ప్రేమలేని కథలే పండుతున్నాయా?
టీవీక్షణం
ఒక్కోసారి ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు... ఈ చిత్రకథ ఫలానా సినిమాలా ఉందే అనిపిస్తూంటుంది. ఒకేలాంటి పాయింటుతో కథలు అల్లడం వల్ల అలా అవుతుంది. అయితే అది ఎప్పుడైనా జరుగుతుంది. కానీ సీరియళ్ల విషయంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న చాలా సీరియళ్లు ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నాయి. హీరో, హీరోయిన్లకి అనుకోకుండా పెళ్లవుతుంది. వాళ్ల మధ్య ప్రేమ ఉండదు. పెళ్లి చేసుకున్నాం కాబట్టి కలిసుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత ఒకరి మంచితనం మరొకరికి అర్థమై ప్రేమ పుడుతుంది. అక్కడ్నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది.
చాలా సీరియళ్లలో ఇదే కథ. స్టార్‌ప్లస్ చానెల్లో ‘యేహై మొహోబ్బతే’ అనే సీరియల్ ప్రసారమవుతోంది. రమణ్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు పుడతారు. భార్య అతడిని మోసగించి, కొడుకుని తీసుకుని మరో వ్యక్తితో వెళ్లిపోతుంది. తన దగ్గరున్న కూతురి కోసం ఇషితను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంలా ఉంటారు. ‘రంగ్స్రియా’ (కలర్స్) లో పోలీసాఫీసరైన రుద్ర, ఓ కేసులో సాక్షియైన పార్వతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటాడు. ఎన్నో గొడవల తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త ప్రేమించడం మొదలుపెట్టాడు. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ‘గుస్తాక్ దిల్’, సోనీలో వచ్చే ‘ఏక్ నయీ పెహచాన్’లలో కూడా ఇదే పరిస్థితి. ఇవి మాత్రమేనా... ‘సంస్కార్’లో కిషన్-ధర, ‘బానీ’లో రజ్జీ-సోహమ్, ‘దేశ్‌కీ బేటీ నందిని’లో నందిని-రాజ్‌వీర్, ‘తుమ్హారీ పాఖీ’లో పాఖీ-అన్షుమన్, ‘బే ఇంతెహా’లో ఆలియా-జైన్ తదితర జంటలన్నీ మొదట దంపతులై తర్వాత ప్రేమికులైనవాళ్లే.
గతంలో ఇదే పాయింట్‌తో వచ్చిన బడే అచ్చే లగ్‌తేహై, పరిచయ్, సాథ్ నిభానా సాథియా, ఇస్ ప్యార్‌కో క్యా నామ్‌దూ లాంటి సీరియల్స్ సూపర్ హిట్టయ్యాయనో లేక హీరోహీరోయిన్లని త్వరగా కలపకుండా ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్న నమ్మకం వల్లనో గానీ... దాదాపు సీరియళ్లన్నీ ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగులో కూడా ఇలాంటి కథాంశాలు వచ్చాయి. తెలుగులో కూడా లక్ష్మి వంటి కొన్ని సీరియల్‌లో అలానే జరిగింది. వీటన్నిటినీ చూస్తే... హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ లేకపోతేనే కథలు పండుతున్నాయేమో అనిపించడం లేదూ!