కథ: కొసరు | Kosaru | Sakshi
Sakshi News home page

కథ: కొసరు

Published Sun, May 18 2014 2:20 AM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM

కథ: కొసరు - Sakshi

కథ: కొసరు

కొత్త సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అనుకున్నదాని కంటే ఆడంబరంగానే జరిగింది. సాయంత్రం ఆరున్నరకు మొదలైన కార్యక్రమం ముగిసే సరికి రాత్రి తొమ్మిది దాటింది.

 అపరంజిత ఆడిటోరియం నుండి బయటకు వచ్చి మెట్ల పక్కగా నిలబడింది. ఆమెను కార్యక్రమానికి పిలిచి, ఆహ్వాన పత్రిక ఇంటికి వచ్చి ఇచ్చి మరీ మరీ రావాలని కోరి ఒకటికి రెండుసార్లు ఫోను చేసినవాళ్లు ఎవరూ కనబడలేదు. నిరుత్సాహపడింది. తనతో నరహరి వచ్చి ఉంటే బావుండేది. చిత్ర రంగంలో అతనికి కొద్దో గొప్పో పేరుంది. మంచి స్క్రిప్ట్ రైటర్. అతని పలుకుబడి వలనే తనకు అవకాశాలు వస్తున్నాయి. అతన్నీ ఆ కార్యక్రమానికి పిలిచారు. ఏదో కొత్త సినిమా పనిమీద ఉండటం వలన రావడం కుదరలేదు.

 ఆమె ఇప్పటివరకు అయిదు చిత్రాల్లో నటించింది. రెండు చిత్రాలు బాగా నడిచాయి. ఒకటి కోర్టు కేసులో ఉండి విడుదల కాలేదు. రెండు చిత్రాలు యావరేజ్‌గా నడిచాయి. చేతిలో కొత్తవేమీ లేవు. నరహరి పూనుకుంటే ముందుకు వెళ్లగలదు. అతని మీద నమ్మకం సడలుతోంది. తన మీద అతనికి అనుమానం కలుగుతున్నట్టుగా ఉంది. చిత్రరంగం గురించి తన కంటే అతనికే బాగా తెలుసు. నలుగురితో చనువుగా ఉండకపోతే ఎక్కడికక్కడ నొక్కేస్తుంటారు. కత్తిమీద సాములా ఉంటోంది. కొన్నిసార్లు తప్పించుకోడానికి వీలుండదు. ఏ ప్రామిస్సూ నిలవదు. నిరాశకు లోనవుతోంది. ఏం చేయాలో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు.
 తెలిసినవాళ్లు ఎవరైనా కనిపిస్తారేమోనని కొద్దిసేపు ఎదురుచూసింది. కనిపించారు కాని, లిఫ్ట్ ఇవ్వాల్సివస్తుందేమోనని తల తిప్పుకుని వెళ్లిపోయారు. ఎవరి మీద ఆధారపడటం ఇష్టమనిపించలేదు. ట్యాక్సీ పట్టుకుని ఇంటికి వెళ్లడం మంచిదనిపించింది. కార్లు పలచబడ్డాయి. మెట్లు దిగి ప్రాంగణంలోంచి బయటకు వచ్చి కాలిబాట మీద నుంచుంది. చల్లటి గాలి విసురుగా వీస్తోంది. పైట భుజాల నిండా కప్పుకుంది. టాక్సీలు లేవు. ఖాళీగా ఉన్న ఆటోను పిలవబోతోంటే తెల్ల రంగు కారు మెల్లగా వచ్చి, ఆమె ముందు ఆగింది. ఎవరిదై ఉంటుందా అనుకుని తొంగిచూసే లోపల ముందు తలుపు తెరుచుకుని రంగరాజు ముఖం కనిపించింది.
 చేయి ఊపుతూ ‘‘రా, కూర్చో’’ అన్నాడు.

 అతని కారులో కూర్చోడం ఇష్టం లేకపోయినా, కూర్చోక తప్పలేదు. కారు ముందుకు కదిలింది. వారాంతం అవటాన రోడ్డు మీద ట్రాఫిక్ అట్టే లేదు. లోపల లైటు ఆర్పేసి, ఆమె చేతి మీద తన చేయి వేసి, ‘‘మనం కలిసి చాలా కాలమైంది కదూ’’ అన్నాడు.
 ఆమె చేయి వెనక్కి తీసుకోలేదు. అతని చేయి వేడిగా ఉంది. ‘ఊ’ అంది.

 రంగరాజు ఒక నిర్మాత తమ్ముడు. నాలుగైదు సినిమాల్లో చిన్న పాత్రలు వేశాడు కాని, ఎదగలేకపోయాడు. ముప్ఫై సంవత్సరాలుంటాయి. జిమ్‌కు వెళ్తుంటాడనుకుంటా, బాడీ గట్టిగా ఉంటుంది, తట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది.
 ‘‘మిమ్మల్ని స్టేజీ మీదకు పిలిచారు. వెళ్లారు గాని ఏం మాట్లాడలేదు. వినీ వినబడకుండా థాంక్స్ అని చెప్పారు.’’
 నాలుగు గోడల మధ్య తప్ప మిగిలిన సమయాల్లో గౌరవంగానే సంబోధిస్తుంటాడు.
 నవ్వేసి ఊరుకుంది.
 ‘‘మీరొక్కరే వచ్చారేం? మీవారు రాలేదు.’’
 అతను నరహరి గురించి అన్నాడు. నరహరి ఆమె భర్త అని కొంతమంది అనుకుంటుంటారు.
 ‘‘అతను మా ఆయన కాదు. మా అమ్మకు దూరపు చుట్టమవుతాడు. అంతే!’’
 అతను అలా అనడం ఆమె కాదనడం అది మూడో సారో, నాలుగో సారో! కావాలని అంటున్నాడో, మర్చిపోయి అడుగుతున్నాడో అర్థం కాలేదు. నరహరి రంగరాజు మీద సౌమ్యుడు. ఇబ్బంది కలిగించడు. ఆమె తల్లి కూడా అతనంటే ఇష్టపడుతుంది. అపరంజితకు గత నాలుగైదు నెలలుగా నరహరి అంటే ఆసక్తి తగ్గిపోయింది. మునుపటిలా కలిసి భోజనం చేయడం లేదు. అతను ఉండే మేడ గదిలోంచి ఎప్పుడో గాని బయటకు రావడం లేదు. ఏవేవో రాస్తున్నాడు కాని, ఏదీ క్లిక్ కావడం లేదు. అతని అవసరం ఉన్నట్టు అనిపించడం లేదు. ఇంట్లోంచి ఎలా బయటికి పంపించాలో తెలియడం లేదు. ఆమె తల్లికి కూడా అటువంటి ఆలోచనే ఉంది. ‘తొందరపడొద్దు. చేసేదేదో పకడ్బందీగా చేద్దాం. మనకు అపవాదు రాకూడదు’ అంది. తల్లి ఊరెళ్లి రెండు వారాలు అవుతుంది. రేపో మాపో రావాలి.
 ‘‘లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామా?’’ అడిగాడు, ఆమె తొడ మీద చేయి వేసి. చేయి బలంగా ఉంది. ఒక్క చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాడు. చూపు రోడ్డుమీద ఉంది. లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే అతన్ని ఆపడం కష్టం. నాలుగైదుసార్లు లాంగ్ డ్రైవ్‌కు తీసుకెళ్లాడు.
 ‘‘ఇంట్లో అమ్మ ఉంది. అరగంట ఆలస్యం అయితే ఊరుకోదు. రాత్రంతా తిట్లు తినాల్సి వస్తుంది’’ అబద్ధం చెప్పింది.
 ‘‘ఎక్కువ సమయం తీసుకోను. త్వరగానే తిరిగొచ్చేద్దాం.’’
 అతని చేతిమీద గిచ్చి, ‘‘ఇవేళ వద్దు’’ అంది.
 ‘‘నీ ఇష్టం’’ అని కారు యూటర్న్ తీసుకున్నాడు.
 
 ఇంటికి వచ్చాక కాలింగ్ బెల్ నొక్కబోతూ తలుపు నెట్టింది. లోపల గడియపెట్టి లేదు. తెరుచుకుంది. లోపలికి వచ్చి, గడి పెడుతూ తలుపు గడియపెట్టనందుకు నరహరిని తిట్టుకుంటూ, ‘ఎవరైనా వచ్చి ఏదైనా తీసుకువెళ్లుంటే’ అనుకుంది. ‘ఈ మనిషిని చంపేస్తే తనకు పట్టిన శని విరగడవుతుందేమో’ అని కూడా అనుకుంది. వెంటనే పాపం అనిపించింది.
 భోజనాల బల్లమీద తను వెళ్తూ పెట్టిన భోజన పదార్థాలు అలానే ఉన్నాయి. తినలేదు. తను వెళ్లాక మేడ గదిలోంచి కిందకు వచ్చి ఉండడు. వండినదంతా వేస్ట్ అవుతుంది. అతన్ని భరించడం కష్టమవుతోంది. మేడ ఎక్కి అతని గదిలోకి అడుగుపెడుతోంటే బల్ల మీద కూర్చుని రాసుకుంటున్నవాడు వెనక్కి తిరిగి చూడకుండా,
 ‘‘కార్యక్రమం ఎలా జరిగింది?’’ అనడిగాడు.
 ‘‘బాగానే జరిగింది. భోజనం చేయలేదేం?’’ బల్ల పక్కగా నుంచుని అడిగింది కోపం బయట పడనీయకుండా.
 ‘‘ఆకలిగా అనిపించలేదు. ఈ స్క్రిప్ట్ పని ముగింపుకు వచ్చింది. రేపు వాళ్లకిచ్చేస్తే నా పనైపోతుంది. ఇహ ఏ పనులూ ఒప్పుకోదల్చుకోలేదు. జీవితం మీద విసుగు పుడుతోంది. చనిపోవాలని ఉంది. నవ్వకు. నిజంగా అంటున్నాను. ఈ కాయితం చదువు’’ ఆమెకు కాయితం ఇచ్చాడు.

 అందులో ఇలా ఉంది: ‘‘జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’’ పేరు, సంతకం, తేదీ, సమయం ఉన్నాయి. కాయితం తిరిగి అతనికి ఇచ్చేసింది. బల్ల సొరుగులో పెట్టుకున్నాడు.
 అతని తల నిమురుతూ, ‘‘అలాంటి పిచ్చిపనులు చేయకు’’ అంది.
 ‘‘ఏం చేయను చెప్పు?’’
 ‘‘నీ కోసం పాలు వేడి చేసి తీసుకువస్తాను’’ అతని జవాబుకై ఎదురుచూడకుండా కిందకు దిగి వంట గదిలోకి వచ్చి, ఫ్రిజ్‌లోంచి పాలు తీసి వేడిచేసి పెద్ద గ్లాసు నిండా పోసింది. స్టౌ పైన ఉన్న సొరుగులోంచి చిన్న ప్లాస్టిక్ డబ్బా మూత తెరిచి చూసింది. సగం వరకు నిద్రమాత్రలు ఉన్నాయి. తను రోజూ వేసుకుంటుంది. కనీసం ఒకటైనా వేసుకోకపోతే నిద్రపట్టదు. రెండు మాత్రలు మటుకు ఉంచి, మిగిలినవన్నీ పాల గ్లాసులో వేసి ప్లాస్టిక్ డబ్బా తిరిగి సొరుగులో పెట్టి స్పూనుతో అయిదు నిమిషాల పాటు మాత్రలన్నీ కరిగేలా కలిపి, గ్లాసు ఎత్తి పట్టుకుని చూసింది. ఏవీ కనబడటం లేదు. స్పూనుతో పాలు తీసి రుచి చూసింది. రుచిలో తేడా కనిపించలేదు.
 గ్లాసు పైటతో శుభ్రంగా తుడిచి, వేగంగా కొట్టుకుంటున్న గుండెను చిక్కబట్టుకుని ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి, నరహరి గదిలోకి వచ్చి, పాలగ్లాసు అతని ముందు పెట్టింది.
 ‘థేంక్స్’ అని గ్లాసు అందుకుని, ఆమె ముఖంలోకి చూస్తూ గ్లాసు ఖాళీ చేసి బల్లకు ఒక పక్కగా పెట్టాడు.
 ‘‘నే వెళ్తాను. నిద్ర వస్తోంది’’ అంది.
 ‘సరే’ అన్నట్టు తలూపాడు.
 ఆమెకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. తను తప్పు చేస్తున్నట్టు అనిపించింది. కిందకు దిగి వచ్చి లైట్లార్పి పడక గదిలోని మంచం మీద పడుకుంది.

 అరగంట తర్వాత నిద్రలోకి జారుకోబోతున్న సమయంలో వంట గదిలో అయిన చప్పుడుకు నిద్ర పక్కకు జరిగింది. లేచి కూర్చుంది. తను చేసిన పనికి భయం వళ్లంతా పాకింది. అలా వేయకుండా ఉండాల్సింది అని చేసిన తర్వాత పదే పదే అనుకుంది. మధ్యలో నిద్ర భంగమైతే వెంటనే నిద్రపట్టదు. నరహరి ఆలోచనలే మాటిమాటికీ గుర్తు వస్తున్నాయి.
 వంట గదిలో లైటు వెలుగుతోంది. దుప్పటి పక్కకు తీసి కాళ్లు కిందపెట్టి చెప్పులు తొడుక్కుంది. తను పాలలో కలిపిన మాత్రలు పనిచేయలేదా? అవి పనిచేయడానికి సమయం పడుతుందా? లేక తనిలా మేడ గదిలోంచి కిందకు రాగానే బాత్‌రూమ్‌కు వెళ్లి తాగిన పాలన్నీ కక్కేశాడా?
 అయిదు నిమిషాల తర్వాత వంట గదిలో లైటు ఆరిపోయింది. అతను మెట్లు ఎక్కుతున్న చప్పుడు, వెనక తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. నిద్ర పూర్తిగా ఎగిరిపోయింది. నిద్ర పట్టాలంటే నిద్రమాత్రలు వేసుకోక తప్పదు. ప్లాస్టిక్ డబ్బాలో రెండు వదిలిపెట్టిన విషయం గుర్తు వచ్చింది.

 చప్పుడు కాకుండా వంట గదిలోకి నడిచి లైటు వేసి ప్లాస్టిక్ డబ్బా అందుకుని మూత తెరిచి, అందులోని మాత్రలను అరచేతిలోకి తీసుకుని అందులో ఉన్న చిన్న కాయితం అందుకుంది. అది ఇందాక లేదు. మాత్రలు నోట్లో వేసుకుని కాయితంలో ఉంది చదవసాగింది. ‘‘నన్ను చంపాలని ఎందుకు అనుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నవి నిద్రమాత్రలు కావు. సైనైడ్‌వి...’’ ఇంకేం చదవలేకపోయింది. అప్పటికి ఆ మాత్రలు నోట్లో కరిగిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement