రక్షక – అనాథ | Funday story world | Sakshi
Sakshi News home page

రక్షక – అనాథ

Published Sun, Aug 12 2018 12:57 AM | Last Updated on Sun, Aug 12 2018 12:57 AM

Funday story world - Sakshi

బెంగళూరుకి వచ్చి కాపురం పెట్టి ఇప్పటికే పదిహేనేళ్ళయింది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పరిచయం అయినవారు, ‘‘మీ ఊరు ఏది?’’ అని అడిగినపుడు ఒకట్రెండు క్షణాలు తబ్బిబ్బవుతాను. మొన్నమొన్నటివరకు ఊళ్ళో నేను పుట్టి పెరిగిన ఒక ఇల్లు ఉందనే ధైర్యముండేది. ఈ మధ్యనే దాన్ని కూడా అమ్మడం జరిగింది. వచ్చిన సొమ్ముతో బెంగళూరులో ఉన్న ఇంటి వంటింటిని ఆధునీకరించటమూ జరిగింది. ఇప్పుడు తప్పనట్టు ‘ఇదే ఊరివాడిని...’ అని బెంగళూరును అంగీకరిస్తున్నాను. విన్నవారు అకస్మాత్తుగా తాము బళ్లారి జిల్లా దగ్గరి ఊరివారని చెబితే చాలు, ‘‘అరే! నేనూ మీ ఊరివాడినేనండి’’ అని అనేటప్పుడు నాలో సంతోషం ఉప్పొంగేది. ఊళ్లోని ఇంటిని అమ్మటం అత్యంత బాధాకరమైన విషయం. పాలు తాగించి, పెంచిన ఇంటి పెద్ద ఆవును కసాయిఖానాకు అమ్మినట్టే. అయితే వాస్తవమైన విషయాలు మన భావుకతను నలిపివేస్తాయి. ఇంటిని అద్దెకు ఇస్తే దాని అద్దె సొమ్మును జనం సరిగ్గా ఇవ్వరు. ఖాళీగా వదిలేస్తే ఇల్లు పాడుబడి పరులపాలవుతుంది. బెంగళూరులోని రియల్‌ ఎస్టేట్‌ చూసిన నాకు, ఊళ్ళోని ఇల్లు కేవలం భావనాత్మకమైన సంబంధంగా మిగిలిపోవటం మాత్రం చేదు నిజం. చివరికి అమ్మటానికి నిర్ణయించుకున్నాను. సుమారు నాలుగేళ్లపాటు వాళ్ళకీ వీళ్ళకీ చెప్పుకున్న మీదట ఒకరు కొనటానికి ఒప్పుకున్నారు. రిజిస్ట్రేషన్‌ పనులు సాఫీగా ముగిశాయి.

ఇంట్లో ఉన్న వస్తువులను నేను, అక్క మాకు కావలసినవన్నీ ఉంచుకుని మిగిలినవాటిని వాళ్ళకు వీళ్ళకు ఇచ్చాం. వస్తువులన్నీ పంచుకున్నప్పటికీ ఇంట్లో ఉన్న దేవుడి పాతపటాలను ఏమిచేయాలో తోచలేదు. ఒక్క మేకును కొట్టడానికీ సంకోచించేటటువంటి కొత్త ఇంటిని కట్టుకున్న మేము, ఈ పాత దేవుడి పటాలను ఎలా ఉపయోగించాలి? దగ్గర్లోని దేవాలయానికి వెళ్లి అర్చకులను ఈ పటాలు కావాలా అని అడిగితే కరాఖండిగా వద్దని నిరాకరించారు. ‘‘తరతరాలుగా ఈ ఊళ్ళో బతికిన ఇంటివాళ్లు ఇప్పుడు ఇల్లు అమ్ముకుని బెంగళూరు చేరుకుంటున్నారప్పా. అందరి ఇళ్ల దేవుడి పటాలను పెట్టుకుని నన్నేం చేయమంటావు?’’ అని అసహనం, దుఃఖం కలగలిసిన స్వరంతో అన్నారు.  ఇంట్లోని ఇతర వస్తువులను వాళ్ళూ వీళ్ళూ సంతోషంతో తీసుకున్నప్పటికీ, పటాలను మాత్రం వద్దన్నారు. అడవికి వెళ్ళి ఏదైనా చెట్టుకింద పెట్టెయ్‌మని కొందరు సలహా ఇచ్చారు. మేము పూజించిన దేవుడి పటాలను అలా అనాథగా ఎక్కడో పెట్టి రాగలమా? అంతకు మించి అడవి అంటే భయం ఉన్న నాకు అలా త్యాజ్యవస్తువులను అడవిలో వదిలివేయటానికి కచ్చితంగా మనసొప్పలేదు. ఈ దేవుడి పటాలు నేను ఊహించినదానికన్నా పెద్ద సమస్యగా మారిపోయాయి. 

అమ్మా–నాన్నలు మహా దైవభక్తులు. ఇంటికి క్యాలెండర్‌ రూపంలో ఏ దేవుడు వచ్చినా సరే, దాన్ని ఇంటి నుంచి బయటికి పంపే ఊసే లేదు. ఆ క్యాలెండర్‌లో ఉన్న నెలలు–రోజుల వివరాలు కేవలం నెపం మాత్రమే. కళకళలాడే దేవుడి చిత్రం మాత్రం వారికి ముఖ్యమైంది. సంవత్సరం ముగిసేలోపు దానికి ఫ్రేవ్‌ు వేయించి, ఎలాంటి సంకోచం లేకుండా గోడకు మేకు కొట్టి, దేవుడి ఫొటోను వేలాడదీసి, మరుసటి రోజు నుంచి కుంకుమ పెట్టి మంగళారతి చేసేవారు.  ఇక తీర్థక్షేత్రాలకు వెళితే, అక్కడి ప్రముఖమైన దేవుడి ఫొటోను తప్పకుండా తెచ్చేవారు. ధర్మస్థలానికి చెందిన మంజునాథుడు, తిరుపతి వెంకటేశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రస్వామి, ఉడిపి కృష్ణప్ప, కుక్కె సుబ్రహ్మణ్యం, సన్నుతి చంద్రలాంబ, హంపి యంత్రోద్ధార, పూరీ జగన్నాథ, కాశీ విశ్వనాథ, బదిరి నారాయణ, కొల్హాపూర్‌ మహాలక్ష్మి... ఒకటా, రెండా? తాము వెళ్లివచ్చిన పుణ్యక్షేత్రాలు, ఇతరులు వెళ్లివచ్చి ప్రసాదంతోపాటు ఇచ్చిన దేవుడి ఫొటోలు అన్నీ ఇంటి గోడ మీద అలంకరింపబడేవి. ఇంటి బయట తలుపుమీద భూతరాజుగారు. రాత్రి మేము పడుకున్నప్పుడు ఆ దేవతలందరూ మెలకువగా ఉండి మమ్మల్ని కాపాడుతున్నటువంటి భావం ఏర్పడేది. ఏదైనా తప్పుచేస్తే ఆ దేవుళ్ల కోపపుదృష్టిని ఎదుర్కోవడానికి గుండె వణికేది. మంచి పనులు చేస్తే నవ్వుముఖంతోనే అందరూ ఆశీర్వదించేవాళ్లు. ఒక విధంగా చూస్తే ఇంట్లో ఒక్కరమే ఉన్నామనే భావన మాకు ఎన్నడూ కలగలేదు. 

తీర్థ క్షేత్రాలకు సంబంధం లేని, అయితే కొన్ని పండుగలకు లేదా పూలకు మాత్రమే కావలసిన కొందరి దేవతల ఫొటోలు ఉన్నాయి. సత్యనారాయణస్వామి, వటసావిత్రి, సూర్యనారాయణస్వామి, పురందరదాసు, బుధబృహస్పతి, వరమహాలక్ష్మి మొదలైనవి. వటసావిత్రిని పున్నమినాడు పూజించి, సాయంకాలం పూట సావిత్రి కథను అమ్మ చదివేది. పాట వినడానికి మడికట్టుకున్న కాశవ్వ గుమ్మం దగ్గరికొచ్చి కూర్చునేది. సత్యవంతుడి ఆత్మను యమధర్మరాజు యమపాశం వేసి లాక్కునిపోతున్న సందర్భం వచ్చినపుడు వెక్కివెక్కి ఏడ్చేది. తెలిసిన ఆ కథనే ప్రతీ సంవత్సరం వింటున్నప్పుడు కూడా ఏడుపు తప్పకుండా వచ్చేది. ‘‘ఎంతటి పతివ్రత చూడమ్మా, యముడి వెంటపడి, ముత్తయిదువుతనం కాపాడుకుంది. నా భర్త చనిపోయినపుడు నాకూ అలాగే అతడి వెంటపోయి పోట్లాడి భర్తను తిరిగి తీసుకుని రావాలని అనిపించింది. అయితే మనలాంటి అల్పులకు ఆయన ఎలా కనిపిస్తాడో చెప్పు’’ అని తప్పకుండా చెప్పేది.

పురందరదాసుల పుణ్యతిథిన ఉదయం నుంచి రాత్రి పడుకునేవరకు దాసులపాట, భజన జరిగేది. అమ్మ, అక్క ఇద్దరూ మధురంగా పాడేవారు. నాకు పాడటానికి రాకపోయినా భజనలో ఆడంబరంగా భాగం వహించేవాడిని. గుంపులో కలిసి పాడటానికి మంచి కంఠస్వరం అవసరం ఉండదు. పాడాలనే ఉత్సాహం వుంటేచాలు. ఇరుగుపొరుగు ఇళ్లవాళ్లంతా పాల్గొనేవాళ్లు. నేనే చిత్రించిన హనుమంతుడి చిత్రమొకటి ఇంట్లో ఉండేది. పాఠశాలలో జరిగిన చిత్రకళా పోటీలో నేను ఆ హనుమంతుడి చిత్రాన్ని వేశాను. పర్వతాన్ని చేత్తో మోసుకుని, సముద్రాన్ని లంఘించే హనుమంతుడి చిత్రమది. అతడి తోక అతడి పొడవైన దేహాన్ని చుట్టి తలమీదికి వచ్చింది. ఆ చిత్రానికి కన్సొలేషన్‌ బహుమతి ఇచ్చారు. అక్క ఆ చిత్రాన్ని చూసి పదేపదే తమాషా చేసింది. ‘‘నీ హనుమంతుడు సరిగ్గా భోజనమే చేయలేదు. కడ్డిపైల్వాన్‌లా ఉన్నాడు’’ అనేది. ‘‘తోక కిందికి కదిలిస్తూ ఉండాలి. అది ఎలా ఆకాశంవైపు నిటారుగా నిలబడి ఉంటుంది’’ అని తార్కికమైన ప్రశ్న వేసేది. అమ్మ మాత్రం అక్క వ్యంగ్యమైన మాటలను సమర్థించక ఆ చిత్రానికి ఫ్రేము వేయించి, మిగిలిన దేవుళ్ళ మధ్యన చేర్చింది. అయితే అక్క కూడా ఆ పటాన్ని భక్తితో పూజించే సమయం రానే వచ్చింది.అక్కకు రెండుమూడు సంబంధాలు చూసినా ఏవో కుంటిసాకులతో సంబంధాలు కుదరలేదు. అమ్మా, నాన్నలకు కలవరం మొదలైంది. అక్కలో విచిత్రమైన ఓటమి భావన. అప్పుడు ఎవరో పెద్దవాళ్లు రోజూ హనుమంతుణ్ణి పూజించి, తోకకు ఒక్కొక్క గంధపు బొట్టు పెట్టమని చెప్పారు. అక్క ఎలాంటి సలహా అయినా పాటించటానికి సిద్ధంగా ఉంది. నా హనుమంతుడి తోక రోజుకొక గంధపు చుక్కతో చల్లబడసాగింది. తోకంతా గంధపు చుక్కలతో మూసుకుపోయేటంతలో అక్కకు సంబంధం కుదిరింది. ‘‘ఈ పటంలోని హనుమంతుడు మహా సత్యవంతుడు’’ అని అమ్మ అందరి ముందు చెప్పుకుంటూ తిరిగింది. అక్కకూ ఆ హనుమంతుడి మీద ఎక్కడలేని భక్తి పెరిగి, ఆయన కడ్డి దేహం కానీ, తర్కానికి అందని నిటారుగా నుంచున్న తోకకానీ కనిపించకుండా పోయాయి. అమ్మ మాటను విని ఇంకో ఇద్దరు అమ్మాయిలు గంధం పూసి భర్తలను పొందారు. అందరిలా కృష్ణవేణమ్మ తన కూతురు మంజి చేత ఆ పటానికి పూజ చేయించింది. తోక మూసుకుపోయేటంతగా గంధం పూసినా మంజికి సంబంధం కుదరలేదు. ‘‘నా కూతురి నుదుట కళ్యాణ యోగం రాయకపోతే ఏ దేవుడు మాత్రం ఏం చేస్తాడులెండి’’ అని కృష్ణవేణమ్మ తప్పును కూతురి నుదుటి రాత మీద తోసి దేవుడి మహిమను కాపాడింది. 

గండి నరసింహస్వామి ఇంటి దేవుడైనప్పటికీ మూల విగ్రహం ఫొటో మాత్రం ఇంట్లో ఉండలేదు. దానికి కారణం లేకపోలేదు. ఆ దేవుడు ఎంతటి సత్యవంతుడంటే ఫొటో తీస్తే, ఫొటో వచ్చేదేకాదు. ఓ ఆంగ్ల మహిళ పట్టుబట్టి దొంగతనంగా ఆ దేవుడి ఫొటో తీసినప్పటికీ, ఉగ్ర నరసింహుడి కోపానికి గురై రక్తం కక్కుకుని చచ్చిపోయిందట. గుర్రం మీద వచ్చిన ఆమె ఫొటో గుడి గోపురం మీద ఇప్పటికీ ఉంది.మా అందరి నమ్మకాన్ని తలకిందులు చేసేలా గోపణ్ణ కుమారుడు ప్రహ్లాద బెంగళూరు నుంచి వచ్చాడు. పెద్దనగరం తళుకు బెళుకులను చూసిన ప్రహ్లాద ఎవరికీ తెలియకుండా దేవుడి ఫొటోను క్లిక్‌ చేశాడు. అతడికి మా అందరి మూఢనమ్మకాన్ని అబద్ధం చేసిన సంతోషం. ‘‘చూడండి...చూడండి..’’ అని నవ్వుతూ ఆ ఫొటోను అందరికీ చూపిస్తూ వచ్చాడు. మా తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ‘‘దేవుడిని అబద్ధం చేయాలనే పాడుబుద్ధి ఈ వెధవకి. అదేం సాధిస్తాడో...’’ అని అమ్మ సగం బాధ, సగం కోపంతో అంది. అయితే ఆ ఫొటోను మాత్రం ఇంట్లో పెట్టుకోవడానికి ఇద్దరూ అంగీకరించలేదు. ఊరికి వెళ్ళే రోజున అతడిని భోజనానికి పిలిచింది. వేడి పప్పుపులుసు, అన్నం మహాకారంగా ఉంది. ఒక ముద్ద మింగటం ఆలస్యం, ప్రహ్లాదకు కారం నెత్తికెక్కింది. కళ్లలోంచి, ముక్కులోంచి నీళ్లుకారి గుడ్లు మిటకరించసాగాడు. అతడికి నీళ్లు తెచ్చి ఇవ్వటం మరిచిన అమ్మ, ‘‘ఉగ్ర నరసింహుడికి తప్పయిందని వేడుకోప్పా... అంతా సరిపోతుంది...’’ అని ఒత్తిడి పెట్టసాగింది.

ఇంట్లో ఉన్నవి కేవలం దేవుడి ఫొటోలు మాత్రమే కావు. పెద్దవాళ్ళ ఫొటోలూ ఎన్నో ఉన్నాయి. ఒళ్ళు కూలబడిపోయేటంతగా నగలు, వస్త్రాలను ధరించి కుర్చీమీద కూర్చున్న అమ్మమ్మ, ఆమె పక్కన కోటు–ధోవతి ధరించి, చేతిలో పొన్నుకర్ర పట్టుకుని నుంచున్న తాతయ్య. ఆ ఫొటో పక్కనే జంటగా నుంచున్న అమ్మానాన్నల ఫొటో. ఊటీకి హనీమూన్‌ కోసం వెళ్లినపుడు భుజం మీద చేయి వేసి నుంచున్న అక్కాబావల కలర్‌ ఫొటో. నేను పసివాడిగా ఉన్నప్పుడు జంబుఖానా మీద పడుకుని తల పైకెత్తిన ఫొటో. ఇందిరాగాం«ధీ ఊరికి వచ్చినపుడు ఆమెకు అక్కయ్య పూలదండ వేసేటప్పుడు తీసిన ఫొటో. నాన్న పట్టా పొందినపుడు నల్లకోటు, టోపీ వేసుకుని తీయించుకున్న ఫొటో. అమ్మ చేతికి వాచీ కట్టుకుని తన స్నేహితురాలితో తీయించుకున్న ఫొటో. ఇవికాక అక్క బొత్తాలతో అల్లిన బాతు బొమ్మ.మాకు తెలియని ఒక స్త్రీ ఫొటో ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆమె పేరు రిందమ్మ. పెద్దపెద్ద కళ్లున్న ఆమె ముఖం మీద కాస్త కూడా నవ్వు లేకుండా, భయంకరంగా, గంభీరంగా ఉండేది. నాన్నకు ఆ ఫొటో పట్ల చాలా గౌరవం. అయితే ఆయనకూ ఆమె ఎవరో తెలియదు. అయితే పితృపక్షం రోజున ఆమెకు తప్పకుండా పిండప్రదానం జరిగేది.  నాన్న రెండవ చిన్నాన్న పెళ్ళిలో తీసిన ఒక గ్రూప్‌ ఫొటో ఉండేది. అందులో నాన్న అచ్చం నాలాగే ఉన్నారు. ఆ చిన్న వయస్సులోనే ధోవతి కట్టుకుని, కోటు వేసుకుని, తలకు ఒక టోపీ పెట్టుకున్నారు. పాఠశాల ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీకి అక్క నాకు అదే వేషం వేసింది. మొదటి బహుమతి వచ్చింది. మా ఇంటికి పెద్దవాళ్లు ఎవరు వచ్చినా ఆ ఫొటోను గంటలకొద్దీ చూస్తూ కూర్చునేవారు. ఈమె సుందరమ్మ, ఇతను అనంతు, ఇతను గుండు చిన్నాన్న అని గుర్తించి సంతోషపడేవారు. అయితే నాన్న పిన్నికి మాత్రం ఈ ఫొటో చూస్తే సరిపడేదికాదు. ఎందుకంటే ఆమె ఆ ఫొటోలో లేదు. చిన్నాన్న పక్కన కూర్చున్న అతడి మొదటి భార్య పెళ్ళయిన సంవత్సరంలోనే కాన్పులో చనిపోయింది. ‘‘చచ్చిన తరువాత కూడా ఎంత పీడించిందమ్మా ఈ నా సవితి...’’ అని నఖశిఖపర్యంతం మండిపడేది. అయితే కాన్పులో బతికిపోయిన సరోజక్క మాత్రం కళ్లు విప్పార్చుకుని తను చూడని తల్లిని చూస్తూ నుంచునేది. 
రెండు వందలకు పైగా ఉన్న ఫొటోలను ఇల్లు కొన్నవారు తెచ్చి నాకు ఇచ్చారు. ఒక్కొక్క ఫొటోను చూసినప్పుడంతా తోసుకొచ్చే జ్ఞాపకాలు. అయితే వాటిని ఎలా రక్షించాలి? నా జీవితానికి అనుమతి ఇచ్చి నడిపించిన దేవాధిదేవతలు, పెద్దలు నా వైపు నిస్సహాయ దృక్కులతో ‘‘ఎలాగైనా కాపాడు’’ అని వేడుకోసాగారు. ఉగ్రనరసింహుడి గోర్లు మొండివయ్యాయి. లక్ష్మి చేతి నుంచి కురిసే బంగారు నాణేలు మెరుపు పోగొట్టుకున్నాయి. సత్యనారాయణుడి ఇరుపక్కలున్న అరటి ఆకులు వాడిపోయాయి. సూర్యభగవానుడికి గ్రహణం పట్టింది. 

రెండు రోజులు ఆలోచించిన తరువాత ఒక ఉపాయం స్ఫురించింది. ఫొటోల బొత్తిని విప్పి, ఫ్రేము, అద్దాలు తొలగించి, జాగ్రత్తగా ఫొటోలను బయటికి తీశాను. ప్రతీ చిత్రాన్ని స్కానర్‌లో పెట్టి, సాఫ్ట్‌ కాపీ తయారుచేశాను. అన్ని ఫొటోల చిత్రాలను ఒక సీడీలో సంగ్రహించాను. ఆ íసీడీని చిటికెన వేలికి చిక్కించి ఎత్తి పట్టుకున్నప్పుడు గోవర్ధనగిరిధారిలా పులకించాను. ముక్కోటి దేవతలను నా చిటికెనవేలి చివరన ఎత్తి పట్టుకున్నాను. ఇప్పుడు నా కంప్యూటర్‌ తెరమీద ఈ దేవతలూ, పెద్దలూ స్క్రీన్‌సేవర్‌ అయ్యారు. నేను కొద్దిసేపు పని ఆపితే చాలు, ఒక్కొక్కరుగా వచ్చి చిన్న తెరమీద దర్శనమిస్తారు. ఆ ఫొటోలను చూసినపుడు ఒక్కసారిగా బాల్యంలోకి పరుగులుపెట్టిన వెచ్చటి అనుభవం నాకు కలుగుతుంది. నా సహోద్యోగులు, ‘‘అరెరె, ఈ ఫొటో మా ఇంట్లో ఉండేది... ఈ ఫొటో మా ఇంట్లో ఉండేది...’’ అని గుర్తించేవారు.
కన్నడ మూలం : వసుధేంద్ర
అనువాదం: రంగనాథ రామచంద్రరావు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement