నిర్మల హృదయుడు! | Nirmal To Advertising captains children | Sakshi
Sakshi News home page

నిర్మల హృదయుడు!

Published Sun, Aug 9 2015 1:01 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

నిర్మల్‌కు పిల్లలే ప్రచార సారథులు - Sakshi

నిర్మల్‌కు పిల్లలే ప్రచార సారథులు

ఆదర్శం
 
*  ఆశయమే అతడి ఊపిరి
* అందరి క్షేమమే అతడి లక్ష్యం
* మరి ఆ లక్ష్యం నెరవేరిందా?!
మంచి పనులు అనేవి గాల్లో నుంచి ఊడిపడవు. మనం చూసిన సంఘటనలే... మంచి పనులకు పునాదులవుతాయి. నిజం చెప్పాలంటే పవన్‌కు పుస్తక ప్రపంచం గురించి తప్ప వాస్తవ ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. అలాంటి వ్యక్తికి ‘సెర్చ్’ పుణ్యమా అని వాస్తవ పరిస్థితులను చూసే అవకాశం దొరికింది.
 
‘సెర్చ్’ (సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్)లో రెండున్నర సంవత్సరాల ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మహారాష్ట్రలోని  గడ్చిరోలి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో  పనిచేయాల్సి వచ్చింది పవన్‌కి. గడ్చిరోలిలోని చాలా గ్రామాల్లో డయేరియా సోకి జనాలు చనిపోతుం టారు. అంతగా డయేరియా ప్రబలడానికి అపరిశుభ్ర పరిస్థితులే కారణమని తన  స్టడీ ద్వారా గుర్తించాడు పవన్. ఒక గ్రామంలో 64 కుటుంబాలు ఉంటే, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే టాయ్‌లెట్‌కి వెళ్లాక సబ్బుతో చేతులు కడు క్కోవాలనే అవగాహన ఉందని తెలిసి ఆశ్చర్య పోయాడు.

అయితే అది సబ్బులు లేక పోవడం వల్ల వచ్చిన సమస్య కాదు. లక్స్ నుంచి సంతూర్ వరకు వారి దగ్గర అన్ని రకాలైన సబ్బులూ ఉన్నాయి. అయితే వారి దృష్టిలో సబ్బు అంటే సౌందర్య సాధనం మాత్రమే. మురికి వదిలించుకోవడానికి సబ్బును ఉపయోగించాలి అనే అవగాహన వారిలో లేదు. ఈ పరిస్థితిని నివారించి ప్రజలలో ఆరోగ్యస్పృహ కలిగించడం ఎలా అని ఆలోచించాడు పవన్. సరిగ్గా అప్పుడే తన ఫ్రెండ్ డా॥మానస్ కౌశిక్ ద్వారా టిప్పీ టాప్ గురించి విన్నాడు.

డా॥జిమ్ వాట్ తయారు చేసిన హ్యాండ్ వాషింగ్ పరికర మైన ‘టిప్పీ టాప్’కు న్యూజిలాండ్‌లో మంచి ఆదరణ ఉంది. ధర కూడా చాలా తక్కువ. దాని స్ఫూర్తితో ఒక తాడు, సబ్బు, కొన్ని పుల్లలతో ఒక హ్యాండ్ వాషింగ్ పరికరాన్ని డిజైన్ చేసి దానికి ‘నిర్మల్’ అని పేరు పెట్టాడు. ఓ చిన్న క్యాన్ లాంటి దానికి గొట్టం మాదిరిగా ఉంటుంది. దాన్ని నొక్కగానే లిక్విడ్ బయటకు వస్తుంది. దాంతో చేతులు కడుక్కోవచ్చు. అదీ నిర్మల్ పరికరం. తన ప్రాజెక్ట్‌కు ప్రచార సారథులుగా బడి పిల్లలను ఎంచుకున్నాడు పవన్.
 
మొదటిసారిగా... కుడకువయి ప్రైమరీ స్కూల్లో ‘నిర్మల్’ను పరిచయం చేసి ఎలా తయారు చేయాలో పిల్లలకు చెప్పాడు. చేతులను కడుక్కునే విషయంలో వరల్డ్ హెల్త్ ఆర ్గనైజేషన్ ఇచ్చిన సూచనలను తమాషా పాఠాల రూపంలో రాసి పిల్లలకు నేర్పించాడు. ‘నిర్మల్’ను ఎలా ఉపయోగించాలనేది ఆటల రూపంలో చూపాడు. ఈ ప్రయోగం విజయం సాధించడం, నలభై రూపాయల లోపే ‘నిర్మల్’ను తయారు చేసుకొనే సౌలభ్యం ఉండడంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది.
 
ఒకవైపు ఫిజీషియన్‌గా పని చేస్తూనే మరోవైపు, తన ఖాళీ సమయాన్ని పూర్తిగా ‘నిర్మల్’ కోసం ఉపయోగించేవాడు పవన్. పిల్లల్నే కాదు, పెద్దలను కూడా నిర్మల్‌లో భాగస్వాములను చేయాలనుకున్నాడు. ఊళ్లో ఏ పండగ జరిగినా బహిరంగ ప్రదేశాల్లో ‘నిర్మల్’ పరికరాలను ఏర్పాటు చేసి ఆ ఊరి ఆడవాళ్లతో పూజలు చేయించే వాడు. దాంతో ‘నిర్మల్’ వారి సంస్కృతిలో భాగమైపోయింది. ఇప్పుడు చేతుల శుభ్రత గురించి మాత్రమే కాదు... పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛమైన నీటిని గురించిన అవగాహన కూడా ప్రజలకు వచ్చింది. డయేరియా మరణాలు తగ్గిపోయాయి.
 
గడ్చిరోలి గ్రామీణ ప్రాంతాల్లో ‘పొగ తాగడం’ అనేది కూడా ఎక్కువగా కని పిస్తుంది. నాలుగైదు సంవత్సరాల పిల్లలు కూడా పొగ తాగుతుంటారు. దీనిపై కూడా దృష్టి పెట్టాడు పవన్. ‘మంచిది కాదు, మానండి’ అంటే వారు వినరని తెలుసు. అందుకే పొగ నుంచి వారి దృష్టి మళ్లించడానికి రకరకాల ఆటలను ఎంచు కొని, పిల్లల్తో ఆడిస్తూ, ఆటల ద్వారానే పొగతాగడం వల్ల కలిగే దుష్పరిణా మాలను ఒక కథలా చెప్పడంతో చాలామంది పొగతాగే అలవాటు నుంచి దూరమయ్యారు.రెండు ఘన విజయాలను సాధించిన పవన్... ప్రస్తుతం సైన్స్‌ను సామాన్య జనానికి  చేరువ చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement