మనీ... కాపీయే కానీ... | Money telugu movies copied by hollywood | Sakshi
Sakshi News home page

మనీ... కాపీయే కానీ...

Published Sun, Nov 29 2015 1:01 AM | Last Updated on Thu, Sep 27 2018 8:56 PM

మనీ... కాపీయే కానీ... - Sakshi

మనీ... కాపీయే కానీ...

ఆ సీన్ - ఈ సీన్
తను రూపొందించే సినిమాల వెనుక ఉన్న అసలు సినిమాల గురించి, తను కాపీ కొట్టిన విధానం గురించి చాలా ఉత్సాహవంతంగా వివరిస్తాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఫలానా సినిమాలోని ఫలానా సీన్‌లో ఫలానా ఫ్రేమ్‌ను ఫలానా హాలీవుడ్ సినిమా నుంచో, ఇంకో విదేశీ సినిమా నుంచినో కాపీ కొట్టాను అని ఆయన సగర్వంగా చెబుతూ ఉంటారు. కేవలం వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే కాదు...

ఆయన ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమాల్లో కూడా కావాల్సినంత కాపీ కళ ఉంటుంది. అలా ఆర్జీవీ కంపెనీలో తొలితొలిగా ఉత్పత్తి అయిన సినిమా ‘మనీ’. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, రేణుకా సహానీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకి ‘రూత్‌లెస్ పీపుల్’ సినిమా ఆధారం. 1986లో వచ్చిన ఈ హాలీవుడ్ సినిమా మాదిరిలోనే 1992లో ‘మనీ’ సినిమాని రూపొందించారు. అతి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసే నిరుద్యోగ యువకులు జేడీ, చిన్నా...

తమ పొరుగింటిలో ఉండే ధనికురాలు జయసుధను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసేందుకు వ్యూహం పన్నుతారు. ఎలాగో ఆమెను అపహరిస్తారు. తీరా డబ్బు కోసం ఆమె భర్త సుబ్బారావు (పరేష్ రావల్) కు ఫోన్ చేస్తే, ఆమెను చంపేస్తే డబ్బులిస్తాను అంటూ బేరం పెడతాడు. తర్వాత వాళ్లు ఏం చేశారనేది మిగతా కథ.
 
అయితే ఒరిజినల్ వెర్షన్‌లో హీరోలు ఇద్దరు కాదు... ఒక్కడే. నిరుద్యోగం కామన్ ప్రాబ్లెమ్. తను గతంలో పనిచేసిన కంపెనీ యజమానురాలిని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు. ఈ పనిలో అతడికి భార్య సహాయంగా నిలుస్తుంది. కిడ్నాప్ తతంగం పూర్తైఓనర్ భర్తకు ఫోన్ చేస్తే.. అతడేమో వీరికి ట్విస్ట్ ఇస్తాడు.
 
మనీ సినిమాలో పరేష్ రావల్ పోషించిన సుబ్బారావు పాత్ర తీరు అంతా హాలీవుడ్ సినిమాలో పాత్ర తీరులో కనిపించేదే. భార్య కిడ్నాప్ కావడం అతడికి సంబరంగా మారుతుంది. ఈ ఆనందంలో ఎంత తాగుతున్నాడో తెలీనంతగా తాగేస్తూ డ్యాన్సులు కూడా చేసేస్తూ ఉంటాడు. అయితే కిడ్నాప్ కేసు గురించి విచారణ జరపడానికి వచ్చిన పోలీసుల ముందు మాత్రం వినయం నటిస్తూ ఉంటాడు.

వారి ముందుకు వచ్చేటప్పుడు కళ్లకు సబ్బు పట్టించుకుని ఏడుస్తున్నట్టుగా నటించడం, ఇతర వినయాలు అన్నీ హాలీవుడ్ వెర్షన్‌లో ఈ పాత్రను పోషించిన నటుడు ఎంత అద్భుతంగా చూపించాడో... పరేష్ రావల్ కూడా అంతే స్థాయిలో జీవించేశారు.
 క్లయిమాక్స్‌లో సుబ్బారావు అసలు స్వరూపం మేడమ్‌కు వివరిస్తారు కిడ్నాపర్లు. మొదట్లో ఆమె నమ్మదు.

తర్వాత అర్థమయ్యేలా చేస్తారు. మరోవైపు ఈ కిడ్నాపింగ్ ముఠాను వెంటాడే పోలీసులు, వారిని తప్పించుకోవడానికి వీళ్లు పడే పాట్లు... ఈ ఎపిసోడ్లు అన్నీ రెండు సినిమాల్లోనూ కామన్. ఈ రెండు సినిమాల మధ్య మరిన్ని పోలికలు ఏమిటంటే... రెండూ కామెడీ ఎంటర్‌టైనర్లు. సూపర్ హిట్లు. మూల కథను హాలీవుడ్ నుంచి తీసుకున్న ఆర్జీవీ కంపెనీ దాన్ని తెలుగులో తీర్చిదిద్దిన విధానం మాత్రం అమోఘంగా ఉంటుంది.

కథ ఎంత కాపీ అయినా కథనంలో మాత్రం ‘మనీ’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యింది. క్లైమాక్స్ ఎపిసోడ్‌ను, హాలీవుడ్ వెర్షన్‌తో ఏమాత్రం సంబంధం లేని‘ఖాన్ దాదా’ పాత్రను సూపర్‌‌బగా చూపించారు ‘మనీ’ మేకర్లు. ఆ పాత్రలో బ్రహ్మానందం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తర్వాత ఈ సినిమాకు ‘మనీ మనీ’ రూపంలో సీక్వెల్ కూడా వచ్చింది. అంటే హాలీవుడ్ వాళ్లు ఆగిపోయిన చోట నుంచి ఆర్జీవీ కంపెనీ మొదలు పెట్టిందన్నమాట!
- బి.జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement