గ్లామర్, డీగ్లామర్ అనే తేడా లేకుండా నటనలో బహుముఖి అనిపించుకుంటోంది ఇషా తల్వార్. బాలీవుడ్ నిర్మాత వినోద్ తల్వార్ కూతురైన ఇషా ముంబైలో పుట్టి పెరిగింది. ఎకనామిక్స్‌లో పట్టా అందుకుంది. ఐ లవ్ మీ(మలయాళం), థిల్లు ముల్లు–2 (తమిళం), గుండెజారి గల్లంతయిందే (తెలుగు)లాంటి హిట్ సినిమాలలో నటించిన ఇషా తాజాగా బాలీవుడ్ సినిమా ‘ఆర్టికల్ 15’తో ‘అదితి’ పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇషా గురించి మినీ సంగతులు...
గ్లామర్: దుస్తుల్లో కాదు వ్యక్తిత్వంలో ప్రతిఫలించేది.
దృష్టి: ఎప్పుడూ వాణిజ్యదృష్టి మాత్రమే కాదు... అందుకు భిన్నమైన దృష్టి కూడా ఉండాలి. అప్పుడే మంచి చిత్రాలు చేయగలుగుతాము.
సినిమాలకు ముందు: కమర్షియల్ యాడ్స్‌లో నటించాను.
డ్యాన్స్: చాలా ఇష్టం. టెరెన్స్ డ్యాన్స్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నాను. బాలే, జాజ్, సల్సా, హిప్–హాప్‌లలో ప్రవేశం ఉంది.
బోర్: ఒకేరకమైన పాత్రలు మళ్లీ మళ్లీ చేయడం. నా మొదటి సినిమాలో డీగ్లామర్ రోల్ చేశాను. రెండో సినిమాలో కూడా అలాగే చేసి ఉంటే వరుస పెట్టి అలాంటి పాత్రలే వచ్చేవి. అదృష్టవశాత్తు రెండో సినిమాలో అలాంటి పాత్ర చేయలేదు.
నచ్చనిది: ‘సక్సెస్‌ఫుల్ యాక్ట్రెస్’ అని పిలిపించుకోవాలనుకోవడం.
నమ్మేది: రాశి కంటే వాసి ముఖ్యం. ప్రతిభ నిరూపించుకోవడానికి ఎడాపెడా సినిమాలు చేయనక్కర్లేదు. కలకాలం గుర్తుండేలా కొన్ని సినిమాలు చేసినా చాలు.
ప్రేక్షకులు: గౌరవనీయ వ్యక్తులు. వాళ్లు డబ్బు పెట్టి సినిమాకు వస్తేనే కదా సినిమాలు బతికేవి! ఒకరు ‘జీరో’ అయినా ‘హీరో’ అయినా అది వారి మీదే ఆధారపడి ఉంటుంది.
సంతోషం: మొదటి సినిమా హిట్ కావడం. (తట్టతిన్ మరయతు–మలయాళం)
ఆ తరువాత: ‘ఆ తరువాత ఏంటి?’ అనేది అవసరమేగానీ అదే ప్రధానమైపోతే... చేస్తున్న పనికి న్యాయం చేయలేం.
4జీ: ఒక సినిమాను ఎంపిక చేసుకునేటప్పుడు 4జీ గురించి ఆలోచిస్తాను. 1. గుడ్ డైరెక్టర్, 2. గుడ్ స్క్రిప్ట్, 3. గుడ్ ప్రొడక్షన్ హౌస్, 4. గుడ్ టీం.
నచ్చేవి: నాలోని నటనను మెరుగు పరిచే పాత్రలు.
డ్రీమ్‌రోల్: ‘డ్రీమ్‌రోల్’ అని ప్రత్యేకంగా ఏదీ లేదు. చేస్తున్న ప్రతిరోల్‌ను డ్రీమ్‌రోల్‌గానే భావిస్తాను.
ఇష్టమైన ప్రదేశం: పొలాచ్చి
ఇబ్బంది: చేసిన సినిమానే రీమేక్ రూపంలో మళ్లీ చేయడం. అయితే కొన్ని సందర్భాలలో తప్పదు!
తేలిక–కష్టం: మాయ చేసి బతకడం తేలిక. నిజాయతీగా బతకడం చాలా కష్టం.
Comments
Please login to add a commentAdd a comment