ప్రేమ పూసెనోయ్...వాడి పోయెనోయ్! | Lyricist Purnachari interview | Sakshi
Sakshi News home page

ప్రేమ పూసెనోయ్...వాడి పోయెనోయ్!

Published Sat, Nov 26 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM

ప్రేమ పూసెనోయ్...వాడి పోయెనోయ్!

ప్రేమ పూసెనోయ్...వాడి పోయెనోయ్!

 పువ్వుచాటు ముల్లుంటే..అమ్మాయి నవ్వు చాటు మాయ ఉంటుంది.  ‘‘నవ్వు చూసి ప్రేమ అనుకుని మోసపోయిన ఓ విఫల ప్రేమికుడి గీతమిది’’ అన్నారు పాటల రచయిత పూర్ణాచారి. ‘ప్రేమ పూసెనోయ్.. వాడి పోయెనోయ్..’ అంటూ ‘ప్రేమమ్’ సినిమాలో  హీరో లవ్ ఫెయిల్యూర్ సాంగ్‌ను పూర్ణాచారి రాశారు. రాజేశ్ మురుగేశన్ స్వరకర్త. ఈ పాట తత్వం గురించి, ఆ పాట రచయిత పూర్ణాచారి మాటల్లోనే...
 
 ఓ టీనేజ్ కుర్రాడు (నాగచైతన్య) తన ప్రేమను వ్యక్తపరిచేలోపే... ఎవరినైతే ప్రేమిస్తున్నాడో? ఆ అమ్మాయి (అనుపమా పరమేశ్వరన్) మరొక అబ్బాయిని తీసుకొచ్చి ఇతగాడికి పరిచయం చేస్తుంది. అంతే కాకుండా.. అతణ్ణి ప్రేమిస్తున్నాననీ, పెళ్లి  చేసుకోవాలనుకుంటున్నాననీ చెబుతుంది. ఆశలన్నీ అడియాశలైన సందర్భం ఇది.  
 
 పల్లవి: ప్రేమ పూసెనోయ్.. వాడి పోయెనోయ్.. / రెక్కలన్ని రాలిపోయెనోయ్..॥ అమ్మాయి నవ్వులే ఓ అందమైన పువ్వై అబ్బాయి మనసులో ప్రేమగా పూసింది. కానీ, ఆ ప్రేమ పువ్వు ఎంతోసేపు లేదు. వాడిపోయింది, రెక్కలన్నీ రాలిపోయాయని పల్లవిలోనే చెప్పేశాం. ఇంకో అబ్బాయిని తీసుకొచ్చి ప్రేమిస్తున్నానంటే.. ఇక అతని మనసులో ఆ అమ్మాయిపై ఆశలు ఎందుకుంటాయి? ఎప్పుడో చచ్చిపోయాయని చెప్పడం పల్లవి ఉద్దేశం.
 
 చరణం 1: పువ్వుచాటు ముల్లులా.. మెల్లంగ గుచ్చినాది/ నొప్పి కూడా చెప్పుకోని తీరు బాధపెట్టెనోయ్ / ఈ తేనె పరిమళం తీయంగ లేదురో / ఆ చేదు మాటవింటే ప్రాణమాగిపోయెరో ॥(2)॥ఎప్పుడూ పువ్వులే.  అందమైన గులాబీకి ముళ్లున్నట్టు.. సుకుమారంగా కనిపించే కొందరమ్మాయిల్లో కర్కశత్వం కూడా ఉంటుంది. ‘ప్రేమమ్’లో ఈ పాట సందర్భం విషయానికి వస్తే.. హీరో మనసులో ఏముందో తెలుసుకోకుండానే తన స్వార్థం కోసం వాడుకుంటుంది. బయటకు చెప్పలేడు, లోపలే దాచుకోలేడు. 
 
 పువ్వుల నుంచి తేనె వస్తుంది కనుక, అమ్మాయి మాటలను తేనెతో పోల్చానిక్కడ. మనం ప్రేమించిన అమ్మాయి మరొకర్ని ప్రేమిస్తున్నానని చెబితే.. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడా మాటలు.. అంటే తేనె చేదుగా ఉంటుంది. ఊపిరి ఆగినంత పనే. అబ్బాయిలు ప్రేమ విషయాన్ని ముందే అమ్మాయిలకు చెబితే మంచిది.చరణం2: రెక్కలెన్నొ తెచ్చి ఆకాశాన్ని ఊపినానే/ లెక్కలేని పూలచుక్కలెన్నొ తెంచినానె/ ముళ్ళు గుచ్చుతున్నా.. గుండె నొచ్చుతున్న / బాధింత అంత కాదే... / అద్దంలో నన్ను నేను చూసుకుంటే / నా గుండె బుజ్జగించినట్టు వుందె/ ఎంత చెప్పుకున్న ఓటమొప్పుకున్న / నా ఏడుపాగదాయె
 
 ఆకాశం ఓ చెట్టయితే.. ఆ చెట్టుకి పూసిన పూలు నక్షత్రాలు. ఆకాశాన్ని చెట్టుగా, పూలను చుక్కలుగా వర్ణించడమనేది ఇక్కడి ప్రయోగం. నాకంటే ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరనే ప్రతి ఒక్కరూ ఫీలవుతారు. ఇక్కడ ఈ కుర్రాడూ అంతే. ఆకాశమంత చెట్టుని ఊపి, పూలచుక్కలను తెంచాను. నేను నీ కోసం ఇంత చేస్తున్నప్పుడు.. నువ్వే ముల్లై గుచ్చుకుంటే ఆ గుండె బాధ వర్ణనాతీతమంటున్నాడు. బాధలో ఉన్నప్పుడు పక్కనున్న మనిషి ఎవరైనా ఓదార్చడం వేరు. కానీ, అద్దంలో చూసుకున్నప్పుడు అతడి గుండె అతణ్ణి ఓదారుస్తున్నట్టు ఉందంటున్నాడు.
 
 ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్లు ఆలోచిస్తారు. అదే విధంగా ‘‘ప్రేమలో ఓడిపోయాను. అంతా అయిపోయింది’’ అని టీనేజ్ కుర్రాళ్లకు అర్థమవుతుంది. ఆ వయసులో పరిణతితో కూడిన ఆలోచనలు ఉండవు కదా! ఏ ఎమోషన్స్ అయినా డీప్‌గా ఉంటాయి. దాన్ని సరళమైన భాషలో, కవితాత్మకంగా చెప్పడం జరిగింది.  చరణం3: చూసి చూసి నన్ను పావులా భలేగ/ వాడుతున్న తీరు చూడరా/ నా చుట్టు ఇందరున్నా.. నవ్వింది నన్ను చూసి / ఈ వింతగున్న ఆటలేంటి ఓరి దేవుడా ॥(2)॥
 
 అమ్మాయి వెనుక చాలామంది అబ్బాయిలు ప్రేమిస్తున్నానంటూ తిరగడం సహజమే. అందులో ఎవరో ఒక్కర్ని చూసి అమ్మాయి నవ్వితే.. అతడు ఏమనుకుంటాడు? నేనంటే ఇష్టం అనే ఫీలవుతాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. కానీ, చివరికి ఇంకెవర్నో ప్రేమించి సహాయం చేయమంటే? మోసం చేయడమే. తానో పావుగా మారిన వైనాన్ని, మోసపోయిన తీరునీ.. ‘ఓరి దేవుడా.. ఈ వింత ఆటలేంటి?’ అని తలచుకుని ఏడుస్తున్నాడు.    ఈ పాట రాసే అవకాశమే చాలా విచిత్రంగా వచ్చింది. మొదట మలయాళీ వెర్షన్‌కు నా చేత డమ్మీ లిరిక్స్ రాయించారు. ఈ కుర్రాడిలో విషయం ఉందని ‘అగరొత్తుల కురులే వలగా విసిరేశావే..’ సాంగ్ మొదట రాయించారు. 
 
 దర్శక-నిర్మాతలకు నాపై నమ్మకం పెరగడంతో తర్వాత నేనే ఇంకో పాట ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. అప్పుడీ పాట ఇచ్చారు. సుమారు ముప్పై వెర్షన్‌లు రాశాను. సీనియర్ రచయితలు బ్రహ్మాండంగా రాస్తున్న టైమ్‌లో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ఈ పాట విని రామజోగయ్య శాస్త్రిగారు ప్రత్యేకంగా ప్రశంసించారు. పాటల రచయితగా నా ప్రయాణం ‘ప్రేమమ్’ ముందు, ఆ తర్వాత అని చెప్పుకునే విధంగా సినిమాలో రెండు పాటలు నాకు పేరు తీసుకొచ్చాయి. 
 ఇంటర్వ్యూ: సత్య పులగం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement