ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..! | Italian Story india cinema | Sakshi
Sakshi News home page

ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..!

Published Sun, Jul 26 2015 1:31 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..! - Sakshi

ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..!

విదేశీ సినిమాల సీడీలను చూసి కథాంశాలను కాపీ కొట్టి రూపొందించిన సినిమాలు అంటే అవేవో అత్యంత వైవిధ్యమైన కథనంతో వచ్చినవో, సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతమైన అద్భుతాలో కానక్కర్లేదు. చాలా సాధారణం అనిపించే కథల మూలం కూడా ఏ హాలీవుడ్‌లోనో ఉండవచ్చు. సెన్సిబుల్‌గా సాగుతూ అచ్చ తెలుగు కథలు అనుకొన్న సినిమాల రూట్స్ కూడా అమెరికాతో ముడిపడి ఉండవచ్చు. ‘బావగారూ బాగున్నారా’ సినిమా కథాంశంలో కూడా విదేశీహస్తం ఉందనే విషయం తెలిసినప్పుడు కలిగే అభిప్రాయాలివి.
 
 1998లో మెగాస్టార్ చిరంజీవి, రంభ హీరో ీహ రోయిన్లుగా జయంత్ దర్శ కత్వంలో వచ్చిన ‘బావగారూ బాగు న్నారా’ మూల కథ మనది కాదు. ‘ఫోర్‌స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ అనే ఇటాలియన్ సినిమా కథ అది. ఆ కథలో ఉన్న గొప్పదనం అనేక మంది, అనేక సార్లు దాన్ని కాపీ కొట్టేలా చేసింది. 1942 నుంచి ఇప్పటి వరకూ అనేకసార్లు ఈ సినిమా కథను అటు తిప్పి ఇటు తిప్పి ఎవరో ఒకరు రీమేక్ చేస్తూనే ఉండటం ఈ కథాంశంలో ఉన్న నిత్యనవ్యతకు సాక్ష్యం.
 
 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తమ తమ స్వదేశాలకు చేరుకొన్న సైనికుల భావోద్వేగాల ఆవిష్కరణతో సినిమా ఆరంభం అవుతుంది. ప్రాణాలతో తిరిగొచ్చిన సైనికులకు వారి వారి కుటుంబాలు స్వాగతం పలుకుతుంటాయి. తీరంలో నౌకలు దిగిన వారిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ల వాళ్లంతా వచ్చి ఉంటారు. అయితే లెఫ్టినెంట్ హోదాలోని పాల్ సటన్‌ను మాత్రం పట్టించుకొనే వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడొక అనాథ. దాంతో అతడు బాధప డతాడు. తనకూ ఒక కుటుంబం ఉంటే బావుంటుందని అనుకుంటాడు. తాను పెళ్లి చేసుకొంటేనే అది సాధ్యమవు తుందన్న ఉద్దేశంతో ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం మొదలు పెడతాడు.
 
 మార్గ మధ్యంలో పాల్‌కు విక్టోరియా పరిచయం అవుతుంది. అంతు లేని విషాదంతో కనిపిస్తోన్న ఆమె కథను అడిగి తెలుసుకుంటాడు పాల్. తన బాయ్‌ఫ్రెండ్ తనను గర్భవతిని చేసి మోసగించాడని, ఇంట్లోవాళ్లకు తెలిస్తే చంపేస్తారని ఆమె చెబుతుంది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకొన్న పాల్, విక్టోరియాకు బాయ్‌ఫ్రెండ్‌గా వాళ్ల ఇంటికి వెళతాడు. అయితే కూతురు తన సమ్మతం లేకుండానే భర్తను తెచ్చుకొందన్న కోపంతో ఉన్న హీరోయిన్ తండ్రి పాల్‌ను అసహ్యించుకుంటాడు. మిగతా వాళ్లు మాత్రం పాల్‌ను ఆదరిస్తారు. మరి విక్టోరియా తండ్రిని అతడు ఎలా ఆకట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఎలా సభ్యుడయ్యాడు అనేదే మిగతా కథ. ఇక ఈ తరహాలో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చాయో చూస్తే పెద్ద లిస్టే తయారవుతుంది.
 
 ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ని ‘ఎ వాక్ ఇన్ ద క్లౌడ్స్’ పేరుతో ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వారు హాలీవుడ్‌లో తీశారు. ఇది హాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఆ తర్వాత ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో భాషల్లో సినిమాలొచ్చాయి. మన ‘బావగారూ బాగున్నారా’ కూడా ఇలా వచ్చిందే. ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఉన్న రచన కోసం చిరంజీవి పరేష్ రావెల్  ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అయితే రచన హీరోయిన్ కాకపోవడమే మన కథలో మార్పు. రచనకు ప్రేమించినవాడితో పెళ్లి చేసి, తాను ప్రేమించిన రచన చెల్లెలు రంభని చిరంజీవి పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.
 
 అలాగే జగపతిబాబు నటించిన ‘అల్లుడుగారు వచ్చారు’పై కూడా ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ ప్రభావం కనిపిస్తుంది. ఎన్టీయార్ నటించిన ‘బృందావనం’లో కూడా పై సినిమా ఛాయలే కనిపిస్తాయి. 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లో ‘థాయి అక్షర్ ప్రేమ్‌కీ’ అనే సినిమా వచ్చింది. అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ తొలిసారి కలసి నటించిన ఈ సినిమా ‘ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్’కు అనధికార రీమేక్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఒక ఇటాలియన్ కథ.. ఇండియాలో అనేక సినిమాలకు మూలంగా నిలిచింది.
 - బి.జీవన్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement