'సాంగ్'రే బంగారు రాజా
‘శంకరాభరణం’ సినిమాలో సంగీత, సాహిత్యాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ సినిమా విజయం తరువాత నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (చెన్నై), డిస్ట్రిబ్యూటర్ కె.ఆర్.ప్రభు (బెంగళూరు)లు కట్టుకున్న ఇళ్లకు ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు.
శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...
పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను మొదలయ్యింది. దమ్మారో దమ్... మిట్ జాయే గమ్... మోగిపోతు న్నాయి. త్యాగయ్య, క్షేత్రయ్య పాత చింతకాయ పచ్చడి. సరిగమ పదనిస... అదో పెద్ద నస. ఇలాంటి టైములో ముక్కు ముఖం తెలియని ఒక శాస్త్రిగారు, నామాలు పెట్టుకుని, ధోవతి చుట్టుకుని, గోదారి ఒడ్డున తిరుగుతూ సంగీతం.. సంగీతం అంటూ ఉంటే ఎవరు చూస్తారు? ప్రజలే చూస్తారు. చూశారు. చూస్తూ చెప్పుకుంటూనే ఉన్నారు.
అమ్మను నాన్నను పుట్టిన ప్రాంతాన్ని ఈ మట్టి ఇచ్చిన సంస్కృతిని స్వీకరించడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉండరు? మధ్యలో వచ్చిన భ్రాంతిని తొలగించుకోవడానికి ఎవరు మాత్రం అడ్డు చెప్తారు? ‘ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలాగ అంటాడు. ఎదురుదెబ్బ తగలిన బిడ్డ అమ్మా అని మరొకలాగ అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది. శ్రుతి ఉంది. స్వరం ఉంది’ అన్న శంకరశాస్త్రి తాను నమ్మినదానిని ఎంత గట్టిగా ఆచరిస్తాడో తనను నమ్మి వచ్చిన ఆమెకు కూడా అంత గట్టిగా రక్షణ ఇద్దామనుకుంటాడు. కాని లోకం అనుమానించింది.
ఆయనను పరాభవించింది. తన ఆత్మలో దోషం లేదు. అది నిప్పు. తన అర్చనలో దోషం లేదు. అది లావా. అందుకే కుండపోతలో స్వరం కదలాడింది. పరమేశ్వరుడి ఎదుట పెనుగులాడింది. ‘నాదోపాసన చేసినవాడను నీవాడను నేనైతే’... ‘నిర్నిద్రగానం’ వినిపిస్తాను విను అంటాడు శంకరశాస్త్రి. ‘పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా’ ఆ వాన ఆ మెరుపులకు మనం కూడా భయపడిపోతాము. వెండితెరపై గొప్ప గాన సృష్టి ఇది. ఆనందవృష్టి.శంకరాభరణం (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా... పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ...
అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై... ముద్దుకే పొద్దు పొడిచె...
అబ్బాయి సద్బ్రాహ్మణుడు. అమ్మాయి నియమాలు పాటించే క్రిస్టియన్. కాని హార్మోనియం పెట్టెకు జంధ్యం లేదు. పోనీ అది బాప్టిజం తీసుకోలేదు. స..ప..స... ఏ మతం వాడైనా పలకొచ్చు. అదే స్వరం. ప్రేమను ఏ కులం వారైనా ప్రకటించవచ్చు. అదే జ్వరం. పాట వాళ్లిద్దరినీ కలిపింది. పాటే వారిని కోనేట్లో తామరల్లా విప్పారేలా కూడా చేసింది. అంతవరకూ లేని ఒక దృశ్యం అంతవరకూ సాధ్యం కాని ఒక గమనం తెర మీదకు తీసుకొచ్చి చూపినవాడు భారతీరాజా.
సీతాకోక చిలుక కోసం తన చిన్ననాటి స్నేహితుడు ఇళయరాజాను పాటలు అడిగి నప్పుడు వేరే దర్శకులైతే ఏవో అబ్జెక్షన్స్ చెప్పొచ్చు... కాని ఈ స్నేహితుడి ముందు స్వేచ్ఛగా తాననుకుంటున్నది చూపవచ్చు. ఇంకేముంది... ఇళయరాజా ఏడు మెట్ల కోనేట్లోకి దిగాడు. తోడు వేటూరినీ దింపాడు. ఆ భావుకుల ముఖాన తొలి ఎండ పడింది. పల్లవి కోరస్‌తో మొదలైంది. ‘అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై.. ముద్దుకే పొద్దు పొడిచె’... ఒకే మాటను వేరువేరు భావాలతో పలికించడం వేటూరి సరదా.
‘ఓ... చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే’... అనడంలో చమక్కు ‘దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా’ అనడంలో మనకే దప్పిక వేయించగల చమత్కారం.. భేషో. అన్నట్టు ఈ పాటలో కోనేట్లో కంఠం వరకూ దిగిన కార్తిక్, ముచ్చర్ల అరుణ చుట్టూ తామరలు చకచకా పరుగులు తీస్తుంటాయి. నీళ్లల్లో పూర్తిగా మునిగి అలా తామర్లను కదిలించింది ఎవరో తెలుసా?
ఇటీవల మరణించిన ప్రసిద్ధ నటుడు మణివణ్ణన్, ఇప్పటి తమిళ కమెడియన్ మనోబాల. వీళ్లిద్దరూ భారతీరాజా శిష్యులు. చిత్రం ఏమిటంటే షాట్ అయ్యాక కూడా వీళ్లు నీళ్లలోనే ఉంటే యూనిట్ వీళ్లను వదిలి వెళ్లిపోయిందట. వారి కష్టం... మనకు ఈ పాట మిగిల్చిన సౌందర్యం. పొందు ఆరాటాల... పొంగు పోరాటాలా...చిత్రం: సీతాకోకచిలుక (1981)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్నొ రువ్వి ఎన్నెన్ని కలలు తెప్పించావే పొన్నారీ...
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి...
హంగ్రీ సెవంటీస్. ఎక్కడ చూసినా ఆకలి. నిరుద్యోగం. ఇళ్లల్లో వయసుకొచ్చి చేతిలో పట్టాలు పుచ్చుకొని తండ్రి సంపాదన తినలేక స్వశక్తితో సంపాదించలేక అస్థిమితంతో రగులుతున్న యువత. నో వేకన్సీతో తిప్పలు. దీనిని చూపున్నవాడు పసిగడతాడు. బాలచందర్ ‘ఆకలి రాజ్యం’ తీశాడు. కాని జీవితం అంటే ఉత్త ఆకలే కాదు ప్రేమ ఉంటుంది. కొంచెం ఇష్టం ఉంటుంది. మంచి పాట కూడా ఉంటుంది. అందరూ పాటలు పెడతారు.
బాలచందర్ కొత్త తరహాగా పెడదామనుకున్నాడు. హీరోయిన్ స్వరం ఇస్తూ ఉంటుంది హీరో ఆ స్వరానికి తగ్గ పదం పాడాలి. ‘తననా తననా అన్నా తానా అన్న రాగం ఒకటే కదా’... శ్రీదేవి, కమలహాసన్ ఈ పాటలోనే ఒకరికి మరొకరి మీదున్న ఇష్టాన్ని కనుగొంటారు. ‘నీవు... నేను.. అని అన్నా... మనమే కాదా’ అనడం చేతులు కలుపుకోవడం గుడ్డిలో మెల్ల. గుడ్డి ఎందుకంటే నిరుద్యోగం.
అందులో మెల్ల ఈ ప్రేమ. మనుషులు ఎంత నిరాశలో కూడా ఏదో ఒక ఆశను వెతుక్కుంటారు. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు వింటే ఈ పాట కొంచెం సరదా పుట్టిస్తుంది. ఆమె స్వరానికి మనం పాడుతున్న ఫీలింగ్ ఇచ్చి సరి చేస్తుంది. పాడండి... ‘సంగీతం... నువ్వైతే... సాహిత్యం నేనవుతా’...చిత్రం: ఆకలి రాజ్యం (1981)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
రచన: ఆత్రేయ
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి