ఓ పరదేశీ... | gujrati girl and uzbekistan boy love story | Sakshi
Sakshi News home page

ఓ పరదేశీ...

Published Sun, Dec 6 2015 3:05 AM | Last Updated on Tue, Aug 21 2018 2:56 PM

ఓ పరదేశీ... - Sakshi

ఓ పరదేశీ...

గుజరాత్ అమ్మాయి, ఉజ్బెకిస్తాన్ అబ్బాయిల విషాదాంత ప్రేమగాథ
జీలం, చీనాబ్ నదుల మధ్య కొలువు తీరిన అందమైన పట్టణం గుజరాత్ (పాకిస్తాన్)లోకి అడుగుపెడితే, మట్టిపూల పరిమళం హృదయాన్ని తాకుతుంది. గుజరాత్... మట్టితో చేసిన రకరకాల కళాకృతులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి మధ్య ఆసియా దేశాలకు కూడా మట్టి కళాకృతులు ఎగుమతి అవుతుంటాయి. అవే ఇజ్జత్ బేగ్‌ని గుజరాత్‌కి రప్పించాయి.
 
బుక్‌హర (ఉజ్బెకిస్తాన్)కు చెందిన ఇజ్జత్ బేగ్ వ్యాపార పనిలో భాగంగా గుజరాత్‌లో అడుగుపెట్టాడు. కుమ్హర్ వీధిలో నడుస్తూ నడుస్తూ  ఒక కుండల దుకాణం దగ్గర ఆగిపోయాడు. అప్పటి వరకు ఉన్న ఆయాసం మంత్రం వేసినట్లు మాయమైపోయింది. ‘ఇంత అందమైన అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదు’ అనుకున్నాడు... ఆ దుకాణంలో కూర్చున్న అమ్మాయిని చూస్తూ.
 
ఆ అమ్మాయి పేరు సోహ్ని. అంటే ‘అందమైనది’ అని అర్థం. మట్టితో అందమైన కళారూపాలు చేయడంలో  సోహ్నికి మంచి పేరుంది. నాన్న తుల్హా నుంచి ఈ విద్యను నేర్చుకుంది. అందుకే ‘తండ్రిని మించిన తనయ’ అంటారు చాలామంది సోహ్నిని. కొందరేమో... ‘నీ అందంలో కొంచెం ఈ బొమ్మల తయారీలో వాడుతున్నావా’ అని చమత్కరిస్తారు కూడా!
 
అంత అందాన్ని చూసిన ఇజ్జత్ కన్ను నిద్రకు కూడా మూతపడనని మొరాయిం చడం మొదలెట్టింది. అతని మనసు ఆమె వైపే పరుగులు తీయసాగింది. దాంతో రోజూ దుకాణానికి వచ్చి సోహ్ని దగ్గర ఏదో వస్తువు కొనుక్కువెళ్లేవాడు. అలా వారి పరిచయం పెరిగింది. ఒకరోజు తన మనసులోని మాటను బయటపెట్టాడు ఇజ్జత్... ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని. ఆమె నోట మాట రాలేదు. కళ్లలోని సిగ్గు మాత్రం ‘నేనూ కూడా నిన్ను ప్రేమి స్తున్నాను’ అని చెప్పకనే చెప్పింది.
 
అంతలో ఇజ్జత్  స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన రోజు వచ్చింది. కానీ వెళ్లలేదు. అక్కడే ఉండిపోవడానికి ఉద్యోగయత్నాలు మొదలుపెట్టాడు. ‘ఎక్కడో  పని చేయడం  ఎందుకు? తుల్హా ఇంట్లో పనివాడిగా చేరితే రోజూ సోహ్నిని చూడవచ్చు’ కదా అను కున్నాడు. వెళ్లి తుల్హాను కలిశాడు. ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. పశువులను మేపే పని ఇజ్జత్‌కు అప్పగించాడు తుల్హా. సంపన్నుడైన ఇజ్జత్‌కు ఆ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.

పశువులను మేపాల్సిన అవసరం అంత కంటే లేదు. కానీ ప్రేమ ఏ పని అయినా చేయిస్తుంది కదా! అందుకే చేసేందుకు సిద్ధపడ్డాడు. అతడిని అందరూ మహీవాల్ (పశువుల కాపరి) అని పిలిచేవారు. ఇప్పుడతను సోహ్నిని రోజూ చూడగలుగుతున్నాడు.  మాట్లాడగలుగుతున్నాడు. అది చాలు.
 
కొన్నిరోజుల తరువాత సోహ్ని-ఇజ్జత్‌ల ప్రేమ వ్యవహారం తుల్హాకు  తెలిసింది. ‘మోసం’ అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఇజ్జత్ మీద చేయి చేసుకొని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ‘‘ఈ ఊళ్లో కనిపిస్తే ప్రాణాలు తీసేస్తాను’’ అని హెచ్చరించాడు.
 
అయినా సరే... గుజరాత్‌ని విడిచి వెళ్లలేదు ఇజ్జత్. చీనాబ్ నది ఒడ్డున ఒక గుడిసె వేసుకొని అక్కడే ఉండసాగాడు. విషయం తెలిసిన సోహ్ని  ఎవరి కంట పడకుండా  రాత్రి వేళల్లో  ఘర్రా (నీటి కుండలాంటిది) సహాయంతో నదిలో ఈదుతూ అవతలి ఒడ్డున ఉన్న ఇజ్జత్ దగ్గరకు చేరేది. అలా ఇద్దరూ తమదైన ప్రేమ ప్రపంచంలో విహరించేవాళ్లు.  
 ఎప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి కూడా ఇజ్జత్‌ని కలవడానికి నది దగ్గరగా వెళ్లింది సోహ్ని. నది పోటెత్తుతోంది.

అయినా వెనక్కి వెళ్లాలనిపించలేదు. దాంతో ఇజ్జత్ దగ్గరకు బయలు దేరింది. కొద్దిసేపటి తరువాత పట్టు తప్పి నదిలో మునగడం ప్రారంభించింది. ఆమె అరుపులు ఇజ్జత్ చెవిన పడ్డాయి. వెంటనే నదిలోకి దూకేశాడు. సోహ్నిని రక్షించ డానికి ప్రయత్నించి తాను కూడా ప్రమాదంలో చిక్కుకు పోయాడు. తర్వాత, ఆ ఇద్దరి ప్రాణాలూ పంచ భూతాల్లో కలిసిపోవడానికి ఎంతోసేపు పట్టలేదు.
 ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ ప్రేమికుల శవాలను చూసి గుజరాత్ దుఃఖ సముద్రం అయింది. సోహ్ని-మహీవాల్‌ల ప్రేమ ఒక  చారిత్రక ప్రేమకథగా గుజరాత్ గుండెల్లో శాశ్వతంగా  నిలిచిపోయింది.
 - యాకూబ్ పాషా
 
సోహ్ని-మహీవాల్‌ల సమాధి
* సోహ్ని-బేగ్‌ల ప్రేమను ఎందరో కవులు కవితలుగా మలిచారు. పాటలుగా అక్షరబద్దం చేశారు.
* సోబ్హసింగ్ అనే ప్రసిద్ధ చిత్రకారుడు వీరి ప్రేమకథపై ఎన్నో అందమైన వర్ణ చిత్రాలను గీశాడు.
* పాకిస్తాన్‌లోని షహ్దపూర్‌లో సోహ్ని-మహీవాల్‌ల సమాధి ఉంది.
* ‘సోహ్ని మహీవాల్’ పేరుతో ఇప్పటి వరకు బాలీవుడ్‌లో నాలుగు చిత్రాలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement