానం చేశాడు. ‘దాని’ తెల్లగా ఉన్నాడు. పొగలాగా ఉన్నాడు. మంచులాగా ఉన్నాడు. గాలిలో తేలియాడాడు. తోటలో దిగటం చూశాను. తోట నుంచి నిష్క్రమించటం చూశాను. ఆకాశంలోంచి దిగాడు. ఆకాశంలోకే వెళ్లిపోయాడు. నేను చూశాను. నా తండ్రి వచ్చాడు. తోటను ఆశీర్వదించాడు. నన్ను దీవించాడు. ఇదిగో దానం. ఇదిగో డబ్బు!’’ అని ఆనందంతో కేకలు పెడుతున్నాడు.జనం ఆశ్చర్యంగా అతడి అరుపులు వింటున్నారు.అతను సమాధుల తోట మెయిన్‌ గేటు నుంచి రోడ్డు మీదికి వచ్చాడు.అప్పుడే రద్దీ మొదలవుతూ ఉంది.సూర్యుడు రాకముందు, కనిపించకముందు, సూర్యకిరణాలు వచ్చి తొలివెలుగు, తొలి వెలుతురు సృష్టించినట్లు తూర్పు నవ్వుతూ ఉంది. ఆమె నవ్వుతూ ఉంది. అతనికి ఆనందంగా ఉంది. ముందుకు నడుస్తున్నాడు. ఆమె అడిగింది.‘‘అంతదూరం, ఇంటిదాకా నడిచే వెళతావా?’’ – ‘‘వెళ్తాను’’ఆమె అడిగితే సమాధానం చెప్పినట్లుగా అనిపించింది. ఆమె జాలిగా చెప్పింది.‘‘నడవలేవు, నామాట విను, టాక్సీఎక్కి ఇంటికి వెళ్ళు. జేబులో డబ్బులేకపోయినా, ఉన్నదంతా నాకే ఇచ్చినా, ఇంటిదగ్గర టాక్సీఫేర్‌ ఇవ్వవచ్చు. టాక్సీ ఎక్కు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఈ వయస్సులో ఈ స్థితిలో ఎంతో దూరం నడవలేవు’’ – ‘‘నడుస్తాను’’‘‘ఎంతకాలం?’’ – ‘‘ఎంతకాలమైనా, తండ్రి పిలుపు వచ్చేదాకా, నడుస్తుంటాను. నడుస్తూనే ఉంటాను’’ఆమె మౌనంగా ఉంది. అతను నడుస్తూనే ఉన్నాడు.
- ఆచార్య  కొలకలూరి ఇనాక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement