
రాహుల్‌ని ఇషిత క్షమిస్తుందా?!
డబ్బింగ్ సీరియల్ అయినా కథ బాగుంటే తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారనడానికి పెద్ద సాక్ష్యం... ‘మనసు పలికే మౌన గీతం’. అనుకోకుండా పరిచయమైన ఓ పాపకు దగ్గరై, తన కోసం ఆమె తండ్రి రాహుల్‌ని వివాహం చేసుకుంటుంది ఇషిత. ఆ తర్వాత అతడిని ప్రేమిస్తుంది. అతడి ప్రేమనూ సంపాదించుకుంటుంది. అయితే రాహుల్ మొదటి భార్య సుజన కారణంగా అడుగడుగునా ఇబ్బంది పడుతూ ఉంటుంది. చివరికి ఏ పాప కోసం రెండో పెళ్లివాడికి భార్యయ్యిందో, అదే పాపను సుజనకు ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అది కూడా భర్త చేసిన పొరపాటు వల్ల. దాంతో ఆమె పడుతోన్న వేదనను చూసి ప్రేక్షకుల కళ్లు తడుస్తున్నాయి. ఏదో ఒకటి చేసి పాపను దక్కించుకుంటుందని ఎదురు చూస్తున్నారు. కానీ అలా జరగదు. పాప ఇషితకు దూరమై పోతుంది. కథలో రాబోతోన్న పెద్ద మలుపు అదే. మరి ఆ పరిస్థితికి కారణమైన భర్తని ఇషిత క్షమిస్తుందా? పాపను ఎప్పటికైనా మళ్లీ కలుస్తుందా? ఇప్పుడే చెప్పేస్తే ఏం బావుంటుంది! మీరే చూడండి.