వివేకం: ఆదుర్దా వాస్తవం కాదు
మీరు ‘ఆదుర్దా’ అనేది ఏమిటంటే, ఫలితం ఏమౌతుందోనని ఆందోళన పడటం. దేని ఫలితమైనా మీ కోరికలపై ఆధారపడి ఉండదు. మీరు చేసే విధానాన్ని బట్టి ఫలితం నిర్దేశింపబడి ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో మీరు ఎంత అసమర్థులైతే, మీ ఆదుర్దా అంత ఎక్కువగా ఉంటుంది. అవునా, కాదా?
మీకు మోటారు సైకిలు నడపడం రాదనుకుందాం. మీరు దానిపై కూర్చుంటే ప్రతిక్షణం ఆదుర్దా. అదే మోటార్ సైకిల్ ఎలా నడపాలో తెలుసనుకోండి, అది ఒక కలలా ఉంటుంది. కాబట్టి మోటార్ సైకిల్ కాదు మీ ఆదుర్దాకి కారణం. కేవలం మీరు దాన్ని నడపలేకపోవడం అనేదే ఆదుర్దాకు కారణం. కాబట్టి మీ ఆదుర్దాని సరిచేసుకుందామని చూడకండి. ఆదుర్దా అనేది నిజం కాదు. అది కేవలం కొంత చేతగానితనానికి పరిణామం. దేనినైనా మనం చేయాలని అనుకుంటే, మన సమర్థతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఫలితం కోసం చేయడం కాదు.
మీరు కేవలం విజయాన్ని కోరుకున్నంత మాత్రాన అది రాదు. మీకు ఉన్న యోగ్యతను బట్టి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ భూమిపై ఏదైనా సఫలీకృతం కావాలంటే రెండు ప్రాథమిక విషయాలు పాటించాలి. అవి మీ భౌతిక శరీరాన్ని, మనసును పూర్తి సమర్థతతో ఉపయోగించగలగటం. ఇలా కనక జరగాలంటే మీరు స్వతహాగా ప్రసన్నంగా ఉండాలి. అలా ఉంటే మీ జీవితంలో మీరే ఒక సమస్య కాదని దాని అర్థం. మీరే సమస్య కాకపోతే బయటి విషయాలను తేలికగా ఎదుర్కోవచ్చు. మీరే కనుక ఒక సమస్య అయితే ఇక అన్నీ ఇబ్బందులే.
ఈ భూమిపై ఎన్నో వేల సంవత్సరాల జీవితానుభవం ఉన్నప్పటికీ, మానవులు ఇంకా ఎన్నో సమస్యలతో ఉండటానికి కారణం, స్వతహాగా వ్యక్తులు తమకు తామే ఒక పెద్ద సమస్య కావడం వలన. వారు ఏదైనా సరిచేసి సమర్థించడానికి ప్రయత్నిస్తే, ఇంకా ఎక్కువ సమస్యలు సృష్టిస్తారు. మీకు మీరే ఒక సమస్యగా ఉన్నప్పుడు, మీరు దేనిని తాకినా అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది.
కాబట్టి అన్నింటికంటే మొదటిది, ముఖ్యమైనది ‘ఇది’ అంటే ‘మీరు’ ముందు సరిగ్గా ఉండాలి. మీరు కనుక స్థిరంగా ఉంటే, అప్పుడు మనం ప్రపంచంలో అన్నీ సరిగ్గా చేయగలం. ప్రపంచం ఏ విధంగా ఉన్నా, మీరు మాత్రం స్థిరంగా ఉండగలరు. ఇలా ఉండటానికి ప్రతివారూ యోగ్యులు, అర్హులు; ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. మీరు ఈ దేశపు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా ఒక గొప్ప క్రీడాకారునిగా అవబోతున్నారా అనేది ముఖ్యం కాదు. అది అలా జరిగితే మంచిదే; కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కనీసం ఈ జీవితాన్ని హాయిగా జీవించగలగాలి. ఇలా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది.
సమస్య - పరిష్కారం
సద్గురూ! చిన్న చిన్న యోగసాధనాల వల్ల అనేక సమస్యలు దూరం చేసుకోవచ్చనుకుంటే, మరి ఆడవారు యోగా చెయ్యవచ్చా?
- ఎస్ వసంత, సికింద్రాబాద్
సద్గురు: ఈ సమాజంలో కొన్ని కుటుంబాల్లో యోగా, ప్రాణాయామం లాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు స్త్రీ ఆచరిస్తే భర్తకు దూరమైపోతుందని, కుటుంబం వదిలి బయటకు వచ్చేస్తుందనే మూఢ విశ్వాసం ఉంది. ‘నీకేమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా? యౌవనంలో ఎందుకు యోగం, ధ్యానం?’ అంటూ యువతను తికమక పెట్టేవారూ ఉన్నారు. ‘‘శరీరం వయసులో ఉన్నప్పుడు, దాన్ని సంతోషాలను పొందడానికి ఉపయోగించుకోవాలి. శరీరం దేనికీ పనికిరాకుండా పోయినప్పుడు, ఆధ్యాత్మికంలో దించాలి,’’ అనే ఆలోచనలు పెరిగిపోయాయి. కాని వయసు దాటాక శరీరం సక్రమంగా పనిచేయకపోతే భోజనం సయించదు. తింటే జీర్ణం కాదు. కూర్చుంటే నిల్చోవడం రాదు. నిల్చుంటే కూర్చోవడం కష్టం. అలాంటి స్థితిలో ఆధ్యాత్మికమా? ఏం ఆలోచనలివి?
యోగ వలన యౌవన ప్రాయంలో జీవితం మీద విరక్తి పుట్టదు. పైగా జీవితం మీద పరిపూర్ణమైన ప్రేమ జనిస్తుంది. భార్య అనే మనిషిని పనిచేసే యంత్రంగా, సుఖాలనిచ్చే మనిషిగా మాత్రమే భావించే వ్యవస్థను కుటుంబం అని ఎలా అంటాం? కుటుంబం అంటే ఒకరికొకరు భాగం పంచుకోవడం. భార్యాభర్తలిరువురూ పరస్పరం పూర్తి ప్రేమతో ఉంటేనే సహజీవనం సాఫీగా సాగిపోతుంది. ఇరువురూ కలిసి ఒకే దిక్కుకు పయనించాలి కదా! ఉత్తమమైంది ఆశించడానికి అందరూ అర్హులే!!
- జగ్గీ వాసుదేవ్