రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా... | I cried after hearing Nani's Voice, says his sister Deepti | Sakshi
Sakshi News home page

రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా...

Published Sun, Aug 18 2013 2:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM

రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా...

రిలేషణం: తన గొంతు వినగానే గట్టిగా ఏడ్చేశా...

ఆగస్టు 21 రాఖీ పౌర్ణమి సందర్భంగా...
 తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒకరి మీద మరొకరి కంప్లయింట్లు... ఆ రోజు అన్నీ పుల్‌స్టాప్. రాఖీ పండుగ అనురాగాల కొమ్మలు తొడుక్కుని, ఆప్యాయతల రెక్కలు విప్పుకుని వర్షరుతువులో తడి ఆరని జ్ఞాపకమై తోడొస్తుంది. తూర్పున ఉన్న తమ్ముడు నానీని, పడమరలో ఉన్న అక్క దీప్తిని కలిపి కట్టిన రక్షాబంధనమే ఈ వారం రిలేషణం... దీప్తి మాటల్లో...
 
 అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమతోపాటు గొడవలు, అలకలు మామూలే. మేం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇద్దరం విపరీతంగా కొట్టుకునేవాళ్లం. టీవీ చానెల్ విషయంలో యుద్ధాలే జరిగేవి. నేనొక చానల్ చూస్తానంటే, తను మరోటి చూస్తానని! ఓ వంద రిమోట్ల దాకా విరగ్గొట్టి ఉంటాం. ఇద్దరం కలసి చేసే అల్లరి సంగతేమో కానీ, నాని అల్లరికి స్కూలు వాళ్లు కూడా హడలిపోయేవారు.
 
 ఎనిమిదో తరగతి విజయవాడలోని సిద్ధార్ధ స్కూల్లో చదివాడు నానీ. వాడి అల్లరిని భరించలేక ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్ ఇంటికి లెటర్స్ పంపించేవాళ్లు, ఫోన్లు చేసేవాళ్లు. ఒక్కోసారి ఆ ఫోన్లు నేనే రిసీవ్ చేసుకునేదాన్ని. అమ్మలా నటించేసి, ఏదేదో చెప్పి మేనేజ్ చేసేదాన్ని. అయినా వాడి అల్లరి మితిమీరడంతో స్కూల్‌వాళ్లు వాణ్ని హైదరాబాద్ పంపేశారు. అంతేకాదు... మావాడికి చిన్నప్పట్నుంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. వాడికొచ్చే బ్లాంక్ కాల్స్‌కి నేను తిట్లు తినేదాన్ని.
 
 నాకు మొదటినుంచీ చదువు మీద శ్రద్ధ ఎక్కువ. కానీ నానీకి మాత్రం సినిమా అంటే ప్రాణం. ఏ సినిమా విడుదలైనా, ఫస్ట్ షోకే పరిగెత్తేవాడు. ఎంత ఇన్‌వాల్వ్ అయి చూస్తాడంటే... పక్కన బాంబు పేలినా పట్టించుకోడు. నాకు తనలో నచ్చని విషయం అదే. మరీ అంత పిచ్చేంట్రా అనేదాన్ని. పైగా సినిమా చూసి, ఆ కథకు తన ఇమాజినేషన్ జోడించి మరీ ఫ్రెండ్స్‌కు చెప్పేవాడు. తీరా వాళు సినిమా చూశాక ‘నువ్వు చెప్పిందేదీ సినిమాలో లేదురా’ అనేవాళ్లు. అంత బాగా చెప్పేవాడు! తన పర్‌స్పెక్టివ్ నుంచి చూస్తే, ఏ సినిమా అయినా నచ్చేస్తుంది మనకు!
 
 ఇంజినీరింగ్ అయ్యాక నేను యు.ఎస్. వెళ్లిపోయాను. ఒక్కసారిగా ఏదో దూరమైపోయినట్టుగా అనిపించింది. కొత్తలో ఓ రోజు ఫోన్ చేశాను. వాడి గొంతు వినగానే దుఃఖం పొంగుకొచ్చి గట్టిగా ఏడ్చేశాను. వాడిదీ అదే పరిస్థితి. ఎంత కొట్టుకున్నా అంత ప్రేమ ఒకరంటే ఒకరికి! వాడు డెరైక్షన్ ఫీల్డ్‌లోకి అడుగుపెడుతున్నానని చెబితే సంతోషమేసింది. కానీ యాక్టింగ్ అంటే వెంటనే ఎస్ అనలేకపోయాను. ఎందుకంటే, వాడికి డెరైక్టర్‌కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయని నాకు తెలుసు. కానీ నటన అంటే చేయగలడో లేదోనని భయమేసింది.
 
 కానీ ‘అష్టాచెమ్మా’ చూశాక నా భయం పటాపంచలయ్యింది. వెంటనే ఫోన్‌చేసి ‘అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదురా, చాలా బాగా చేశావ్’ అని మెచ్చుకున్నాను. సంబరపడిపోయాడు. సినిమా పట్ల తనకున్న అంకితభావం, కమిట్‌మెంట్ వల్లే మంచి నటుడు కాగలిగాడు. అయితే వాడు ఏదో ఒక రోజు గొప్ప దర్శకుడు అవుతాడని నా నమ్మకం. మణిరత్నం ప్రభావం తనమీద చాలా ఉంది. తప్పకుండా ఒకనాడు వాడు ఆ స్థాయి డెరైక్టర్ అవుతాడు. ఆ రోజుకోసం కోసం ఎదురుచూస్తూ ఉంటా!
 
 చిన్నతనంలో అక్క రాఖీ కట్టగానే ఫైవ్‌స్టార్ చాక్లెట్, డైరీ మిల్క్ ఇచ్చేవాణ్ని. అమెరికా వెళ్లినప్పట్నుంచిఆన్‌లైన్‌లో పంపిస్తోంది. దాన్ని మా కజిన్స్‌లో ఎవరితోనైనా కట్టించుకుంటాను. నా సినిమాలకు సంబంధించి బెస్ట్ క్రిటిక్ అక్కే. సినిమాల్లో ఏం బాగుంది, ఏం బాగోలేదు అని రివ్యూ రాసి మరీ పంపిస్తుంది. నేను ఏ ఇంపార్టెంట్ విషయమైనా మొదట పంచుకునేది అక్కతోనే. నా ప్రేమ విషయం కూడా ముందు తనకే చెప్పాను. వెంటనే అంజూని చూడాలంటూ ఎగ్జయిటయ్యింది. ఇప్పుడు వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎక్కువసేపు ఉండటం లేదని అంజూ అక్కకి కంప్లయింట్ చేస్తుంది. నేను తనకి సరిగ్గా ఫోన్ చేయట్లేదని అక్క అంజుకి కంప్లయింట్ చేస్తుంది. (నవ్వుతూ) ఇద్దరి మధ్యలో నేను బుక్కయిపోతూ ఉంటాను!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement