‘ఉపయోగా’ అంటే ఏమిటి? అసలు అది ఎందుకు చేయాలి?
భారతీయ భాషలలో ‘ఉపయోగా’ అనే పదము యొక్క అర్థం దురదృష్టవశాత్తూ దిగజారిపోయి ‘ఏదైతే ఉపయోగపడుతుందో అది’గా మారిపోయింది. ఉప అనే పదానికి అర్థం కింద స్థాయి అని, అందువల్ల ఉపయోగా అంటే కింద స్థాయి యోగా అని. ఐక్యమయిపోవడం కోసమే యోగా. అంటే యోగా అనేది తన పరమోన్నత స్వభావానికి చేరుకోవాలనుకునే నిబద్ధత గల సాధకుడి కొరకే. అటువంటి కోరికా, ఉద్దేశమూ లేని వారికి - తమ అస్తిత్వ మూలంతో కలిసిపోవడానికి సిద్ధంగా లేనప్పటికీ, సంసారికతలో పడి కొట్టుకుపోకూడదనుకనే వారికి అందించబడేదే ఈ సెమీ యోగా లేదా ఉపయోగా.
కాలక్రమేణ, వాడుక భాషలో ‘ఉపయోగా’ అంటే ‘ఉపయోగపడే యోగా’ లేదా ‘ఉపయోగపడే చర్య’ అని అర్థం చేసుకోవడం జరిగింది. కాని దేనిని కూడా అలాంటి దృక్పథంతో చూడకూడదు. నిజానికి మనం ఒకదాన్ని దానిలోని ఉపయోగం ఏమిటనే భావనతో మాత్రమే చూడకూడదు. దానిలో అంతకు మించినదే ఉండవచ్చు. మీకు గనుక ఒక దాని పట్ల దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దృక్పథం లేకపోతే, అప్పుడది మీకు ఎంతో ఉపయోగపడడమే కాకుండా, ‘మీరు’ అనే మీ మౌలిక భావననే సమూలంగా మార్చివేస్తుంది.
ఉపయోగా అనేది లోతైన ఆధ్యాత్మిక దృక్పథం కలిగినది కాదు, ఇది మనిషి యొక్క భౌతిక, మానసిక, శక్తి పార్శ్వాల కొరకు రూపొందించబడింది. ఇది ఇంకొంచెం పరిపూర్ణమైన భౌతిక జీవనం కావాలనుకునే వారికి. నేను భౌతికత అన్నప్పుడు, అది మానసిక, భావోద్వేగ అంశాలకు కూడా వర్తిస్తుంది. మనము అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే యోగా ఒక రకమైన వ్యాయామం కాదు. కానీ యోగాలో ఉపయోగా వంటి శక్తివంతమైన వ్యాయామ పద్ధతులు కూడా ఉన్నాయి. వ్యాయామం కావాలనుకునే చాలా మందికి ఉపయోగా ఒక మంచి ప్రారంభం కావచ్చు. ఎందుకంటే అది దానికదే ఒక శక్తివంతమైన వ్యవస్థ. యోగాను ఒక వ్యాయామంగా చేయడం కంటే ఉపయోగాను చేయడం చాలా మంచిది. వారు దానిపట్ల ఆకర్షితులు అయినప్పుడు, వారంతట వారే యోగాలోకి వెళ్ళవచ్చు.
మీరు నిద్రపోయినప్పుడు, చాలా సేపు పడుకుని కదలకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు మీ శక్తి వ్యవస్థలో కొంత జడత్వము ఏర్పడుతుంది. అప్పుడు మీ కీళ్లలో కావలసినంత లూబ్రికేషన్ ఉండదు. మీ కీళ్ళను లూబ్రికేట్ చేయకుండా కదిలిస్తే అవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఒక మనిషికున్న స్వేచ్ఛంతా కూడా తనకున్నటువంటి కీళ్ళ వల్లనే. కీళ్ళు శక్తి భాండాగారాలు. కీళ్ళలోని నాడులు ఒక నిర్దిష్ట విధానంలో ప్రవర్తిస్తాయి. ఉపయోగాలోని ఒక అంశము కీళ్ళలోని కందెనను (లూబ్రికెంట్‌ను), శక్తి స్థానాలను ఉత్తేజపరచడమే. అందువల్ల మీ తక్కిన వ్యవస్థంతా సరిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది.
ప్రేమాశీస్సులతో, సద్గురు
- సద్గురు జగ్గీ వాసుదేవ్
www.sadhguru.org