నా కూతురు ఎక్కువగా హెర్బల్–సప్లిమెంట్లు తీసుకుంటుంది. తాను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సమయంలో హెర్బల్– సప్లిమెంట్లు తీసుకోవచ్చా? విటమిన్స్ తప్పనిసరి అంటారు కదా.... ఇవి సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు.
హెర్బల్ సప్లిమెంట్లు, గర్భంలో ఉన్నప్పుడు తీసుకోకపోవడం మంచిది. వీటికి ప్రభుత్వ ఆమోదం లేదు. మామూలు సమయంలో తీసుకుంటే ఫర్వాలేదు కాని గర్భిణులు ఇవి తీసుకోవటం వల్ల, వాటిలో కొన్ని పదార్థాల వల్ల అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు, బ్లీడింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.కాబట్టి ప్రెగ్నెన్సీలో వాటిని తీసుకోకపోవడం మంచిది.ఫోలిక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ జాతికి చెందిన ఒక విటమిన్. దీన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల, బిడ్డ పెరుగుదలకు, అవయవాలు సరిగా ఏర్పడటానికి, నాడీవ్యవస్థలో లోపాలను చాలావరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది 5ఎంజీ మాత్ర రూపంలో దొరుకుతుంది. ఫోలిక్ యాసిడ్ తాజా ఆకుకూరలు, పప్పులు, బఠానీలు, బీన్స్, పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. పైన చెప్పిన ఆహారంతో పాటు, ఫోలిక్ యాసిడ్ మాత్ర కూడా ప్రెగ్నెన్సీ రాకముందు మూడునెలల నుంచే వాడటం మంచిది. అలానే మొదటి మూడునెలలు తప్పనిసరిగా వాడటం వల్ల పిండం సరిగా పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతుంది.
నాకు జనాంగాల మీద పొక్కులు వస్తున్నాయి. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. స్కేబీస్, ఫ్యూబిక్ లైస్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల పొక్కులు వస్తాయని ఎక్కడో చదివాను. ఇది నిజమేనా? వివరంగా తెలియజేయగలరు.
జనాంగాల మీద పొక్కులు అనేక రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో సిఫిలిస్, స్కేబిస్, çప్యూబిక్‌లెన్ హెర్పిస్, వార్ట్స్ వంటి ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ ఉంటాయి. వీటిలో చాలావరకు లైంగిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.ఒక్కొక్క ఇన్‌ఫెక్షన్‌ని బట్టి జననాంగాల మీద రకరకాల పొక్కులులాగా, నీటిగుల్లలులాగా, చిన్న చీముగడ్డలులాగా ఉండవచ్చు.లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి కండోమ్స్ వాడుకోవడం మంచిది.అలాగే రక్తహీనత, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌లు ఎక్కువగా, తొందరగా సంక్రమించే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చెయ్యడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌లను అరికట్టవచ్చు, ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.ఒకసారి డాక్టర్‌ని సంప్రదిస్తే పొక్కులు ఎటువంటి ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చిందో పరీక్ష చేసి, నిర్ధారణ చేసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి.
ప్రసవమయ్యాక బాలింతల రొమ్ముల ఆకృతిలో మార్పులు వస్తాయని, వాపు వస్తుందని, ఇబ్బందిగా ఉంటుందని విన్నాను. ఇలా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా?
ప్రసవమయ్యాక కంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే శరీరంలో మార్పులలాగే, రొమ్ములలో కూడా పాలు తయారుకావటానికి అనుగుణంగా మార్పులు మొదలవుతాయి. ఇందులో భాగంగా రొమ్ములు సైజు పెరుగుతాయి. నిపుల్ చుట్టూ వలయాకారం నల్లగా ఏర్పడుతుంది. కొందరిలో నల్లగా లేక ఎర్రగా రొమ్ముపైన స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడుతాయి.కాన్పు తర్వాత పాలు పడటం మొదలయ్యి, రొమ్ములు నిండుగా సౌష్టవంగా తయారవుతాయి. పాలు సరిపడా ఉండి, బిడ్డ సరిగా పాలు తీసుకుంటే రొమ్ములో వాపు, ఇబ్బంది, నొప్పి ఏమీ ఉండవు.కొన్నిసార్లు బిడ్డ సరిగా పాలు తాగకపోవటం, పాలు ఎక్కువగా స్రవించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే రొమ్ములు పాలతో గట్టిపడి వాపు, ఇబ్బంది, నొప్పి వస్తాయి.
అప్పటికీ సరిగా పట్టించుకోకపోతే, చీము పట్టడం, జ్వరం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు.కాబట్టి బిడ్డ పుట్టిన తరువాత పాలు పడినా పడకపోయినా, రొమ్ము పట్టించి చీకేలా చేయాలి. మూడుగంటలకొకసారి పాలు పట్టాలి. పాలు ఎక్కువగా అనిపిస్తే వాటిని పిండి తీసివేయాలి. అలానే ఉంటే పైన చెప్పిన ఇబ్బందులు రావచ్చు. రొమ్ముల్లో వాపు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించాలి. సహజంగా రొమ్ములో వచ్చే మార్పులను అన్నీ నివారించలేము. అవి గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులకు అనుగుణంగా ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు లభించే పోషకాలు, ఇతర లాభాలతో పోలిస్తే ఈ మార్పుల గురించి భయపడటం తగదు. ఈ ప్రయోజనాలు వెలకట్టలేనివి.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment