
ఉన్నత విద్యావంతులు
పంచామృతం
సినీ పరిశ్రమలో తారలుగా వెలుగొందాలంటే వ్యక్తిగత ప్రతిభే అర్హత. కొందరికి ప్రతిభకు కుటుంబ నేపథ్యం ప్లస్ అవుతుంది. సూపర్‌స్టార్లను చేసేస్తుంది. మరి ఇటువంటి రంగంలో తారలుగా వెలుగొందుతున్న వారిలో కొందరు ఉన్నత విద్యావంతులూ ఉన్నారు. తెరమీద గంతులేసే పాత్రలు చేసినా ఆ తెరమీదకు రాకముందు మాత్రం వారు ఏకాగ్రతతో, శ్రద్ధగా పెద్ద చదువులు చదివిన వారే! అకాడమీ డిగ్రీలతో ఉన్నతవిద్యావంతులైన అలాంటి వారిలో కొందరు..
సొహాఅలీఖాన్
కుటుంబ నేపథ్యానికి తగిన చదువులు చదివింది సొహా. పటౌడీల కుటుంబం నుంచి వచ్చిన సొహా లండన్‌స్కూల్‌ఆఫ్ ఎకనామిక్స్ లో ‘అంతర్జాతీయ సంబంధాల’ గురించి అధ్యయనం చేసింది. అదే వర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని సాధించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రీతీజింతా
‘సొట్టబుగ్గల సుందరి’ అనే పదాన్ని ఒక బిరుదుగా, దాన్నే పెద్ద అర్హతగా ప్రీతీజింతా గురించి పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ప్రీతీ స్కూల్‌ప్రోగ్రెస్ కార్డులను చూస్తే మాత్రం తన గురించి చెప్పడానికి చాలా అర్హతలున్నాయనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి విలియమ్ షేక్‌స్పియర్ కవిత్వం, నాటకాలపై ఆసక్తిని పెంచుకొన్న ప్రీతి సిమ్లాలోని సెయింట్ బెడెస్ కాలేజీలో ఇంగ్లిష్ ఆనర్స్ డిగ్రీని పూర్తి చేసింది. తర్వాత క్రిమినల్ సైకాలజీలో మాస్టర్‌డిగ్రీ జాయిన్ అయ్యింది. అంతలోనే సినిమాల్లో అవకాశం రావడంతో చదువుకు ఫుల్‌స్టాప్‌పెట్టింది.
సిద్ధార్థ
నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడగల, రాయగల ప్రతిభావంతుడు సిద్ధూ. గాయకుడిగా కూడా ప్రతిభను చాటుకొన్న ఈ నటుడు సినిమాల్లోకి రాకముందు సిన్సియర్ స్టూడెంట్. ముంబయిలోని ఎస్‌పీ జైన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ విద్యాలయంలో ఎమ్‌బీఏ పూర్తి చేశాడు. అంతకన్నా ముందు ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ సబ్జెక్ట్‌తో ఆనర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.
అమీషాపటేల్
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా చేసి దేశవ్యాప్త గుర్తింపును సంపాదించుకొన్న అమీషాపటేల్ విదేశీ వర్సిటీల్లో చదివింది. 90లలోనే అమెరికా వెళ్లి మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీలో అర్థశాస్త్రం అభ్యసించింది. గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. టాపర్‌గా నిలిచి గోల్డ్‌మెడల్ సాధించింది!
మాధవన్
చదువుతో పాటు ఎన్‌సీసీలో కూడా యాక్టివ్‌గా ఉండేవాడట మాధవన్. ఎన్‌సీసీలో ఇతడి ప్రతిభను చూసి ఇంగ్లండ్ టూర్‌కు కూడా పంపించారట. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అటుపై రాయల్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో శిక్షణ పొందాడు. ఈ అర్హతలతోనే కెనడాలో భారత కల్చరల్ అంబాసిడర్‌గా నియమితం అయ్యాడు. అనుకోకుండా సినిమాల వైపు వచ్చాడు.