హితుడా? హంతకుడా?
పట్టుకోండి చూద్దాం
కేరళలోని ఓ కొండప్రాంతం... జనం గుమిగూడి ఉన్నారు. అందరూ కొండ మీద నిలబడి కింద ఉన్న లోయలోకి చూస్తున్నారు. వాళ్ల మధ్య నిలబడిన ఓ వ్యక్తి ‘సాగర్’ అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అందరూ అతణ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ వస్తూనే. ‘‘నా ఫ్రెండ్ సర్. ట్రెక్కింగ్ చేస్తూ లోయలోకి పడిపోయాడు. తనని కాపాడండి సర్. వెంటనే వెతకండి సర్’’ అంటూ మరింత బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడతను.
‘‘ఏడవకండి. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్. ‘‘మాది హైదరాబాద్ సర్. నా పేరు వినీత్. నేను నా ఫ్రెండ్ సాగర్ టూర్‌కి వచ్చాం. ఇందాక మేం ట్రెక్కింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్ సాగర్ నడుముకి కట్టుకున్న బెల్ట్ ఊడిపోయింది. దాంతో తను జారి లోయలోకి పడిపోయాడు సర్.’’ లోయలోకి తొంగి చూశాడు ఇన్‌స్పెక్టర్. చాలా లోతు ఉంది. పడితే బతికే చాన్సే లేదు. అయినా అలా అనలేదు. ‘‘నేను వెతికిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి’’ వెళ్లిపోయాడు.
రెండు రోజులు గడిచినా సాగర్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకలేదు. దాంతో పోలీసులు వినీత్‌ని వెళ్లిపొమ్మన్నారు. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తెలియజేస్తామన్నారు. దాంతో భారమైన మనసుతో హైదరాబాద్ బయలుదేరాడు వినీత్.
రెండు రోజుల తర్వాత...
సీరియస్‌గా ఫైల్ తిరగేస్తున్న ఇన్‌స్పెక్టర్ అభిమన్యును ఫోన్ రింగయిన శబ్దం డిస్టర్బ్ చేసింది. ‘ప్చ్’ అని విసుక్కుంటూ ఫోన్ తీసి హలో అన్నాడు.
‘‘నేను కేరళ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మిస్టర్ అభిమన్యూ. ఇక్కడ లోయలో ఒక వ్యక్తి మృతదేహం దొరికింది. అతను హైదరాబాద్‌కి చెందినవాడే. తన ఫ్రెండ్‌తో పాటు టూర్‌కి వచ్చాడు. ట్రెక్కింగ్ చేస్తూ లోయలో పడిపోయాడు.
దాంతో అతని ఫ్రెండ్ కంప్లయింట్ ఇచ్చాడు. రెండు రోజులు వెతికినా దొరక్కపోవడంతో అతన్ని వెళ్లిపొమ్మన్నాం. ఈరోజు ఉదయం డెడ్‌బాడీ దొరికింది. బాడీని హైదరాబాద్ పంపిస్తున్నాం. కాస్త మీరిది డీల్ చేయాలి’’ చెప్పాడు ఫోన్ చేసిన వ్యక్తి.
‘‘ష్యూర్... అది నా బాధ్యత’’ అన్నాడు అభిమన్యు. అవతలి వ్యక్తి చెప్పిన మిగతా వివరాలు కూడా విని ఫోన్ పెట్టేశాడు. కాసేపట్లో మృతుడి ఫొటోతో పాటు అతడి వివరాలు కూడా ఫ్యాక్స్‌లో వచ్చేశాయి.
ఇరవై తొమ్మిదేళ్ల వయసు. దగ్గర దగ్గర ఆరడుగుల పొడవున్నాడు. చనిపోయినప్పుడు నల్లరంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా వేసుకున్నాడు. చనిపోయి అయిదు రోజులు కావడంతో మృతదేహం పాడైపోయి పోలికలు తెలియడం లేదు. కానిస్టేబుల్‌ని పిలిచాడు అభిమన్యు. మృతుడి వివరాలిచ్చి, ‘‘అతని కుటుంబానికి విషయం తెలియజెయ్యండి. అలాగే అతని ఫ్రెండ్‌కి కూడా’’ అని ఆదేశించాడు.
‘‘బాబూ సాగర్’’... మృతదేహం చూస్తూనే దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది తల్లి. ‘‘తండ్రి లేని పిల్లాడని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నాను. వాడే ప్రపంచం అనుకున్నాను. ఇప్పుడు నాకు దిక్కెవరు’’ అంటూ ఆ ముసలి తల్లి కన్నీరు మున్నీరవుతుంటే అందరి మనసులూ తల్లడిల్లాయి. అయ్యోపాపం అన్నట్టుగా చూస్తున్నారంతా. సాగర్ తల్లిని ఓ వ్యక్తి ఓదారుస్తున్నాడు.
‘‘సర్... అతనే వినీత్. సాగర్‌తో కేరళ వెళ్లిన వ్యక్తి’’ అన్నాడు కానిస్టేబుల్ కామేష్. అలాగా అన్నట్టు తలూపాడు అభిమన్యు.
అంతక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వినీత్ దగ్గరకు వెళ్లి అన్నాడు... ‘‘వినీత్... మీరో సారి స్టేషన్‌కు వస్తే స్టేట్‌మెంట్ తీసుకోవాలి.’’
‘‘ఇంకా ఏం తీసుకుంటారు సర్ స్టేట్ మెంట్? చూస్తున్నారుగా మా పరిస్థితి? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. పాపిష్టివాణ్ని. నేనే తనని పట్టుబట్టి టూర్‌కి తీసుకెళ్లాను. నావల్లే వాడికిలా అయ్యింది. నా పాపం ఊరికే పోదు.’’
‘‘అవును... మీ పాపం ఊరికే పోదు.’’
ఉలిక్కిపడ్డాడు వినీత్. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు అయోమయంగా.
‘‘ఏమంటాను? స్నేహితుణ్ని నమ్మించి, ఊరు గాని ఊరు తీసుకెళ్లి, కొండమీద నుంచి తోసేసి క్రూరంగా చంపేసిన పాపం ఊరికే ఎలా పోతుంది అంటున్నాను.’’
అవాక్కయిపోయాడు వినీత్. ‘‘నేను నేను’’
‘‘ఇక తప్పించుకోలేవు వినీత్. నాకు బలమైన సాక్ష్యం దొరికింది. ఇదిగో’’ అన్నాడు అభిమన్యు. అతని చేతిలో తన రిటర్‌న టికెట్ చూసిన వినీత్ నీరుగారిపోయాడు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు.
ఇంతకీ ఆ టికెట్‌లో ఏముంది? అది చూసి వినీత్ హంతకుడని అభిమన్యు ఎలా కనిపెట్టాడు?!
జవాబు:
ఇన్‌స్పెక్టర్‌కి రిటర్‌న టికెట్ దొరికింది కదా! దానిమీద కేరళ వెళ్లినప్పుడు బుక్ చేసిన టికెట్ మీద ఏ డేటు ఉందో అదే ఉంది. అంటే రాను పోను ఒకేసారి బుక్ చేశాడు వినీత్. మరి రిటర్‌న టికెట్ తనకు మాత్రమే చేశాడంటే సాగర్ తనతో తిరిగి రాడనే కదా! దాన్ని బట్టి అతణ్ని చంపేయడానికి ముందే స్కెచ్ వేశాడని అర్థమవుతోంది.