నవ్వులు రువ్వే పువ్వులు
నెయిల్ ఆర్ట్
గోళ్లు నవ్వడం ఎప్పుడైనా చూశారా! మునివేళ్లలో నవ్వులు ఎప్పుడైనా వీక్షించారా! గులాబీ, బంతి, చామంతి, గోరింట అందాలతో మురిసిపోతూ నవ్వే గోళ్లు మీవి కావాలని ఉందా! అయితే చాలా సింపుల్‌గా ఆ నవ్వులను మీ గోళ్లకు అతికించవచ్చు. పువ్వుల కాంతులను వెదజల్లవచ్చు. మార్బుల్ ఆర్ట్ ద్వారా మీ గోళ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు. ముందుగా గోళ్లకు బేస్ కోట్ వేసుకోవాలి. దీని వల్ల డిజైన్ బ్రైట్‌గా కనిపించడమే కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది.
ఆ తర్వాత తెలుపు రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆరనివ్వాలి. గోరును మాత్రమే వదిలేసి చుట్టూతా (వేలికి) పెట్రోలియమ్ జెల్లీ రాయాలి. చుట్టూ గ్లూ ఉండే టేప్ అతికించాలి.
1. చిన్న గాజు గిన్నెలో ముప్పావు వంతు నీళ్లు పోయాలి. నచ్చిన నెయిల్ పాలిష్‌ను ఎంచుకోవాలి. (ఇక్కడ గులాబీ రంగు నెయిల్‌పాలిష్‌ను ఎంచుకున్నాం) ఒక చుక్క నెయిల్‌పాలిష్‌ను నీళ్ల మధ్యలో వేయాలి.
2. నెయిల్ పాలిష్ చుక్క నీటి పై భాగంలో స్ప్రెడ్ అవగానే తెలుపు రంగు నెయిల్ పాలిష్ డ్రాప్ వేయాలి. ఇలా ఒకసారి గులాబీ రంగు, మరోసారి తెలుపు రంగు నెయిల్‌పాలిష్ డ్రాప్స్ నాలుగైదు సార్లు వేయాలి.
3. టూత్ పిక్ తీసుకొని మధ్యలో పువ్వు వచ్చేలా నెయిల్‌పాలిష్‌ను కదపాలి.
4. టేప్ వేసిన వేలి గోరు మునిగేలా డిజైన్ చేసిన నెయిల్‌పాలిష్‌లో నెమ్మదిగా ముంచి, తీయాలి.
5. నెయిల్ పాలిష్ ఆరాక టేప్ తీసేయాలి.
6. పువ్వుల రేకలతో అందమైన డిజైన్ గోళ్ల మీద సాక్షాత్కరిస్తుంది. దీని మీద మళ్లీ ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించే బేస్‌కోట్ వేయాలి.
ఇలా చూడముచ్చటైన డిజైన్లు మీ గోళ్ల మీద అందంగా కనువిందు చేయవచ్చు.