అవకాశవాద పొత్తులు ఎండనుబట్టి గొడుగులు
ఎన్నికల్లో పొత్తులకు... స్నేహాలకు సంబంధించి చంద్రబాబుకు సిద్ధాంతాలేం లేవు... కేవలం అవసరాలే. ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1994 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. 1999 ఎన్నికల్లో బాబు కమ్యూనిస్టులకు కటీఫ్ చెప్పి బీజేపి పంచన చేరారు. 2004లో తిరిగి బీజేపీతోనే ముందుకు వెళ్లారు. 2009లో బీజేపీకి కటీఫ్ చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో, తెరాసాతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేశారు. మతతత్వ పార్టీ బీజేపీతో జీవితంలో కలిసే ప్రసక్తే లేదన్నారు. మోడీ వంటి నరహంతకుని హైదరాబాద్‌లో అడుగు పెట్ట నిచ్చేది లేదని హెచ్చరించారు. తనను మించిన సెక్యులర్ ఇంకెవరూ లేరన్నారు. ప్రస్తుత ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందన్నారు.
చివరి నిమిషంలో అదే బీజేపీతో స్నేహం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రాపకం కోసం బాబు తాపత్రయం మరీ విడ్డూరం. జూనియర్ ఎన్టీఆర్‌తో 2009 ఎన్నికల ప్రచారాన్ని చేయించుకున్న చంద్రబాబు ఈ సారి జూనియర్ స్థానంలో పవన్‌కల్యాణ్‌ను తిప్పాలనుకున్నారు. మోడీకి జై కొడుతోన్న పవన్ కాస్తా టీడీపీ ఊసెత్తకపోయే సరికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కనపెట్టి... పవన్ కల్యాణ్ ఇంటికి తానే ఫోను చేసి మరీ తేనీటికి వస్తున్నానని చెప్పి వెళ్లి పార్టీకి ప్రచారం చేసి పెట్టమని ప్రాధేయపడ్డారు.
1994 ఎన్నికల్లో జనామోదం పొందిన ఎన్టీఆర్‌ను ఏడాదికే అన్యాయంగా పదవిలో నుంచి దించి 1995లో పాలనా పగ్గాలు చేపట్టిన బాబు, 1996లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ముద్ర వేయలేక పోయారు. పార్టీ అధినేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని, లేదంటే 1999 శాసనసభ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని ఆయనకు బాగా తెలుసు. దాంతో, అప్పటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసిన బాబు కాంగ్రెస్‌తో పాటు బీజేపీపైనా ధ్వజమెత్తారు. అది మతతత్వ పార్టీ అని గొంతు చించుకుని ప్రచారం చేశారు. ముస్లిం మైనారిటీ ఓట్ల మీద కన్నేశారు. విజయవాడలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, బీజేపీ ఎంత మతతత్వ పార్టీ అంటే, అది మసీదు (బాబ్రీ మసీదు)లను కూలుస్తుంది అన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా 1998లోనూ టీడీపీకి ఆశించిన స్ధాయిలో లోక్‌సభ స్థానాలు రాలేదు. అలా బాబు లెక్క తప్పింది.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ దక్కుతుందన్న భరోసా కలగలేదు. మరి దొడ్డిదారిన తెచ్చుకున్న అధికారం నిలుస్తుందో, లేదో! ఈ సందేహంతో బాబు సతమతమయ్యారు. లౌకికవాదపు రంగు పులుముకుని అంతకు ముందు దాకా తాను చెప్పిన మాటలన్నీ మరచి బీజేపీతో అంటకాగారు బాబు. ఆయన అదృష్టం బాగుండి ఆ ఎన్నికల్లో గండం గట్టెక్కారు. అలా ఆయన సీఎం పీఠం నిలబడ్డా ఆయన లౌకిక వాదం మాత్రం గాలికి పోయింది.
గోధ్రా అనంతర అల్లర్లకు కారకుడైన నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీల్లేదని, వెంటనే ఆయన్ని మార్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో 2002 ఏప్రిల్ 11న తీర్మానం చేసింది. మోడీని తక్షణం గద్దె దించకపోతే తాము ప్రజా విశ్వాసం కోల్పోతామని టీడీపీ భీష్మించింది కూడా. అయినా బీజేపీ నాయకత్వం వీసమెత్తు కూడా ఖాతరు చేయలేదు. గుజరాత్ మత అల్లర్లకు సంబంధించి మోడీపై వాజ్‌పేయి ఆగ్రహంగా ఉన్నారని అందిన గాలి వార్త ఆధారంగా, దాన్నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు బాబు నెత్తికెత్తుకున్న ‘మోడీని మార్చాల్సిందే’ నినాదపు ఎత్తుగడ అలా వికటించింది. 2003లో అలిపిరిలో మందుపాతర పేలుడు ఉదంతం తర్వాత మరోమారు సానుభూతి పవనాల సాయంతో గట్టెక్కాలని ఎంతగానో ఆశపడ్డారు. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడన్నట్టు బీజేపీతో పొత్తు సాగిస్తూనే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.
కానీ జనాగ్రహం దెబ్బకు తాను మునగడమే గాక కేంద్రంలో ఎన్డీఏ కూటమినీ, దాని ప్రధాన భాగస్వామి బీజేపీనీ ముంచారు. తానూ తేలిపోయారు. 2004లో అధికారం దూరమైన నాటి నుంచి చంద్రబాబు మళ్లీ మాట మార్చారు. ఎన్డీఏతో పొత్తు తప్పేనని, గోధ్రా అల్లర్ల ప్రభావం తమపైనా పడి ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమయ్యారని పాత పాట అందుకున్నారు. 2009 ఎన్నికల ముందు పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుతో ఈ మేరకు బహిరంగ ప్రకటన ఇప్పించారు. నెపాన్ని బీజేపీపై నెట్టి, నెమ్మదిగా ఇతర పక్షాలకు దగ్గరయ్యే యత్నాలను ముమ్మరం చేశారు.
తెలంగాణ ఉద్యమ వాతావరణాన్ని, దాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న జాడల్లేని సీమాంధ్ర రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త ఎత్తుగడకు దిగారు. అది కాస్తా చివరికి మహా భంగపాటుకే దారి తీసింది. ‘బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడం తప్పయింది. మేం అధికారంలో ఉన్నప్పటి మా విధానం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం’ అంటూ 2011 మేలో జరిగిన టీడీపీ మహానాడులో బహిరంగంగానే బాబు చెంపలేసుకున్నారు.
‘గోధ్రా అనంతర ఘటనలకు బీజేపీ నాయకత్వమే కారణం. అదే గనక జరిగి ఉండకపోతే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం’అని పార్టీ 30వ వ్యవస్థాపన దినం సందర్భంగా 2012 మార్చి 29న అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పలికారు. అదే అసెంబ్లీ వేదిక నుంచి, అంతకు ముందే ముస్లిం మైనారిటీలకు క్షమాపణ చెబుతూ, ‘జీవితంలో మరోమారు బీజేపీ వైపు వెళ్లను గాక వెళ్లను’ అని కూడా అన్నారు. ‘బీజేపీతో పొత్తు జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని భవిష్యత్తులో మళ్లీ చేయను’ అని 2013 జూన్ 11న మైనారిటీలతో జరిగిన సదస్సులో కూడా చెప్పారు బాబు.
తాజాగా దేశంలో మోడీ గాలి వీస్తోందంటూ మీడియా కథనాలు రాగానే, బీజేపీ పిలవకపోయినా బాబు అటువైపు అదేపనిగా పరుగులు తీశారు. గతమంతా నీటి మూటే అయింది. తానే పలికిన లౌకికవాదం గాలి మాటగా మిగిలింది. తప్పని చెంపలేసుకున్న బీజేపీతో పొత్తే మళ్లీ ముద్దయింది. విశ్వసనీయత అడుగంటిన టీడీపీతో పొత్తు వద్దుగాక వద్దంటూ బీజేపీ స్థానిక నాయకత్వమంతా ఎంతగా మొరపెట్టుకున్నా, పక్షం రోజుల పాటు ఇదో రాజకీయ వివాదంగా మారినా... బాబు పట్టుబట్టి మరీ ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబు మార్కు అవకాశవాదానికి ఇవి కొన్ని మచ్చుతునకలు.
బాబుపై వేసిన చార్జిషీట్‌ను మరచిందా బీజేపీ?
టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు, సంభాషణలను గుర్తుచేసుకుంటే... ఆ రెండింటి మధ్య పొత్తు చారిత్రక పొత్తా? చరిత్ర హీనమైన పొత్తా? అనేది అవగతమవుతుంది. 1998లో బాబు పరిపాలనలో వంద తప్పులు అంటూ బీజేపీ చార్జిషీట్ వేసింది. తాము అధికారంలోకి వస్తే బాబుపై సీబీఐ విచారణ జరిపించి కటకటాల వెనక్కి పంపిస్తామంది.