నాయక్‌ నహీ...ఛోటా నాయక్‌ హూ మై! | kabir duhan singh special story | Sakshi
Sakshi News home page

నాయక్‌ నహీ...ఛోటా నాయక్‌ హూ మై!

Published Sun, Feb 26 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

నాయక్‌ నహీ...ఛోటా నాయక్‌ హూ మై!

నాయక్‌ నహీ...ఛోటా నాయక్‌ హూ మై!

‘ఎందుకింత సెక్యూరిటీ?’ ఈ సంభాషణ వినండి మీకే అర్థమవుతుంది... ‘మాఫియా డాన్‌ ఛోటా నాయక్‌ పేరు విన్నావా?’‘ఛోటా నాయక్‌ గురించి వినని వారు ఎవరుంటారు సార్‌? వాడి గురించి మా పోలీసు ట్రైనింగ్‌లో క్లాసులు కూడా తీసుకున్నారు’‘మీరు పోలీసు ట్రైనింగ్‌లో చదువుకున్న ఆ నాయక్‌ను ఈరోజు కోర్టుకు తీసుకు వస్తున్నారు. అందుకే ఈ సెక్యూరిటీ. వాడిని పట్టుకోవాలనుకోవడం పాతికేళ్ల మన పోలీసుల కల. మన నుంచి తప్పించుకోవాలనుకోవడం ఇప్పుడు వాడి కల’ పోలీసుల కల ఫలించనే లేదు.

కల కనాల్సిన అవసరం నాయక్‌కు రానే లేదు. కోర్టులో హాజరు పరచడానికి ముందే తప్పించుకున్న ఛోటా నాయక్, ‘నన్ను పట్టుకుంటే ప్రమోషన్‌ వస్తుందని తెలిసినవాడివి... నాతో పెట్టుకుంటే ప్రాణం పోతుందని తెలియదా?’ అంటూ అక్కడి పోలీస్‌ అధికారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ కూడా ఇస్తాడు. గోపీచంద్‌ ‘జిల్‌’ సినిమాతో ఛోటా నాయక్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కబీర్‌ దుహన్‌ సింగ్‌.

ఢిల్లీకి సమీపంలోని ఫరీదాబాద్‌లో జన్మించాడు కబీర్‌. ఢిల్లీ యూనివర్సిటీలో చేరిన తరువాత ‘మోడలింగ్‌’ మీద దృష్టి పెట్టాడు. గుడ్‌లుక్స్, ఫిజిక్‌...ఈ రెండూ మోడలింగ్‌లో మంచి అవకాశాలు రావడానికి  ‘టాప్‌ త్రీ’లో ఒకరిగా నిలవడానికి తోడ్పడ్డాయి.  ఎన్నో ర్యాంప్‌వాక్‌లు చేయడంతో పాటు సామ్‌సంగ్, హీరోహోండాలాంటి ఎన్నో కమర్షియల్‌ యాడ్స్‌ చేశాడు. ఆ సమయంలోనే నటించాలనే కోరిక పుట్టింది. అదే పనిగా సినిమాలు చూడడంతో పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు.

‘‘వీడు ఏ నేపథ్యం నుంచి వచ్చాడు? అనేది దక్షిణాది ప్రజలు పట్టించుకోరు. ఏమాత్రం ప్రతిభ ఉన్నా పట్టం కడతారు. ఎక్కడికో తీసుకెళ్లిపోతారు. ఇది నాకు బాగా నచ్చడంతో సౌత్‌ ఫిల్మ్స్‌లో నటించాలనే కోరిక బలంగా కలిగింది. బాలీవుడ్‌ స్టార్‌ డ్రైవెన్‌ ఇండస్ట్రీ, తమిళ్‌ కంటెంట్‌ డ్రైవెన్‌ ఇండస్ట్రీ, తెలుగు కమర్షియల్‌ డ్రైవన్‌ ఇండస్ట్రీ’’ అంటున్న కబీర్‌ బాలీవుడ్‌ కంటే దక్షిణాది సినిమాల్లో నటించడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు.

రా«ధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా నటించిన ‘జిల్‌’ సినిమాలో ఛోటా నాయక్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు కబీర్‌. సినిమాలో నటించడానికి ముందు కొన్ని గ్యాంగ్‌స్టర్‌ సినిమాలు చూసి తన పాత్ర గురించి ఎక్సర్‌సైజ్‌ చేశాడు. ప్రతిభావంతులతో కలసి పనిచేస్తున్నప్పుడు మనల్ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతాడు కబీర్‌. ప్రతిభావంతులతో కలసి పనిచేయడం ‘లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అంటాడు.‘జిల్‌’ విలన్‌–ఓరియెంటెడ్‌ సినిమా కావడంతో ‘ఛోటా నాయక్‌’గా  కబీర్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

‘జిల్‌’ తరువాత అవకాశాలు ఊపందుకున్నాయి. తమిళంలో అజిత్‌తో కలసి పనిచేసే అవకాశం వచ్చింది. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌లాంటి స్టార్‌ హీరోలతో పని చేసే అవకాశం వచ్చింది. తన పాత్ర పండించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు కబీర్‌. కొన్ని సందర్భాల్లో గొప్ప నటుల నుంచి మంచి నోట్స్‌ దొరకవచ్చు.

కొన్నిసార్లు ఆలోచనలోని గాఢత నటనకు ఉపకరణం కావచ్చు. మరికొన్నిసార్లు...దృశ్యాలే కొత్త ఐడియాలను ఇవ్వవచ్చు. తన నటనను మెరుగుపెట్టుకోవడానికి  ఏ మాధ్యమం అయిన సరే అనుసరిస్తాడు కబీర్‌. మైక్‌ టైసన్‌కు పెద్ద అభిమాని అయిన కబీర్‌కు బాక్సర్‌ పాత్రలో నటించాలనే కోరిక బలంగా ఉండేది.  ఆ కోరిక త్వరగానే తీరిపోయింది. నారారోహిత్‌ ‘తుంటరి’ సినిమాలో బాక్సర్‌గా నటించే అవకాశం వచ్చింది. వెంటనే బాక్సింగ్‌లో క్రాష్‌ కోర్సు చేశాడు. ప్రొఫెషనల్‌ బాక్సర్‌లతో సంభాషించాడు. ఆ ఫలితం వృథా పోలేదు... సినిమాలో నిజమైన బాక్సర్‌ని చూసినట్లుగానే అనిపించింది.

‘‘ఒకప్పుడు ప్రాంతీయ చిత్రాల్లో విలన్‌కు బుర్రమీసాలు, మెడలో పెద్ద గొలుసు...ఇలా ప్రత్యేకమైన ఆహార్యం కనిపించేది. అయితే ఇప్పుడు అనూహ్యంగా మార్పు వచ్చింది. విలన్‌ కూడా హీరోతో సమానంగా సై్టలిష్‌గా కనిపిస్తున్నాడు. విలన్‌కు సై్టలింగ్‌ కూడా ముఖ్యమే. దుస్తులతో మాత్రమే సై్టలింగ్‌ రాదు. హ్యాండ్‌సమ్‌గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దీని కోసం వ్యాయామానికి ఎప్పుడూ ప్రాధాన్యమిస్తాను’’ అంటాడు కబీర్‌.

‘కిక్‌–2’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఒకవ్యక్తి కబీర్‌ దగ్గరకు వచ్చి... ‘‘హీరోగా నటించవచ్చు కదా’’ అన్నాడు. సమాధానంగా చిరునవ్వు నవ్వాడు కబీర్‌. ఈ నవ్వు సంగతేమిటోగానీ ‘విలన్‌’ పాత్రల్లోనూ హీరోయిజాన్ని చూపించవచ్చునని ఎందరో ఉత్తమ విలన్‌లు నిరూపించారు. కబీర్‌ వారి బాటలోనే ప్రయాణిస్తున్నాడు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement