హోంమేడ్ ఫేషియల్
న్యూ ఫేస్
ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఇకపై ఫేషియల్ చేసుకోవచ్చు. దాంతో ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు... అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకొని ఆకర్షణీయంగా తయారై వెళ్లొచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం..
క్లెంజింగ్: ఫేషియల్‌లో మొదటి స్టెప్ క్లెంజింగ్. అంటే క్లీనింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బరి నూనె రాసుకొని అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌ను ముఖంపై పెట్టుకొని, రెండు నిమిషాల తర్వాత పొడి క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి.
స్టీమింగ్: ముందుగా వేడి నీళ్లలో నిమ్మగడ్డి లేదా లావెండర్ ఆయిల్‌ను వేయాలి. ఆ నీటి ఆవిరి తగిలేలా, ముఖాన్ని గిన్నెకు కాస్తంత దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా తల మీద ఏదైనా టవల్ కప్పుకోవాలి. అలా అయిదు నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి.
ఎక్స్‌ఫోలియేషన్: దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ బాదం నూనె, 1 టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.
ఫేస్‌ప్యాక్: ఇప్పుడు ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం లూజ్ కావడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ను వాడాలి. ముఖానికి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకొని 10-15 నిమిషాల తర్వాత పచ్చి పాలు లేదా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
టోనింగ్: ఈ స్టెప్‌లో నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై జిడ్డుతనం పూర్తిగా పోతుంది.
మాయిశ్చరైజర్: జిడ్డుచర్మం వారు 1 టేబుల్ స్పూన్ పాలలో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖం, మెడ భాగాలకు రాసుకొని 10 నిమిషాలు మర్దనా చేసుకోవాలి. (మర్దనా ఎప్పుడూ కింది నుంచి మీదకు చేసుకోవాలి. పై నుంచి కిందకు చేస్తే చర్మం సాగుతుంది). పొడి చర్మం వారు మాయిశ్చరైజర్‌గా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు.