
పిచ్చివాళ్ల స్వర్గం
హ్యూమరం
పిచ్చాసుపత్రి నుంచి ఒకాయన తప్పించుకు పారిపోయి జనంలో పడ్డాడు. మొదట ఒక రాజకీయ నాయకుడు ఎదురయ్యాడు.
‘‘చారిత్రక సన్నివేశంలో బృహత్తర పథకం ఎదురైంది. మిగులు జలాల పోరాటం రాజీనామాలతో పరిష్కారం. పేదల కన్నీటి ఉప్పెన ఒత్తిడి వాయుగుండమై అల్పపీడనమై ప్రజా సంక్షేమమే ప్రధాన కర్తవ్యం’’ అని ఉపన్యసిస్తుండగా, పిచ్చివాడు జడుసుకుని కాలి సత్తువ కొద్దీ పారిపోతూ ఉంటే ఒక పుస్తకావిష్కరణ సభ తగిలింది.
‘‘ఈ పుస్తకం మస్తక పరీక్ష. కవిత్వం కాదిది కన్నీటి తత్వం. జనం గుండె గల్లంతు సాగర సంగమ తటాక జల తరంగిణి పాఠక బుర్ర రామకీర్తనగా...’’
పిచ్చివాడికి కోపమొచ్చి, ‘‘ఏం మాట్లాడుతున్నార్రా?’’ అని గట్టిగా అరిచాడు.
‘‘మాట్లాడే సమయంలో నోరు మూసుకుని ఉండటం, నోరు మూసుకోవాల్సిన సమయంలో మాట్లాడటం రచయితల మౌళిక హక్కు. అర్థం కాకుండా మాట్లాడితే వేదాంతం. అర్థం లేకుండా మాట్లాడితే సిద్ధాంతం. అర్థమే పరమార్థమైతే ఎకనామిక్స్. అర్థాన్ని జీర్ణం చేసుకుంటే పాలిటిక్స్’’ అని కర్రలు తీసుకుని రచయితలంతా పిచ్చివాడిని తరుముతున్నారు.
ఎక్కడికి పారిపోవాలో తెలియక, మనవాడు ఒక సినిమా ఆడియో ఫంక్షన్‌లోకి వెళ్లాడు.
‘‘కళామతల్లి సేవకులం, భృత్యులం, ఆ తల్లి పాదధూళి సోకితే రాయికి ప్రాణమొస్తుంది. ఆ తల్లికి జోల పాడుతాం. కళామతల్లి...’’ అంటూ ఒకాయన పూనకమొచ్చినట్టు ఊగుతున్నాడు.
‘‘ఆ తల్లి ఎక్కడుంది?’’ అని పిచ్చివాడు అమాయకంగా అడిగాడు.
‘‘ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆమెని చూసినవాళ్లు ఇంతవరకూ లేరు’’ అని దివాళా తీసిన ఒక నిర్మాత చెప్పాడు.
అయోమయంగా వెళుతున్న పిచ్చివాడిని ఒక చానెల్‌వాళ్లు లాక్కెళ్లారు.
‘ప్రజాస్వామ్యానికి జబ్బు చేసిందా, లేదా?’ అన్న అంశంపై బోలెడు మంది నాయకులు డాక్టర్లతో చర్చావేదిక సాగుతుంటే పిచ్చాయనకు కూడా మైకిచ్చారు.
‘‘ప్రజాస్వామ్యానికి బీపీ పడిపోయింది. షుగర్ లెవెల్స్ పెరిగాయి. నాడి అందడం లేదు. గుండె ఎక్కడుందో తెలియడం లేదు’’ అంటూ పిచ్చివాడిని అభిప్రాయం చెప్పమన్నారు.
‘‘ప్రజాస్వామ్యమంటే ఏంటి?’’ అన్నాడు మనవాడు.
మైకులు, కెమెరాలతో చావబాదారు.
పిచ్చివాడు నేరుగా పిచ్చాసుపత్రికి వెళ్లి, ‘‘ఇక్కడి కంటే బయటే పిచ్చివాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇదే సేఫ్’’ అంటూ డాక్టర్ని బతిమాలి చేరిపోయాడు.
- జి.ఆర్.మహర్షి
మహర్షిజం
రాజకీయ నాయకుల ప్రత్యేకత:
వాళ్లు తక్కువగా మాట్లాడే నెల - ఫిబ్రవరి
వాళ్లు చచ్చినా స్వర్గానికి ఎందుకు వెళ్లరు?
- వెళ్లినా దాన్ని
నరకంగా
మారుస్తారు.
సులభంగా గెలిచే ఆట -
మల్లయుద్ధం
(రోజూ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి)
కేంద్ర మంత్రుల స్పెషాలిటీ?
ఏకకాలంలో నాటకం, తోలుబొమ్మలాట, బుర్రకథ, భరతనాట్యం అభినయించగలరు.
అమాయకత్వం:
శుభం కార్డు పడిన తరువాత కూడా ఇంకా సినిమా ఉందనుకోవడం.
సామాన్యుడి కామెంట్:
తెలుగులో మాట్లాడినా మన నాయకుల మాటలు అర్థం కావడం లేదు.