టీవీక్షణం: చూస్తే భారతమే చూడాలి!
ఒకప్పుడు ఆదివారం వస్తే చాలు... ఉదయాన్నే ఇల్లాళ్లు హడావుడిగా వంటలు పూర్తి చేసేసేవాళ్లు. బడికెళ్లే రోజుల్లో బద్దకంగా ఒళ్లు విరుచుకునే పిల్లలు కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసి, టిఫిన్లు ముగించేవాళ్లు. అందరూ అన్నీ చక్కబెట్టేసుకుని టీవీ సెట్ల ముందు తిష్ట వేసేసేవారు.
కాసేపటికి తెర మీద ప్రత్యక్షమయ్యేది... మహాభారత్. అంతే, సూది మొన పడినా వినిపించేంత నిశ్శబ్దం. అందరి కళ్లూ తెరమీద అతుక్కుపోయేవి. అందరి మనసులూ భక్తి పారవశ్యంతో మునిగిపోయేవి. అది కేవలం సీరియల్ కాదు వారికి. సాక్షాత్తూ మహాభారత కథకు తమ ఇల్లే వేదిక అయ్యిందన్నంత తన్మయత్వం వారిలో. రెండేళ్ల పాటు అంద రూ తమ ఆదివారాలను భారతానికే అంకితం చేసేశారు.
మళ్లీ పదమూడేళ్ల తర్వాత అదే పరిస్థితి ఏర్పడింది. ఈసారి స్టార్ ప్లస్ చానల్ మహాభారతాన్ని తీసుకొచ్చింది. ఆదివారానికి బదులు ప్రతిరోజూ రాత్రి ఎనిమిదిన్నరకు ప్రతి ఇంటా కృష్ణలీలన్ని, పాండవుల వీరోచిత గాథల్ని చూపిస్తోంది. మరోసారి ఆ అతిగొప్ప ఇతిహాసాన్ని కళ్లకు కడుతోంది.
అప్పటికీ ఇప్పటికీ... నటులు మారారు. తీసే విధానం మారింది. కెమెరా టెక్నిక్స్ వచ్చి చేరాయి. గ్రాఫిక్స్ పెద్ద పీట వేస్తున్నాయి. మారనిది ఒక్కటే... ప్రేక్షకాదరణ. దాన్ని ఆదరణ అనే కంటే, భక్తి భావన అనడం బెటరేమో. ఆ భావనే ఇప్పటికీ భారతాన్ని ఆస్వాదించేలా చేస్తోంది. మరో పాతికేళ్ల తర్వాత ప్రసారం చేసినా, ప్రేక్షకులను టీవీల ముందు కూర్చోబెట్టి తీరుతుంది!