New Face
-
కరివేప్యాక్
న్యూ ఫేస్ ఆర్థికంగా ఎదగాలనో.. పోటీ ప్రపంచంలో ముందుండాలనో.. మరే ఇతర కారణాల వల్లో మనల్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా గృహిణులు తమ శరీరం పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తుంటారు. కొన్ని రోజులు అలాగే వదిలేస్తే.. చర్మం, జుత్తు వంటివి కూడా క్రమంగా పాడైపోతాయి. అలా అని వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లోనే మన చర్మానికి సరిపోయే ప్యాక్స్ వారానికోసారి వేసుకున్నా సరిపోతుంది. ఓసారి ఈ ప్యాక్‌ను ట్రై చేసి, ఫలితం మీరే చూడండి. కావలసినవి * కరివేపాకు పేస్ట్ (ఆకులను మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి) - 1 టేబుల్ స్పూన్ * శనగపిండి - అర టేబుల్ స్పూన్ * పెరుగు లేదా పాలు - అర టేబుల్ స్పూన్ తయారీ * ఓ బౌల్లో కరివేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు లేదా పాలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో చర్మాన్ని కాస్తంత స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే.. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. (కరివేపాకు పేస్ట్‌కు బదులుగా.. ఎండబెట్టిన కరివేపాకుల పొడిని కూడా ప్యాక్‌గా వేసుకోవచ్చు) * కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. అలాగే ఈ కరివేపాకు ప్యాక్ ముఖంపై మొటిమలు, దద్దుర్లను దూరం చేస్తుంది. అలాగే ఇందులోని శనగపిండి మంచి క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అంతేనా, ఇది చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకు తినడం వల్ల వచ్చే లాభాలెన్నో మనకు తెలుసు. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ కూడా చర్మానికి పలురకాలుగా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు జుత్తు పెరుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుంది. -
టీ డికాక్షన్‌తో మెరుపు
న్యూ ఫేస్ ఉదయాన్నే టీ తాగితే తాజాదనం భావన కలుగుతుంది, చురుగ్గా ఉంటామని చాలా మంది ఆలోచన. అందుకే ఉదయాన్నే రోజును టీతో మొదలుపెడతారు. కొంతమంది పాలు కలపకుండా బ్లాక్ టీని సేవిస్తారు. అంటే కేవలం డికాక్షన్ మాత్రమే అన్నమాట. టీ డికాక్షన్‌తో మేని మెరుపును కూడా పెంచుకోవచ్చు. కావాల్సినవి: ♦ స్పూన్ టీ పొడి ♦ అర స్పూన్ తేనె ♦ 2 స్పూన్ల బియ్యప్పిండి తయారీ: ⇒ కప్పున్నర నీళ్లను వేడి చేసి, అందులో టీ పొడి వేయాలి. అర కప్పు టీ అయ్యేంత వరకు మరిగించి, చల్లారనివ్వాలి. ⇒ టీ డికాక్షన్ చల్లారాక అందులో తేనె, బియ్యప్పిండి కలపాలి. ⇒ ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి, పూర్తిగా ఆరనివ్వాలి. ఇందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ⇒ ముఖం మీద నీళ్లు చిలకరించి, వేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ⇒ తర్వాత చల్లని నీటితో మొత్తం కడిగేయాలి. ⇒ టీ డికాక్షన్లోని యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు, మొటిమలు తొలగించడానికి సహాయపడతాయి. ముడతలను నివారిస్తాయి. బియ్యప్పిండి మర్దన వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తేనెలోని పోషకాలు సహజకాంతిని ఇస్తాయి. అందుకని, వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మ సమస్యలు దరిచేరవు. స్నానానికి ముందు శరీరానికంత టీ డికాక్షన్‌తో ప్యాక్ వేసుకొని, తర్వాత స్నానం చేస్తే తాజాదనం అనుభూతి కలుగుతుంది. మేనికాంతి సహజసౌందర్యంతో నిగనిగలాడుతుంది. -
కొబ్బరి పాలు... పెంచే కాంతి...
న్యూ ఫేస్ కొబ్బరి పాలతో చర్మానికి మెరుగైన సంరక్షణను అందజేయవచ్చు. చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక. * పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి కొబ్బరి పాలలోని నూనె మంచి మాయిశ్చరైజర్‌లా పని చేసి, ముడతలను నివారిస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. * బాగా పొడిబారినట్టుగా ఉండే చర్మానికి రాత్రి పూట కొబ్బరి పాలతో మృదువుగా మసాజ్ చేసి వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానే, సున్నిపిండితో స్నానం చేయాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేసినా చర్మం పొడిబారడమనే సమస్య దరిచేరదు. చర్మకాంతీ పెరుగుతుంది. * ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. * రెండు టీ స్పూన్ల కొబ్బరి పాలలో నాలుగు బాదంపప్పులు వేసి రాత్రిపూట నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బి దీంట్లో టీ స్పూన్ పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. కాంతి తగ్గదు. * మేకప్‌ని తొలగించుకున్న తర్వాత వాటిలో ఉండే గాఢ రసాయనాల వల్ల చర్మం దురద పెట్టడం, కాంతి తగ్గడం సహజం. ఇలాంటప్పుడు మేకప్ తొలగించగానే కొబ్బరి పాలను ముఖానికి, గొంతుకు, మెడకు పట్టించి మృదువుగా మునివేళ్లతో మర్దన చేయాలి. * కొబ్బరి పాలలో ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉంటే చర్మం మృదుత్వం, వర్చస్సు పెరుగుతాయి. -
పెరిగే వయసును ఆపేసే దాల్చిన చెక్క...
న్యూ ఫేస్ వంటకాలలో వాడే దాల్చిన చెక్కలో చర్మకాంతిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీనిని సౌందర్య ఉత్పాదనలలో తప్పనిసరిగా వాడుతుంటారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మాన్ని త్వరగా ముడతలు పడనివ్వదు. అమితంగా ఉండే మినరల్స్, విటమిన్ల వల్ల చర్మం సహజకాంతిని కోల్పోదు. దీంతో ఎక్కువ కాలం యవ్వనకాంతితో వెలిగిపోతారు. ఆహారంలోనూ దాల్చిన చెక్కను ఉపయోగిస్తూ ఉండాలి. జిడ్డు, కాంబినేషన్ చర్మం గలవారికి దాల్చినచెక్క ప్యాక్ మహత్తరంగా పనిచేస్తుంది. కావల్సినవి: * టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి * రెండు టేబుల్ స్పూన్ల తేనె తయారీ: * దాల్చిన చెక్క, తేనె కలపాలి. మృదువైన మిశ్రమం తయారుచేయాలి. * ముఖాన్ని శుభ్రపరుచుకుని తడి లేకుండా తుడవాలి. తర్వాత దాల్చిన చెక్క మిశ్రమాన్ని కళ్ల చుట్టూతా వదిలేసి ముఖమంతా రాయాలి. * అలాగే గొంతు, మెడకు కూడా పట్టించాలి. * కనీసం 15 నిమిషాల సేపు ఆరనివ్వాలి. దీంతో దాల్చిన చెక్క, తేనెలోని పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. * తర్వాత గోరువెచ్చని నీటిని ముఖం మీద చిలకరించి, మృదువుగా మర్దనా చేస్తూ, కడిగేయాలి. * తర్వాత చల్లని నీటితో కడిగి, మెత్తని టవల్‌తో తుడవాలి. * మీ ముఖ చర్మం మృదువుగా కనిపిస్తుంది. వారానికి 2-3 సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మ కాంతి పెరగుతుంది. * ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఎండకు కందిపోయిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. మచ్చలు, యాక్నె సమస్యలు తగ్గుతాయి. -
చర్మకాంతికి కందిపప్పు ఫేస్ ప్యాక్
న్యూ ఫేస్ మొటిమలు, యాక్నె, నల్ల మచ్చలు ముఖం మీద ఉంటే కందిపప్పుతో తయారుచేసిన ప్యాక్ వేసుకుంటే సరైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి ఈ ప్యాక్ తగినంత మాయిశ్చరైజర్‌ని అందిస్తుంది. ఫలితంగా చర్మ కాంతిమంతంగా కనిపిస్తుంది. స్టెప్ 1: అర కప్పు కందిపప్పును కడిగి కనీసం 4-5 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లన్నీ వడకట్టి మెత్తగా రుబ్బాలి. దీంట్లో పావు కప్పు పాలు, టీ స్పూన్ బాదం నూనె కలపాలి. స్టెప్ 2: ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడవాలి. తయారుచేసుకున్న కందిపప్పు చిక్కటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల సేపు ఆరనివ్వాలి. స్టెప్ 3: ముఖాన్ని కడిగేముందు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మునివేళ్లతో వలయాకారంగా మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించాలి. * ఈ ప్యాక్‌లో రోజ్‌వాటర్‌ని కూడా కలుపుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. * యాక్నే సమస్య ఉన్న వారు మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమంలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ శనగపిండి, ముప్పావు కప్పు పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద వెంట్రుకలు పోవాలంటే.... ముఖ చర్మం మీద ఉండే వెంట్రుకలను తొలగించడానికి కందిపప్పు ఫేసియల్ బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కందిపప్పు, 50 గ్రాముల గంధంపొడి, నారింజ తొక్క పొడి, తగినన్ని పాలు కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. పైన కొన్ని నీళ్లు చల్లి ప్యాక్ మెత్తబడ్డాక మునివేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడచ్చు. -
గులాబి రేకుల ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: గులాబి రేకుల పొడి (ఎండిన రేకులను గ్రైండ్ చేసుకోవాలి) - 2 టేబుల్ స్పూన్లు, పాలు - ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు - చిటికెడు తయారీ: ఓ బౌల్లో గులాబి రేకుల పొడిని వేసి, పాలు పోయాలి. అలాగే అందులో పసుపు కూడా వేసి బాగా కలపాలి. మిశ్రమం పొడిగా అనిపిస్తే కాసిన్ని పాలు లేదా రోజ్ వాటర్‌ను కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌గా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో జిడ్డుచర్మం, సన్ ట్యాన్ దూరమై, ముఖం కాంతిమంతంగా తయారవుతుంది. గులాబి రేకులను ఎండబెట్టి, పౌడర్‌గా చేసుకునేంత సమయం లేనప్పుడు... రేకులను పేస్ట్గానూ చేసి వాడొచ్చు. గులాబి రేకులలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అలాగే ఇందులోని విటమిన్-డి చర్మంపై మొటిమలు, నల్ల మచ్చలను దూరం చేస్తుంది. అలాగే ముడతలను తగ్గిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. -
వేపాకు ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: వేపాకు పేస్ట్ (ఆకులను మెత్తగా నూరుకోవాలి) - 1 టేబుల్ స్పూన్, శనగపిండి - 1 టీ స్పూన్, పెరుగు - అర టీ స్పూన్ తయారీ: ఓ బౌల్లో వేపాకు పేస్ట్, శనగపిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే... చర్మం మృదువుగా తాజాగా అవుతుంది. (వేపాకు పేస్ట్‌కి బదులు... ఎండిన వేపాకుల పొడిని కూడా ఉపయోగించొచ్చు) వేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని మొటిమలు, దద్దుర్ల నుంచి కాపాడతాయి. అలాగే ఈ ప్యాక్‌లోని శనగపిండి ముఖంపై ఆయిలీనెస్ను తగ్గిస్తుంది. మంచి క్లీనింగ్ ఏజెంట్‌గానూ శనగపిండి తోడ్పడుతుంది. రోజూ కాలుష్యంలో తిరిగేవారు ఈ ప్యాక్‌ను రోజు విడిచి రోజు వేసుకుంటే ఎలాంటి చర్మ వ్యాధులు దరి చేరవు. -
హోంమేడ్ ఫేషియల్
న్యూ ఫేస్ ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఇకపై ఫేషియల్ చేసుకోవచ్చు. దాంతో ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు... అప్పటికప్పుడు ఫేషియల్ చేసుకొని ఆకర్షణీయంగా తయారై వెళ్లొచ్చు. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం.. క్లెంజింగ్: ఫేషియల్‌లో మొదటి స్టెప్ క్లెంజింగ్. అంటే క్లీనింగ్. ముందుగా ముఖానికి కాస్తంత కొబ్బరి నూనె రాసుకొని అరనిమిషం పాటు మర్దనా చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌ను ముఖంపై పెట్టుకొని, రెండు నిమిషాల తర్వాత పొడి క్లాత్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. స్టీమింగ్: ముందుగా వేడి నీళ్లలో నిమ్మగడ్డి లేదా లావెండర్ ఆయిల్‌ను వేయాలి. ఆ నీటి ఆవిరి తగిలేలా, ముఖాన్ని గిన్నెకు కాస్తంత దగ్గరగా పెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా తల మీద ఏదైనా టవల్ కప్పుకోవాలి. అలా అయిదు నిమిషాలు ఉన్న తర్వాత ముఖాన్ని మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడుచుకోవాలి. ఎక్స్ఫోలియేషన్: దీన్నే ఫేషియల్ స్క్రబ్ అని కూడా అంటారు. ఈ స్క్రబ్ కోసం ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టీ స్పూన్ బాదం నూనె, 1 టీ స్పూన్ రోజ్‌వాటర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంతో రెండు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్‌ప్యాక్: ఇప్పుడు ఓ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం లూజ్ కావడానికి కొద్దిగా రోజ్‌వాటర్‌ను వాడాలి. ముఖానికి ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకొని 10-15 నిమిషాల తర్వాత పచ్చి పాలు లేదా గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. టోనింగ్: ఈ స్టెప్‌లో నిమ్మరసం లేదా రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. దాంతో ముఖంపై జిడ్డుతనం పూర్తిగా పోతుంది. మాయిశ్చరైజర్: జిడ్డుచర్మం వారు 1 టేబుల్ స్పూన్ పాలలో పావు టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖం, మెడ భాగాలకు రాసుకొని 10 నిమిషాలు మర్దనా చేసుకోవాలి. (మర్దనా ఎప్పుడూ కింది నుంచి మీదకు చేసుకోవాలి. పై నుంచి కిందకు చేస్తే చర్మం సాగుతుంది). పొడి చర్మం వారు మాయిశ్చరైజర్‌గా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాసుకోవచ్చు. -
నేరేడు ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: నేరేడుపండ్లు: 4-5, శనగపిండి: 1 టీ స్పూన్ తయారీ: ముందుగా నేరేడుపండ్ల గింజలు తీసేసి... వాటిని చిదిమితే గుజ్జుగా మారుతుంది. తర్వాత ఆ గుజ్జులో శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకోవాలి. తర్వాత ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం తళాతళా మెరిసిపోతుంది. నేరేడుపండ్లలోని విటమిన్-సి, మినరల్స్ కారణంగా చర్మం ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది. అప్పటికప్పుడు ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా ఉందని చింతించకండి. పార్టీకి వెళ్లే రెండు గంటల ముందు ముఖానికి ఈ నేరేడుపండ్ల ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. -
తమలపాకుల ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: తమలపాకులు - 2, కొబ్బరి నూనె - 1 టీ స్పూన్, శనగపిండి - అర టీ స్పూన్ తయారీ: ముందుగా తమలపాకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి నూనె, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌తో రోజులో ఎప్పుడో ఒకసారి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. క్రమం తప్పకుండా అలా చేస్తే మొటిమలు, నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. అంతేకాదు, ముఖం మునుపటి కంటే ఎక్కువగా నిగారిస్తుంది. * ఈ తమలపాకుల్లోని యాంటీ బాక్టీరియల్ లక్షణం ముఖంపై వచ్చే మొటిమలను నివారిస్తుంది. అలాగే కాలిన గాయాలను, వాటి ద్వారా ఏర్పడిన మచ్చలను త్వరగా తొలగించేందుకు తోడ్పడుతుంది. -
ఆల్మండ్ ప్యాక్
న్యూ ఫేస్ కావలసినవి: బాదం గింజలు (ముక్కలుగా చేసినవి) - 2 టీ స్పూన్లు, తేనె - 1 టీ స్పూన్, బాదం నూనె - 2 టీ స్పూన్లు ఎలా చేయాలి: బాదం గింజలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్‌ను ఓ బౌల్లోకి తీసుకొని, అందులో తేనె, బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఈ ప్యాక్ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. బాదం నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు రాకుండా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్-ఇ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. -
రైస్‌ఫ్లోర్ ప్యాక్...
న్యూ ఫేస్ కావలసినవి: బియ్యంపిండి - 1 టేబుల్ స్పూన్, పెరుగు - 1 టీ స్పూన్, తేనె - 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఓ బౌల్లో బియ్య పిండి, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తేనెను కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని ఈ బియ్యం పిండి మిశ్రమంతో ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక, గోరువెచ్చని నీటితో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి. దాంతో ముఖం క్లీన్‌గా సాఫ్ట్‌గా మారుతుంది. * బియ్యంపిండి మంచి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెరుగు, తేనె ముఖకాంతిని మెరుగుపరుస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు కచ్చితంగా వేసుకుంటే మృతకణాలు తొలగిపోయి.. ముఖం తళతళా మెరిసిపోతుంది. కావాలంటే ఈ ప్యాక్‌లో కొద్దిగా శనగపిండిని కూడా కలుపుకోవచ్చు.