‘ఇదంజగత్’ సినిమాతో తెలుగు తెరకు అంజు కురియన్ రూపంలో మరో మలయాళీ భామ పరిచయమయింది. ఈ సినిమాలో ‘దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్లు.... దారాలేవో అల్లే్లస్తున్న స్నేహాలేవో’ అని పాట ఉంది. ఈ పాటలాగే సరిహద్దుల దూరాలను దూరం చేస్తూ మన చిత్రసీమకు వచ్చి స్నేహహస్తం చాటుతున్న అంజు కురియన్ గురించి...
అప్పుడు అలా ఇప్పుడు ఇలా!
తన గురించి తాను ఇలా రాసుకుంది అంజు.ఏజ్ 10: టీచర్ కావాలనుకున్నాను.
ఏజ్ 15: డాక్టర్ కావాలనుకున్నాను.
ఏజ్ 20: ఆర్కిటెక్ట్ కావాలనుకున్నాను. ఏజ్ 25: మళ్లీ కిడ్ కావాలనుకుంటున్నాను. కిడ్ అయితే కాలేదుగానీ హీరోయిన్ మాత్రం అయ్యింది. ‘అందం అనేది మనసులో నుంచి పుడుతుంది. కాస్మొటిక్స్ నుంచి కాదు’ అని నమ్మే అంజు సహజసౌందర్యానికే తన ఓటు అంటుంది.
ప్రేమమ్‌తో...
కేరళలోని కొట్టాయంలో పుట్టిన అంజు కురియన్ చెన్నైలో చదువుకుంది. కాలేజీ రోజుల్లో మోడలింగ్ చేసేది. ఈ సమయంలోనే డైరెక్టర్ ఆల్ఫాన్స్ మలయాళ చిత్రం ‘నేరం’తో ఆమెను వెండితెరకు పరిచయం చేశారు. ఈ బ్లాక్‌కామెడీ థ్రిల్లర్‌లో సహాయ పాత్రే అయినప్పటికీ తగిన గుర్తింపు తెచ్చింది. ఇక ప్రేమమ్ (మలయాళం)లో కూడా చేసింది సహాయ పాత్రే అయినా భా.....రీ గుర్తింపు తెచ్చిపెట్టింది.
చెన్నై టు సింగపూర్
‘చెన్నై టు సింగపూర్’ అంజు తొలి తమిళ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాపై విమర్శల మాట ఎలా ఉన్నా అంజు కురియన్ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి.
‘ఇదంజగత్’ అంజు తొలి తెలుగు చిత్రం. దీనికి ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ భాష సమస్య వల్ల నటించలేదు. ‘ఇదంజగత్’ కథ విన్న తరువాత మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనని అనుకుందట. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అనుకుంది. భాష విషయంలో సుమంత్ సహకరించాడట. అంజు కోసం ఆయన తెలుగు టీచర్ అయ్యాడన్నమాట!
కొత్త ప్రపంచంలోకి...
రొటీన్ పాత్రలు కాకుండా భిన్నమైన అనుభూతిని ఇచ్చే పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతుంది అంజు. ఇతర భాషా చిత్రాల్లో నటించడం ద్వారా తన కెరీర్ పరిధిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న అంజు ఇప్పుడు తెలుగు నేర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ‘కొత్త భాష నేర్చుకోవడం ద్వారా భాష రావడం మాత్రమే కాదు.... కొత్త సాంస్కృతిక ప్రపంచంలోకి అడుగుపెడతాం’ అని చెబుతుంది అంజు కురియన్.
‘కంఫర్ట్‌జోన్ నుంచి కదలడం కష్టమే’ అనుకున్న దశ నుంచి ‘నువ్వు దృష్టి పెట్టాల్సింది లక్ష్యం మీదే...నీ భయాల మీద కాదు’ అని నమ్మే దశకు వచ్చింది. ఇక విజయాలకు అడ్డేమున్నది!
Comments
Please login to add a commentAdd a comment