
Hardik Pandya- Natasa Stankovic Love Story: అమ్మానాన్న.. తోబుట్టువులు మినహా.. జీవితంలో అచ్చంగా తమకు మాత్రమే సొంతమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడనడంలో సందేహం లేదు. ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా సదరు వ్యక్తి ముందు మాత్రమే తమ మనసులోని భావాలు వ్యక్తీకరించగలుగుతారు.
బాధైనా, సంతోషమైనా వాళ్లతోనే పంచుకోవడానికే ఇష్టపడతారు. తాము పూర్తిగా నమ్మిన వ్యక్తి.. తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే.. చెప్పేదేముంది! ఎగిరి గంతేయడం సహజం.
మనసుకు నచ్చితే చాలు.. ‘‘మనవాళ్లా’’, ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే వారితో ముడిపడిపోతారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధాన్ని బలపరచుకుంటారు. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా- సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ ఈ కోవకు చెందినవాళ్లే!
సాధారణ మధ్య తరగతి కుటుంబం
హార్దిక్- నటాషా విభిన్న ధ్రువాలకు చెందిన వాళ్లు. గుజరాత్‌లోని సూరత్‌లో 1993 అక్టోబరు 11న జన్మించాడు హార్దిక్. అతడి తండ్రి హిమాన్షు పాండ్యా కార్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే, కుమారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో సహా వడోదరకు ఫిష్ట్ అయ్యారు.
కొడుకులు కృనాల్, హార్దిక్‌కు క్రికెట్‌లో మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. లోన్ ఏజెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారు. తండ్రి ప్రోత్సాహంతో అన్న కృనాల్‌తో కలిసి కిరణ్ మోరే అకాడమీలో చేరిన హార్దిక్.. అక్కడే తన ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే, అప్పటికే ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. అయినప్పటికీ ఆటను వదల్లేదు.
ఆటంటే ప్రాణం
తొమ్మిదో తరగతిలోనే హార్దిక్ స్కూల్‌కు వెళ్లడం మానేసి పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టాడు. జూనియర్ లెవల్లో రాణిస్తూ.. క్లబ్ క్రికెట్‌లో సత్తా చాటాడు. నిజానికి 18వ ఏట వరకు లెగ్ స్పిన్నర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. బరోడా కోచ్ సనత్ కుమార్ సూచనతో ఫాస్ట్ బౌలర్‌గా మారాడు.
దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు ఆడిన హార్దిక్.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ దృష్టిలో పడటంతో అతడి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. 2015 నుంచి 2021 వరకు అదే జట్టుతో కొనసాగిన హార్దిక్.. ఆర్థికంగానూ, టీమిండియా క్రికెటర్‌గానూ ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. భావి కెప్టెన్‌గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు.
‘ప్లే బాయ్’ ఇమేజ్
అయితే, కొన్నిసార్లు తన ఆటిట్యూడ్ వల్ల హార్దిక్ తీవ్రంగా విమర్శలపాలయ్యాడు. తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో కలిసి.. 2019లో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న హార్దిక్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కొన్నాళ్లు నిషేధం ఎదుర్కొన్నాడు.
ఆ సమయంలో అతడు నటాషాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో డేటింగ్ చేసిన హార్ది్క్ పాండ్యా.. నటాషానూ మధ్యలోనే వదిలేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
సెర్బియా నుంచి వచ్చి బాలీవుడ్‌లో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటాషాకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుపులు. అయితే, ఎవరెన్ని మాటలు అన్నా నటాషా వెనుకడుగు వేయలేదు..
హార్దిక్‌ను నమ్మిన నటాషా
ఓ పార్టీలో తనకు పరిచయమైన హార్దిక్‌ను హార్దిక్‌లానే చూసింది. తన కంటే వయసులో దాదాపు ఏడాది చిన్నవాడైన అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమించింది. ఆమె నమ్మకాన్ని హార్దిక్ వమ్ముచేయలేదు. 2020 జనవరిలో నటాషా చేతి వేలికి ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు.
ముచ్చటైన కుటుంబం
మోకాళ్లపై కూర్చుని.. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ గోముగా అడిగాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ముందే మనసిచ్చిన నెచ్చెలితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అదే ఏడాది మేలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది. కొన్ని నెలల్లోనే వీరి దాంపత్యానికి గుర్తుగా కుమారుడు అగస్త్య జన్మించాడు. వీరిది ఇప్పుడు ముగ్గురితో కూడిన ముచ్చటైన కుటుంబం.
మరోసారి తన ‘రాణి’తో
నిజమైన ప్రేమకు విధి కూడా సహకరిస్తుంది అంటారు. ఇలా రెండు వేర్వేరు దేశాల్లో జన్మించి.. విభిన్న సంస్కృతుల నుంచి వచ్చిన హార్దిక్- నటాషా.. ప్రేమకు హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వేడుకగా పెళ్లిచేసుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు రెండోసారి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న ఈ జంట మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనుంది.
తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్దిక్, నటాషాను వివాహమాడనున్నాడు. రాజస్థాన్ కోటలో తన ‘హృదయపు పట్టపురాణి’ని మనువాడి మరో చిరకాల జ్ఞాపకాన్ని మిగిల్చబోతున్నాడు.
భార్య విశ్వాసాలకు గౌరవమిస్తూ ‘వైట్ థీమ్ వెడ్డింగ్’కు ఏర్పాట్లు చేయించి మరోసారి ఆమె మనసు గెలుచుకున్నాడు. వాలంటైన్స్‌డే-2023 సందర్భంగా ప్రేమ పక్షులు.. సారీ సారీ ప్రేమతో ముడిపడిన దంపతులు.. మరోసారి పెళ్లిచేసుకోబోతున్న అగస్త్య అమ్మానాన్న హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్‌కు శుభాకాంక్షలు!!
చదవండి: Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా
మైదానంలో ‘కింగ్’లైనా.. ‘రాణుల’ ప్రేమకు తలవంచిన వాళ్లే!
Comments
Please login to add a commentAdd a comment