‘అమితాబ్ బచ్చన్ రిటైర్ కాలేదు. నేనెందుకు కావాలి’ అంటాడు ఈ సినిమాలో శర్మాజీ అనే తండ్రి. అమితాబ్‌కు 78. శర్మాజీకి 58. వి.ఎర్.ఎస్ ఇవ్వడం వల్లో రిటైర్‌మెంట్ వల్లో తండ్రులు పనికి దూరం అవుతారు. ఇక వారి జీవితం ముగిసినట్టేనా? ఆశలు, ఆకాంక్షలు అంతమేనా? అసలు రిటైర్ అయిన తండ్రులను ఎంతమంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు? రిషి కపూర్ చివరి సినిమా ‘శర్మాజీ నమ్‌కీన్’. మరో విశేషం ఏమంటే రిషి మరణం వల్ల మిగిలిన సినిమాని అదే పాత్ర పోషించి పరేశ్ రావెల్ మెప్పించటం! ఈ వారం సండే సినిమా.
ఈ సినిమాలో రిటైర్ అయిన శర్మాజీ, అతని స్నేహితుడు ‘బాగ్‌బన్’లోని క్లయిమాక్స్‌ను ఫోన్‌లో చూస్తుంటారు. శర్మాజీ ఫ్రెండ్ అయిన శిక్కు చెడ్డా ‘దీనిని కాలేజీ పిలకాయలందరికీ సిలబస్‌గా పెట్టాలి’ అంటాడు. ఎందుకంటే అమితాబ్– హేమమాలిని నటించిన బాగ్‌బన్‌లో పిల్లల నిర్లక్ష్యానికి లోనయ్యే తల్లిదండ్రులను చూపిస్తారు. అయితే ‘శర్మాజీ నమ్‌కిన్’ ఈ సమస్యను తీసుకోకుండా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే గ్యాప్‌ను చర్చిస్తుంది. వారి వైపు ఉండే కథలను వినాలని చెబుతుంది.
కథ ఏమిటి?
ఢిల్లీలో మిడిల్‌క్లాస్ కాలనీలో ఉండే శర్మాజీ (రిషి కపూర్) తాను పని చేసే మిక్సీ, గ్రైండర్ తయారీ ఫ్యాక్టరీ నుంచి వి.ఆర్.ఎస్. తీసుకుంటాడు. అంటే ఫ్యాక్టరీయే అతనికి వి.ఎర్.ఎస్. ఇచ్చి పంపిస్తుంది, అది దివాలా తీయడంతో. ఇంట్లో భార్య ఉండదు. చాలా ఏళ్ల క్రితమే డబుల్ టైఫాయిడ్ తో చనిపోయి ఉంటుంది. పెద్ద కొడుకు ఉద్యోగం. చిన్న కొడుకు కాలేజీ. శర్మాజీకి ఉత్సాహం ఉంది. జీవితాన్ని ఆస్వాదించాలని ఉంది. ఏదో ఒకటి చేస్తూ పనికొచ్చేలా ఉండాలని ఉంది. టీవీ చూసి చూసి, ఖాళీగా ఉండి ఉండి బోర్ కొడుతుంది. ‘నాకు బోర్ కొడుతుంది’ అని పిల్లలతో అంటే ‘ట్రావెల్ చెయ్యి. లేదా రెస్ట్ తీసుకుని ఎంజాయ్ చెయ్యి’ అంటారు తప్ప ఇంకో పనేదైనా చేస్తానంటే ఒప్పుకోరు.
58 ఏళ్లొస్తే ఏ పని చేయకుండా ఎందుకు ఉండాలి ఇదేం రూలు అంటాడు శర్మాజీ. చివరకు అతని ఫ్రెండ్ అతనికి ఒక సలహా ఇస్తాడు. ‘నీకు వంట బాగా వచ్చు కదా. నాకు తెలిసిన వాళ్లు కిట్టీ పార్టీలు చేసుకుంటూ మంచి వంటవాడు కావాలంటుంటాడు. నువ్వెళ్లి వండు. కాలక్షేపం.’ అంటాడు. శర్మాజీకి నిజంగానే వంట బాగా వచ్చు. ‘ఇంత బతుకు బతికి వంటవాడిగా మారడమా’ అని ముందు తటపటాయించినా చివరకు అంగీకరిస్తాడు. అలా కిట్టీ పార్టీలు చేసుకునే ఒక స్త్రీల బ్యాచ్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. ఇదంతా కొన్నాళ్లు పిల్లలకు తెలియకుండా జరిగినా ఆ తర్వాత పిల్లలకు తెలియడంతో వాళ్లు మా పరువేం కాను అని గొడవకు దిగుతారు. చివరకు ఇద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారన్నది క్లయిమాక్స్.
వారి మనసులో ఏముంది?
‘శర్మాజీ నమ్‌కిన్’లో దర్శకుడు తెలివిగా ఒక విషయాన్ని చెబుతాడు. రిటైర్ అయిన తల్లిదండ్రుల భావోద్వేగాలు ఏమిటో ఎవరూ పట్టించుకోరు అనేది ఒకటి– మిడిల్ ఏజ్‌కు వచ్చిన వివాహిత స్త్రీలు తమకు వ్యాపకాలు లేక చేసేందుకు పని లేక కుటుంబాలకే జీవితాలు అంకితం చేసి చేసి విసిగిపోతున్నారనేది ఒకటి. శర్మాజీ లాంటి రిటైర్ అయిన వాళ్లు, కిట్టీ పార్టీ చేసుకునే మధ్య వయసు స్త్రీలు ఒకరి సమస్యను మరొకరు సానుభూతితో అర్థం చేసుకుంటారు. ఒకరికి మరొకరు సపోర్ట్‌గా నిలుస్తారు.
అలాగే శర్మాజీ పెద్ద కొడుకు తనకు ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఇంటి నిర్ణయాలు తానే తీసుకోగలను అనుకుంటూ ఉంటాడు. ఆ మిడిల్ క్లాస్ ఇంటి నుంచి పెద్ద ఫ్లాట్‌లోకి మారాలని అతని కోరిక. ఇక్కడే మీ అమ్మ చనిపోయింది... నేను కూడా ఇక్కడే పోతాను... రాను అని తండ్రి అంటుంటాడు. తనకు బయట ఏవైనా సమస్యలు వస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోడు. అలాగే తండ్రి కూడా తన మనసులో ఏముందో చెప్పుకునేంత స్పేస్ ఇవ్వడు. ఇలాంటి పిల్లలు ఇప్పుడు అన్ని చోట్లా ఉన్నారు. శర్మాజీ వంటి తండ్రులు కూడా. వీళ్లు తమను ఈ సినిమాలో చూసుకుంటారు.
రిషి చివరి సినిమా
రిషి కపూర్ ఈ సినిమా యాభై శాతం ముగించాక అనారోగ్యం వల్ల మరణించాడు. సినిమా ఎలా పూర్తి చేయాలనే సమస్య వచ్చింది. రణ్‌బీర్ కపూర్ తాను ఆ వేషాన్ని పూర్తి చేద్దామని అనుకున్నాడు. చివరకు పరేష్ రావెల్ తాను మిగిలిన పోర్షన్ చేస్తానని ముందుకు వచ్చాడు. రిషి కపూర్ పూర్తి చేయని సీన్లన్నీ పరేష్ చేశాడు. అంటే సినిమా అంతా ముందు వెనుకలుగా రిషి కపూర్, పరేశ్ రావెల్ వస్తూనే ఉంటారు. అయితే ఇద్దరూ మంచి నటులు కాబట్టి ఆడియెన్స్ అసౌకర్యంగా భావించరు. కాని రిషి కపూర్ ఎక్కువ నచ్చుతాడు. జూహీ చావ్లా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో రిషి కపూర్ పక్కన కనిపిస్తుంది. సినిమా మొదట్లో రణ్‌బీర్ తన తండ్రి నటించిన ఈ సినిమా గురించి భావోద్వేగంతో మాట్లాడతాడు. సినిమా ముగిశాక రిషి కపూర్ ఆన్ లొకేషన్ షాట్స్ రన్ అవుతూ ఉంటే ఇన్నాళ్ల పాటు అతడు పంచిన వినోదం, అతడు ఇచ్చిన సినిమాలు గుర్తొచ్చి మనసు భారం అవుతుంది.
తేలికపాటి హాస్యంతో సాగిపోయే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో మార్చి 31న విడుదలైంది. చూడండి.
Comments
Please login to add a commentAdd a comment