'సాంగ్'రే బంగారు రాజా
ఘంటసాల కర్ణాటక సాంప్రదాయ సంగీతం అభ్యసించినప్పటికీ, హిందూస్తానీ సంగీతం అంటే కూడా ఆయనకు అభిమానం. తాను సంగీతదర్శకత్వం వహించిన సినిమాల్లో పహాడి, దేశ్... మొదలైన హిందూస్థానీ రాగాలను ఉపయోగించారు ఘంటసాల.
చినుకులా రాలి... నదులుగా సాగి... వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమా... నా ప్రేమా...
నీ పేరే నా ప్రేమా..నదివి నీవూ కడలి నేనూ... మరచిపోబోకుమా... మమత నీవే సుమా...
ప్రేమలో ఎవరైనా గెలవడానికి ఇష్టపడతారు. కాని మృత్యువుతో ఎవరు పోటీ పడతారు? ఇద్దరబ్బాయిలు ఇద్దరమ్మాయిలు. వారిలో ఒకబ్బాయి ఒకమ్మాయి తొందరపడ్డారు. అమ్మాయి నెల తప్పింది. పెళ్లి జరిగే వీలు లేదు. పెళ్లి చేసుకునే వీలున్న రెండో అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తొందరపడ్డ అబ్బాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండో అమ్మాయిని చేసుకున్నాడు. చాలా క్లిష్టమైన ఆట మొదలైంది.
ఇలాంటి ఆట ప్రమాదకరంగా మారి తొందరపడ్డ అమ్మాయి ప్రాణం తీసింది. టీనేజ్ తికమకలు తొందరపాట్లు చూపించ డానికి జంధ్యాల తీసిన ‘నాలుగు స్థంభాలాట’ పెద్ద హిట్. అంత కంటే పెద్ద హిట్ అందులో రాజన్ నాగేంద్ర చేసిన ఈ పాట. దాని కంటే పెద్ద హిట్ దానికి వేటూరి అందుకున్న పద ప్రవాహం. ‘ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే’... షీర్ పొయెట్రీ. ‘హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ’...
బాలూ సుశీల ఈ పాటను టీనేజ్‌లో ఉన్నవాళ్ల వలే ఉత్తేజంతో పాడారు. రేడియో ఈ పాట మీద చాలా మైలేజ్ గెయిన్ చేసింది. ఇప్పటికీ ఆకాశవాణి వివిధభారతికి రోజూ ఒక కార్డు ముక్క ఈ పాట కోసమే వస్తూ ఉంటుంది. తెలుగు యువతీ యువకులు ప్రేమలో పడ్డాక తెలుగులో పాడుకోదగ్గ పాటల్లో ఇది ఒకటి. ఇదే ఒకటి.చిత్రం: నాలుగు స్థంభాలాట (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
మౌనమేలనోయి... మౌనమేలనోయి ఈ మరపురాని రేయి...
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల... తారాడే హాయిలో...
చెప్పినవాటి కంటే చెప్పనివే బాగుంటాయి. అర్థం అయిన వాటి కంటే అర్థం కానివే బాగుంటాయి. తెలిసిపోయిన వాటి కంటే తెలుస్తూ ఉన్నవే బాగుంటాయి. ఆమె పరిణతి కలిగిన స్త్రీ. అతడు సున్నితమైన మనసు కలిగిన కళాకారుడు. రోజూ ఇద్దరూ కలుస్తారు. వేరే ఏవేవో మాట్లాడుకుంటారు. కాని లోపల వేరేదేదో జరుగుతుంటుంది. పైకి ఏమిటో చేస్తుంటారు. లోన వేరేది చేయాలని ఉంటుంది. మనసు ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది.
ప్రేమ ఉన్నప్పుడు కోరిక పుడుతుంది. ఒక స్త్రీలోని కోరిక ఈ పాట. ఆ రాత్రి అతడి తలపులు ఆమెను బాధిస్తాయి. కాలి బొటనవేలిని మరొక బొటనవేలితో అదిమి పెట్టమంటాయి. ‘పలికే పెదవి ఒణికినప్పుడు’, ‘ఒణికే పెదవి వెనుకాల’ వేరేదేదో ఉన్నప్పుడు ఆ భావనను తెర మీద చూపించాలనుకోవడం దర్శకుడి భావ స్వేచ్ఛ. తాను ఇష్టపడ్డ మగవాడి గురించి ఆమె స్నానం చేస్తూ ఏకాంతంలో ఆలోచించడం చాలా లలితంగా చూపిస్తాడు.
కాని సినిమా చూసి కొందరు అశ్లీలం అన్నారు. ‘మీరూ అదే చేస్తారు గమనించండి’ అని కె.విశ్వనాథ్ సమాధానం ఇచ్చారు. ఏమైనా సాగర సంగమంలో ఈ పాట, ఆ రాత్రి, ఆ ఏకాంతం, అంతే ఏకాంతాన్ని పలికించిన బాలూ, జానకిల కంఠాలు, ఇళయరాజా స్వరం, వేటూరి గీతం... తెలుగులో సున్నితమైన శృంగార ప్రకటనకు ఒక మేలిమి నమూనా. జయప్రద కోసం ఈ పాటను చూడాలి. ఈ పాట కోసం జయప్రదను చూడాలి. జయప్రద కోసం జయప్రదను చూడాలి. జయప్రదమైన పాట ఇది.చిత్రం: సాగర సంగమం (1983)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
వందేమాతరం... వందేమాతరం...
వందేమాతర గీతం వరుస మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తెలుగు సినీ విశ్వవిద్యాలయం కింద చాలా స్కూళ్లు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కె.వి.రెడ్డిది ఒక స్కూలు. విఠలాచార్యది ఒక స్కూలు. దాసరిది ఒక స్కూలు. రాఘవేంద్రరావుది, కె.ఎస్.ఆర్.దాస్‌ది ఒక స్కూలు. అలాగే మరో స్కూల్ ఉంది. అందులో మాదాల రంగారావు, వేజెళ్ల సత్యనారాయణ, ధవళ సత్యం ఆ తర్వాత కాలంలో టి.కృష్ణ ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు వస్తారు. ఒకప్పుడు దేశం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదించింది.
తెల్లదొరలను తరిమికొట్టింది. కాని నల్లదొరల చేత చిక్కింది. ఈ నల్లదొరల బండారం బయటపెట్టడానికి వీళ్లంతా సినిమాలు తీశారు. టి.కృష్ణ దీనిని తన ‘నేటి భారతం’, ‘వందేమాతరం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాలతో బలంగా చూపించారు. ‘వందేమాతరం’లోని ఈ పాటను స్కూల్ మాస్టర్ అయిన హీరో రాజశేఖర్ ఆలపిస్తాడు.
ఊరి పెద్దలే పల్లెల్ని నాశనం చేస్తున్నారని బాధ పడతాడు. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాటతోనే వెలుగులోకి వచ్చాడు. సినారె నాటి వందేమాతరం గీతంలోని ప్రతి పంక్తిని తీసుకొని నేటి పరిస్థితిని చురకలా వేసుకుంటూ వెళతారు. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది’ అనేది ఇందులో ఒక పంక్తి. పని మొదలవని పథకాలు చూస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలకు ఇది సరిపోయేలా ఉంది కదూ?చిత్రం: వందేమాతరం (1985)
రచన: సినారె
గానం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్‌ఫోన్ కంపెనీలో 16 ఏళ్ల వయసులోనే హార్మోనిస్ట్‌గా పనిచేశారు సి.ఆర్.సుబ్బురామన్. ఆయనకు కర్ణాటక సంగీతం మీద ఎంత పట్టు ఉందో పాశ్చాత్య సంగీతం మీద కూడా అంతే పట్టు ఉండేది.
ఈ తూరుపు.. ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ...
పడమటి సంధ్యారాగాలేవో... పారాణి పూసెనులే...
యూ ఆవకాయ్... మీ ఐస్‌క్రీమ్... దిజ్ ఈజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్స్ డ్రీమ్స్
ఇవాళ తెలుగు నేలలోని ప్రతి వీధి నుంచి ఒక అబ్బాయో, అమ్మాయో అమెరికాలో చదువుకుంటున్నారు. ప్రతి వాడ నుంచి ఒక జంట అమెరికాలో కాపురం ఉంటున్నారు. ఇక్కడ పుట్టే పిల్లలకు తోబుట్టువులుగా అమెరికాలో కూడా ఎంతో మంది తెలుగు పిల్లలు ఊపిరి పోసుకుంటున్నారు. ఆ పడమర, ఈ తూర్పు విడిపోవడం సాధ్యం కాదు. ఒకరిని వదిలి మరొకరు మనలేని పరిస్థితి వచ్చేసింది. అయితే దీనిని 30 ఏళ్ల క్రితమే కనిపెట్టి సినిమాగా తీసినవాడు జంధ్యాల.
సంస్కృతుల సంగమమే కాదు, వైవాహిక అనుబంధాలు కూడా తప్పవని ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడమే దీనికి మార్గమని ఆయన ఆ కథలో సూచిస్తాడు. ‘పడమటి సంధ్యా రాగాలేవో... పారాణి పూసెనులే’... అనడంలో ఒక కవితాత్మక భావం ఉంది. సినిమా కూడా అంతే కవితాత్మకంగా ఉంటుంది.
ముఖ్యంగా విజయశాంతి ఈ సినిమాలో ఉన్నంత చక్కగా ఏ సినిమాలోనూ లేదేమో అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు, దీనికి టైటిల్ కూడా ఆయనే పెట్టారు. ‘ఏ దేశమైనా ఆకాశం ఒకటే’ అంటారు వేటూరి ఈ పాటలో. అది అర్థం చేసుకుంటే పాస్‌పోర్ట్‌ల అడ్డంకులెరగని విశ్వమానవతత్వం అందరికీ అలవడుతుంది. ప్రపంచం ఒక ఇష్ట కుటుంబంగా మారుతుంది.చిత్రం: పడమటి సంధ్యారాగం (1987)
సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
జీవితం సప్తసాగర గీతం/ వెలుగు నీడల వేదం... సాగనీ పయనం
కల... ఇల... కౌగిలించే చోట (2)
ఆర్.డి.బర్మన్ తెలుగులోకి రావడం ఒక వింత. అప్పుడెప్పుడో ఒకసారి పాడినా తిరిగి ఆశా భోంస్లే గొంతు విప్పడం మరో వింత. జంధ్యాల తీసిన ‘చిన్ని కృష్ణుడు’... పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాని ఈ పాటను మాత్రం తెలుగువారికి మిగిల్చింది. హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్, హీరోయిన్ ఖుష్బూ అమెరికాలో అలా షికార్లు కొడుతుంటే జంధ్యాల అద్భుతమైన మాంటేజ్‌ను రన్ చేస్తూ ఈ పాటను చూపిస్తారు.
దానికి ఆశా గొంతు, బాలూ తోడ్పాటు చాలా వినబుద్ధేసేలా ఉంటాయి. ‘ఈ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులు.. ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులూ’ అని అమెరికా విశేషాలను పాటలో వేటూరి పొదుగుతూనే ఈ అగ్రరాజ్యం దానికదే ఊడిపడలేదని ‘కృషి ఖుషి సంగమించే చోటు’ కనుకనే సాధ్యమైందని అంటారు.
ఆర్.డి.బర్మన్, ఆశా భోంస్లే సహజీవనం చేశారనే సంగతి సంగీతాభిమానులకు తెలుసు. బర్మన్ తెలుగులో మొదటిసారి చేస్తున్నాడు కనుక ఆమెతో పాడించడం సులువయ్యింది. ఇదే సినిమాలో ‘మౌనమే ప్రియా గానమై’ అనే పాట టిపికల్ ఉత్తరాది తరహాలో ఉంటుంది. పాడింది మన జానకి. వింటుంటే లతా, ఆశా... సరేనయ్యా మన జానకమ్మకు ఏం తక్కువయ్యా అని అనబుద్ధేస్తుంది.చిత్రం: చిన్నికృష్ణుడు (1988)
సంగీతం: రాహుల్ దేవ్ బర్మన్
రచన: వేటూరి
గానం: ఆశాబోంస్లే, ఎస్.పి.బాలు
లాలూదర్వాజ లస్కరు బోనాల పండుగకు వస్తనని రాకపోతివి..
లక్డీకాపూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి...
పాత రోజుల్లో శోభనం గదిలో పెళ్లికొడుకు పెళ్లికూతురితో ‘ఏదైనా పాట పాడు’ అనంటే ఆ అమాయక పెళ్లి కూతురు ఏ చోటులో ఎటువంటి పాట పాడాలో కూడా తెలియక చాలా హుషారుగా తన పల్లె స్వభావంతో ‘పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మ తుమ్మెదా’ అని అందుకుంటుంది. తెలుగువారికి ఆ పాట ఒక హుషారైన నవ్వులు చిందే జ్ఞాపకం. తమిళం వాళ్లు దీనిని పట్టుకున్నారు. క్షత్రియ పుత్రుడు సినిమాలో పెళ్లి కూతురిని పాడమంటే ‘సన్నజాజి పడకా మంచె కాడ పడకా’ అని నోటి దరువుతో అందుకుంటుంది.
ఏ సంస్కృతి మీద దృష్టి పెడితే ఆ సంస్కృతి నుంచి ఒక మంచి పాట తన్నుకు రావడానికి ఏ అడ్డంకీ ఉండదు. ‘మొండిమొగుడు పెంకిపెళ్లాం’ సినిమాలో విజయశాంతి తెలంగాణ ప్రాంతం నుంచి వస్తుంది. పెద్ద ఆఫీసర్ల పార్టీలో ఎవరో ఆమెను పాట పాడమంటారు.
ఇంకేముంది? తెలంగాణ సొగసు నుంచి ఈ పదం అందుకుంటుంది. ‘యాడికో ఉర్కుతాడని యేసినా ముక్కుతాడుని’ అని మొగుణ్ణి కవ్విస్తూ పాడుతుంటే ఆ మజా వేరుగా ఉంటుంది. తెలంగాణ గ్రామీణ సౌందర్యం ఉండేలా పాటలు రాయడంలో సాహితి సిద్ధహస్తుడు. బోనాల పండుగకు ఒక కవిగా అతడల్లిన పూల పేర్పు ఈ పాట... లాలూ దర్వాజ్ లష్కర్...చిత్రం: మొండిమొగుడు పెంకిపెళ్లాం (1992)
సంగీతం: కీరవాణి
రచన: సాహితి
గానం: ఎస్.పి.శైలజ