విభజన ‘వారధి’
చంద్రబాబు ‘రెండు కళ్ల’ సిద్ధాంతమే ఆంధ్రప్రదేశ్‌కు శాపమైంది. ఆయనది మొదట్నుంచీ ‘విభజన’ రాగమే. ఆయన నోటి నుంచి ఒక్కరోజు కూడా సమైక్యమన్న మాటే రాలేదు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు అభ్యంతరమూ చెప్పలేదు. వైఎస్ ఉన్నంత కాలం బాబు కుయుక్తులు సాగలేదు. అనంతరం ఆయన రెచ్చిపోయారు. విభజన కుట్రలకు పదును పెంచారు. తెలుగుజాతికి ద్రోహం చేశారు.
చంద్రబాబుదే విభజన పాపం
మల్లు విశ్వనాథరెడ్డి
సీమాంధ్రలో సగటు ఓటరుకు సింగపూర్ ఎలా ఉంటుందో తెలియదు. ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అక్కడ ఏముంటుందో కూడా తెలియదు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేవు. చిత్తూరు జిల్లా కుప్పం వాసులు మంచినీటి కోసం నానా తిప్పలు పడుతున్నారు. గొంతు తడుపుకునే మార్గం లేక కిలోమీటర్ల కొద్దీ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా చంద్రబాబు మాటలు చూస్తే మాత్రం కోటలు దాటుతున్నాయి. సీమాంధ్ర ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతుంటే.. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ పంచరంగుల సినిమా చూపిస్తున్నారు.
విభజించేదాకా వెంటబడ్డ బాబు
రాష్ట్రం విడిపోకుండా ఉంటే సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలుండేవి. చంద్రబాబుకు మాత్రం రాష్ట్రం కలిసి ఉండటం ఇష్టం లేదు. అందుకే విడగొట్టాలని పంచాయతీ పెట్టారు. రాష్ట్రాన్ని విడదీసే వరకు ఆయన విశ్రమించలేదు. కర్నాటక ప్రాజెక్టులు నిండితే గాని మన ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడదీస్తే తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎలా వస్తాయో అర్థంకాని పరిస్థితి. అయినా రాష్ట్రాన్ని విడగొట్టాలనే బాబు పట్టుబట్టారు. ఒక్కమాటల చెప్పాలంటే.. ‘ఇదిగో విడగొట్టమని లేఖ ఇస్తున్నా.. తీసుకోండి’ అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఆ తరువాత ‘ఇంకెప్పుడు విడగొడతారంటూ కేంద్రం వెంటపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్లు కూడా అందించే ఏర్పాటు చేయలేని చంద్రబాబు.. అదేదో ఉట్టికి ఎగరలేనమ్మ.. అన్న తీరులో ఇప్పుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటే జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ రాష్ట్ర విభజన విషయంలో మీ అభిప్రాయమేంటని అడిగినప్పుడు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఆనాడు ‘మాకిష్టం లేదు.. మేం ఒప్పుకోం.. అంగీకరించే ప్రసక్తే లేదు’ అని ఒక్క మాట.. ఒకే ఒక్క మాట చెప్పి, అదేమాటపై నిలబడి ఉంటే విభజన జరిగేదే కాదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇవ్వడంతోనే కేంద్రం ప్రభుత్వం విభజన వైపు మొగ్గు చూపక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించడంలో తొలి ముద్దాయి కాంగ్రెస్ అయితే మలి ముద్దాయిగా చంద్రబాబు నిలిచారు. విభజనకు టీడీపీ అనుకూలంగా ఉందని పేర్కొంటూ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడంతో మొదలు.. విభజనకు ముందు జరిగిన ఆఖరి అఖిలపక్షం వరకు.. చంద్రబాబు విధానం విభజనకు అనుకూలంగానే సాగింది. ఏ దశలోనూ విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. పైగా కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో ఢిల్లీ పెద్దలు ఆడమన్నట్లుగా ఆడారు. సీమాంధ్ర ప్రయోజనాల గురించి ఆయన కేంద్రంపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. విభజన పాపాన్ని కడిగేసుకోవడానికైనా సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీల కోసం పట్టుబట్టాల్సిన చంద్రబాబు.. సొంతలాభం కోసం సీమాంధ్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు.
వెంటాడుతున్న విభజన పాపం
చంద్రబాబు సహకారం వల్లనే రాష్ట్ర విభజన సులభమైందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. తనపై ఉన్న కేసులకు సంబంధించి సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబు సహకరించారని భావిస్తున్నారు. సీమాంధ్రలో టీడీపీని విభజన పాపం వెంటాడుతోంది. విభజనకు సహకరించడంతో పాటు సీమాంధ్ర ప్రయోజనాలను గాలికి విడిచిపెట్టిన చంద్రబాబు తీరు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రజల ఆగ్రహం ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయేమోనని టీడీపీ నేతలు భయపడుతున్నారు.
చంద్రబాబు లేఖల చరిత్ర
2008 అక్టోబర్ 18: తెలంగాణకు టీడీపీ అనుకూలమని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ 2012 సెప్టెంబర్ 26: తెలంగాణ అంశంపై తాత్సార ధోరణి తగదని, శ్రీకష్ణ కమిటీ సూచన మేరకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అక్కడికక్కడే తెలంగాణ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ.
2012 డిసెంబర్ 27: గతంలో ప్రణబ్ కమిటీకి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోలేదని, అదే వైఖరికి కట్టుబడి ఉన్నామంటూ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖను సమర్పించిన పార్టీ ప్రతినిధి బృందం.
2013 నవంబర్ 12: రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీవోఎం) ఏర్పాటు చేసిన అన్ని పార్టీల సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయిం చిన టీడీపీ.. విభజనలో గత సంప్రదాయాలు పాటించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాసింది.
- తెలంగాణకు అనుకూలంగా అక్టోబర్ 18, 2008న అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీకి చంద్రబాబు రాసిన లేఖ
- గతంలో రాసిన లేఖను ధ్రువీకరిస్తూ 27.12.2012న కేంద్ర హోంమంత్రి షిండేకు బాబు రాసిన మరో లేఖ