సాంగ్‌రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

సాంగ్‌రే బంగారు రాజా

Published Sat, Jun 18 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

సాంగ్‌రే బంగారు రాజా

సాంగ్‌రే బంగారు రాజా

సోలో అయినా, యుగళగీతమైనా... పిఠాపురం పాడినవన్నీ దాదాపు హాస్యగీతాలే. ‘హాస్యగీతాల గోపురం’ పిఠాపురం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడారు. మాధవపెద్ది, పిఠాపురం జంటగాయకులుగా ప్రసిద్ధి పొందారు.
 
కల్లాకపటం కానని వాడా... లోకం పోకడ తెలియని వాడా...
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా... నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా...

 
కొసరాజు లేకపోతే తెలుగుపాటకు కొన్ని మొదళ్లు దొరికేవి కావు. మరికొన్ని కొసలు కూడా దొరికేవి కాదు. తెలుగు పాట ఆయనొచ్చాక ముద్దబంతి పూలు కట్టింది. మొగలి రేకు జడను చుట్టింది. పల్లెదేశమైన ఈ దేశంలో పల్లెదనం లేని సినిమాలు రావడానికి వీల్లేని ఆ రోజుల్లో పల్లెపాటకు కేరాఫ్ అడ్రస్‌గా కొసరాజు ఉన్నారు. ‘పెద్ద మనుషులు’ సినిమాలో ‘శివశివ మూర్తివి గణనాథ’ పాటతో మెరిసిన కొసరాజు ఆ వెంటనే వచ్చిన ‘రోజులు మారాయి’ సినిమాలో ఈ పాటతో సినీ కచ్చేరి వేపచెట్టు కింద పర్మినెంట్‌గా కండువా వేయగలిగారు.

‘నవధాన్యాలను గంపనెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకుని ముల్లుగర్రను చేత పట్టుకొని ఇల్లాలిని నీ వెంటబెట్టుకుని’... రైతే కాదు కొసరాజు కూడా పాటల ఏరువాక సాగించారు. భూమిని అదుపులో ఉంచుకుని పేదల్ని కామందులు పీడించుకు తినే రోజులు మారాయి అని చెప్పే ఈ సినిమాలో ఈ పాటకు వహీదా రెహమాన్ నర్తించడం దీనిని క్లాసిక్‌గా మార్చింది. పాట మొదలులో చేతులెత్తి ఆమె కొట్టే వృత్తాలు ఇవాళ్టికీ హీరోయిన్లకు సాధ్యం కాదు.

ఇక మాస్టర్ వేణు ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా తప్పెట్ల బృందం తెప్పించి దీనికి మ్యూజిక్ చేశారు. వాళ్లకు తాళం రాకపోతే తానే తాళానికి తగినట్టు తప్పెట కొట్టి చూపించారు. జిక్కి గురించి చెప్పకపోతే కళ్లు పోతాయి. ఆమె ఈ పాటను మీదుమిక్కిలి సౌందర్యంతో పాడింది. పల్లెరైతులకు ఆడపడుచుగా మారింది. కొన్ని అలా కుదురుతాయి. ఈ పాట పంట అలా పండింది అంతే.చిత్రం: రోజులు మారాయి (1955)
సంగీతం: మాస్టర్ వేణు
రచన: కొసరాజు
గానం: జిక్కి

 
నిదురపో... నిదురపో... నిదురపో... / నిదురపోరా
తమ్ముడా... నిదురపోరా తమ్ముడా...
నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా...
కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా...

 
‘కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా’.... కాలికి దెబ్బ తగిలి ఏడుస్తున్న పిల్లాడిని ఓదారుస్తూ పాట మొదలవుతుంది. దయామయమైన జూనియర్ శ్రీరంజని ముఖం, ఆమె గొంతు నుంచి వెలువడుతున్న లతా మంగేష్కర్ పాట, తెలుగు వారిని దయదలిచి జోకొట్టిన ఆ మేలిమి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేము. ‘నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా’... అని లతా పాడుతుంటే ఎంతమంది కాసిన్ని లిప్తల పాటైనా తమ గతాన్ని మర్చిపోయారో... గాయపడే ఘటనల నుంచి ఎంత ఓదార్పు పొందారో... లెక్కే లేదు.

హిందీలో 1949లో ‘మహల్’ సినిమా వచ్చి లతా ముద్ర ఇది అని ప్రకటించగలిగింది. 1953 ‘ఆహ్’ నాటికి ఆమె పేరు మరింత పాపులర్ అయ్యింది. ఆ సమయంలో అంటే 1955లో లతా పాట తెలుగులో వినిపించగలిగింది. సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి పూనిక వల్ల ఇది సాధ్యమైంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఫార్ములాకు తొలి రూపం ఉన్న సినిమాలలో ‘సంతానం’ ఒకటి.

చిన్నప్పుడు విడిపోయిన ఒక తండ్రి బిడ్డలు మళ్లీ కలుస్తారు. పాటే కలుపుతుంది. లతాతో ఘంటసాల గొంతు కలిపారు. ‘లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే’... లైన్‌లో ఆయన చూపే కరుణ శిలను కూడా కుదుళ్ల నుంచి కుదిపేయగలదు. ఈ పాటతో తెలుగువారిది కరుణారుణం.చిత్రం: సంతానం (1955)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
రచన: అనిసెట్టి సుబ్బారావు
గానం: లతా మంగేష్కర్, ఘంటసాల

 
రావోయి చందమామ... మా వింత గాథ వినుమా... రావోయి చందమామ
సామంతము గల సతికీ... ధీమంతుడనగు పతినోయ్ /సతి పతి పోరే బలమై... సతమతమాయెను బ్రతుకే...

 
వింతగాథే మరి. పెళ్లి కాలేదు. కాని దంపతులు. ఒకే చూరు కింద ఉంటారు. కాని శత్రువులు. ఇంతకు మించిన విడ్డూరం ఉందా? దీనిని ఎవరికి చెప్పుకున్నా భుక్తి పోతుంది. భార్యభర్తలం అని అబద్ధం చెప్పి తెచ్చుకున్న ఉద్యోగం పోతుంది. మళ్లీ అప్పుల పాలు కావాల్సి వస్తుంది. అందుకే సర్దుకుపోతున్నారు. అంతలోనే కీచులాడుకుంటున్నారు.

అలిగినప్పుడల్లా మీడియేటర్‌గా చంద్రుణ్ణి వాళ్ల మధ్యకు లాగుతున్నారు. ఎమ్టీరావుగా ఎన్టీఆర్, మిస్సమ్మగా సావిత్రి ఆ కస్సుబుస్సుమనే జంట... నవ్వు దాచుకున్న నిండు చంద్రుడు... ఎ.ఎం.రాజా, పి.లీల పాట... తెలుగువారికి శాశ్వతంగా మిగిలిన ఒక ఆహ్లాదకరమైన సందర్భం. పింగళి నాగేంద్రరావు తన మాటలతో ఆడుకుంటాడు. ‘తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్’ అనడంలో శ్లేష ఉంది.

ఆమె మతం వేరు అనేది ఒక అర్థమైతే ఆమె స్వభావం వేరు అనేది మరో అర్థం. రామారావు ఇంత అందంగా ఏ సినిమాలోనూ లేడు. సావిత్రి ఇంత పెడసరంగా కూడా. సాలూరి ఈ పాటకు బాణీ కట్టే ముందు కాసిన్ని వెన్నముద్దలు తినేసి వచ్చుంటారు. లేకుంటే ఇంత చల్లదనమూ వెన్నెలదనమూ సాధ్యం కాదు. సామంతము గల సతికీ... ధీమంతము గల పతినోయ్... ఓహ్... ఇవాళ ఈ బాణీ వదలదు.చిత్రం: మిస్సమ్మ (1955)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: పింగళి నాగేంద్రరావు
గానం: పి.లీల, ఎ.ఎం.రాజా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement