అలా చేయడం తప్పా?! | life suggestions tells Yandamuri Veerendranath | Sakshi
Sakshi News home page

అలా చేయడం తప్పా?!

Published Sun, Nov 15 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

అలా చేయడం తప్పా?!

అలా చేయడం తప్పా?!

జీవన గమనం
నేనో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిని. నాకు ఎవరైనా రూల్స్ పాటించకపోతే నచ్చదు. ఆఫీసులో కొలీగ్స్ నుంచి రోడ్డు మీద ఆటోవాడి వరకూ ఎవరు నియమాలు తప్పినా సహించ లేను. అలా చేయడం తప్పు కదా అని నిలదీసి అడిగేస్తాను. అది ఎవరికీ నచ్చదు. నీకు అవసరమా అంటారు. తనే పెద్ద సిన్సియర్ అయినట్టు అని కొందరు ఎగతాళి కూడా చేస్తున్నారు. నేనిలా చేయడం తప్పా?
 - శంకర్రావు, జీడిమెట్ల

 
సమాజంలో జరుగుతోన్న అక్రమా లను చూసి ఆవేశం రావడం, రక్తం మరగడం సాధారణమే. అయితే ‘పరిస్థితి అలా తయారవడానికి మనం కూడా దోహదపడుతున్నామా’ అనే విషయం ఆలోచించుకోవాలి. దీన్నే ఇంగ్లిష్‌లో ‘సెల్ఫ్ రియలైజేషన్’ అంటారు. ఉదాహరణకి రోడ్డు పక్కన చెత్త చూసి, మీరు ప్రభుత్వం మీద కోపం తెచ్చుకున్నారనుకుందాం. ఇంట్లోని చెత్త మీరెప్పుడైనా రోడ్డుమీద పడేశారా అన్నది ఆలోచించుకోవాలి.

సినిమాలో లంచగొండి పోలీసు అధికారి మీద హీరో ఉమ్మేసినప్పుడు ప్రేక్షకులంతా చప్పట్లు కొడతారు. చిత్రమేమిటంటే, వాళ్లలో చాలామంది లంచగొండులు ఉంటారు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి ఆటోవాడు రెట్టింపు చార్జీ అడిగితే, కోపం రావడం సహజమే. ఎందుకంటే మీ బల హీనతతో అతడు ఆడుకుంటున్నాడు కాబట్టి. అయితే పాస్‌బుక్ కోసం ఒక రైతు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు లంచం అడిగితే, ఇతరుల బలహీనతలతో ఆడు కునే వారిలో మీరు కూడా ఒకరవుతారు.

అప్పుడు మీకు ఆటోడ్రైవర్ మీద కోపం తెచ్చుకునే అధికారం లేదు. ఇలా ఆలో చిస్తే, మనలో కూడా అవే లోపాలుంటే, ఆవేశం తగ్గిపోతుంది. లేదూ మీరు సిన్సియర్‌గా ఉన్నారంటే... ఓ మంచి అభిరుచిని ఏర్పరచుకోండి, ఆవేశం అదే తగ్గుతుంది. సమాజంలో ఏఏ పరిస్థితుల వల్ల ఉద్వేగం కలుగుతోందో వ్యాసాలుగా రాసి పత్రికలకి పంపండి. ఫేస్‌బుక్‌లో పోస్టులు, బ్లాగులు పెట్టడం కూడా ఓ పద్ధతి. దీన్నే ‘ఔట్-లెట్’ అంటారు. అంతర్గత ఆవేశానికీ ఉద్విగ్నతకీ కారణ మైన పరిస్థితుల పట్ల ప్రతిస్పందించ డానికి చాలామంది కళాకారులు ఎన్నుకునే పద్ధతి ఇది. మంచి ఫలితం ఉంటుంది.
 
కులమతాలు పట్టించుకోకుండా, కట్న కానుకలు తీసుకోకుండా పెళ్లాడాను. పదేళ్లు కాపురం చేసి, బాబు పుట్టాక ఆమె అక్రమ సంబంధాల వైపు పరుగెత్తింది. నేను వ్యతిరే కించినా విడాకులు సాధించుకుంది. వేరొక రితో సహజీవనం చేస్తోంది. నేను మా కుటుం బీకుల ప్రోత్సాహంతో ఓ డైవర్సీని పెళ్లాడాను. ఆవిడకు ఎదిగిన కూతురుంది. ముగ్గురం అన్యోన్యంగా ఉంటున్నాం. అయితే నా మొదటి భార్య మా బాబుని నాకు దూరం చేసింది. వాడికి నాపై చెడు అభిప్రాయాన్ని పెంచి నా దగ్గరకు రాకుండా చేసింది. అది నేను తట్టుకో లేకపోతున్నాను. ఏం చేయాలి?
 - ఓ సోదరుడు, బెంగళూరు

 
మీరు అడిగిన ప్రశ్నకి మొదటి ఐదు వాక్యాలూ అవసరమా? ‘నేను చాలా గొప్ప పని చేశాను, నా భార్య నీచమైన మనస్తత్వం కలది’ అన్న అభిప్రాయం మీ ప్రశ్నలో ఎక్కువగా కనిపిస్తోంది. మొదటి భార్యను వదిలేసినప్పుడు ఆమెతో పాటు మానసికంగా మీ బాబును కూడా వది లేయడానికి సిద్ధపడాలి. మీ రెండో భార్య మాజీ భర్త ఆమెనీ, ఆమె కూతుర్నీ కొంత కాలం తన దగ్గరకు పంపించమంటే మీరు ఎలా ఫీలవుతారో, బహుశా మీ మొదటి భార్య కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మీరిప్పుడు అన్యోన్యంగానే ఉన్నారు కాబట్టి మొదటి భార్యతో బంధం పూర్తిగా తెంచుకోండి.

జిలేబి తింటూ డయాబెటిస్ తగ్గాలంటే ఎలా? మోహం ఎక్కువైతే వ్యామోహం అంటారు. వ్యామోహం ఎక్కువైతే తాపత్రయం అంటారు. తాపం అంటే కోరిక. త్రయం అంటే మూడు. ‘నేను బావుండాలి, నన్ను బాగా ఉంచడం కోసం అవతలివారు బాధపడినా నేను బావుండాలి, నేను పోయాక కూడా నావాళ్లు (మాత్రమే) బావుండాలి’ అనే మూడు కోరికలే తాప త్రయం. ఇదే అన్ని విషాదాలకీ మూలం.
 
నేనో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్ నన్ను రెగ్యులర్‌గా డ్రాప్ చేసే వాడు. తను నన్ను ప్రేమించాడు. మొదట కాదన్నా నన్ను దేవతలాగా చూడటం చూసి నేనూ ప్రేమించాను. మావాళ్లు ఒప్పుకున్నారు. కానీ ఉద్యోగాలు, స్తోమత కారణంగా తేడాలు వస్తాయంటూ తన ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. అప్పుడే నాకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో వెళ్లాల్సి వచ్చింది. తర్వాత కూడా ఇద్దరం టచ్‌లో ఉన్నాం.

పెళ్లికి డేట్ ఫిక్స్ చేశారని తను చెబితే ‘వెయిట్ చేస్తే చెయ్యి, లేదంటే తననే చేసుకో’ అన్నాను. కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఎన్నిసార్లు చేసినా దొరక లేదు. చాలా రోజులు ప్రయత్నించి, తన ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ చేస్తే తనకి పెళ్లైపోయిందని చెప్పారు. నంబర్ అడిగితే నాకు ఇవ్వొద్దన్నా డని అన్నారు. నా గుండె పగిలిపోయింది. తను లేకుండా నేను బతకలేను. తనని నేను మర్చిపోలేను. ఇప్పుడు నేనేం చేయాలి?
 - ప్రియాంక, ఆస్ట్రేలియా

 
అతడిని మర్చిపోవడం తప్ప మీకింకో మార్గం ఏముంది చెప్పండి! రంభ తా వలచి వచ్చిన అనే సామెత గుర్తుందిగా! మీరు దేబిరించేకొద్దీ అతనికి మీమీద ప్రేమ తగ్గడమే కాకుండా అసహ్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మీరు అతడిని మర్చిపోవడమే మంచిది. గుండెలు పగలటాలూ, మళ్లీ అతుక్కోవడాలూ మామూలే. కాలమే అన్ని గాయాలనూ మానేలా చేస్తుంది. కొంతకాలం ఇతర అభిరుచుల్లో నిమగ్నమైతే మనసు సర్దు కుంటుంది. జీవితాన్ని ఎప్పుడు కావా లంటే అప్పుడు ఫ్రెష్‌గా ప్రారంభించ వచ్చు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకుంటే ఆనందంగా ఉండగలరు.                 
 - యండమూరి వీరేంద్రనాథ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement