Star Plus
-
తన పెళ్లి గురించి చెబుతూ ఏడ్చేసిన టాప్ హీరోయిన్..
Bhagyashree Gets Emotional Remembering Her Wedding: బాలీవుడ్లో ఒక ఊపు ఊపేసిన అలనాటి టాప్ హీరోయిన్ భాగ్యశ్రీ. 1989లో సల్మాన్ ఖాన్ సరసన 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఎంత క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యశ్రీ పలు సామాజిక సేవలందించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 'భాగ్యశ్రీ' స్కీమ్‌కు 2015లో బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికైంది. ఇటీవల స్టార్‌ప్లస్ నిర్వహిస్తున్న కొత్త రియాలిటీ షో 'స్మార్ట్ జోడి'లో భాగ్యశ్రీ దంపతులు పాల్గొన్నారు. ఈ షోలో తన వివాహం గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. హిమాలయ దస్సానితో తన వివాహానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని, ఎలాంటి మద్దతు ఇవ్వలేదని ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. వారి పెళ్లికి తన భర్త తప్ప ఇంకెవరూ లేరని కన్నీళ్లు పెట్టుకుంది. 'తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కలలు కంటారు. కానీ తమ పిల్లలకు కూడా సొంత కలలు ఉంటాయి. మీరు వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొన్నిసార్లు వారి డ్రీమ్స్‌తో వారిని జీవించనివ్వండి. ఎందుకంటే చివరికీ వారి జీవితాన్ని వారే జీవించాలి కాబట్టి.' అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ. అలాగే 'ఒక సమయంలో నేను, హిమాలయ దస్సానీ లేచిపోయామని ప్రజలు, మీడియా ప్రచారం చేశారు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మేము అలా చేయలేదు.' అని పేర్కొంది. స్టార్ ప్లస్ నిర్వహిస్తున్న ఈ స్మార్ట్ జోడీ రియాలిటీ షోలో నిజ జీవితంలోని 10 మంది జంటలు పాల్గొంటారు. అందులో భాగంగా ఒక జంటగా భాగ్యశ్రీ-హిమాలయ దస్సానీ పార్టిసిపేట్ చేశారు. View this post on Instagram A post shared by StarPlus (@starplus) -
సింగర్‌గా ఎదగాలనుకున్నా! కానీ.. అదృష్టం ఆ రూపంలో తలుపుతట్టింది!
రంగుల ప్రపంచంలో.. ఎవరు ఏం కావాలన్నది పరిశ్రమే నిర్ణయిస్తుందంటారు. ఈ మాట సోనల్ పవార్ జీవితంలో అచ్చంగా నిజం.. గ్రేట్ సింగర్‌గా ఎదగాలనుకున్న ఆమెను.. బిజీ యాక్ట్రెస్‌గా మార్చింది ఇండస్ట్రీ. ప్రస్తుతం తనలో దాగిన నటనకు మెరుగులు దిద్దుతూ వరుస సీరియల్స్, సిరీస్‌తో దూసుకుపోతోంది.. సొంత ఊరు డెహ్రడూన్. చిన్నప్పుడే సింగర్ కావాలని ఫిక్స్ అయిపోయింది. స్కూల్లో ప్రేయర్ బెల్ కొట్టినా.. ఫ్రెండ్స్‌కు బోర్ కొట్టినా తన పాటే వినబడేది. పలు సంగీత పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. అదే స్ఫూర్తితో ప్రసిద్ధ రియాలిటీ షో ‘సరిగమప’ లోనూ పాల్గొంది. విజేతగా నిలవకపోయినా, వెంటనే ఓ సినిమాలో పాడే చాన్స్ కొట్టేసింది. దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. అవకాశాల కోసం ఆమె ప్రయత్నమూ ఆగలేదు. షోలో వచ్చిన పాపులారిటీ నెమ్మది నెమ్మదిగా తగ్గి, సింగర్‌గా స్థిరపడకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లింది. ఒకరోజు తను పాడిన పాట.. టీవీలో రిపీట్ ఎపిసోడ్లో వినబడుతోంది. అప్పుడే ఆమె ఓ విషయాన్ని గమనించింది. అక్కడికి వచ్చిన అతిథుల్లో కొంతమంది నటీమణులు కూడా ఉండటం. వారికి సింగర్స్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. రిపీట్ ఎపిసోడ్ ఇచ్చిన ప్రేరణతో నటిగా మారింది. అదృష్టం ఆమె తలుపు తట్టినట్లు కొద్దిరోజుల్లోనే స్టార్ ప్లస్‌లో ప్రసారమమ్యే ‘కసౌటీ జిందగీ కీ’ సీరియల్లో అవకాశం లభించింది. సింగర్‌గా కాకపోయినా, నటిగా మంచి సక్సస్ సాధించింది. వెబ్ దునియాలోకి అడుగుపెట్టి ‘గందీ బాత్’, ‘మాయ–2’, ‘క్యాండీ’ సిరీస్‌లతో అలరిస్తోంది. చదవండి: పాకిస్తానీ క్రికెటర్ మొహిసిన్ ఖాన్ వివాహ బంధం.. అలా.. ముగిసింది! -
ప్రముఖ టీవీ షో సెట్లో అగ్నిప్రమాదం
ముంబై: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో ‘పాండ్యా స్టోర్’ సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో సెట్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంజయ్ వాద్వా, కోమల్ సంజయ్ వాద్వా నిర్మాణంలో స్టార్ ప్లస్ ఛానల్లో జనవరి 25 నుంచి ‘పాండ్యా స్టోర్’ అనే టీవీ షో ప్రసారం మొదలైంది. షైనీ దోషి, కిన్షిక్ మహాజన్ పాత్రధారులుగా ఈ షో ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. తమిళంలో వచ్చిన పాండ్యాన్ స్టోరీస్‌ను రీమేక్ చేస్తూ ‘పాండ్యా స్టోరీ’ చేస్తున్నారు. అయితే ముంబై శివారులోని గోరెగావ్‌లో ఉన్న ఫిల్మ్ సిటీలో శనివారం తెల్లవారుజామున 2.30 సమయంలో ప్రమాదం సంభవించింది. సెట్లోని మేకప్ రూమ్ నుంచి మొదట మంటలు వ్యాపించాయి. అనంతరం ఆ మంటలు సెట్టంతా వ్యాపించాయి. మంటల్లో క్యాస్టూమ్స్, విలువైన సామగ్రి, షూటింగ్ సామగ్రి తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నటీనటులు, షూటింగ్ బృందం అందరూ క్షేమంగా ఉన్నారని.. అయితే ప్రమాదంతో కొంత నష్టం ఏర్పడిందని షో నిర్వాహకులు ప్రకటించారు. సెట్లోని కొంత భాగం దగ్ధమైందని తెలిపింది. ఈ ఘటనతో ఆ షోకు కొన్ని రోజులు ఆగిపోయే అవకాశం ఉంది. The sets of Pandya Store caught fire 🔥 Thank God no one was shooting there when this unfortunate incident took place but major parts of the sets are damaged, as per the reports 😔 #KinshukMahajan #ShinyDoshi #PandyaStore #FilmCity #ItsEZone • • • • Follow 👉 @its_ezone 📱 pic.twitter.com/kjIUe7xeH0 — ItsEZone (@Its_EZone) February 20, 2021 -
ఆ నటి బరువు 108: ఇంకా బరువు పెరగాలట!
ఆమె బరువు 108 కిలోలు.. అయినా, తమ టీవీషో కోసం మరింత బరువు పెరుగాలని నిర్వాహకులు సూచించారు. వారికి ఆమె సింపుల్ గా నో చెప్పింది. ఇది అంజలీ ఆనంద్‌కు ఎదురైన అనుభవం. ప్రముఖ చానెల్ స్టార్‌ప్లస్‌లో త్వరలో ప్రసారమయ్యే ’డాయి కిలో ప్రేమ్’ అనే టీవీ షోతో ఆమె తొలిసారి ప్రేక్షకులను పలుకరించబోతున్నది. అధిక బరువున్న అమ్మాయిగా ఈ షోలో నటిస్తున్నది. ఇప్పటికే ఆమె 108 కిలోల బరువు ఉండగా.. నిర్వాహకులు మరింత బరువు పెరగాలని, అప్పుడే షో కోసం బాగుంటుందని కోరారు. అయితే, వారి అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ‘నేను ఇప్పటివరకు ఎంతో చురుగ్గా జీవించాను. నాకు ట్రెక్కింగ్, సైక్లింగ్ ఇష్టం. నిలకడైన బరువును పాటించాను. ఇప్పుడు ఒక్కసారిగా బరువు పెరగమంటే నేను గట్టిగా నో అనే చెప్తాను. నేను ప్రస్తుతం 108 కిలోల బరువు ఉన్నాను. ఇంకా బరువు పెరగడం వల్ల ఇబ్బందులు ఎదురుకావొచ్చు’ అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది. డాయి కిలో ప్రేమ్’ ఏప్రిల్ 3 నుంచి స్టార్ ప్లస్ లో ప్రసారం కానుంది. ఈ షోలో అంజలి సరసన నటిస్తున్న మెహెర్జాన్ మజ్దా కూడా 16 కిలోల బరువు పెరిగాడు. -
ప్రేమలేని కథలే పండుతున్నాయా?
టీవీక్షణం ఒక్కోసారి ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు... ఈ చిత్రకథ ఫలానా సినిమాలా ఉందే అనిపిస్తూంటుంది. ఒకేలాంటి పాయింటుతో కథలు అల్లడం వల్ల అలా అవుతుంది. అయితే అది ఎప్పుడైనా జరుగుతుంది. కానీ సీరియళ్ల విషయంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న చాలా సీరియళ్లు ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్నాయి. హీరో, హీరోయిన్లకి అనుకోకుండా పెళ్లవుతుంది. వాళ్ల మధ్య ప్రేమ ఉండదు. పెళ్లి చేసుకున్నాం కాబట్టి కలిసుండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత ఒకరి మంచితనం మరొకరికి అర్థమై ప్రేమ పుడుతుంది. అక్కడ్నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. చాలా సీరియళ్లలో ఇదే కథ. స్టార్‌ప్లస్ చానెల్లో ‘యేహై మొహోబ్బతే’ అనే సీరియల్ ప్రసారమవుతోంది. రమణ్కి పెళ్లై ఇద్దరు పిల్లలు పుడతారు. భార్య అతడిని మోసగించి, కొడుకుని తీసుకుని మరో వ్యక్తితో వెళ్లిపోతుంది. తన దగ్గరున్న కూతురి కోసం ఇషితను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంలా ఉంటారు. ‘రంగ్స్రియా’ (కలర్స్) లో పోలీసాఫీసరైన రుద్ర, ఓ కేసులో సాక్షియైన పార్వతిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటాడు. ఎన్నో గొడవల తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త ప్రేమించడం మొదలుపెట్టాడు. లైఫ్ ఓకే చానెల్లో ప్రసారమయ్యే ‘గుస్తాక్ దిల్’, సోనీలో వచ్చే ‘ఏక్ నయీ పెహచాన్’లలో కూడా ఇదే పరిస్థితి. ఇవి మాత్రమేనా... ‘సంస్కార్’లో కిషన్-ధర, ‘బానీ’లో రజ్జీ-సోహమ్, ‘దేశ్‌కీ బేటీ నందిని’లో నందిని-రాజ్వీర్, ‘తుమ్హారీ పాఖీ’లో పాఖీ-అన్షుమన్, ‘బే ఇంతెహా’లో ఆలియా-జైన్ తదితర జంటలన్నీ మొదట దంపతులై తర్వాత ప్రేమికులైనవాళ్లే. గతంలో ఇదే పాయింట్‌తో వచ్చిన బడే అచ్చే లగ్తేహై, పరిచయ్, సాథ్ నిభానా సాథియా, ఇస్ ప్యార్‌కో క్యా నామ్దూ లాంటి సీరియల్స్ సూపర్ హిట్టయ్యాయనో లేక హీరోహీరోయిన్లని త్వరగా కలపకుండా ఉంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్న నమ్మకం వల్లనో గానీ... దాదాపు సీరియళ్లన్నీ ఇదే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. తెలుగులో కూడా ఇలాంటి కథాంశాలు వచ్చాయి. తెలుగులో కూడా లక్ష్మి వంటి కొన్ని సీరియల్లో అలానే జరిగింది. వీటన్నిటినీ చూస్తే... హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ లేకపోతేనే కథలు పండుతున్నాయేమో అనిపించడం లేదూ! -
స్టార్ ప్లస్, లైఫ్ ఓకే ఛానెల్స్ ప్రారంభించిన యాప్ టీవీ
ప్రపంచ ప్రఖ్యాత యాప్ టీవీ యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకుల కోసం భారతీయ ఛానెళ్ల ప్రసారానికి శ్రీకారం చుట్టినట్లు యాప్ టీవీ ముఖ్యకార్యనిర్వహాణాధికారి ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. అందులోభాగంగా స్టార్ ప్లస్, లైఫ్ ఓకే హిందీ ఛానెల్స్ ప్రసారాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయ్ రెడ్డి అట్లాంటాలో మీడియాతో మాట్లాడుతూ... యాప్ టీవీ ద్వారా యూఎస్‌లోని దక్షిణాసియా ప్రాంత వాసులంతా భారతీయ టీవీ సీరియళ్లను వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్టార్ ప్లస్, లైఫ్ ఓకే చానెల్స్ రెండు పెయిడ్ ప్యాకేజీ కింద వీక్షించేందుకు యూఎస్‌లోని భారతీయ టీవీ ప్రేక్షకులకు అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా యాప్ టీవీ ఇప్పటికే తన ప్రసారాలను 170 ఛానెల్స్‌లను వివిధ భారతీయ భాషలలో ప్రసారం చేస్తున్నట్లు ఉదయ్ రెడ్డి వివరించారు. యూఎస్‌లో టీవీ ప్రేక్షకులకు భారతీయ టెలివిజన్ ఛానల్స్ అంటే అత్యంత ప్రీతి పాత్రమమని ఆయన గుర్తు చేశారు. యాప్ టీవీ ద్వారా ప్రసారాలను స్మార్ట్ టీవీలు, ఎస్టీబ్సీ, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, పీసీలు ద్వారా వీక్షించవచ్చని చెప్పారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా చూసే ప్రత్యేకత యాప్ టీవీ సొంతమని ఉదయ్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. -
రూ. 100 కోట్ల 'మహా' సీరియల్!
బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ నేటి (సెప్టెంబర్ 16) రాత్రి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయులు ఇతిహాసం మహాభారతం ఇప్పుడు ఆధునికత హంగులతో మరోసారి చిన్నితెరపై ప్రేక్షకులను అలరించనుంది. దూరదర్శన్‌లో రెండు దశాబ్దాల పాటు ప్రసారమయి, వీక్షకుల మన్నలందుకున్న మహాభారత్ సీరియల్ ఇప్పుడు స్టార్ ప్లస్‌లో సరికొత్తగా రానుంది. స్టార్ ఇండియా రూ. 100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. స్వస్తిక్ పతాకంపై సిద్ధార్థ కుమార్ తివారి దీన్ని నిర్మించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటల నుంచి అరగంటపాటు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. 128 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నారు. మనదేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన సీరియల్‌గా 'మహాభారత్' నిలిచింది. దీని నిర్మాణానికి రూ. వంద కోట్లు ఖర్చు చేయగా, మార్కెటింగ్ కోసం మరో రూ. 20 కోట్లు కేటాయించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సీరియల్ నిర్మించామని స్టార్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మదహుక్ వెల్లడించారు. యువ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాలన్న ఉద్దేశంతో గ్రాఫిక్స్ అధిక వ్యయం చేసినట్టు వివరించారు. నేటి యువత అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచామని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మానవ ప్రవర్తనకు సంబంధించిన వాస్తవాలను దీని ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. భారీ వ్యయంతో తెరకెక్కిన మహాభారత్ సీరియల్‌ను ప్రమోట్ చేసేందుకు స్టార్ ఇండియా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 నగరాల్లోని షాపింగ్స్ మాల్స్‌లో మహాభారత్ సీరియల్ మ్యూజియంలు పెట్టింది. సీరియల్లో వివిధ పాత్రధారులు వినియోగించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. అలాగే చిన్న పట్టణాలకు సంచార మ్యూజియంల ద్వారా ఈ సీరియల్ విశేషాలు చేరవేయనున్నారు. మహాభారత్ సీరియల్ పాత్రధారులు దేశవ్యాప్తంగా కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. మరోవైపు సీరియల్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనలకు 10 సెకండ్లకు రూ. 2 లక్షల ధర నిర్ణయించారు. సీరియల్ ప్రారంభమైన తర్వాత ప్రకటనల రేట్లు మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ఢిల్లీకి పూజా శర్మ ద్రౌపదిగా పాత్రతో బుల్లి తెరకు పరిచయమవుతోంది. కృష్ణుడిగా సౌరభ్ జైన్, అర్జునుడుగా షహీర్ షేక్ నటించారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఆధునిక మహాభారత్ మెగా సీరియల్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.