నిక్కరు | funday story to world | Sakshi
Sakshi News home page

నిక్కరు

Published Sun, May 6 2018 12:28 AM | Last Updated on Sun, May 6 2018 12:28 AM

funday story to world - Sakshi

కొంకణీ మూలం : వశంత్‌ భగవంత్‌ సావంత్‌
అనువాదం: శిష్టా జగన్నాథరావు

రాత్రవుతున్న కొద్దీ అతిథులు రావడం కూడా పెరుగుతోంది. బయట కొరికేసే చలి. జాతరకొచ్చిన జనం గుంపులు గుంపులుగా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలామంది మండపంలో గుమిగూడి జాతరలో దేవుడి వస్తువుల వేలం త్వరగా పూర్తవ్వాలని హడావుడి చేస్తున్నారు. కేశవ్‌ మామ టీకొట్టు ఎదురుగా ఉన్న స్తంభానికి ఆనుకుని నేను ఎవరైనా నా స్కూలు మిత్రులు కనిపిస్తారేమోనని ఎదురు చూస్తూ నిలుచున్నాను. జాతర ఆఖరి రోజవడం వలన ఊళ్లో వాళ్లంతా మూకుమ్మడిగా వచ్చారు. నాకెంతో ఇష్టమైన ఈ జాతర ఏడాదికొకసారి వస్తుంది. ఈ ఏడాది మాత్రం నా ఉత్సాహం ఎండిపోయింది మనస్సులోనే. కారణం ఈసారి అమ్మ నన్ను కేశవ్‌ మామ జాతరలో పెట్టిన టీ దుకాణంలో ఉంచి, ఆయనకి సహాయం చేయమని పురమాయించింది. నిజం చెప్పాలంటే ఈ కేశవ్‌ మామని చూస్తేనే నాకు చిరాకేసేది. ఈ జాతర మూడు రాత్రులు మమ్మల్ని గద్దలా పొడిచి, పొడిచి చంపుకుతిన్నాడు. చలికి వణుకుతున్న జనం, ఆ వణుకు తగ్గడానికని చాయ్‌ కోసం మా కొట్టులో జమవుతున్నారు. అందువల్ల మాకు బొత్తిగా విశ్రాంతి లోపించింది. కేశవ్‌ మామ టీకొట్టులో పనిచేసే భట్టీవాడు, టీ ఇచ్చే సర్వరు ఇద్దరూ మామని చాటుగా నానాబూతులు తిట్టేవారు. అయితే ఆయన ముందు మాత్రం పల్లెత్తుమాట అనకుండా అడ్డమైన చాకిరీ చేసేవారు. మూడు రాత్రులు నిద్రలేకుండా పనిచేయడం వలన నా కళ్లు గుడ్లగూబ కళ్లల్లా అయ్యాయి. రెండు కాళ్లు పీకుతున్నాయి. ఎప్పుడు కాస్త నడుంవాల్చి విశ్రాంతి తీసుకోగలుగుతానా అని ఎదురుచూస్తున్నాను.    

‘‘డిగూ.. ఒరేయ్‌ డిగూ.. లోపల ఆ ఖాళీ గ్లాసులెవరు తీస్తార్రా? మీ నాన్న వస్తాడ్రా కడగడానికి? గొప్పగా షావుకార్లా నిల్చున్నావు ఆ కొయ్యపట్టుకుని. నడు... తొరగారా లోపలికి. ఆ గ్లాసులు కడుగు.. ముందు ఆ ప్లేట్లు చూడు’’.మావ నా మీద ఇంకా శాపనార్థాలు కురిపించేలోగా, ఆయన రుసరుసలని లక్ష్యపెట్టక నేను వెనకదారిలో వచ్చి గ్లాసులు కడగసాగాను. మూడు రాత్రులు రెండు గ్లాసులు బద్దలుకొట్టానని, నేను అప్పటికే రెండు తన్నులు తిన్నాను. నాకు పూర్తిగా విసిగెత్తింది.అన్ని గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు అక్కడే విసిరేసి హాయిగా జాతరలోకి పోయి మండపంలో స్నేహితులతో కూర్చుని పిచ్చాపాటి మాటల్తో, చక్కగా నాటకం చూడాలని మనసు ఉవ్విళ్లూరింది. కానీ ఏం చేస్తాను? అమ్మ నన్ను కోప్పడుతుందని భయమేసి, ఆ ఆలోచన వదులుకొన్నాను.ప్రతి ఏడాదీ ఇలాగే కేశవ్‌ మావ జాతరలో టీకొట్టు పెడతాడు. కానీ నాకు ఈసారే తెలిసింది. అతను నాకు మావని. అతని వ్యాపారమే అదిట. వివిధ జాతర్లలో తిరగడం. ఏ ఊళ్లో ఏ జాతర జరిగినా అక్కడ మావ టీ హోటలు డేరా వెలుస్తుంది. ఈ హడావిడిలో పనితొందర్లో ఎప్పుడూ ఆయనకి, తన చెల్లెల్ని (అంటే మా అమ్మని) చూడడానికి వీలవలేదట. కానీ ఈ సారి మాత్రం జాతర ప్రారంభం అవడానికి ముందురోజే మా ఇంటికి వచ్చాడు. ఆయన నా మావ అనీ, జాతరలో దుకాణం పెడ్తున్నాడనీ విని, ఆశ్చర్యం ఆనందాలతో ఈ విషయం నా తోటి మిత్రులకి చెప్పడానికి నేను వాడలోకి పరిగెత్తాను.నేను తిరిగి, తిరిగి ఇంటికి చేరిన తర్వాత కేశవ్‌ మావ గుడికి వెళ్తానని చెప్పి బయటకి వస్తున్నాడు. మావ తెచ్చి ఇచ్చిన పిప్పరమెంట్ల పొట్లం నాకు ఇస్తూ అమ్మ ఇలా అంది – ‘‘డిగూ, మావ నీకు లాగు కుట్టించుకోడానికి కొత్త బట్ట ఇస్తానన్నాడు’’.‘‘నిజంగానా?’’ అని నేను నా వెనక చిరిగిన లాగు తడుముకుంటూ అన్నాను. 

‘‘అవును, నిజం. కానీ నువ్వు ఆయనకో పని చెయ్యాలట.’’‘‘ఎటువంటి పని?’’ నేను ఉత్సాహంతో ఊరటతో అడిగాను.‘‘మావ చాయ్‌ కొట్టులో ఇద్దరు పనివాళ్లు ఆరోగ్యం బాగులేనందువల్ల రాలేదట. అందుకని జాతర ఉన్న మూడు రోజులు నువ్వు అతనికి సహాయంగా ఆ టీకొట్టులో పనిచేయాలి’’ అమ్మ నన్ను బుజ్జగిస్తూ చెప్పింది.‘‘వద్దు.. వద్దు.. నేను ఎంచక్కా జాతరలో తిరగాలి మిత్రులతో కలిసి!’’‘‘ఇదిగో విను – నువ్వు తెలివైన నా బంగారు కొడుకువి కదూ, ఈ మధ్య నీకు నేను కొత్త బట్టలు కుట్టించలేకపోయాను. నీ ముడ్డి దగ్గర చిరిగిన పట్లంతో జాతరలో తిరుగుతావా ముష్ఠివాడిలా? నీ మిత్రులునవ్వరా నిన్ను చూసి? అయినా జాతరలో ఏముందిరా, ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ దుకాణంలో పనిచేస్తే, ఎంచక్కా నీకు కొత్త లాగు వస్తుంది.’’అమ్మకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలియలేదు. చివరికి ఒప్పుకున్నాను. నా జుత్తుని వేళ్లతో ప్రేమగా నిమురుతూ అమ్మ అంది – ‘‘ఇదిగో చూడు, నువ్వు మావ దుకాణానికి వెళ్లు. నేను చెప్పాను మీ మావకి నువ్వు వస్తావని. పని కాస్త వొళ్లు దగ్గర పెట్టుకుని చెయ్యి. నీ మావ కాస్త కోపిష్ఠి. అతనికి సహనం తక్కువ. నీ మీద ఏ కారణం వల్లనైనా విరుచుకుపడితే నిరాశపడకు. ఈ జాతర్లలో రాత్రిళ్లు ఎప్పుడూ జాగరణ చెయ్యడం వలన అతనిలో శక్తి, సహనం పోయాయి.’’ నేను సరేనని అన్నట్లు తల ఆడించాను.

అమ్మ మళ్లీ అంది – ‘‘నీకు తెలియదురా. నీ మావకి ఎన్నో పనులు అడ్డమైన వ్యవహారాల్లోనూ తల దూరుస్తాడు. ఇక్కడి వస్తువులు అక్కడికీ, అక్కడివి ఇక్కడికీ వాణ్ని వంచించడం, వీణ్ని కాళ్లు పట్టుకుని వేసుకోవడం ఇటువంటి తిమ్మిని బమ్మిని చేసే వక్రబుద్ది వాడిది. డబ్బే వాడి దైవం. డబ్బు ముందు మనవాళ్లు, పరాయివాళ్లు అని అంతరం చూపడు. ఎవర్నీ లెక్కచెయ్యడు. ఇన్నేళ్లుగా జాతరలో దుకాణం పెడుతున్నాడు అయినా ఒక్కసారీ, ఈ ఊరికి వచ్చినప్పుడు వాడికి నన్ను చూడాలని తోచలేదు. మనింటికి రాలేదు. ఈసారి మాత్రం వచ్చాడు. ఎందుకనీ? పనివాళ్లు తక్కువైనందువల్ల. నిన్ను మేనల్లుడిని ఆ మురికిపనిలో దింపడానికి.’’అమ్మ కళ్లంబడి అశ్రువులు వచ్చాయి. అప్పుడామె చెప్పిన మాటలు నాకు సరిగ్గా అర్థమవలేదు. కానీ రెండు రాత్రులు కేశవ్‌మావ టీ కొట్టులో కొట్టుమిట్టాడాక ఆ త్రాస్టుడి కుటిల స్వభావం బాగా తెలిసింది. టీ ఒకసారి చేసాక, మళ్లీ అదే పొడితో మళ్లీ మళ్లీ టీ చేయమని వంటవాడికి ముందే పురమాయించి వాడు మరచినప్పుడు, మండిపడి కోప్పడేవాడు. శేరు పాలల్లో మరో శేరు నీళ్లు కలిపేవాడు. ఆ టీలో రుచిపచీ లేదు. ఒట్టి వేడినీళ్లు. కొద్దిగా పంచదార ఎక్కువ పడితే ఆ వంటవాడి ముడ్డిమీద పడిందనుకో దెబ్బ! జనం గోలచేసేవారు. కానీ మావ వాళ్లేమన్నా పళ్లు ఇకిలిస్తూ నవ్వేవాడు. ఏమాత్రం లజ్జ లేకుండా! జాతరలో మరెవ్వరి చాయ్‌ దుకాణం లేనందువల్ల మావ కొట్టులోనే జనాలు ఉండేవారు. మావ మానవత్వం ఇసుమంతైనా చూపించకుండా తన వ్యాపారం కొనసాగించేవాడు. అతని కుటిల స్వభావం, కుత్సిత బుద్ధి, పాడు పనులు చూశాక అతనంటే నాకు ఏహ్యభావం కలిగేది. అతన్ని చూడాలంటేనే అసహ్యం వేసేది. హోటల్లో గిరాకీదారులుండగా, అందరి ముందు మావని తూర్పారబెట్టి, అవమానం చేసి ఆ పని విడిచిపెట్టి పారిపోవాలని నాకు క్షణక్షణం అనిపించేది. కానీ అమ్మ ప్రేమతో చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, ఆ ఆలోచనకీ, నా కాళ్లకి బంధాలు తగిలేవి.గ్లాసులు, సాసర్లు కడుగుతూ ఉండగా, నా చెవుల్లో బయట జాతరలో లౌడ్‌స్పీకర్‌ మీద దేవుడి వస్తువుల వేలంపాట వినపడుతోంది. ‘‘ఆఖరి బేరం.. దేవుడి చరణాల మీద పూల దండ.. ఇరవై ఒక్క రూపాయలు... మూడవసారి....’’ వేలం పాట ముగియగానే, ఆ వేలంపాట పాడినవాడు ఉస్సూరుమని నిట్టూర్చాడు. పెద్ద కార్యం పూరై్తందని. కానీ నాకూ ఆ వంటవాడికీ, టీనీళ్లు గిరాకులకి ఇచ్చే పనివాడికీ మాత్రం విశ్రాంతి లేదు. హఠాత్తుగా దుకాణంలో రద్దీ తగ్గింది. నాటకం ప్రారంభమవుతుందని తెలిసి పరుగుపరుగున డబ్బులు గల్లా మీద విసిరేసి వెళ్లిపోయారు. గడియారంలో టైమ్‌ చూసి మావకి ఒళ్లుమండింది. 

మావ మండిపడ్డం చూసి నిజం చెప్పాలంటే నాకు భలే భలే అనిపించింది. ఈ మనిషి ఇలాగే జీవితాంతం ఏడుస్తూ చావాలని మనసులోనే శాపనార్థాలు పెట్టాను. వంటవాడు చక్కటి, చిక్కటి టీ నాకోసమని చేసి మావ చూడకుండా గ్లాసు నా చేతికిచ్చి తాగమని రహస్యంగా సంజ్ఞ చేశాడు.మావ గల్లాపెట్టెలో నోట్లు లెక్కపెడుతున్నాడు. నేను ఒక కుర్చీలో కూర్చుని నోట్లు లెక్కపెట్టడం చూస్తున్నాను. తడి చేసిన నాలికని వేలుతో మధ్య మధ్య తాకుతూ, ఏకాగ్రదృష్టితో అతి జాగ్రత్తతో లెక్కపెడుతున్నాడు. అలా లెక్కపెడుతూ తలెత్తి నన్ను చూసి హఠాత్తుగా కోపంతో కేకలేశాడు – ‘‘నువ్వేం చేస్తున్నావురా? నడు, త్వరగా ఆ ఎంగిలి గ్లాసులన్నీ కడుగు. సర్ది పెట్టు. లెక్కపెట్టు ఎన్ని విరిగాయో, ఎన్ని మిగిలాయో’’.నేను అన్ని గ్లాసులు, సాసర్లు కడిగాను. వాటిని సర్దిపెట్టి, భట్టీ దగ్గరకెళ్లి చలితో కొంకర్లుపోయిన చేతుల్ని వెచ్చచేసుకోసాగాను. చేతుల్లో కరెన్సీనోట్లు మరోసారి లెక్కపెట్టి మావ నన్ను పిలిచాడు. నాకనిపించింది. ఇప్పుడు మావ నాకు ప్యాంట్‌ కుట్టించుకోవడానికి బట్టకోసం డబ్బులు ఇస్తాడని. నేను గల్లాపెట్టె దగ్గర చేరగానే మావ అన్నాడు – ‘‘నువ్వు కాస్త ఈ గల్లాపెట్టె దగ్గర కూర్చో కాసేపు’’ అని. నన్ను అక్కడ కూర్చోబెట్టి, లోపల ఉంచిన ట్రంక్‌పెట్టె తెరిచి డబ్బులు పెట్టసాగాడు. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుంటే, నాకు ఏనుగెక్కినంత ఆనందమైంది. నేను ఇలా కూర్చునుండగా నా మిత్రులెవరైనా చూస్తే బాగుంటుందని సంబరపడ్డాను. కానీ కళ్లకెవరూ కనిపించలేదు.మావ నోట్లన్నీ తీసుకెళ్లాక, గల్లా పెట్టెలో చాలా చిల్లర మిగిలింది. ఎంత చిల్లరంటే, నేను ఎప్పుడూ దేవాలయంలో దేవుడి ముందు పళ్లెంలో కూడా చూడలేదు. అంత చిల్లర! నేనా చిల్లరలో నా చెయ్యి పెట్టి, కెలుకుతూ చప్పుడు చేశాను. ఆ చప్పుడు విని నా ఒళ్లు ఝల్లుమంది. నేను నా దోసిట్లో వచ్చినంత చిల్లర తీసుకుని పైకెత్తి గడగడలాడించి, మళ్లీ లోపల పడేశాను. మూడు రాత్రుల జాగరణ ఉండి ఆ హోటల్లో చేసిన పని అలసట ఆ చప్పుడుతో అదృశ్యమైపోయినట్లు నాకనిపించింది.

నాటకం మొదటి అంకం పూర్తవగానే నలుగురైదుగురు వ్యక్తులు టీ తాగడానికి దుకాణంలోకి వచ్చారు. వాళ్లు టీ తాగాక, నేను హుందాగా బెల్లు వాయించి బిల్లు ఎంతైందని పనివాణ్ని అడిగాను. వాళ్లిచ్చిన నోటు తీసుకుని బాకీ చిల్లర తిరిగి ఇచ్చాను.లోపటి నుంచి మావ అరిచాడు – ‘‘సరిగ్గా బిల్లు వసూలుచేశావట్రా?’’ అని.‘‘హా.. చేశాను’’ నేనూ గంభీరంగా జవాబిచ్చాను.‘‘సీతారామ్‌..’’ వంటవాడిని ఉద్దేశించి మావ గట్టిగా అన్నాడు. ‘‘రేపు, ఎల్లుండీ కామర్‌ఖండ్‌ జాతరకి వెళ్తున్నాం. నాటకం మూడవ భాగం పూర్తవగానే సామాన్లు అన్నీ సర్దేసి, మూటలు కట్టి, ఆతర్వాతే పడుకోవాలి. తెల్లవారుజామున పికప్‌ వ్యాన్‌ వస్తుంది. డేరా ఎత్తేసి వెంటనే వెళ్లిపోవాలి. వింటున్నావా?’’సీతారాం.. అవును అనలేదు, కాదు అనలేదు.మావ చిన్న మేజామీద లెక్కలు రాసుకుంటున్నాడు. నేను పావలా కాసులు, అర్ధరూపాయి బిళ్లలూ ఏరి ఒకదానిమీద ఒకటి పేర్చి నిటారుగా అమర్చాను. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఉండడం చూసిననా క్లాసు మిత్రులిద్దరు నా ముందరికి వచ్చి నన్ను పలకరించారు. నేను వాళ్లని చూసి హుందాగా అడిగాను, ‘‘టీ తాగుతార్రా?’’. వాళ్లు తాగుతామని తల ఊపుతూ సూచించారు. ‘‘సీతారాం, ఇక్కడ రెండు చక్కటి, చిక్కటి టీలు తీసుకురా’’ అని నేను హుందాగా, దర్జాగా ఆర్డర్‌ ఇస్తూ బల్ల మీద బెల్లు వాయించడానికి చేయి చాపితే, ఆ చెయ్యి తగిలి నిలువుగా పేర్చిన నాణేలన్నీ ఖంగున నేలమీద పడిపోయాయి. ఇంతవరకూ నా చేతలు చూడని మావ వెంటనే లేచి పరుగున వచ్చి చిల్లరంతా ఏరి గల్లాపెట్టెలో వేశాడు. నన్ను ఓ మూలకి తీసుకెళ్లి నా జేబులన్నీ జాగ్రత్తగా వెతికి, నా చెవి మెలేసి అన్నాడు కోపంగా.. ‘‘మీ అబ్బ సొమ్మనుకున్నావురా ఇది? డబ్బుల దగ్గర ఆటలాడుతావు? కాస్త గల్లాపెట్టె దగ్గర కూర్చోగానే డబ్బు నిషా ఎక్కింది కదూ? చాలు చాలు.. పక్కకి తప్పుకో’’.

మావ నన్ను తోసేసి, మూలకి గెంటాడు. నా మిత్రులు నారాయణ, బీకు బెదిరిపోయి బయటకెళ్లిపోయారు. నా ఒళ్లు మండిపోయింది కోపంతో. ఒక కుర్చీ ఎత్తి మావ నెత్తిమీద గట్టిగా పడేసి, రక్తం కారేలా చూడాలని క్షణంసేపు అనిపించింది.‘‘నా లాగు బట్టకోసం డబ్బులియ్యి’’ కోపం పట్టలేక గట్టిగా అన్నాను.‘‘ఆ.. డబ్బులా? రేపొద్దున్న మీ అమ్మకి ఇస్తాను’’ మావ తాపీగా అన్నాడు.‘‘రేపు వద్దు.. నాకు ఇవాళే ఇప్పుడే కావాలి.’’‘‘ఇప్పుడే కావాలా? సరే ఇప్పుడే నీ చెవి మెలేసి ఓ లెంపకాయ ఇస్తాను’’ అలా అంటూనే మావ నాకో లెంపకాయ ఇచ్చాడు. జాగరణతో నిద్రలోపించిన నా కళ్లల్లో హఠాత్తుగా చీకట్లు చిమ్మాయి. ఆ దెబ్బతో నేను పరిగెత్తి నాటకం ఆడుతున్న మండపంలోకి వచ్చిపడ్డాను. నాటకం చూస్తూ, చూస్తునే నిద్రపోయాను. ఎప్పుడు నాటకం పూర్తయిందో ఎవరికి తెలుసు! అమ్మ నన్ను తట్టి లేపినప్పుడు కళ్లు తెరిచాను. మధ్యాహ్నం అయ్యింది. నాలాగే నలుగురైదుగురు కుర్రాళ్లు మండపంలో పడుకొని ఉన్నారు.‘‘మావ నీకు నిక్కరు బట్టకోసం డబ్బులిచ్చాడ్రా?’’ అమ్మ ప్రేమతో నిమురుతూ చెవిలో అడిగింది. ‘‘లేదమ్మా! నీకు ఇస్తానన్నాడమ్మా. నీకూ ఇవ్వలేదన్నమాట!’’ నేనన్నాను.అమ్మ ఇవ్వలేదని తలాడించింది.నేను మావ టీ దుకాణంవైపు చూశాను. సామాన్లన్నీ తీసుకుని మావ ఎప్పుడెళ్లిపోయాడో ఎవరికి తెలుసు? డేరా – బురా ఏం లేదక్కడ. పిడకలతో, బొగ్గులతో నిండిన ఒక భట్టీ మాత్రం వదిలేసివుంది, అక్కడ ఒక దుకాణం ఉండేదన్న గుర్తుగా. మరే విధమైన గుర్తులేదు.‘‘మావ పెద్ద మోసగాడు’’ నేను ఏడుపు గొంతుకతో అన్నాను.‘‘వాడి పని గొడవలో నీ సంగతి బహుశా మరచిపోయి ఉంటాడు’’ అంటూ నడవసాగింది అమ్మ. మావ చాయ్‌ దుకాణం పెట్టిన స్థలంవైపు కన్నెత్తి కూడా మళ్లీ చూడకుండా నా చిరిగిన లాగు మీద చిరుగుని అరచేతితో కప్పుకుంటూ నేనూ అమ్మవెంబడే ఇంటివైపు నడవసాగాను.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement