ప్రపంచానికే మార్గదర్శకంగా.. టెక్‌ ఇండియా | National Technology Day Special Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ప్రపంచానికే మార్గదర్శకంగా.. టెక్‌ ఇండియా

Published Sun, May 10 2020 9:04 AM | Last Updated on Sun, May 10 2020 9:04 AM

National Technology Day Special Story In Sakshi Funday

పారిశ్రామిక విప్లవం తర్వాత పాశ్చాత్య దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిన మాట నిజమే. అలాగని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రాక్‌ ప్రపంచం వెనుకబడి ఏమీ లేదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన భారత దేశం పురాతనకాలం నుంచే ఎన్నో ఘన విజయాలను సాధించింది. నేటి అధునాతన యుగంలోనూ మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది. కొన్ని అంశాలలోనైతే ప్రపంచానికే మార్గదర్శకంగా కూడా నిలుస్తోంది. మే 11 నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా భారతదేశం సాధించిన కొన్ని అపురూప సాంకేతిక విజయాల గురించి ఒక విహంగ వీక్షణం...

సింధూలోయ నాగరికత కాలం నుంచే భారత భూభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిఢవిల్లింది. గుజరాత్‌ జునాగఢ్‌ జిల్లాలోని గిర్నార్‌ ప్రాంతంలో సింధూలోయ నాగరికత నాటి రిజర్వాయర్ల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇవి క్రీస్తుపూర్వం 3000 ఏళ్ల నాటివి. తొలినాటి నీటిపారుదల కాలువల అవశేషాలు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. నీటిపారుదల పరిజ్ఞానంతో పత్తి, చెరకు పంటలను ప్రపంచంలోనే తొలిసారిగా సాగుచేసిన ఘనత సింధూలోయ నాగరికత ప్రజలకే దక్కుతుంది. తూనికలు, కొలతల ప్రామాణికీకరణ, ఓడ రేవుల నిర్మాణం వంటి అంశాలలో కూడా సింధూలోయ నాగరికత ప్రజలకు విశేషమైన సాంకేతిక పరిజ్ఞానం ఉండేది. గుజరాత్‌లోని లోథల్‌లో సింధూలోయ నాగరికత ప్రజలు నిర్మించుకున్న ఓడరేపు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది.

ఇది క్రీస్తుపూర్వం 2400 ఏళ్ల నాటిది. సింధూలోయ నాగరికత అంతరించిన తర్వాత కూడా భారత భూభాగంలో ఏర్పడిన వివిధ రాజ్యాలలోని ప్రజలు అప్పటి కాలానికి అసాధారణ సాంకేతిక పాటవాన్ని కలిగి ఉండేవారు. క్రీస్తుశకం నాలుగో శతాబ్ది నాటికి ఇనుప గజాలు, వెదురు బొంగులు ఉపయోగించి వంతెనలను నిర్మించుకునేవారు. భారీ రాతి స్థూపాలను, ఇనుప స్తంభాలను నిర్మించుకునేవారు. రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఢిల్లీలో క్రీస్తుశకం నాలుగో శతాబ్దిలో నిర్మించిన ఇనుప స్తంభం ఇప్పటికీ శాస్త్రవేత్తలను అబ్బురపరుస్తూనే ఉంది. అప్పటి కమ్మరులు తుప్పుపట్టని ఇనుముతో ఇంతటి భారీ స్తంభాన్ని నిర్మించడం అపురూపమైన విశేషమే! క్రీస్తుశకం రెండో శతాబ్ది నుంచి నాలుగో శతాబ్ది మధ్య కాలంలో మెట్ల బావులను నిర్మించుకున్న సాంకేతిక నైపుణ్యం భారతీయుల సొంతం. ప్రపంచానికి వజ్రాలను పరిచయం చేసిన ఘనత కూడా భారతీయులకే దక్కుతుంది. 

గోదావరి, కృష్ణా, పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఐదువేల ఏళ్ల కిందటే వజ్రాలను వెలికి తీసేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. వేద వాంగ్మయంలోను, పురాణాలలోను, కౌటిల్యుడి అర్థశాస్త్రంలోను వజ్రాల ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుశకం పదహారో శతాబ్ది నాటికి గోల్కొండ ప్రాంతం వజ్రాల గనులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. నూలు వడికే రాట్నం, పొలం దున్నే నాగలి వంటి పరికరాలను తొలిసారిగా రూపొందించిన వారు ప్రాచీన భారతీయులే. ‘సున్నా’ను (0) కనుగొన్న ఘనత కూడా భారతీయులదే. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి సున్నాతో కూడిన భారతీయుల అంకెల విధానం ప్రపంచమంతటికీ విస్తరించింది. ప్రాచీన భారతీయులు సాధించిన సాంకేతిక విజయాలు ఇలా చాలానే ఉన్నాయి.

మంగోలులు భారత భూభాగంపై దాడులు చేసిన కాలంలో వారి ద్వారా ఇక్కడి సైన్యానికి గన్‌పౌడర్‌తోను, గన్‌పౌడర్‌ను ఉపయోగించే ఆయుధాలతోను పరిచయం ఏర్పడింది. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మంగోల్‌లను ఓడించిన తర్వాత మంగోల్‌ సైనికుల్లో కొందరు ఇక్కడే ఉండిపోయారు. మంగోల్‌ పాలకుడు హులగు ఖాన్‌ పంపిన రాయబారి 1258లో ఢిల్లీకి వచ్చినప్పుడు, అతడు అప్పటి ఢిల్లీ పాలకుడు నసీరుద్దీన్‌ మహమ్మద్‌ సమక్షంలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి ప్రదర్శన నిర్వహించాడు. ఆ తర్వాత ఖిల్జీ కాలంలో ఇక్కడే ఉండిపోయిన మంగోల్‌ సైనికుల సాయంతో భారతీయ సైనికులు కూడా మందుగుండు సామగ్రి తయారీ, తుపాకులు, ఫిరంగుల వంటి ఆయుధాల ప్రయోగం నేర్చుకున్నారు. అనతికాలంలోనే ఇవి దక్షిణాదికి కూడా వ్యాపించాయి. విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల సైన్యం కూడా తుపాకులు, ఫిరంగులు ఉపయోగించేది. బ్రిటిష్‌వారు దేశంలో ఒక్కొక్క ప్రాంతాన్నే ఆక్రమించుకుంటూ విస్తరిస్తున్న కాలంలో దక్షిణాదిలో మైసూరు పాలకుల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. మైసూరు పాలకుడు హైదర్‌ అలీ లోహపు సిలిండర్లతో రూపొందించిన రాకెట్లను తొలిసారిగా యుద్ధంలో వినియోగించాడు.

హైదర్‌ అలీ హయాంలో రాకెట్ల కోసం రూపొందించిన సిలిండెర్ల తయారీకి వాడిన ఇనుము నాణ్యత కొంత తక్కువగా ఉండేది. వీటి నుంచి ఉపయోగించిన క్షిపణులు దాదాపు కిలోమీటరు వరకు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగేవి. హైదర్‌ అలీ వారసుడు టిప్పు సుల్తాన్‌ రాకెట్ల తయారీని మరింతగా అభివృద్ధి చేశాడు. నాణ్యమైన లోహంతో తయారు చేసిన సిలిండర్ల నుంచి ప్రయోగించిన రాకెట్లు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగేవి. టిప్పు సుల్తాన్‌ సైన్యం ప్రయోగించిన రాకెట్లకు నాటి బ్రిటిష్‌ సైన్యం ముప్పుతిప్పలు పడింది. టిప్పు సుల్తాన్‌ను జయించిన తర్వాత బ్రిటిష్‌ సైనికాధికారులు మైసూరు రాకెట్ల తయారీ విధానాన్ని తెలుసుకుని, దానికి మరింత మెరుగులు దిద్దుకోగలిగారు. బ్రిటిష్‌ హయాంలో ఆధునిక విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఎందరో భారతీయులు విదేశాలకు వెళ్లి ఉన్నతస్థాయి చదువులు చదువుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ పరిశోధనలు సాగించారు. సి.వి.రామన్, హరగోవింద ఖురానా, జగదీశ్‌చంద్ర బోస్‌ వంటి ఎందరో శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమదైన ముద్ర వేశారు. భారతదేశంలో ఆధునిక శాస్త్ర పరిశోధనలకు ఇలాంటి శాస్త్రవేత్తలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు.

మధ్యయుగంలో మన సాంకేతిక విజయాలు
మధ్యయుగంలో కూడా భారతీయులు అనేక అపురూపమైన సాంకేతిక విజయాలను సాధించారు. కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన శాస్త్రవేత్త అలీ కశ్మీరీ ఇబ్న్‌ లుక్మాన్‌ క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో తొలిసారిగా అతుకులు లేని భూగోళపు లోహపు నమూనాను (గ్లోబ్‌) రూపొందించాడు. మొఘల్‌ సామ్రాజ్యంలో ఇలాంటి ఇరవై గ్లోబ్‌లను తయారు చేశారు. వీటిని కశ్మీర్‌లోను, లాహోర్‌లోను 1980లో ఆధునిక శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఎంతటి ఆధునిక పరిజ్ఞానంతోనైనా అతుకులు లేకుండా లోహపు గ్లోబ్‌ను రూపొందించడం సాధ్యం కాదని వారు తేల్చారు. అప్పటికాలంలో అతుకులు లేని లోహపు గ్లోబ్‌లను తయారు చేయడం అపురూపమని అభిప్రాయపడ్డారు.

మన ఆధునిక సాంకేతిక విజయాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక విద్యపై దృష్టి సారించింది. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో 1951 ఆగస్టు 18న తొలి ఐఐటీని ఏర్పాటు చేసింది. అనతికాలంలోనే బాంబే, మద్రాస్, ఢిల్లీ, కాన్పూర్‌లలో కూడా ఐఐటీలను ఏర్పాటు చేసింది. అప్పట్లో సోవియట్‌ యూనియన్‌తో ఉన్న సత్సంబంధాలు అంతరిక్ష పరిశోధనలకు ఊతమిచ్చాయి. స్వయంగా అంతరిక్ష పరిశోధనలను సాగించాలనే లక్ష్యంతో 1969లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏర్పాటైంది.

‘ఇస్రో’ నిర్మించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను సోవియట్‌ యూనియన్‌ 1975 ఏప్రిల్‌ 19న విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. అనతికాలంలోనే ‘ఇస్రో’ రోహిణి సిరీస్‌లో మూడు ఉపగ్రహాలను రూపొందించి, తాను స్వయంగా నిర్మించిన అంతరిక్ష ప్రయోగ వాహనాల ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. తర్వాతి కాలంలో ‘ఇస్రో’ అనేక ఘన విజయాలను సాధించింది. ‘చంద్రయాన్‌–1’, ‘చంద్రయాన్‌–2’, ‘మంగళ్‌యాన్‌’ప్రయోగాలు ‘ఇస్రో’ను ప్రపంచస్థాయి అంతరిక్ష పరిశోధన సంస్థలకు దీటుగా నిలిపాయి. 

ఫైబర్‌ ఆప్టిక్స్‌ పితామహుడు
ప్రపంచమంతటా ఇప్పుడు ఇంటర్నెట్‌ విస్తరించింది. ఇంటర్నెట్‌ విస్తరణతో ప్రపంచమే కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్‌ పనిచేయడానికి అత్యంత కీలకమైన ఫైబర్‌ ఆప్టిక్స్‌ను రూపొందించిన వ్యక్తి మన భారతీయుడే. అమెరికాలో స్థిరపడిన భారత శాస్త్రవేత్త నరీందర్‌సింగ్‌ కపానీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను రూపొందించారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీలో పరిశోధనలు సాగించే కాలంలో ఆయన తన సహ శాస్త్రవేత్త హెరాల్డ్‌ హాప్‌కిన్స్‌తో కలసి 1953లో ఆప్టికల్‌ ఫైబర్‌ తీగల ద్వారా తొలిసారిగా ఒక ఫొటోను విజయవంతంగా ట్రాన్స్‌మిట్‌ చేయగలిగారు.

ఈ ప్రయోగంతో ఆయన ‘ఫైబర్‌ ఆప్టిక్స్‌ పితామహుడు’గా శాస్త్ర సాంకేతిక రంగంలో ఘనకీర్తిని దక్కించుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఎడాపెడా వాడుతున్న యువతరానికి కపానీ పేరు పెద్దగా తెలియదు. ‘ఫార్చూన్‌’ పత్రిక 1999లో విడుదల చేసిన ‘ఈ శతాబ్ది వాణిజ్యవేత్తలు’ ప్రత్యేక సంచికలో కపానీని ‘అన్‌సంగ్‌ హీరో’గా గుర్తించింది. కమ్యూనికేషన్ల రంగాన్ని కీలకమైన మలుపు తిప్పిన కపానీకి దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని ‘ఫార్చూన్‌’ పత్రిక అభిప్రాయపడింది.

యూఎస్‌బీ ఆవిష్కర్త
డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, లాప్‌టాప్‌ కంప్యూటర్లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ కెమెరాలు వంటివి విరివిగా వాడుతున్న ఇప్పటి తరానికి యూఎస్‌బీ అంటే తెలియనిది కాదు. కీబోర్డులు, మౌస్‌లు, పెన్‌డ్రైవ్‌లు వంటివేవి వాడాలన్నా ఎలక్ట్రానిక్‌ పరికరాలకు యూఎస్‌బీ పోర్టు తప్పనిసరి. ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించేవారికి రోజువారీ జీవితంలో భాగంగా మారిన ‘యూనివర్సల్‌ సీరియల్‌ బస్‌’ (యూఎస్‌బీ) రూపకర్త మన భారతీయుడే! అమెరికాలో స్థిరపడిన భారత శాస్త్రవేత్త అజయ్‌ వీ భట్‌ తొలిసారిగా 1996లో యూఎస్‌బీని రూపొందించారు. 

తర్వాతి కాలంలో దీనికి మెరుగులు దిద్దారు. ఇదొక్కటే కాదు, కంప్యూటర్లలో బొమ్మల నాణ్యతకు చాలా కీలకమైన ‘యాక్సిలరేటెడ్‌ గ్రాఫిక్‌ పోర్ట్‌’ (ఏజీపీ), ‘పెరిఫరల్‌ కనెక్ట్‌ ఇంటర్‌కనెక్ట్‌ ఎక్స్‌ప్రెస్‌’ (పీసీఐ–ఈ) వంటి వాటిని కూడా భట్‌ రూపొందించారు. భట్‌ ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనకు 2013లో ‘యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డు’ లభించడం విశేషం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ ఎప్పటికప్పుడు తన ముద్రను చాటుకుంటూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో తన సాంకేతిక పాటవాన్ని నిరూపించుకుంటూనే ఉంది. సాంకేతిక రంగంలో భారతీయులు అడుగుపెట్టని విభాగమంటూ దాదాపు ఏదీ లేదు. భవిష్యత్తులో కూడా భారతీయ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు మరిన్ని ఘనవిజయాలను సాధించగలరని ఆశించవచ్చు.

హాట్‌మెయిల్‌ రూపకర్త
కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగిన ఇప్పటి కాలంలో కంప్యూటర్లు వాడేవారంతా ఈ–మెయిల్‌ సేవలను వాడుకుంటున్నారు. తొలినాళ్లలో ఈ–మెయిల్‌ కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ–మెయిల్‌ ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొత్తలో 1960వ దశకంలో ఈ–మెయిల్‌ పంపే వ్యక్తి, దానిని స్వీకరించే వ్యక్తి ఇద్దరూ ఆన్‌లైన్‌లో ఉంటేనే ఈ–మెయిల్‌ కమ్యూనికేషన్‌ సాధ్యమయ్యేది. చాలాకాలం వరకు ఒకే రకమైన కంప్యూటర్లు వినియోగించే వారి మధ్య మాత్రమే ఈ–మెయిల్‌ కమ్యూనికేషన్‌ సాధ్యమయ్యేది. ఇన్ని లోపాల కారణంగా చాలాకాలం పాటు ఈ–మెయిల్‌ సామాన్యులకు అందుబాటులో లేని వ్యవహారంగానే కొనసాగింది.

అమెరికాలో స్థిరపడిన భారత వాణిజ్యవేత్త, శాస్త్రవేత్త సబీర్‌ భాటియా తొలిసారిగా 1996లో ఉచిత ఈ–మెయిల్‌ సర్వీస్‌ ‘హాట్‌మెయిల్‌’ను అందుబాటులోకి తెచ్చాడు. తన సహచరుడు జాక్‌ స్మిత్‌తో కలిసి ‘హాట్‌మెయిల్‌ డాట్‌ కామ్‌’ సంస్థను ఏర్పాటు చేశాడు. తర్వాతికాలంలో ‘హాట్‌మెయిల్‌’ను ‘మైక్రోసాఫ్ట్‌’కు అమ్మేశాడు. ‘మైక్రోసాఫ్ట్‌’ చేజిక్కించుకున్నాక హాట్‌మెయిల్‌ మరింత ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ‘హాట్‌మెయిల్‌’ అంతరించినా, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఉచిత ఈ–మెయిల్‌ సేవలన్నింటికీ ఇదే స్ఫూర్తిప్రదాత.   – పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement