Telugu song
-
రవిశంకర్ రాజు టూ మాస్ మహారాజా: ఇరగదీశాడు భయ్యా!
#EagleRavitejarapsongintelugu టాలీవుడ్ హీరో రవితేజ్ గా వస్తున్న మూవీ ఈగల్. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో తెలుగు కుర్రోడు దుమ్ము రేపాడు. తెలుగులో ర్యాప్ మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవిశంకర్ రాజు నుండి మాస్ మహారాజా రవితేజ వరకు సాగిన ప్రయాణాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. అంతేకాదు అద్భుతమైన RAP పాటకు రవితేజ కూడా ఫిదా అయిపోయాడు. ఉత్సాహంగా ఊగిపోయాడు. అదేంటో మీరు కూడా ఒకసారి చూసేయండి. కాగా మాస్ మహారాజాగా గుర్తింపు పొందిన హీరో రవితేజ్ నటిస్తున్న మూవీ ఈగల్. ధమాకా తర్వాత మరో మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న సినిమాలొ అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. -
Mother's Day 2021: ఈ ‘అమ్మ’ పాటలు ఎప్పుడు స్పెషలే
‘అమ్మ’ తెలుగు భాషలో ఈ పదం కన్న గొప్పది మరొకటి లేదు. నిస్వార్థ ప్రేమకు చిరునామ అమ్మ. పిల్లలు అంద వికారంగా ఉన్నా, అంగవైకల్యం కలిగి ఉన్న గుండెలకు హత్తుకొని పెంచుకుంటుంది అమ్మ. అందుకే కనిపించే దైవం అమ్మ అంటారు. మనం తిట్టినా, కొట్టిన తల్లి ప్రేమ మారదు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఆమె దృష్టిలో పిల్లాడిలాగే ఉంటాం. అందుకే అంటారు కాబోలు.. ‘ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే’. అమ్మ గురించి, అమ్మ గొప్పదనం గురించి చెప్పుకునేందుకు మరో సందర్భం మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా తెలుగులో వచ్చిన ‘అమ్మ’పాటలు మీకోసం.. -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం -
పాతికేళ్ల తరవాత రీ షూట్ అయిన పాట
చిత్రం: లిటిల్ సోల్జర్స్ రచన: సిరివెన్నెల సంగీతం: శ్రీ గానం: దీపిక, విష్ణుకాంత్ నా జీవితంలో ‘లిటిల్ సోల్జర్స్’ ఒక మైల్స్టోన్. ఆ సినిమా సమయానికి నాకు పదేళ్లు. నా చెల్లిగా వేసిన కావ్యకు నాలుగేళ్లు. కావ్య మరీ చిన్నపిల్ల కావటం వల్ల 40 రోజులు అనుకున్న షూటింగ్ వందరోజుల పాటు జరిగింది. దర్శకులు గుణ్ణం గంగరాజుగారు ఆయనకు కావలసిన విధంగా వచ్చేవరకు ఎన్ని టేక్‌లైనా ఓపికగా చేయించారు. ఈ సినిమాకు పిల్లలే హీరోలు. ఈ సినిమాలోని ‘అయామ్ వెరీ గుడ్ గర్ల్’ పాట నేటికీ చిగురాకులా పచ్చగా ఉంది. పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పాటను, ఇప్పుడు మా అమ్మాయికి అన్నం తినిపించటానికి చూపిస్తున్నాను. ఈ పాతికే ళ్లలో ఎంతోమంది వచ్చి, ‘నాకు మీలాంటి అన్నయ్య ఉన్నాడు, నాకు బన్నీలాంటి చెల్లాయి ఉంది’ అంటూ చెబుతూనే ఉన్నారు. ఈ సినిమా తరవాత నేను కావ్యను మళ్లీ చూడలేదు. కాని అప్పుడే బన్నీ నాకు చెల్లి అని ఫిక్స్ అయిపోయాను. బన్నీ (కావ్య) పెళ్లికి వాళ్ల అన్నయ్య ఫోన్ చేసి, ‘మన చెల్లికి పెళ్లి జరుగుతోంది, నువ్వు రావాలి’ అని పిలిచాక, ఈ పాట రీషూట్ చేయబోతున్న విషయం చెప్పాడు. ఇందులో నేను స్నేహితుడిగాను, ఆదర్శ్ అన్నయ్యగాను చేద్దామన్నాడు. అలా ఆ పాటను 2015లో రీషూట్ చేశాం. ఇలా ఈ పాటతో పాతికేళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఆ సినిమా షూటింగ్ అంతా మాకు సెలబ్రేషనే. గుణ్ణం గంగరాజుగారి వదిన ఊర్మిళ గారి అమ్మాయి కావ్య. అయినా ‘ఇద్దరూ మన పిల్లలే’ అనే భావనతోనే చూశారు. కావ్య షూటింగ్లో ఎవ్వరి మాటా వినేది కాదు. ఊర్మిళ పెద్దమ్మ లేదంటే నేను మా ఇద్దరి మాటే వినేది. కెమెరా పక్కనే నిలబడి ఫైవ్‌స్టార్, కోక్ చూపిస్తే చాలు వెంటనే చేసేసేది. ఆ పాటలోని ప్రతి చిన్న బిట్‌ను చాలా టేక్‌లు తీశారు. ‘టింగ్’ అనే చిన్న బిట్ కోసం కనీసం పాతికసార్లు చేశాం. నాలుగేళ్ల కావ్య చేత చేయించిన ఘనత గంగరాజు, రసూల్ గార్లదే. ఒక్కోసారి నిద్రపోతుండేవాళ్లం. ఒకసారి బ్రేక్ చెప్పకుండా, ఎవ్వరికీ చెప్పకుండా అన్నం తినేశాను. అప్పుడు గంగరాజు గారు కేకలేసి, క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ఈ సినిమాలో మాకు తల్లిదండ్రులుగా నటించిన అరవింద్, హీరా గార్లు మాకు చాకొలేట్లే కాకుండా బహుమతులు కూడా తెచ్చిపెట్టారు. ఈ పాటను ఎప్పటికీ మరచిపోలేను. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
'సాంగ్'రే బంగారు రాజా
‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది..’ అనే పల్లవిని మొదట యథాలాపంగా రాశారు ఆరుద్ర. ఆ తరువాత ఇది పాటగా రూపుదిద్దుకుని ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాట పల్లవికి ప్రేరణ ఒక మోటు జానపదగీతం. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్ము కరుణించినావయ్యా జన్మజన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్యా / మేము తరియించినామయ్యా శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం సినిమా షిర్డీ సాయిబాబాను తెలుగువారికి మరింత చేరువ చేసింది. సినిమాతో పాటు ఆ పాటలు భక్తులకు మరింత ప్రియమయ్యాయి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాలని దర్శక నిర్మాతలు అనుకోవడం విశేషం. ఎందుకంటే అప్పటికి ఇళయరాజా పీక్‌లో ఉన్నారు. చిన్న సినిమా భరించలేనంత పారితోషికం అడిగే స్థాయిలో ఉన్నారు. అయినా సాయిబాబా సినిమా అనగానే ఎంతో మనసు పెట్టి ఆరాధనతో పాటలు చేశారు. ‘దైవం మానవ రూపంలో’, ‘బాబా... సాయి బాబా’, ‘సాయి శరణం బాబా శరణం శరణం’... పాటలన్నీ పెద్ద హిట్. ‘మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా’... పాట సాయి లీలలను గానం చేస్తుంది. మనకు ఆయనపై మనసు మళ్లిస్తుంది. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా... సంగీత దర్శకుడు శివ శంకర్ ఈ పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ప్రియమైన నీకు’ విడుదలైనప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే. ప్రతి సంగీత పోటీల్లో ఎవరో ఒకరు ఈ పాట పాడాల్సిందే. బాణి, టెక్స్ట్, చిత్ర గానం... ఈ పాటను శ్రోతలకు చేరువ చేశాయి. ఇప్పటికీ రేడియో అండ్ టీవీల్లో మనసున ఉన్నది శ్రోతల అభిమాన గీతంగా కొనసాగుతోంది. అయితే శివ శంకర్‌కు వెంటవెంటనే అవకాశాలు రాలేదు. కొంత విరామం తర్వాత ఇప్పుడు హరిహరన్ పేరుతో పేరు మార్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది... అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది... వేమన సులభంగా చెప్పాడు. వంగపండు సులభంగా చెప్పాడు. గోరటి వెంకన్న కూడా సులభంగా చెప్తాడు. పాటను సులభంగా చెప్తే జనం సులభంగా గుర్తు పెట్టుకుంటారు. చేరన్ తమిళంలో ‘ఆటోగ్రాఫ్’ తీశాడు. తెలుగులో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’గా రీమేక్ చేశారు. నిరుద్యోగం వల్ల దారీ తెన్ను లేకుండా తిరుగుతున్న హీరోని ఉత్తేజపరచాలి. అందుకు ఈ పాట. అంధులై ఉండి కూడా సంగీతం నేర్చుకుని కచ్చేరీలు ఇస్తూ జీవిక వెతుక్కునే వాళ్లు ఉన్నప్పుడు అన్నీ బాగుండి కూడా నిరర్థకంగా ఉండటం ఏం సమంజసం? అందువల్ల నిరాశ చెందక ముందుకు సాగమని ఈ పాట చెప్తుంది. ‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది... ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది’ అని చెప్పిన ఈ పాట తమిళంలోని మూలం కంటే ట్యూన్ రీత్యా భావం రీత్యా తెలుగులోనే బెటర్ పాట అనిపిస్తుంది. చంద్రబోస్, కీరవాణిలకు నూటొక్క మార్కులు. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం ఆ రోజులు మునుముందిక రావేమిరా.... వయసు మళ్లిందంటే అర్థం కేవలం వయసు మళ్లిందనే. అంతే తప్ప జీవితం అంతమైందని కాదు. ఇక మరేమీ లేదనీ కాదు. జ్ఞాపకాలుంటాయి. కథలు ఉంటాయి. తల పండిన అనుభవాలుంటాయి. కొత్తతరాలకు వినిపించాల్సినవి ఉంటాయి. తెలుగులో ఇద్దరు వయసు మళ్లిన స్నేహితులు తమ గత రోజులను తలుచుకుంటూ పాడుకునే పాట ఇదొకటేనేమో. అనుబంధంలో అక్కినేని, ప్రభాకర్‌రెడ్డిల మీద చిత్రీకరించిన ఈ పాట చూడటానికే కాదు వినడానికి కూడా చాలా బాగుంటుంది. గతం అనగానే జ్ఞాపకం అనగానే ఆత్రేయ కలం ఉరకలు వేస్తుంది. ‘నేను- మారలేదు... నువ్వు- మారలేదు... కాలం మారిపోతే- నేరం మనదేమి కాదు’ అనే పాట పెద్దల ఉనికికి విలువనివ్వమంటుంది. ‘ఈ గాలి మోస్తున్న వీరి కథ’లను వినమంటుంది. నీ స్నేహం.... ఇక రాను అనీ కరిగే కలగా అయినా ఈ దూరం... నువ్వు రాకు అనీ నను వెలి వేస్తూ ఉన్నా మనసంతా నువ్వే... నా మనసంతా నువ్వే... రీ రికార్డింగ్‌లో ఫీల్ కోసం చేసిన ఒక బిట్ సాంగ్ ఆ సినిమాకు ఒక ప్లస్ పాయింట్‌గా మారడం విశేషం. ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘నీ స్నేహం’... అని ఆర్.పి.పట్నాయక్ చేసిన ఈ సాంగ్ ముందు అనుకున్నది కాదు. ఆర్.ఆర్ చేస్తుండగా స్ఫురించింది. ఏదో ఒక బరువైన భావనను గాఢంగా ముద్ర వేసేలా ఈ ట్యూన్ ఉంటుంది. ఆర్.పి. గానం కూడా. ఎప్పటికైనా ఇది ఆర్.పి.కి ఐడెంటిటీ కార్డ్. దురలవాట్ల మీద సూపర్‌హిట్ పాటలు రాశారు కొసరాజు. (సరదా సరదా సిగరెట్టు, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...మొదలైనవి). ఇన్ని పాటలు రాసిన కొసరాజుకు పదేపదే కాఫీ తాగడం తప్ప మరే వ్యసనం లేదు. బండి కాదు మొండి ఇది సాయం పట్టండి / పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి... / గోపాలా... గోవిందా... నాయికా నాయికలు బండెక్కి పాడే పాటలు చాలానే ఉన్నాయి. కాని బండి మీద కంప్లయింట్ చేస్తూ వచ్చిన ఈ పాట ఫేమస్. హిందీలో ‘ఖట్టా మీఠా’ సినిమా ఆధారంగా బాలచందర్ పర్యవేక్షణలో తమిళంలో సినిమా తీశారు. దాని రైట్స్ కొనుక్కుని మురళీమోహన్ తెలుగులో ‘రామదండు’గా తీశారు. సినిమా ఉల్లాసంగా ఉంటుంది. ఆత్రేయ రాసిన ఈ పాట కూడా. ‘ఎక్కడికి వెళ్లాలయ్యా... వెళ్లినాక చెప్తానయ్యా చెప్పకుంటే ఎలాగయ్యా... చెప్పినాక తంటాలయ్యా’.... తెల్లారింది లెగండో... కొక్కరొక్కో / మంచాలింక దిగండో... కొక్కరొక్కో.... ఒక కవి తన పాటను తానే సినిమాలో పాడుకోవడం తెలుగులో ఇంతకు ముందు ఉందా? సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆ అవకాశం దక్కింది. గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్లు’ను సినిమాటోగ్రాఫర్ రఘు అంతే సమర్థంగా సినిమాగా మలచగలిగారు. నలుగురు అంధ భిక్షువుల కథ ఇది. అందరూ కలిసి ఒకరికి చూపు రప్పిస్తే ఆ వచ్చినవాడు కళ్లున్న వాళ్లు చూపే పాడుబుద్ధులన్నీ చూపిస్తాడు. చివరకు అందరూ కలిసి వాడి గుడ్లు పీకేసి దారికి తెస్తారు. ఆ సినిమాలో ఒక విశాఖ ఉదయాన్ని వర్ణించే పాట ఇది. ‘పాము లాంటి సీకటి పడగ దించి పోయింది... సావు లాంటి రాతిరి సూరు దాటి పోయింది’ అని చెప్పి చీకటి వదిలి వెలుగులోకి వెళ్లమని చెప్పే పాట ఇది. చెడును కాదు మంచిని చూడమని చెప్పే పాట. బాలసుబ్రహ్మణ్యం సంగీతం సుందరం. సుమధురం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే చివరి ఆశ ఎప్పుడూ బీభత్సంగా ఉంటుంది. మరి కొద్ది క్షణాల్లో కొడిగడుతుందనుకున్న దీపపు వెలుగు ప్రజ్వలంగా ఉంటుంది. నెమ్మదించబోయే ముందు తుఫాన్ వేగం... ఆఖరు శ్వాస వదిలే ముందు అయినవారి వర్చస్సు... చాలా బీభత్సంగానే ఉంటాయి. ఈ దేశంలో ప్రతి కులం, మతం ఏదో ఒక మేరకు తమ హక్కును అడుగుతాయి. కాని ఈ దేశంలో ఏ కుల పెద్ద లేని కులం, ఏ దేవుడూ లేని మతం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనాథ. తల్లిదండ్రీ లేనివాళ్లు, ఉన్నా వదిలిపెట్టవేయబడినవారు, అభాగ్యులు, దీనులు... ఎవరూ లేని అనాథలు... వారు ఏ హక్కూ అడగరు. ఏ రిజర్వేషన్ కోసమూ పోరాడరు. పూస్తుంటారు. రాలి పోతుంటారు. కాసింత నీలిమను వెతుక్కుంటూ వాలే పొద్దులైపోతుంటారు. మాతృదేవోభవ అనాథలు కాబోతున్న పిల్లల కోసం తల్లి పడే వేదన. చివరి దీపావళిని తన పిల్లలతో చేసుకోవాలనుకుంటుందా తల్లి. అప్పటికే విడివిడిగా పరాయి పంచన చేరిన పిల్లలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఈ పాట వస్తుంది. పాటలో ఆ తల్లిని వేటూరి ‘పగిలే ఆకాశం’తో ‘మిగిలే ఆలాపన’తో పోలుస్తారు. కీరవాణి స్వరం హార్మోనియం మీదా మైక్ ముందూ ఆర్ద్రతను నింపుకుంది. తాకే పాట ఇది. చిత్రం: మాతృదేవోభవ (1993) రచన: వేటూరి గానం, సంగీతం: కీరవాణి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ / కదిలే దేవత అమ్మా... కంటికి వెలుగమ్మా ఏఆర్ రెహమాన్ తండ్రి రహెమాన్ చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లే సర్వస్వంగా పెంచింది. ఎవరూ చెప్పకుండానే దేశమాతకు కృతజ్ఞతగా వందేమాతరం ఆల్బమ్ చేసేవాడు ఎవరైనా చెప్తే అమ్మ మీద పాట ఎంత మనసు పెట్టి చేస్తాడు. మహేశ్‌బాబు సొంత సినిమా అయిన ‘నాని’లో అలాంటి సందర్భం వచ్చింది. తల్లి తనను తిడుతోంది అని భావించే కొడుకు నిజానికి అది తిట్టడం కాదని తల్లి మనసు నిండా ఎప్పుడూ ఉండేది ప్రేమే అని గ్రహించినప్పుడు వచ్చే పాట ఇది. ఒక్కోసారి పాండిత్యాన్ని పరిహరిస్తే మామూలు మాటల్లోనే మంచి పాట పుడుతుంది. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ’ అన్న వెంటనే అవును కదా మనకెందుకు అనిపించలేదూ అనిపిస్తుంది. పాటతో కనెక్టివిటీ వచ్చేస్తుంది. ‘ఎనలేని జాలి గుణమే అమ్మ... కరుణించే కోపం అమ్మ... వరమిచ్చే తీపి శాపం అమ్మ’... అనడం అమ్మ గొప్పదనాన్ని కవి తిరగేసి చెప్పడమే. పాడిన ఉన్ని కృష్ణన్ ధన్యుడు. రాసిన చంద్రబోస్ ధన్యుడు. ఏం... వింటున్న మనం మాత్రం ధన్యులం కామా? ఉప్పొంగెలే గోదావరి... / ఊగిందిలే చేలో వరి/ భూదారిలో నీలాంబరి / మా సీమకే చీనాంబరి అమ్మ గోదావరి... తల్లి గోదావరి... తెలుగు జాతిని వొడిన కూచోబెట్టుకుని నాలుగు ముద్దలు కుడిపే గోదావరి... అన్నం పెట్టే గోదావరి... గొంతున నాలుగు గుక్కలు పోసే గోదావరి.... గోదావరి మీద పాట గోదావరి ఒడ్డున పాట... గోదావరితో పాటుగా పాట... తెలుగువారికి దక్కిన వరం. శేఖర్ కమ్ముల ‘గోదావరి’ మెల్లగా ఎక్కువమందికి నచ్చిన సినిమా. అప్పుడెప్పుడో బాపు ‘అందాల రాముడు’ సినిమాను మొత్తం గోదావరి మీద తీశారు. ఇంత కాలానికి శేఖర్ కమ్ముల అదే పని అంతే అందంగా చేయగలిగాడు. ‘ఏసెయ్ చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా.... చుక్కానే చూపుగా’.... ఇలా ప్రవాహోద్వేగంతో పాడటం బాలూకే సాధ్యం. ‘ఆరేసిన మిరపలు గోదారమ్మకు కుంకుమ బొట్టు దిద్దాయని’ అనడం వేటూరికే సాధ్యం. రాధాకృష్ణన్ చాలా మంచి పాటలు ఇవ్వగల సంగీత దర్శకుడు. ఈ పాట అతడికి పుష్కర స్నాన పుణ్యం ఇచ్చి ఉంటుంది. గ్యారంటీ. కొసరాజు పాటలు రాసే విధానం చిత్రంగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. జేబులో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. అలా నడిచివెళుతున్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే స్లిప్పుల్లో రాసుకునేవారు. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది / సంసారసాగరం నాదే... సన్యాసం శూన్యం నాదే... నాటి హిందీ సూపర్‌స్టార్ రాజ్‌కపూర్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. రాజ్‌కపూర్ మిగిలిన హీరోల్లా కాకుండా నచ్చింది తింటూ కోరింది తాగుతూ మెచ్చింది చేస్తూ ఉండేవాడు. ఇది హృషికేశ్‌కు ఆందోళన కలిగించేది. ‘ఇలా ఉంటే ఎలా... నీకేమైనా అయితే?’ అనేవాడు. ‘అయితే ఏమవుతుంది? హాయిగా పోతాం. అంతేకదా. అంతవరకూ మనం హ్యాపీగా ఉంటూ నలుగురినీ హ్యాపీగా ఉంచడానికి మించి కావలసిందేముంది’ అనేవాడు రాజ్‌కపూర్. ఆ మాటల స్ఫూర్తితోనే హృషికేశ్ హిందీలో ‘ఆనంద్’ సినిమా తీశాడు. మరో ఆరునెలల్లో కేన్సర్ వల్ల చనిపోబోతున్న రాజేష్ ఖన్నా ఆ ఆరునెలల్లో అందరికీ ఆనందం పంచడం కథ. ఇది ఎందరినో ప్రభావితం చేసి ఎన్నో సినిమాలకు మూలం అయ్యింది. తెలుగులో ‘చక్రం’కు కూడా. అయితే తెలుగుకు దక్కిన మేలిమి చేర్పు ఈ పాట. ప్రకృతిలో ఉండే ‘యాక్సెప్టెన్స్’ను అన్యాపదేశంగా బోధిస్తుంది ఈ పాట. చెట్టు వాన కావాలని తుఫాన్ వద్దని అనదు. నేల పైరు కావాలని క్షామం వద్దని అనదు. నది ప్రవాహం కావాలని సంగమం వద్దని అనదు. వాటికి రెండూ సమానమే. మనిషి మాత్రం జీవం కావాలని మృత్యువు వద్దని సంతోషం కావాలని దుఃఖం వద్దని ఘటన కావలని దుర్ఘటన వద్దని అంటాడు. అది ఉన్నప్పుడు ఇదీ ఉంటుంది. ఇదీ సూత్రం. కాని చివరి గడియలకు అది తెలుస్తుంది. అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. ‘నాకు రేపు లేదు... ఇవాళే’ అనుకున్నవారికి ఈ జగతి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అందరూ ప్రేమాస్పదులుగా కనిపిస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ వంటి అల్పమైన విషయాలన్నీ కరిగిపోయి ఉత్త ప్రేమే మిగులుతుంది. జరామరణాల చక్రాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఈ వృత్తాన్ని వీలైనంత ఆహ్లాదంగా సంతోషంగా మలుచుకో అని చెబుతుంది ఈ సినిమాలో ఈ పాట. ‘సంసార సాగరం నీదేననుకో సన్యాసం శూన్యం కూడా నీదేననుకో’ అంటుందీ పాట. సంగీత దర్శకుడు శ్రీ దీనిని పాడాడు. చక్రి ట్యూన్ చేశాడు. ఇద్దరూ తమ జీవితకాలంలో మనకు నాలుగు పాటలు మిగిల్చి దివ్యసంగీతంలోకి మరలిపోయారు. చిత్రం: చక్రం (2005) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: చక్రి గానం: శ్రీ కొమ్మినేని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...(2) కోట్లాది ప్రాణమా... ప్రజా ఉద్యమంలో పాట కూడా దండే. అది సైన్యం. అది ఆయుధం. అది కవాతు. అదే మిలీనియం మార్చ్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసింది. కళలు దానిని అందుకున్నాయి. దానిని అందించాయి. ఒకరొక మాట. ఒకరొక పాట. పాటల యుద్ధనౌక గద్దర్ ఈ హోరుకు మరో హోరు అవుదామను కున్నాడు. ఈ పోరుకు పాటను ‘వేరు’ చేద్దామనుకున్నాడు. వాగ్గేయకారుడు, అనుకున్నంతలోనే పాటను అందుకో గలిగినవాడు, దార్శనికుడు పాట అందుకున్నాడు. ‘మా భూమూలు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా’... లక్ష గొంతులు దీనికి వంత పాడాయి. కోటి స్వరాలు దీనిని ప్రతిధ్వనించాయి. ‘మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా... కన్నీటి గానమా’... అని గద్దర్ పాడుతుంటే ఉద్వేగంతో కంఠనాళాలు పొంగించాయి. ఉద్రేకంతో కంటి ధారలు కురిపించాయి. ఈ పాట ఇక్కడ ఒక ప్రాతినిధ్యం మాత్రమే. ఇంకా వందలాది గాయకులు ఉన్నారు... వందలాది పాటలు ఉన్నాయి. ఉద్యమం సాఫల్యమై తెలంగాణ సాకారమయ్యాక ప్రతి పువ్వుకు ప్రతి పుప్పొడికి ఈ జాతి కృతజ్ఞత ప్రకటిస్తోంది! ‘మా పాలన మాకేనని మండుతున్న గోళమా అమరవీరుల స్వప్నమా... అమర వీరుల స్వప్నమా...’ చిత్రం: జై బోలో తెలంగాణ (2011) సంగీతం: చక్రి రచన- గానం: గద్దర్ నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె కృష్ణవేణి / లంగఓణి వేసుకుని నడుస్తువుంటే నిలవలేనె బాలామణి... నడుము చూస్తె కందిరీగ నడక చూస్తె హంసనడక ప్రియురాలిని మెచ్చే ప్రియుడు ఇప్పటి వరకూ చాలా ఎక్స్‌ప్రెషన్సే వెతికాడు కాని- ‘నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి కలిగెనమ్మ ఏదో కోరిక’ అని చెప్పడం జనానికి నచ్చింది. ‘మహాత్మ’ సినిమాలో ఈ పాట హిట్. తను రాసిన పాటను తనే పాడే లక్కీ చాన్స్‌ను కాసర్ల శ్యామ్ కొట్టేశాడు. ఎఫ్ఎమ్లో బాగా మోగిన పాట ఇది. గోపికమ్మా... చాలునులేమ్మా నీ నిదర / గోపికమ్మా... నిను విడనీమ్మా మంచుతెర ఇటీవలి కాలంలో అత్యధికులు తమ రింగ్ టోన్గా పెట్టిన పాట ఇది. ‘ముకుందా’ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా మ్యూజికల్‌గా ఈ పాటతో నిలబడిపోయింది. మిక్కీ జె మేయర్ స్వరానికి సిరివెన్నెల పదం మేలిమి జతైంది. ‘కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినకా... గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా’... ఆ గోపికమ్మ నిదుర పోతుంటే నిదుర లేపే ఈ పాట శ్రోతల ఆహ్లాదాన్ని కూడా తట్టి లేపుతుంది. ఎందరు కొత్తవాళ్లు వచ్చినా చిత్ర చిత్రే అని నిరూపించిన పాట ఇది. గోపికమ్మా చాలును లేమ్మా... ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో... / అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో... మనుషుల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, ప్రేమించే రెండు మనసుల మధ్య కంచె ఉండకూడదు అని తీసిన ఈ సినిమాలో ఈ పాట కూడా చాలా కంచెలను తీసేసింది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గుజరాతీ. పాడినవాళ్లలో శ్రేయా ఘోషాల్ బెంగాలీ, అభయ్ జోధ్‌పుర్కర్ మధ్యప్రదేశీ. తీసిన దర్శకుడు తెలుగువాడు. వీళ్లందరూ కలిసి చేసిన పాట ఇది. కాని ఒక మార్కు ఎక్కువ సిరివెన్నెలకు పడుతుంది. ‘ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీథెలా ఎటు పోతుందో నిదుర ఎపుడు నిదరోతుందో మొదలు ఎలా మొదలవుతుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో’ అని రాసి కొత్త ప్రేమికుల అవస్థను అవస్థ లేకుండా వివరించినందుకు ఒకటి చాలదంటే రెండు కూడా వేయవచ్చు. -
'సాంగ్'రే బంగారు రాజా
ఘంటసాల కర్ణాటక సాంప్రదాయ సంగీతం అభ్యసించినప్పటికీ, హిందూస్తానీ సంగీతం అంటే కూడా ఆయనకు అభిమానం. తాను సంగీతదర్శకత్వం వహించిన సినిమాల్లో పహాడి, దేశ్... మొదలైన హిందూస్థానీ రాగాలను ఉపయోగించారు ఘంటసాల. చినుకులా రాలి... నదులుగా సాగి... వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమా... నా ప్రేమా... నీ పేరే నా ప్రేమా..నదివి నీవూ కడలి నేనూ... మరచిపోబోకుమా... మమత నీవే సుమా... ప్రేమలో ఎవరైనా గెలవడానికి ఇష్టపడతారు. కాని మృత్యువుతో ఎవరు పోటీ పడతారు? ఇద్దరబ్బాయిలు ఇద్దరమ్మాయిలు. వారిలో ఒకబ్బాయి ఒకమ్మాయి తొందరపడ్డారు. అమ్మాయి నెల తప్పింది. పెళ్లి జరిగే వీలు లేదు. పెళ్లి చేసుకునే వీలున్న రెండో అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తొందరపడ్డ అబ్బాయి గత్యంతరం లేని పరిస్థితుల్లో రెండో అమ్మాయిని చేసుకున్నాడు. చాలా క్లిష్టమైన ఆట మొదలైంది. ఇలాంటి ఆట ప్రమాదకరంగా మారి తొందరపడ్డ అమ్మాయి ప్రాణం తీసింది. టీనేజ్ తికమకలు తొందరపాట్లు చూపించ డానికి జంధ్యాల తీసిన ‘నాలుగు స్థంభాలాట’ పెద్ద హిట్. అంత కంటే పెద్ద హిట్ అందులో రాజన్ నాగేంద్ర చేసిన ఈ పాట. దాని కంటే పెద్ద హిట్ దానికి వేటూరి అందుకున్న పద ప్రవాహం. ‘ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే... కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే’... షీర్ పొయెట్రీ. ‘హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ’... బాలూ సుశీల ఈ పాటను టీనేజ్‌లో ఉన్నవాళ్ల వలే ఉత్తేజంతో పాడారు. రేడియో ఈ పాట మీద చాలా మైలేజ్ గెయిన్ చేసింది. ఇప్పటికీ ఆకాశవాణి వివిధభారతికి రోజూ ఒక కార్డు ముక్క ఈ పాట కోసమే వస్తూ ఉంటుంది. తెలుగు యువతీ యువకులు ప్రేమలో పడ్డాక తెలుగులో పాడుకోదగ్గ పాటల్లో ఇది ఒకటి. ఇదే ఒకటి.చిత్రం: నాలుగు స్థంభాలాట (1982) సంగీతం: రాజన్-నాగేంద్ర రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల మౌనమేలనోయి... మౌనమేలనోయి ఈ మరపురాని రేయి... ఎదలో వెన్నెల వెలిగే కన్నుల... తారాడే హాయిలో... చెప్పినవాటి కంటే చెప్పనివే బాగుంటాయి. అర్థం అయిన వాటి కంటే అర్థం కానివే బాగుంటాయి. తెలిసిపోయిన వాటి కంటే తెలుస్తూ ఉన్నవే బాగుంటాయి. ఆమె పరిణతి కలిగిన స్త్రీ. అతడు సున్నితమైన మనసు కలిగిన కళాకారుడు. రోజూ ఇద్దరూ కలుస్తారు. వేరే ఏవేవో మాట్లాడుకుంటారు. కాని లోపల వేరేదేదో జరుగుతుంటుంది. పైకి ఏమిటో చేస్తుంటారు. లోన వేరేది చేయాలని ఉంటుంది. మనసు ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు కోరిక పుడుతుంది. ఒక స్త్రీలోని కోరిక ఈ పాట. ఆ రాత్రి అతడి తలపులు ఆమెను బాధిస్తాయి. కాలి బొటనవేలిని మరొక బొటనవేలితో అదిమి పెట్టమంటాయి. ‘పలికే పెదవి ఒణికినప్పుడు’, ‘ఒణికే పెదవి వెనుకాల’ వేరేదేదో ఉన్నప్పుడు ఆ భావనను తెర మీద చూపించాలనుకోవడం దర్శకుడి భావ స్వేచ్ఛ. తాను ఇష్టపడ్డ మగవాడి గురించి ఆమె స్నానం చేస్తూ ఏకాంతంలో ఆలోచించడం చాలా లలితంగా చూపిస్తాడు. కాని సినిమా చూసి కొందరు అశ్లీలం అన్నారు. ‘మీరూ అదే చేస్తారు గమనించండి’ అని కె.విశ్వనాథ్ సమాధానం ఇచ్చారు. ఏమైనా సాగర సంగమంలో ఈ పాట, ఆ రాత్రి, ఆ ఏకాంతం, అంతే ఏకాంతాన్ని పలికించిన బాలూ, జానకిల కంఠాలు, ఇళయరాజా స్వరం, వేటూరి గీతం... తెలుగులో సున్నితమైన శృంగార ప్రకటనకు ఒక మేలిమి నమూనా. జయప్రద కోసం ఈ పాటను చూడాలి. ఈ పాట కోసం జయప్రదను చూడాలి. జయప్రద కోసం జయప్రదను చూడాలి. జయప్రదమైన పాట ఇది.చిత్రం: సాగర సంగమం (1983) సంగీతం: ఇళయరాజా రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి వందేమాతరం... వందేమాతరం... వందేమాతర గీతం వరుస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తెలుగు సినీ విశ్వవిద్యాలయం కింద చాలా స్కూళ్లు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కె.వి.రెడ్డిది ఒక స్కూలు. విఠలాచార్యది ఒక స్కూలు. దాసరిది ఒక స్కూలు. రాఘవేంద్రరావుది, కె.ఎస్.ఆర్.దాస్ది ఒక స్కూలు. అలాగే మరో స్కూల్ ఉంది. అందులో మాదాల రంగారావు, వేజెళ్ల సత్యనారాయణ, ధవళ సత్యం ఆ తర్వాత కాలంలో టి.కృష్ణ ఇప్పుడు ఆర్.నారాయణమూర్తి తదితరులు వస్తారు. ఒకప్పుడు దేశం బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వందేమాతరం అని నినదించింది. తెల్లదొరలను తరిమికొట్టింది. కాని నల్లదొరల చేత చిక్కింది. ఈ నల్లదొరల బండారం బయటపెట్టడానికి వీళ్లంతా సినిమాలు తీశారు. టి.కృష్ణ దీనిని తన ‘నేటి భారతం’, ‘వందేమాతరం’, ‘దేశంలో దొంగలు పడ్డారు’, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ సినిమాలతో బలంగా చూపించారు. ‘వందేమాతరం’లోని ఈ పాటను స్కూల్ మాస్టర్ అయిన హీరో రాజశేఖర్ ఆలపిస్తాడు. ఊరి పెద్దలే పల్లెల్ని నాశనం చేస్తున్నారని బాధ పడతాడు. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాటతోనే వెలుగులోకి వచ్చాడు. సినారె నాటి వందేమాతరం గీతంలోని ప్రతి పంక్తిని తీసుకొని నేటి పరిస్థితిని చురకలా వేసుకుంటూ వెళతారు. ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది’ అనేది ఇందులో ఒక పంక్తి. పని మొదలవని పథకాలు చూస్తున్న రెండు రాష్ట్రాల ప్రజలకు ఇది సరిపోయేలా ఉంది కదూ?చిత్రం: వందేమాతరం (1985) రచన: సినారె గానం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్‌ఫోన్ కంపెనీలో 16 ఏళ్ల వయసులోనే హార్మోనిస్ట్‌గా పనిచేశారు సి.ఆర్.సుబ్బురామన్. ఆయనకు కర్ణాటక సంగీతం మీద ఎంత పట్టు ఉందో పాశ్చాత్య సంగీతం మీద కూడా అంతే పట్టు ఉండేది. ఈ తూరుపు.. ఆ పశ్చిమం... సంగమించిన ఈ శుభవేళ... పడమటి సంధ్యారాగాలేవో... పారాణి పూసెనులే... యూ ఆవకాయ్... మీ ఐస్‌క్రీమ్... దిజ్ ఈజ్ ద హాట్ అండ్ స్వీట్ లవ్స్ డ్రీమ్స్ ఇవాళ తెలుగు నేలలోని ప్రతి వీధి నుంచి ఒక అబ్బాయో, అమ్మాయో అమెరికాలో చదువుకుంటున్నారు. ప్రతి వాడ నుంచి ఒక జంట అమెరికాలో కాపురం ఉంటున్నారు. ఇక్కడ పుట్టే పిల్లలకు తోబుట్టువులుగా అమెరికాలో కూడా ఎంతో మంది తెలుగు పిల్లలు ఊపిరి పోసుకుంటున్నారు. ఆ పడమర, ఈ తూర్పు విడిపోవడం సాధ్యం కాదు. ఒకరిని వదిలి మరొకరు మనలేని పరిస్థితి వచ్చేసింది. అయితే దీనిని 30 ఏళ్ల క్రితమే కనిపెట్టి సినిమాగా తీసినవాడు జంధ్యాల. సంస్కృతుల సంగమమే కాదు, వైవాహిక అనుబంధాలు కూడా తప్పవని ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడమే దీనికి మార్గమని ఆయన ఆ కథలో సూచిస్తాడు. ‘పడమటి సంధ్యా రాగాలేవో... పారాణి పూసెనులే’... అనడంలో ఒక కవితాత్మక భావం ఉంది. సినిమా కూడా అంతే కవితాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా విజయశాంతి ఈ సినిమాలో ఉన్నంత చక్కగా ఏ సినిమాలోనూ లేదేమో అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ సినిమాకు సంగీతం అందించడమే కాదు, దీనికి టైటిల్ కూడా ఆయనే పెట్టారు. ‘ఏ దేశమైనా ఆకాశం ఒకటే’ అంటారు వేటూరి ఈ పాటలో. అది అర్థం చేసుకుంటే పాస్‌పోర్ట్‌ల అడ్డంకులెరగని విశ్వమానవతత్వం అందరికీ అలవడుతుంది. ప్రపంచం ఒక ఇష్ట కుటుంబంగా మారుతుంది.చిత్రం: పడమటి సంధ్యారాగం (1987) సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి జీవితం సప్తసాగర గీతం/ వెలుగు నీడల వేదం... సాగనీ పయనం కల... ఇల... కౌగిలించే చోట (2) ఆర్.డి.బర్మన్ తెలుగులోకి రావడం ఒక వింత. అప్పుడెప్పుడో ఒకసారి పాడినా తిరిగి ఆశా భోంస్లే గొంతు విప్పడం మరో వింత. జంధ్యాల తీసిన ‘చిన్ని కృష్ణుడు’... పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కాని ఈ పాటను మాత్రం తెలుగువారికి మిగిల్చింది. హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్, హీరోయిన్ ఖుష్బూ అమెరికాలో అలా షికార్లు కొడుతుంటే జంధ్యాల అద్భుతమైన మాంటేజ్‌ను రన్ చేస్తూ ఈ పాటను చూపిస్తారు. దానికి ఆశా గొంతు, బాలూ తోడ్పాటు చాలా వినబుద్ధేసేలా ఉంటాయి. ‘ఈ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్ఛా జ్యోతులు.. ఐక్యరాజ్య సమితిలోన కలిసే జాతులూ’ అని అమెరికా విశేషాలను పాటలో వేటూరి పొదుగుతూనే ఈ అగ్రరాజ్యం దానికదే ఊడిపడలేదని ‘కృషి ఖుషి సంగమించే చోటు’ కనుకనే సాధ్యమైందని అంటారు. ఆర్.డి.బర్మన్, ఆశా భోంస్లే సహజీవనం చేశారనే సంగతి సంగీతాభిమానులకు తెలుసు. బర్మన్ తెలుగులో మొదటిసారి చేస్తున్నాడు కనుక ఆమెతో పాడించడం సులువయ్యింది. ఇదే సినిమాలో ‘మౌనమే ప్రియా గానమై’ అనే పాట టిపికల్ ఉత్తరాది తరహాలో ఉంటుంది. పాడింది మన జానకి. వింటుంటే లతా, ఆశా... సరేనయ్యా మన జానకమ్మకు ఏం తక్కువయ్యా అని అనబుద్ధేస్తుంది.చిత్రం: చిన్నికృష్ణుడు (1988) సంగీతం: రాహుల్ దేవ్ బర్మన్ రచన: వేటూరి గానం: ఆశాబోంస్లే, ఎస్.పి.బాలు లాలూదర్వాజ లస్కరు బోనాల పండుగకు వస్తనని రాకపోతివి.. లక్డీకాపూలు పోరికి లబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి... పాత రోజుల్లో శోభనం గదిలో పెళ్లికొడుకు పెళ్లికూతురితో ‘ఏదైనా పాట పాడు’ అనంటే ఆ అమాయక పెళ్లి కూతురు ఏ చోటులో ఎటువంటి పాట పాడాలో కూడా తెలియక చాలా హుషారుగా తన పల్లె స్వభావంతో ‘పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులోయమ్మ తుమ్మెదా’ అని అందుకుంటుంది. తెలుగువారికి ఆ పాట ఒక హుషారైన నవ్వులు చిందే జ్ఞాపకం. తమిళం వాళ్లు దీనిని పట్టుకున్నారు. క్షత్రియ పుత్రుడు సినిమాలో పెళ్లి కూతురిని పాడమంటే ‘సన్నజాజి పడకా మంచె కాడ పడకా’ అని నోటి దరువుతో అందుకుంటుంది. ఏ సంస్కృతి మీద దృష్టి పెడితే ఆ సంస్కృతి నుంచి ఒక మంచి పాట తన్నుకు రావడానికి ఏ అడ్డంకీ ఉండదు. ‘మొండిమొగుడు పెంకిపెళ్లాం’ సినిమాలో విజయశాంతి తెలంగాణ ప్రాంతం నుంచి వస్తుంది. పెద్ద ఆఫీసర్ల పార్టీలో ఎవరో ఆమెను పాట పాడమంటారు. ఇంకేముంది? తెలంగాణ సొగసు నుంచి ఈ పదం అందుకుంటుంది. ‘యాడికో ఉర్కుతాడని యేసినా ముక్కుతాడుని’ అని మొగుణ్ణి కవ్విస్తూ పాడుతుంటే ఆ మజా వేరుగా ఉంటుంది. తెలంగాణ గ్రామీణ సౌందర్యం ఉండేలా పాటలు రాయడంలో సాహితి సిద్ధహస్తుడు. బోనాల పండుగకు ఒక కవిగా అతడల్లిన పూల పేర్పు ఈ పాట... లాలూ దర్వాజ్ లష్కర్...చిత్రం: మొండిమొగుడు పెంకిపెళ్లాం (1992) సంగీతం: కీరవాణి రచన: సాహితి గానం: ఎస్.పి.శైలజ -
'సాంగ్'రే బంగారు రాజా
‘మాయాబజార్’లోని ‘వివాహభోజనంబు వింతైన వంటకంబు’ పాట ‘లాఫింగ్ పోలిస్‌మ్యాన్’ అనే పాత ఇంగ్లిష్ పాటకు అనుకరణ. ఆ పాటలోని పోలిస్ నవ్వు ఘటోత్కజుడుకి షిప్ట్ అయిందన్న మాట! దేశమ్ము మారిందోయ్... కాలమ్ము మారిందోయ్ కష్టాలు తీరేనోయ్... సుఖాలు నీవేనోయ్... ఆనకట్టలు మన ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణాన్ని అందులో ప్రజలు పాల్గొనవలసిన అవసరాన్ని బోధిస్తూ హిందీలో ‘జాగ్తే రహో’, ‘దో ఆంఖే బారా హాత్’ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తెలుగులో రాముడు-భీముడు సినిమాలో కొంత ఆ స్పర్శను చూపిస్తూ ఈ పాటను కల్పించారు దర్శకుడు తాపీ చాణక్య. కొసరాజు గ్రామీణ సొగసును రాసే కొసరాజు తన శైలికి భిన్నంగా లభించిన ఈ అవకాశాన్ని అవలీలగా సక్సెస్ చేశారు. ‘కండల్ని కరగదీయి బండల్ని విసరి వేయి నీదేలే పై చేయి’ అని చెప్పే ఈ పాట తప్పనిసరిగా ప్రస్తావించదగ్గ మంచి పాట. అన్నట్టు ఎల్.విజయలక్ష్మి ఈ పాటకు ముద్దుచుక్క. తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా... దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా అల్లూరి సీతారామరాజు తెలుగుజాతికి నిత్య స్ఫూర్తి. ‘ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు’ అని తెల్లవాడిని ప్రశ్నించిన ధీశాలి. సాధారణ ప్రజలు నిజానికి బ్రిటిష్ అగత్యాలను నేరుగా భరించలేదు. ఆ కష్టాలు పడిందంటే గిరిజనులే. వీరి కోసం మొదటగా గెరిల్లా పోరు సలిపినవాడు అల్లూరి. ఆ వీరుడి మీద సినిమా తీసి నటుడు కృష్ణ చిరకీర్తిని పొందాడు. అతడి తేజాన్ని పాటగా మార్చి శ్రీశ్రీ జాతీయ అవార్డు పొందాడు. సంగీతం ఆదినారాయణరావు. అయితే పాటలో విశేషం ఉంది. అప్పటికే ఘంటసాల అనారోగ్యం బారిన పడ్డారు. శ్రీశ్రీ అన్ని చరణాలు ఆయన పాడలేకపోయారు. సహాయకునిగా రామకృష్ణ రంగప్రవేశం చేసి పాటను పూర్తి చేశారు. చాలా మంది ఈ పాటను ఘంటసాల ఒక్కరే పాడారని అనుకుంటారు. కాని రామకృష్ణ తోడ్పాటు ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్రతి మనిషి సింహాలై గర్జించాలి’ అని తెలుగు వారి గర్జనను వినిపించిన పాట ఇది. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక / ఒక రాధిక అందించెను నవరాగ మాలిక సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో... నవ మల్లిక చినబోయెను చిరునవ్వు సొగసులో... జి. ఆనంద్ తెలుగు సినిమాల్లో తక్కువ పాడినా ఆ కొద్ది పాటలతోనే తన ప్రభావం వేయగలిగాడు. మొదట కోరస్ గాయకుడిగా మొదలైతే సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ‘అమెరికా అమ్మాయి’లో ఈ పాట పాడే అవకాశం ఇచ్చి నలుగురి దృష్టిలో పడేలా చేశాడు. ‘సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో’.... అని ఆనంద్ పాడుతుంటే వినబుద్ధేస్తుంది. జి.ఆనంద్ మరో సినిమాలో జి.ఆనంద్ పాడిన ‘దూరాన దూరాన తారాతీరం’ కూడా హిట్టే. ‘దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ’ డ్యూయెట్ కూడా హిట్టే. అన్నట్టు 1975లో ‘చుప్ కే చుప్కే’ విడుదలైంది. అందులోని ‘చుప్ కే చుప్కే చల్ రే ఫుర్వయ్యా’ పాట ఆ 1976లో వచ్చిన ‘ఒక వేణువు వినిపించెను’ పాటకు ఇన్స్పిరేషన్. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో... రవి చూడని... పాడని నవ్యనాదానివో... ఏ రాగమో తీగదాటి ఒంటిగానిలిచే ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై... రవి చూడనిది కవి చూస్తాడని అంటారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మ, పైన నిత్యం తేజస్సును వెదజల్లే సూర్యభగవానుడు వీరిద్దరూ చూడని తాను మాత్రమే చూస్తున్న అందమని తన ప్రియురాలిని ఈ ప్రియుడు బుట్టలో వేసుకుంటున్నాడు. ‘రావణుడే రాముడైతే’ పెద్దగా జనాకర్షణ పొందలేదు కాని ఈ పాట పెద్ద హిట్ అయ్యి నిలిచింది. ‘ఏ గగనమో కురుల జారి నీలమై పోయే... ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే’... వేటూరి భావుకత్వం జి.కె.వెంకటేశ్ కంపోజింగ్ సౌందర్యం... వెరసి ఈ పాట.బాలు నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి... నా దాహం తీరనిది... నీ హృదయం కదలనిది దీనిని రాసిన ఆత్రేయకు ఈ పాటంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం పాడటం ఇష్టం. ‘బాలూ ఫీలవుతూ పాడతాడు. వేరేవాళ్లు పాడటానికి ఫీలవుతారు’ అని ఆత్రేయ జోక్. ‘ఇంద్రధనుస్సు’ సినిమాను అందరూ మర్చిపోయారు. కాని ఈ పాటను ఎప్పటికీ మర్చిపోలేకున్నారు. ఇందులో ప్రేమికుడి దుఃఖమేదో ఉంది. వేడుకోలు ఉంది. ఎవరికీ చెప్పుకోలేని జీర ఉంది. ‘నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది’... అంటుంటే ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవాళ్లంతా ఐడెంటిఫై అవుతారు. కె.వి. మహదేవన్ను ప్రత్యేకంగా పొగడాల్సిన పని లేదు. ప్రతిసారీ పొగడాలంటే మన వల్ల కూడా ఎక్కడవుతుంది చెప్పండి. -
'సాంగ్'రే బంగారు రాజా
‘శంకరాభరణం’ సినిమాలో సంగీత, సాహిత్యాల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ సినిమా విజయం తరువాత నిర్మాత ఏడిద నాగేశ్వరరావు (చెన్నై), డిస్ట్రిబ్యూటర్ కె.ఆర్.ప్రభు (బెంగళూరు)లు కట్టుకున్న ఇళ్లకు ‘శంకరాభరణం’ అని పేరు పెట్టుకున్నారు. శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... శంకరా నాద శరీరా పరా... వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా... పాశ్చాత్య సంగీతపు పెను తుఫాను మొదలయ్యింది. దమ్మారో దమ్... మిట్ జాయే గమ్... మోగిపోతు న్నాయి. త్యాగయ్య, క్షేత్రయ్య పాత చింతకాయ పచ్చడి. సరిగమ పదనిస... అదో పెద్ద నస. ఇలాంటి టైములో ముక్కు ముఖం తెలియని ఒక శాస్త్రిగారు, నామాలు పెట్టుకుని, ధోవతి చుట్టుకుని, గోదారి ఒడ్డున తిరుగుతూ సంగీతం.. సంగీతం అంటూ ఉంటే ఎవరు చూస్తారు? ప్రజలే చూస్తారు. చూశారు. చూస్తూ చెప్పుకుంటూనే ఉన్నారు. అమ్మను నాన్నను పుట్టిన ప్రాంతాన్ని ఈ మట్టి ఇచ్చిన సంస్కృతిని స్వీకరించడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉండరు? మధ్యలో వచ్చిన భ్రాంతిని తొలగించుకోవడానికి ఎవరు మాత్రం అడ్డు చెప్తారు? ‘ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలాగ అంటాడు. ఎదురుదెబ్బ తగలిన బిడ్డ అమ్మా అని మరొకలాగ అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది. శ్రుతి ఉంది. స్వరం ఉంది’ అన్న శంకరశాస్త్రి తాను నమ్మినదానిని ఎంత గట్టిగా ఆచరిస్తాడో తనను నమ్మి వచ్చిన ఆమెకు కూడా అంత గట్టిగా రక్షణ ఇద్దామనుకుంటాడు. కాని లోకం అనుమానించింది. ఆయనను పరాభవించింది. తన ఆత్మలో దోషం లేదు. అది నిప్పు. తన అర్చనలో దోషం లేదు. అది లావా. అందుకే కుండపోతలో స్వరం కదలాడింది. పరమేశ్వరుడి ఎదుట పెనుగులాడింది. ‘నాదోపాసన చేసినవాడను నీవాడను నేనైతే’... ‘నిర్నిద్రగానం’ వినిపిస్తాను విను అంటాడు శంకరశాస్త్రి. ‘పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా’ ఆ వాన ఆ మెరుపులకు మనం కూడా భయపడిపోతాము. వెండితెరపై గొప్ప గాన సృష్టి ఇది. ఆనందవృష్టి.శంకరాభరణం (1980) సంగీతం: కె.వి.మహదేవన్ రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా... పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మ... అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై... ముద్దుకే పొద్దు పొడిచె... అబ్బాయి సద్బ్రాహ్మణుడు. అమ్మాయి నియమాలు పాటించే క్రిస్టియన్. కాని హార్మోనియం పెట్టెకు జంధ్యం లేదు. పోనీ అది బాప్టిజం తీసుకోలేదు. స..ప..స... ఏ మతం వాడైనా పలకొచ్చు. అదే స్వరం. ప్రేమను ఏ కులం వారైనా ప్రకటించవచ్చు. అదే జ్వరం. పాట వాళ్లిద్దరినీ కలిపింది. పాటే వారిని కోనేట్లో తామరల్లా విప్పారేలా కూడా చేసింది. అంతవరకూ లేని ఒక దృశ్యం అంతవరకూ సాధ్యం కాని ఒక గమనం తెర మీదకు తీసుకొచ్చి చూపినవాడు భారతీరాజా. సీతాకోక చిలుక కోసం తన చిన్ననాటి స్నేహితుడు ఇళయరాజాను పాటలు అడిగి నప్పుడు వేరే దర్శకులైతే ఏవో అబ్జెక్షన్స్ చెప్పొచ్చు... కాని ఈ స్నేహితుడి ముందు స్వేచ్ఛగా తాననుకుంటున్నది చూపవచ్చు. ఇంకేముంది... ఇళయరాజా ఏడు మెట్ల కోనేట్లోకి దిగాడు. తోడు వేటూరినీ దింపాడు. ఆ భావుకుల ముఖాన తొలి ఎండ పడింది. పల్లవి కోరస్‌తో మొదలైంది. ‘అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూల జల్లులై.. ముద్దుకే పొద్దు పొడిచె’... ఒకే మాటను వేరువేరు భావాలతో పలికించడం వేటూరి సరదా. ‘ఓ... చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే’... అనడంలో చమక్కు ‘దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా’ అనడంలో మనకే దప్పిక వేయించగల చమత్కారం.. భేషో. అన్నట్టు ఈ పాటలో కోనేట్లో కంఠం వరకూ దిగిన కార్తిక్, ముచ్చర్ల అరుణ చుట్టూ తామరలు చకచకా పరుగులు తీస్తుంటాయి. నీళ్లల్లో పూర్తిగా మునిగి అలా తామర్లను కదిలించింది ఎవరో తెలుసా? ఇటీవల మరణించిన ప్రసిద్ధ నటుడు మణివణ్ణన్, ఇప్పటి తమిళ కమెడియన్ మనోబాల. వీళ్లిద్దరూ భారతీరాజా శిష్యులు. చిత్రం ఏమిటంటే షాట్ అయ్యాక కూడా వీళ్లు నీళ్లలోనే ఉంటే యూనిట్ వీళ్లను వదిలి వెళ్లిపోయిందట. వారి కష్టం... మనకు ఈ పాట మిగిల్చిన సౌందర్యం. పొందు ఆరాటాల... పొంగు పోరాటాలా...చిత్రం: సీతాకోకచిలుక (1981) సంగీతం: ఇళయరాజా రచన: వేటూరి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్నొ రువ్వి ఎన్నెన్ని కలలు తెప్పించావే పొన్నారీ... కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి... హంగ్రీ సెవంటీస్. ఎక్కడ చూసినా ఆకలి. నిరుద్యోగం. ఇళ్లల్లో వయసుకొచ్చి చేతిలో పట్టాలు పుచ్చుకొని తండ్రి సంపాదన తినలేక స్వశక్తితో సంపాదించలేక అస్థిమితంతో రగులుతున్న యువత. నో వేకన్సీతో తిప్పలు. దీనిని చూపున్నవాడు పసిగడతాడు. బాలచందర్ ‘ఆకలి రాజ్యం’ తీశాడు. కాని జీవితం అంటే ఉత్త ఆకలే కాదు ప్రేమ ఉంటుంది. కొంచెం ఇష్టం ఉంటుంది. మంచి పాట కూడా ఉంటుంది. అందరూ పాటలు పెడతారు. బాలచందర్ కొత్త తరహాగా పెడదామనుకున్నాడు. హీరోయిన్ స్వరం ఇస్తూ ఉంటుంది హీరో ఆ స్వరానికి తగ్గ పదం పాడాలి. ‘తననా తననా అన్నా తానా అన్న రాగం ఒకటే కదా’... శ్రీదేవి, కమలహాసన్ ఈ పాటలోనే ఒకరికి మరొకరి మీదున్న ఇష్టాన్ని కనుగొంటారు. ‘నీవు... నేను.. అని అన్నా... మనమే కాదా’ అనడం చేతులు కలుపుకోవడం గుడ్డిలో మెల్ల. గుడ్డి ఎందుకంటే నిరుద్యోగం. అందులో మెల్ల ఈ ప్రేమ. మనుషులు ఎంత నిరాశలో కూడా ఏదో ఒక ఆశను వెతుక్కుంటారు. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు వింటే ఈ పాట కొంచెం సరదా పుట్టిస్తుంది. ఆమె స్వరానికి మనం పాడుతున్న ఫీలింగ్ ఇచ్చి సరి చేస్తుంది. పాడండి... ‘సంగీతం... నువ్వైతే... సాహిత్యం నేనవుతా’...చిత్రం: ఆకలి రాజ్యం (1981) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి -
'సాంగ్'రే బంగారు రాజా
కదలింది కరుణరథం / సాగింది క్షమా యుగం మనిషి కొరకు దైవమే / కరిగి వెలిగే కాంతిపథం తెలుగులో పౌరాణికాలు అనేకానేకం. అసలు భారతీయ సినిమానే హరిశ్చంద్రుని కథతో మొదలయ్యింది. శకుంతల, దుష్యంతుడు, రాముడు, శ్రీకృష్ణుడు... వీళ్లందరి మీద సినిమాలు తీయడానికి తీసిన సినిమాలు చూడటానికి ఏ ఇబ్బందీ లేదు. కాని ఏసుక్రీస్తు మీద అంతవరకు ఎవరూ సినిమా తీయలేదు. తీస్తే చూస్తారో లేదో తెలియదు. కాని నటుడు విజయచందర్ ఈ ఒక్క సినిమా తీయడానికే పుట్టినట్టున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా ఆగకుండా ‘ప్రేమ, కరుణ, సేవ’లను బోధించిన ఏసుక్రీస్తును ప్రజలకు చేరువ చేయాలని ప్రవక్తల జీవితానికి కులం, మతం, ప్రాంతం వంటి అడ్డంకులు ఏమీ లేవని ఒక మతంగా కాకపోయినా కనీసం ఒక చరిత్రగా అయినా ఈ కథను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఆయన ఈ సినిమా తీశాడు. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒకెత్తు. అంతటి కరుణామయునికి శత్రువుని కూడా ప్రేమించగలిగిన మహోన్నతునికి శిలువ వేసి ఊరేగిస్తుంటే చూసిన ప్రతి కన్నూ చెమ్మగిల్లుతుంది. మరి ఆ సందర్భానికి కలం ఎన్ని వెక్కిళ్లు పెడుతుంది? ‘కదిలింది కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే’.... హిందీలో గొప్ప వైష్ణవ భక్తి గీతాన్ని నౌషాద్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడాడు. ఇక్కడ ఏసుక్రీస్తు పాత్రను విజయచందర్ పోషిస్తుంటే బాలూ అద్భుతమైన విషాదంతో ఆ వీడ్కోలు గీతాన్ని పాడుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మతం- మనిషి పైకి పెట్టుకున్న జీవిత విధానం. లోలోన అందరిది ఒకటే మతం. అది మానవతా మతం. మోదుకూరి జాన్సన్ రాసిన ఈ సుదీర్ఘమైన పాటను బాలు పాడిన తీరు ఎన్నిసార్లు విన్నా శ్రోతను కళ్లనీళ్ల పర్యంతం చేస్తుంది. మనుషుల్లో కరుణ అడుగంటిన ప్రతి సందర్భంలోనూ వారిని కరిగించే పాట ఇది. కనికరం కలిగించే పాట.చిత్రం: కరుణామయుడు (1978) సంగీతం: జోసెఫ్ ఫెర్నాండేజ్, బి.గోపాలం రచన: మోదుకూరి జాన్సన్ గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం జోరు మీదున్నావు తుమ్మెదా.. నీ జోరెవరి కోసమే తుమ్మెదా.. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా.. నీ ఒళ్లు జాగరతె తుమ్మెదా సినిమా వాళ్ల మీద సినిమాలు తీయడం తమిళంలో ఎక్కువ. తెలుగులో హీరో హీరోగా మారడం హీరోయిన్గా మారడం కథలో భాగంగా చూపించినా అసలు కథే ఒక హీరోయిన్ జీవితాన్ని చర్చించడం ‘శివరంజని’లో కనిపిస్తుంది. దీనికి దాదాపు ఆరేళ్ల తర్వాత వంశీ ‘సితార’ వచ్చింది. గాత్రం, లావణ్యం ఉన్న పల్లెటూరి అమ్మాయి మోసగాడి వలలో చిక్కి మద్రాసు చేరి సినీ తారగా గొప్ప స్థానం సంపాదించినా బంధువుల చేతిలో నానా బాధలు పడుతూ భర్త చేతిలో కష్టాలు పడుతూ ఓదార్పుగా ఒక స్నేహితుణ్ణి వెతుక్కుందామనుకుంటే అక్కడా అడ్డంకులు ఏర్పడి- తెర మీద కష్టాలు ఎదుర్కోవడం చేతనవుతున్నది కాని నిజజీవితంలో ఈ కష్టాన్ని ఎదుర్కోవడం చేత కాక ప్రాణాలు విడిచే దురదృష్టవంతురాలి కథ ఇది. ఫ్లాష్ బ్యాక్‌లో ఏక్తారా మోగించుకుంటూ జయసుధ పాడే ఈ పాట రమేశ్‌నాయుడి మేలిమి సృజనాత్మకతల్లో ఒకటి. దానికి సినారె పల్లెపదాలు జతపడటం మరింత అందం తెచ్చింది. ‘ముస్తాబు అయ్యావు తుమ్మెదా... కస్తూరి రాశావు తుమ్మెదా...’ పల్లెల్లో పెరిగినవాళ్లకే ఈ కస్తూరి పరిమళం అబ్బుతుంది. సుశీల గానంలో క్రాఫ్ట్ తెలియాలంటే ఈ పాట వినాలి. ఫ్లా లెస్.చిత్రం: శివరంజని (1978) సంగీతం: పి.రమేశ్ నాయుడు రచన: సి.నారాయణరెడ్డి గానం: పి.సుశీల మౌనమె నీ భాష ఓ మూగ మనసా... ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు... కల్లలు కాగానే కన్నీరౌతావు హృదయం గుండె కాదు. మనసు మెదడు కాదు. కొన్ని స్పందనలు హృదయం చేస్తుంది. కొన్ని మాయలకు మనసు లోనవుతుంది. మనసు- ఇది పిచ్చిది. వెర్రిది. పసిది. ఇదే ఒక్కోసారి జడల దయ్యం. మరోసారి కదలని మెదలని బండరాయి. దీని ధాటికి పతాకంలా ఎగిరినవారు ఉన్నారు. దీని దెబ్బకు పండులా రాలినవారు ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ, కోరిక- స్త్రీ పట్ల పురుషుడికి, పురుషుడి పట్ల స్త్రీ- ఈ విషయంలో మనసు వెయ్యి గొంతులతో ఊళ వేసే తుఫానుగాలిలా మారుతుంది. అంతలోనే కామరూపిగా మారి వేణువులో సన్నిటి శ్వాసలా ఇమిడిపోతుంది. ‘గుప్పెడు మనసు’ సినిమాలో శరత్‌బాబు, సుజాత, సరితల మధ్య చోటు చేసుకునే ఆకర్షణ వికర్షణలకు మనసే హేతువు. ఆ సందర్భానికి పాట కావాలి. ఎమ్మెస్ విశ్వనాథన్ రెడీ. ఆత్రేయ రెడీ. పాటకు మాత్రం మనసంత లోతైన గళం కావాలి. మనసంత ఉన్నతాలకు చేరే స్వరం కావాలి. జవాబు తోచింది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. ఆయన పాటకు అంగీకరించాడు. మైక్రోఫోన్ ఎదుట గొంతు సవరించుకున్నాడు... అంత పెద్ద భూతం చిన్న సీసాలో దూరినట్టుగా అనంత భావాల అగాథమైన మనసూ ఒక చిన్న పాటలాగా అమరిపోయింది. ‘లేనిది కోరేవు ఉన్నది వదిలేవు... ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు’.... మనసును తేల్చి చెప్పడానికి ఇంతకు మించిన పంక్తి ఏముంది... పదం ఏముంది? ఎల్లకాలమూ మనసులు గెలిచే పాట ఇది.చిత్రం: గుప్పెడు మనసు (1979) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ -
'సాంగ్'రే బంగారు రాజా
ఆ రోజుల్లో రైల్వేస్టేషన్లలో రైలు ఆగినప్పుడు పెట్టె పెట్టె తిరిగి గ్రాంఫోన్ రికార్డ్‌లు అమ్మేవారు. వాటికి మంచి ఆదరణ ఉండేది. శ్రోతల దగ్గరికే సంగీతం నడిచివచ్చేదన్నమాట! పాడనా తెనుగు పాట... పాడనా తెనుగు పాట... పరవశమై మీ ఎదుట మీ పాట... పాడనా తెనుగు పాట... కోవెల గంటల గణగణలో... గోదావరి తరగల గలగలలో... ఇవాళ్టి పాటల్లో అప్పుడప్పుడు తెలుగు కూడా వాడుతున్నారు. ఒకప్పుడైతే అంతా తెలుగే వాడేవారు. జోరుగా హుషారుగా షికారు పోదమా అనడంలో ఎంతో అందం ఉంది. షాంఘై పిల్లో... స్లీపింగ్ బ్యూటో... థండర్ బుల్లో... వెల్డన్ జిల్లో... అని రాస్తే డోకొస్తుంది తప్ప పాట రాదు. డెబ్బైలలో అందరూ పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులు కావడం మనదేశంలో ఏముందండీ బొంద అనడం ఫ్యాషనైపోయింది. దానిని నిరోధించడానికి హిందీలో మనోజ్ కుమార్లాంటివాళ్లు సినిమాలు తీశారు. తెలుగులో అమెరికా అమ్మాయి, శంకరాభరణం లాంటి సినిమాలు వచ్చాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకమ్మాయి తెలుగింటి కోడలుగా మారి, ఇక్కడి వేష భాషలకు గౌరవం ఇచ్చి, ఇక్కడి తెలుగుకు విలువ ఇచ్చి ఇక్కడి వారి భేషజాన్ని దూరం చేస్తుంది ‘అమెరికా అమ్మాయి’ సినిమాలో. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆలోచనకు జి.కె.వెంకటేశ్ సంగీతం కుదిరింది. ఇటువంటి సందర్భానికి కృష్ణశాస్త్రి కలం తెలుగు నుడిలో ఈతలు కొట్టి అవలీలగా ఒడ్డుకు చేరుతుంది. ‘ఒక పాట... పాడనా తెనుగు పాట’ అని సుశీల పాడుతుంటే శరీరం రోమాంచితం అవుతుంది. ‘మావుల తోపుల మూపుల పైన మసలే గాలుల గుసగుసలో’ తేలియాడి వచ్చే ఆ తెలుగు పాటకు నమస్కరించిన ఈ సినిమాకు వందనం. ఇద్దరు తల్లుల పెట్టని కోట- తెలుగు రాష్ట్రాల ప్రతినోట- ఒక పాట- పాడనా తెలుగు పాట....చిత్రం: అమెరికా అమ్మాయి (1976) సంగీతం: జి.కె.వెంకటేశ్ రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: పి.సుశీల చిత్రం భళారే విచిత్రం... చిత్రం అయ్యారే విచిత్రం... / నీ రాచనగరకు రారాజును రప్పించుటే విచిత్రం... /పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం సుయోధనుడు ఈర్ష్యాపరుడు. జిత్తులమారి. దుష్టచతుష్టయంలో ఒకడు. ఇది నిజమే కావచ్చు. లేదంటే పాండవుల ప్రచారం కావచ్చు. కాని అతడు ఒక సంపూర్ణమైన పురుషుడు. తన పట్టమహిషికి మానస వల్లభుడు. అతడికీ లతలంటే ఇష్టం ఉండొచ్చు. పుష్పోద్యానవనాలంటే కుతూహలం ఉండొచ్చు. మంచి రసభరితమైన రాత్రి భార్య వేళ్లకు చుట్టిన తమలపాకు చిలకలను మునిపంట కొరకాలనే కోరిక కలిగి ఉండవచ్చు. అది ఎందుకు చూపించకూడదు అనుకున్నారు ఎన్.టి.రామారావు. అది విని హవ్వ అని నోరు నొక్కుకున్నారు. కవి సి.నారాయణ రెడ్డి మాత్రం భళా అని కలం అందుకున్నారు. పాట సిద్ధమైంది. చిత్రం... అయ్యారే విచిత్రం... భళారే విచిత్రం.... ఎన్.టి.ఆర్, ప్రభల మీద ఆ పాట తెర మీద వస్తూ ఉంటే విమర్శిద్దామనుకున్నవాళ్లు నోళ్లు వెళ్లబట్టారు. అందులోని రాజసంతో నిండిన శృంగారానికి సలాం కొట్టారు. ‘ఎంతటి మహరాజైనా ఎపుడో ఏకాంతంలో... ఎంతో కొంత తన కాంతను స్మరించడమే సృష్టిలోని చిత్రం’ అనంటే ఆ మాట నిజమే కదా అని చప్పట్లు కొట్టారు. పెండ్యాల ట్యూన్‌ను వింటే ఒరిజినల్ సుయోధనుడు కూడా భేష్ అనాల్సిందే. పాట పాడేటప్పుడు ఎన్టీఆర్ బాలూను పూనడం చూడొచ్చు. ఇక సుశీలమ్మ అంటారా... మాయూరే- కోయిల కూడా ఈర్ష్య పడే గళం.చిత్రం: దాన వీర శూరకర్ణ (1977) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు రచన: సి.నారాయణరెడ్డి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల యాతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు దేవుడి గుడిలోదైనా... పూరిగుడిసెలోదైనా... గాలి యిసిరికొడితే ఆ దీపముండదు ‘ప్రాణం ఖరీదు’ ఎంత అని డెబ్బైలలో నాటక రచయిత సి.ఎస్.రావు ప్రశ్నించారు. దానికి జనం ఇప్పటికీ సమాధానం వింటూనే ఉన్నారు. కల్తీ మద్యం తాగితే ఇంత, గేట్లు లేని క్రాసింగ్ దగ్గర రైలు కింద పడి చచ్చిపోతే ఇంత, వేగం అదుపు చేయకపోవడం వల్ల ప్రైవేటు బస్సు బోల్తా పడితే ఇంత, ఆడపిల్లను అర్ధరాత్రి తోడేళ్ల వలే కమ్మేస్తే ఆ రేటు కొంచెం చూసుకుని మరీ ఇంత, క్వారీలో మనిషి కూలిపోతే ఇంత, కల్తీ సిమెంటు వంతెన విరిగి పడితే ఇంత... ప్రభుత్వాలు, వ్యవస్థ మనిషి ప్రాణానికి రేటు కడుతూనే ఉన్నాయి. అన్నీ పేదవాళ్ల ప్రాణాలే. నోరు లేని వాళ్ల ప్రాణాలే. అమాయకుల ప్రాణాలే. పెద్ద ధనవంతుడెవరైనా ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లో పోయినట్టుగా వినం. ఎక్స్‌గ్రేషియా తీసుకున్నట్టుగా కూడా వినం. గతిలేని వాళ్లకే ఎక్స్‌గ్రేషియా పడేస్తారు. కాని వీరంతా నిజంగా వేరు వేరా? వీరు ఎక్కువా? వారు తక్కువా? ‘అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే సీము నెత్తురులు పారే తూము ఒక్కటే’ అని కవి అంటాడు. అది పుట్టుక ఒకటే అయినప్పుడు ఈ హెచ్చుతగ్గులు ఎందుకు. ‘మేడ మిద్దెలో ఉన్నా సెట్టు నీడ తొంగున్నా నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే’... వాడూ ఏం పట్టుకెళ్లడు. వీడూ ఏం పట్టుకెళ్లడు. మరి ఎందుకు ఈ పీడన? బీదోడికి దండన? మహాకవి జాలాది రాసిన ఈ పాటకు మరణం లేదు. కనీసం పేదరికం ఉన్నంతకాలమైనా లేదు. నాటకం ఆధారంగా తీసిన ఈ సినిమా చిరంజీవికి పెద్ద గుర్తింపు.చిత్రం: ప్రాణం ఖరీదు (1978) సంగీతం: కె.చక్రవర్తి రచన: జాలాది గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం -
'సాంగ్'రే బంగారు రాజా
ఉర్రూతలూగించే సినిమా పాటలే కాదు ‘ఇళయరాజా క్లాసికల్స్ ఆన్ మాండోలిన్’ ఆల్బమ్‌లో కొన్ని కృతులను కర్ణాటక సంప్రదాయంలో స్వరపరిచారు ఇళయరాజా. పూజలు చేయ పూలు తెచ్చాను / నీ గుడి ముందే నిలిచాను... తీయరా తలుపులను రామా... ఇయ్యరా దర్శనము... రామా... దొరికిన దేవతను పూజించు. కరుణించని దేవతను వదిలిపెట్టు. వశమైన ప్రభువునే సేవించు. జారిపోయిన విభుడిని వదిలిపెట్టు. వివాహానికి ముందు మనసు అనే అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు కనపడుతూ ఉంటాయి. కవ్విస్తూ ఉంటాయి. ఉలికులికి పడేలా చేస్తుంటాయి. కాని వివాహం అయ్యాక ఒకే ప్రతిబింబం స్థిరపడిపోతుంది. అదే చిత్తరువులా మారి గోడకు వేలాడుతుంది. ‘పూజ’లో హీరో రామకృష్ణ వేరొకరిని ప్రేమిస్తాడు. కాని వాణిశ్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇది కుండ అని ఈ నీరు చల్లనైనవని గ్రహించడు. ప్రవాహం కోసం అర్రులు చాస్తుంటాడు. ఆ ప్రవాహం తన మానాన తాను ప్రవహించిపోయిందని తెలుసుకున్నాక తాను ఇంతకాలం ఏం కోల్పోయాడో తెలుసుకుని లెంపలేసుకుంటాడు. వాణీ జయరామ్ ఈ పాటను తన లగ్న పరిచిన గానంతో పవిత్రం చేస్తుంది. దాశరథి రచన అందుకు కావలసిన తులసి పదాలను అందిస్తుంది. ఇక రాజన్ - నాగేంద్ర శ్రద్ధ తెలుస్తూనే ఉంటుంది. 1971లో హిందీలో ‘గుడ్డీ’ వచ్చింది. అందులో వాణీ జయరామ్ పాడిన ‘బోల్ రే పపీహరా’ పాట పెద్ద హిట్. దానిని కొంచెం సులభం చేసుకుంటే ‘పూజలు చేయ పూలు తెచ్చాను’...చిత్రం: పూజ (1975) సంగీతం: రాజన్-నాగేంద్ర రచన: దాశరథి గానం: వాణీ జయరామ్ దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... ఇక ఊరేల? సొంత ఇల్లేల? ఓ చెల్లెలా / ఏల ఈ స్వార్థం..? ఏది పరమార్థం...? నన్నడిగి తలిదండ్రి కన్నారా..? నా పిల్లలే నన్నడిగి పుట్టారా? / పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా... ఈ దేశంలో మధ్య తరగతి ఒక పెద్ద బజార్. అక్కడే సరుకులుంటాయి. కొనలేము. అక్కడే మనుషులుంటారు. అమ్మలేము. సరుకులు కావాలంటే డబ్బులు కావాలి. పెళ్లి కావాలంటే కట్నం ఇవ్వాలి. ఆడపిల్లలున్న తండ్రి పరారవుతుంటాడు. బాధ్యత మోయాల్సిన అన్న తాగుబోతు అవుతుంటాడు. ఉన్న చెల్లెలికి ఎప్పటికీ పెళ్లి కాదు. తల్లికి జబ్బు అసలే తగ్గదు. ఒక తమ్ముడికి పోలియోనో చూపు ఉండదో. ఇక బజారు ఎలా నడవాలి? ఈ ఇంట్లో కనీసం అరవై కాండిళ్ల బల్పు ఎలా వెలగాలి? అలాంటప్పుడే ఎవరో ఒకరు మోస్తారు. అన్నీ తలకెత్తుకుంటారు. పంటి బిగువున బాధ దిగమింగుతూ ఇంటిని ఒంటి చేత్తో లాగుతారు. ‘అంతులేని కథ’లో జయప్రద లాంటి అక్క అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది ఈ దేశంలో. ఏమో... అందరం బాగుపడతామేమో... ఎప్పటికైనా మంచి జరుగుతుందేమో... కాని మర్యాదల మధ్యతరగతి తెగించలేదు. అలాగని పతనమూ కాలేదు. ‘ముళ్ల చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా... కళ్లు లేని కబోది చేతి దీపం నువ్వమ్మా’... అవును అది నిజం. అందుకే తాగుబోతైనా నిజం చెప్పాడు ‘నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా’... కాని ఆమె తన స్వార్థం తాను చూసుకోదు. కథంతా అయిపోయాక మళ్లీ అదే బస్‌స్టాప్ దగ్గర నిలబడుతుంది. అదే టికెట్‌ను మళ్లీ తీసుకుంటుంది. తెలుగు శ్రోతలు దశాబ్దాలుగా ఈ పాట వింటున్నారు. ఇప్పటికీ హాంట్ చేస్తూనే ఉంది. కె.జె.ఏసుదాస్, ఆత్రేయ, ఎం.ఎస్.విశ్వనాథన్... అందరివీ మధ్యతరగతి ఆత్మలు. అందుకే ఈ పాట మాయని ఆత్మతో రింగుమంటూనే ఉంటుంది.చిత్రం: అంతులేని కథ (1976) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: కె.జె.ఏసుదాస్ ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా... నా మది నిన్ను పిలిచింది గానమై... వేణుగానమై నా ప్రాణమై... ముఖేశ్‌ను తెలుగులో వినే భాగ్యం రాలేదు. కిశోర్‌నూ రాలేదు. కాని రఫీతో భాగ్యం వచ్చింది. అంతా నిర్మాత పుండరీకాక్షయ్య పట్టుదల, పుణ్యం. ‘భలే తమ్ముడు’లో ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ అని రఫీ పాడితే తెలుగువారు విని తబ్బిబ్బయ్యారు. ఉత్నా బడా సింగర్ తెలుగులో పాడతాడా అని మురిసిపోయారు. ఆ తర్వాత ఆ చెన్నై-ముంబై బంధం కొనసాగింది. ఎన్టీఆర్- రఫీల బంధం... నిమ్మకూరు కాయ- ఉత్తరాది ఉప్పులాగా కలగలసిపోవాలని తిరుమలేశుడు నిర్ణయిస్తే చేసేదేముంది? ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... అని పాడుకోవడం తప్ప. హిందీలో రామానంద్ సాగర్ తీసిన ‘జీత్’ పెద్ద హిట్ అయితే తెలుగులో రీమేక్ చేశారు. అందులో కల్యాణ్‌జీ-ఆనంద్ జీ చేసిన బాణీలను తెలుగులో సాలూరు హనుమంతరావు యథాతథంగా వాడారు. ఉర్దూలో పండితుడైన సినారెకు ఆ హిందీ బాణీకి తగిన తెలుగు వరస రాయడం చిటికెలో పని. ‘తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరపుల రూపమై’... అని చేతిలో పిల్లనగ్రోవితో కులూ లోయ ప్రవాహం అంచున కూచుని ఎన్టీఆర్ పాడటం... మెరుపు తీగలా ఉన్న వాణిశ్రీ అతణ్ణి వెతుక్కుంటూ ఆ సానువుల్లో కుతూహలపడటం... ఒక తాజా ఆపిల్బుట్టలాంటి జ్ఞాపకం. రఫీ... నీ పాటకు మేం ఆల్వేస్ హ్యాపీ.చిత్రం: ఆరాధన (1976) సంగీతం: సాలూరి హనుమంతరావు రచన: సి.నారాయణరెడ్డి గానం: రఫీ, ఎస్.జానకి -
మైండ్ మ్యూజిక్
‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి’ అన్నారు పెద్దలు. జోలపాటల సంగీతానికి శిశువులు ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు. చక్కని సంగీతానికి పశువులు పరవశిస్తాయి. అంతేనా..? శ్రావ్యమైన సంగీతానికి పాములు కూడా తలలూపుతాయట! మాటల పుట్టుకకు ముందు నుంచే నాదం ఉంది. ఏ భాషా ఎరుగని పశుపక్ష్యాదుల ధ్వనులే సప్తస్వరాలకు మూలం అంటారు. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో రకరకాల సంప్రదాయాలు ఉన్నా, వాటన్నింటికీ సప్తస్వరాలే ఆధారం. సంగీతానికి స్పందించని మనుషులు ఉండరు. మనుషులే కాదు, లోకంలో సంగీతానికి స్పందించని జీవులే ఉండవు. కర్ణపేయమైన సంగీతాన్ని ఆలపించినా, ఆలకించినా కలిగే లాభాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మచ్చుకు వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. 1. జ్ఞాపకశక్తికి దివ్యౌషధం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఎన్ని మందులు, మూలికలు అందుబాటులో ఉన్నా, అవన్నీ వీనులవిందు చేసే సంగీతం ముందు బలాదూర్. మతిమరపు జబ్బు బారిన పడిన వయోవృద్ధుల్లో సైతం జ్ఞాపకాల తేనెతుట్టెను కదిలించడం సంగీతానికి మాత్రమే సాధ్యం. కుటుంబ సభ్యుల పేర్లు సైతం గుర్తులేని స్థితికి చేరుకున్న వారు కూడా తమ చిన్ననాటి పాటలకు వెంటనే స్పందిస్తారు. మరుగునపడిన జ్ఞాపకాలను వెలికి తీయడంలో సంగీతానికి మించిన సాధనమేదీ లేదని పలు ఆధునిక పరిశోధనలు నిరూపిస్తున్నాయి. 2. ఏకాగ్రతకు సాధనం మనసు కళ్లెంలేని గుర్రంలాంటిది. అదుపు చేసే సాధనమేదీ లేకపోతే పరుగులు తీస్తూనే ఉంటుంది. కాస్త కూడా కుదురుగా ఉండదు. దేని మీదా ఏకాగ్రత ఉండదు. చదువు సంధ్యలు సజావుగా సాగాలంటే ఏకాగ్రత తప్పదు. కాని ఒకపట్టాన కుదిరి చావదే! అలాంటి పరిస్థితుల్లో జ్ఞాన సముపార్జనపై గురి కుదరాలంటే ‘సంగీత జ్ఞానము’ వినా శరణ్యం లేదు. ఆహ్లాదభరితమైన సంగీతం వింటూ కాసేపు సేదదీరితే మనసు తేలిక పడుతుంది. మనోవీధిలో దౌడుతీసే ఆలోచనల గుర్రాల దూకుడు క్రమంగా నెమ్మదిస్తుంది. వీనులను సోకే స్వర తాళాలపైనే దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఏమాత్రం శ్రమ లేకుండానే, చెమట చిందించకుండానే తిరుగులేని ఏకాగ్రత తప్పకుండా కుదురుతుంది. 3. సాంత్వనామృతం కష్టాల్ నష్టాల్ వస్తే రానీ అనేంత దమ్ము ధైర్యం మనుషుల్లో చాలామందికి ఉండదు. చిన్నా చితకా కష్టాలకు కూడా కుంగి కుదేలైపోతూ ఉంటారు. బతుకుపోరులో ఓటమి ఎదురైనప్పుడల్లా జీవితం మీద బెంగటిల్లిపోతుంటారు. మనసుకు తగిలిన గాయాలకు విలవిలలాడి విలపిస్తూ ఉంటారు. అలాంటి వారికి సాంత్వన కలిగించే శక్తి సంగీతానికే ఉంది. 4. ఉత్సాహానికి ఊపిరి నిదానంగా వినిపించేటప్పుడు లాలనగా ఊరట కలిగిస్తుంది స్వరమాధురి. అయితే, వేగం పుంజుకుని ఉరకలేసే స్వరఝరి ఉత్సాహానికి ఊపిరిపోస్తుంది. నీరవ నిశ్శబ్దంలో కఠిన వ్యాయామాలు చేస్తే త్వరగా అలసిసొలసి నీరసిస్తారు. ‘జిమ్మంది’నాదం అంటూ జోరైన సంగీతం వినిపిస్తే ఉత్సాహంగా వ్యాయామం చేసేస్తారు. 5. సృజనకు పునాది ఎవరికైనా అమ్మపాడే జోలపాటలతో సంగీతంతో పరిచయం మొదలవుతుంది. వయసు పెరిగే కొద్దీ రకరకాల పాటలు చెవినపడుతూ ఉంటాయి. కొన్ని అప్పటికప్పుడు ఆకట్టుకుంటాయి. ఇంకొన్ని అదేపనిగా వెంటాడుతూ ఉంటాయి. మరికొన్ని మనోఫలకంలో చెరగని ముద్రవేస్తాయి. సంగీత సాహిత్యాల మేలిమి సమ్మేళనమైన పాటలు శ్రోతల స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. స్మృతిపథంలో చిరస్థాయిగా నిలిచిపోయే పాటలు సృజనకు పునాదిగా నిలుస్తాయి. వీనుల విందు చేసే ఒక పాట చూడచక్కని ఒక చిత్రానికి ప్రేరణనిస్తుంది. ఉరకలేయించే ఒక పాట సరికొత్త కవనకుతూహలానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. అబ్బురపరచే స్వరకల్పనలు శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలకు ఆలంబనగా నిలుస్తాయి. 6. ఆరోగ్య సిద్ధికి సోపానం ‘అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము’ అని శంకరశాస్త్రి చేత అనిపించారు వేటూరి. సంగీతంతో అద్వైత సిద్ధి, అమరత్వ లబ్ధి కలుగుతాయో లేదో చెప్పలేం గాని, ఆరోగ్య సిద్ధి మాత్రం తథ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడైతే దీనికి ‘మ్యూజిక్ థెరపీ’ అని పేరు పెట్టారు గాని, అప్పట్లో ముత్తుస్వామి దీక్షితార్ సంగీతానికి గల ఈ మహిమను స్వయంగా నిరూపించారు. ముత్తుస్వామి దీక్షితార్ శిష్యుల్లో ఒకరు కడుపునొప్పితో విలవిలలాడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినా అతడి కడుపునొప్పి నయం కాలేదు. జ్యోతిషవేత్త కూడా అయిన దీక్షితార్ అతడి జాతకాన్ని పరిశీలించారు. గురుగ్రహ దోషం వల్లనే తన శిష్యుడికి కడుపునొప్పి వచ్చిందని గ్రహించారు. అతడికి ఉపశమనం కలిగించాలనుకున్నారు. అంతే... ‘బృహస్పతే తారాపతే’ అంటూ అఠాణారాగంలో ఆశువుగా కీర్తన అందుకున్నారు. శిష్యుడికి బాధా విముక్తి కలిగించారు. ఆ తర్వాత మిగిలిన గ్రహాలపైనా కీర్తనలు రచించారు. 7. అధ్యయన శక్తికి ఆలంబన సుస్వరభరితమైన సంగీతం అధ్యయన శక్తికి ఆలంబనగా నిలుస్తుంది. వీనుల విందైన స్వరఝరిని కొన్ని నిమిషాలే ఆలకించినా, మెదడుపై ఆ ప్రభావం చాలాకాలమే ఉంటుంది. అద్భుతమైన స్వరకల్పనలు, లయ విన్యాసాలు జిజ్ఞాసను రేకెత్తిస్తాయని, ఫలితంగా అధ్యయన శక్తిని మెరుగుపరుస్తాయని పలు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. తరచుగా సంగీతం వినే విద్యార్థులు త్వరగా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారని, ప్రయోగాలపై ఆసక్తి కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంగీతం నేర్చుకునే పిల్లలు మిగిలిన వారి కంటే నిలకడగా, క్రమశిక్షణతో ఉంటారని కూడా అంటున్నారు. 8. ప్రగతికి ప్రేరణ ఎగుడుదిగుడు జీవితంలో ఎదగడానికి తగిన ప్రేరణ ఇచ్చే శక్తి సంగీతానికి మాత్రమే ఉంది. పరాభవాలు, పరాజయాలు ఎదురైనా, నిర్దేశించుకున్న లక్ష్యం వైపు పట్టువీడకుండా ముందుకు సాగడానికి తగిన బలం ఇవ్వడానికి ఒక స్ఫూర్తిమంతమైన పాట చాలు. ఎవరేమన్నను... తోడు రాకున్నను... గమ్యం చేరుకునే దాకా ముందుకు సాగడానికి... బతుకుబాటలో పురోగతి సాధించడానికి... 9. శ్రమైక జీవనానికి సౌందర్యం శ్రమైక జీవనానికి సౌందర్యం ఇచ్చేది సంగీతమే. పనితో పాటే పుట్టిన పాట జానపదుల నోట దిద్దుకున్న సొబగులెన్నెన్నో! కాయకష్టాన్ని మరపించే శక్తి హుషారైన పాటలకు మాత్రమే ఉంది. అందుకే, ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది...’ అన్నాడు సినీకవి. అలసట తెలియనివ్వని జీవామృతం కదా సంగీతం! 10. ఉత్పాదకతకు ఉత్ప్రేరకం సంగీతం ఉత్పాదకతకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. మౌనం మంచిదే కావచ్చు గాని, నిశ్శబ్ద వాతావరణంలో గంటల తరబడి పనిచేస్తూ ఉంటే, ఉత్సాహం అడుగంటుతుంది. ఉత్సాహం అడుగంటినప్పుడు ఉత్పాదకత పడిపోతుంది. అలాగని రణగొణ ధ్వనులు వినిపిస్తుంటే ఏకాగ్రత కుదరదు. కర్ణకఠోరమైన శబ్దకాలుష్యం కూడా ఉత్పాదకతకు చేటు చేస్తుంది. అటు నిశ్శబ్దం, ఇటు రణగొణలు కాకుండా, శ్రావ్యమైన సంగీతం వింటూ పనిచేస్తుంటే ఉత్సాహం ఉరకలేస్తుంది. పని వేగంగా సాగుతుంది. మంచి సంగీతాన్ని వినిపిస్తే పశువులు కూడా ఎక్కువ పాలిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మ్యూజిక్ చేసే మ్యాజిక్ ఎలాంటిదో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదూ! -
'సాంగ్'రే బంగారు రాజా
రాజాజీ నవల ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘దిక్కట్ర పార్వతి’ (1974) తమిళ చిత్రానికి సుప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు సంగీత దర్శకత్వం వహించారు. ఇంకో విశేషం ఏమిటంటే ఆయన ‘లైలామజ్నూ’ (1949) చిత్రంలో బాల మజ్నూ పాత్ర కూడా పోషించారు. స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరగిపోదు / జీవితాంతమూ.... కొన్ని సినిమాలు ఎటు పోతాయో తెలియదు. 1973లో విడుదలైన స్నేహబంధం సినిమా కూడా ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం. దాసరి నారాయణరావు మాటలు. కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, జమున తారాగణం. ఆ రోజుల్లో యాభై రోజులు ఆడినట్టుగా ఆంధ్రపత్రికలో యాడ్ వచ్చింది. కాని అందులోని ఈ పాట మాత్రం ఇప్పటికీ ఆడుతోంది. ‘స్నేహబంధమూ... ఎంత మధురము... చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము’... బహుశా స్నేహం అంటే అందరికీ ఇష్టం కావడం వల్ల, స్నేహితుడు లేని మనిషి లేకపోవడం వల్ల, ప్రతి ఒక్కరి బాల్యంలో ఎవరో ఒకరు గాఢంగా స్నేహం చేసి ఉన్నందువల్ల, దానిని అంతే నమ్మకంతో ఆత్రేయ రాయడం వల్ల, ఎంతో మధురంగా సత్యం బాణీ కట్టడం వల్ల ఈ పాట నిలిచింది. ‘మల్లెపూవు నల్లగా మాయవచ్చును... మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును’... కాని స్నేహం మాత్రం చెక్కు చెదరదు అంటారు ఆత్రేయ ఈ పాటలో. బాలు, సుశీల, ఆనంద్, రామకృష్ణ పాడిన ఈ పాట నిత్య మధురం. ముస్తాఫా.. ముస్తాఫా... డోన్ట్ వర్రీ ముస్తాఫా జనరేషన్‌కు ఈ పాట వినిపించాలి. ‘డోన్ట్ వర్రీ పాట’ను తక్కువ చేసేది ఏమీ లేదు కాని ఇలాంటి మంచి తెలుగు పాటను ఆ పాట చెప్పే బంధాన్ని పిల్లలకు వినిపించకపోతే మాత్రం నిజంగానే వర్రీ.చిత్రం: స్నేహబంధం (1973) సంగీతం: సత్యం; రచన: ఆత్రేయ గానం: రామకృష్ణ, బాలు, పి.సుశీల, జి.ఆనంద్ స్నేహమే నా జీవితం / స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది / స్నేహమే నా పెన్నిధి ‘జంజీర్’ స్క్రిప్ట్ సలీమ్-జావెద్లో సలీమ్ రాశాడు. దానిని ముందు ధర్మేంద్రకు అమ్మాడు. ఆ తర్వాత దేవ్ ఆనంద్ యాక్ట్ చేయాల్సింది. చివరకు దాని నొసటన అమితాబ్ బచ్చన్ పేరు రాసి ఉంది. అమితాబ్ కెరీర్‌ని, హిందీలో హీరో క్యారెక్టర్ని మార్చిన సినిమా అది. తెలుగులో అంత రౌద్రంగా, పవర్‌ఫుల్‌గా నటించడానికి కొత్త హీరో అక్కర్లేదు. నిప్పులాంటి మనిషి ఎన్టీ రామారావు ఉండనే ఉన్నాడు. అలా రీమేక్ అయ్యింది ‘నిప్పులాంటి మనిషి’. జంజీర్లో ‘యారీ హై ఈమాన్ మేరా’ ఖవ్వాలీ పెద్ద హిట్. గుల్షన్ బావ్రా రాసిన ఈ ఖవ్వాలీని మన్నా డే పాడాడు. విధి నిర్వహణలో పడి ఒత్తిడికి లోనవుతున్న అమితాబ్‌ను అతని స్నేహితుడైన పఠాన్ పాత్రధారి ప్రాణ్ పిలిచి విందు ఇస్తాడు. ఆ సందర్భంలో నీకు నేనున్నాను నా స్నేహం ఉంది అని పాట ద్వారా చెప్తాడు. తెలుగులో ప్రాణ్ పాత్రను సత్యనారాయణ వేశాడు. రాసే పని సహజంగానే సినారెకు వచ్చింది. ‘అల్లాయే దిగి వచ్చి ఆయ్ మియా ఏమి కావాలంటే’.. అని సాకీ రాసి ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అని అద్భుతమైన పల్లవి రాశారు సినారె. పఠాన్లు స్నేహం చేస్తే ఖయామత్ తక్ అంటే కలియుగాంతం వరకూ స్నేహమే చేస్తారు. బహుశా స్నేహం పాటలను తెలుగులో ఎంచాలంటే ఖయామత్ తక్ ఈ పాట కూడా ఎంచబడుతూనే ఉంటుంది.చిత్రం: నిప్పులాంటి మనిషి (1974) సంగీతం: సత్యం రచన: డా.సి. నారాయణరెడ్డి గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుశలమా నీకు కుశలమేనా... మనసు నిలుపుకోలేక... మరీమరీ అడిగాను... అంతే అంతే అంతే... కుశలమా నీకు కుశలమేనా... ఒక అగ్రహారం అమ్మాయి ఒక దళితుడిని వివాహం చేసుకోవలసి వస్తుంది విధివశాత్తు. తాళి కట్టే సమయం కాసేపే కావచ్చు. కాని ఆ తర్వాత ఏళ్ల తరబడి కాపురం చేయాలి. ఇంట్లో భర్త ఒక్కడే ఉండడు. అత్త ఉంటుంది. మామ ఉంటాడు. ఇంకా వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఉంటారు. ‘మీ పద్ధతులు నాకు నచ్చట్లేదు’ అంటే ఎలా? వచ్చింది నువ్వు. వాళ్లు కాదు. అడ్జస్ట్ కావాల్సింది నువ్వే. వాళ్లు కాదు. కాని ఆమె వెళ్లిపోయింది. భర్తను చులకన చేసి అత్తింటిని పలుచన చేసి... ఆమె నిర్ణయం ఒక బలిపీఠం. అది ఎందరిని బలి కోరింది? మొదటైతే వారి ప్రేమను బలి కోరింది. ఎడబాటుకు ముందు ఆ జంట ఎలా ఉండేది? ఒకరిని మరొకరు చూసి మురిసిపోతూ... ఒక్క క్షణం ఎడబాటు వచ్చినా ఏమో ఎలా ఉన్నారో అంటూ కుశలం తెలుసుకోవాలని ఉబలాట పడుతూ... చేయీ చేయీ పట్టుకుని పాడుతూ... ‘మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే... అంతే.. అంతే’.... చక్రవర్తి, కృష్ణశాస్త్రి కలిసి పని చేయడం కొంచెం విడ్డూరమే. కాని చక్రవర్తి తాను చేసిన పాటల్లో ఈ పాటను ఎంతో లలితంగా మెరిపిస్తాడు. కృష్ణశాస్త్రి మాటకు ఇంతకు మించి ఎవరూ న్యాయం చేయలేరన్నట్టుగా బాణీ కడతాడు. ‘అంతేనా’... అని ఎవరైనా అంటే ‘అంతేలే’.... అనక తప్పదు. బాలూ స్వేచ్ఛ సుశీల సామర్థ్యం మనకు తెలుస్తుంది. శోభన్‌బాబు, శారద కలిసి ‘పూలగాలి రెక్కల పైన నీలిమబ్బు పాయల పైనా’ ఈ పాటను ఎగురవేస్తూ గుర్తుండి ఇలా గుర్తొస్తూనే ఉంటారు.చిత్రం: బలిపీఠం (1975) సంగీతం: చక్రవర్తి రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల -
'సాంగ్'రే బంగారు రాజా
‘సిరివెన్నెల’ సినిమాలో పాటలన్నీ సంగీత ప్రియులను ఓలలాడించేవే. ఇందులో అంధుడైన కథానాయకుడు వేణువు వాయిస్తూ ఉంటాడు. సుప్రసిద్ధ హిందుస్తానీ వేణువాద్య విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా తెరవెనుక వినిపించిన వేణువే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కురిసింది వానా... నా గుండెలోనా... నీ చూపులే జల్లుగా... ముసిరే మేఘాలు... కొసరే రాగాలు... కురిసింది వానా... నా గుండెలోనా వాన అనగానే తెలుగులో రెండు పాటలు ఫేమస్. ఒకటి చిటపట చినుకులు పడుతూ ఉంటే. దానిని రాసింది ఆత్రేయ. పాట కట్టింది మహదేవన్. మహామహులు. మంచిదే. కాని ఆపిల్ పండు వీలుగాని చోట సలీసుగా దొరికిన సీతాఫలం కూడా మేజిక్ చేస్తుంది. బుల్లెమ్మ-బుల్లోడు కోసం సత్యం, రాజశ్రీ అలా మేజిక్ చేసినవారే. తెర మీద కూడా సూపర్‌స్టార్స్ ఏమీ కాదు. చలం, విజయలలిత. కాని పాట నిలబడింది. అమీర్‌పేట్ మీద కొంచెం మబ్బు పట్టినా సీతమ్మధారలో జల్లు కురిసినా రాయల చెరువు మీద కుమ్మరించి పోసినా ఈ పాటే గుర్తుకొస్తుంది. ‘కురిసింది వాన.. నా గుండెలోన... నీ చూపులే జల్లుగా’.... పెద్ద వాన కాదు. అలాగని జల్లు కూడా కాదు. స్థిరంగా నెమ్మదిగా తడవబుద్ధేసే వాన ఎలా ఉంటుందో అలా ఉంటుంది పల్లవి. సత్యం కన్నడ, తెలుగు రంగాలలో స్టార్‌గా ఉన్నాడు. రాజశ్రీ మంచి పాటలు, మాటలు రాయగలిగినా డబ్బింగ్ కింగ్‌గా కొనసాగాడు. చలం మట్టిలో మాణిక్యం. వీళ్లందరూ కలిసి ప్రతివానలో ఈ గొడుగును అందించేసి వెళ్లారు.చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: సత్యం రచన: రాజశ్రీ గానం: బాలు, సుశీల బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు... కళ్లకెపుడు కనపడడు... కబురులెన్నో చెబుతాడు... బూచాడమ్మా బూచాడు... బుల్లిపెట్టెలో ఉన్నాడు... ‘మేడ మీద చూడమంట... ఒక లవ్ జంట లవ్ జంట’ అని ముదిరిపోయిన మణిరత్నం పిల్లలు ఇంకా సినిమాల్లోకి రాని రోజులు అవి. పిల్లలు ఎంత తెలివి కలిగి ఉండాలో అంత తెలివితోటి ఎంత అమాయకత్వం నిండి ఉండాలో అంత అమాయకత్వం తోటి తెలుగు సినిమాల్లో పాడారు. ‘పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే’, ‘తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే’... వాళ్లు ఇలాంటి పాటలే పాడారు. పాత్రౌచిత్యం అని ఒకటుంటుంది. దానిని పాటించేవారు కవులు, రచయితలు. ఆత్రేయ ఈ విషయంలో ఇంకా నిష్ఠను పాటించేవారు. బడిపంతులు సినిమాలో బేబీ శ్రీదేవిగా నేటి శ్రీదేవి ఒక పాట పాడాలంటే టెలిఫోన్‌కు మించిన సాధనం ఏముంది? పిల్లలందరూ అందులో బూచాడున్నాడనే అనుకుంటారు. అందుకే ఆత్రేయ ‘బూచాడమ్మా బూచాడు’ అని చాలా సులభమైన పల్లవితో మొదలెడతారు. ‘గురుగురుమని సొద పెడతాడు... హల్లో అని మొదలెడతాడు’ అని అంటుందా చిన్నారి కంప్లయినింగ్గా. కాని పిల్లలకు బోధించాల్సిన మంచిమాట ఆత్రేయ ఆ పొన్నారి నోటి నుంచి చెప్పిస్తాడు. ‘ఢిల్లీ మద్రాస్ హైదరాబాద్ రష్యా లండన్ జపాన్... ఎక్కడికైనా వెళుతుంటాడు.. ఎల్లలు మనసుకు లేవంటాడు... ఒకే తీగపై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు’.... ఈ పాటలు ఇప్పుడు ఎవరు చెప్తున్నారు. ఏ పిల్లలు ఇప్పుడు వింటున్నారు?చిత్రం: బడి పంతులు (1972) సంగీతం: కె.వి.మహదేవన్ రచన: ఆత్రేయ గానం: పి.సుశీల ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో... / ఎవరికి ఎవరు సొంతము... ఎంత వరకీ బంధము... కడుపు చించుకు పుట్టిందొకరు... కాటికి నిన్ను మోసేదొకరు... తలకు కొరివి పెట్టేదొకరు... ఆపై నీతో వచ్చేదెవరు..? భవ సాగరం అన్నారు పండితులు. బతుకు సంద్రం అన్నారు పల్లీయులు. జీవన తరంగాలు అన్నది ఒక రచయిత్రి. దేవుని చదరంగం అన్నాడొక కవి. ఎవరు ఎన్ని చెప్పినా అనూహ్యమైన మలుపులను దాచుకుని మెలికలు తిరుగుతూ పోయే జీవన రహదారిని చూసి ప్రతి ఒక్కరూ జాగురూకత చెప్పినవారే. భద్రం భద్రం... అంటూ హెచ్చరికలు చేసినవారే. అన్నీ సజావుగా ఉంటేనే జీవితం కూడా సజావుగా ఉంటుంది. చదరంగంలో గడి మారితే విధి ఒక ఎత్తు పన్నితే అది అతలాకుతలం అవుతుంది. మళ్లీ గడులన్నీ సర్దుకోవడానికి సమయం పడుతుంది. సహనం కావాల్సి వస్తుంది. యద్దనపూడి సులోచనరాణి రాసిన జీవన తరంగాలు నవల పెద్ద హిట్. దాని ఆధారంగా తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద హిట్. కన్నతల్లి చనిపోతే కన్నకొడుకు దొంగలా పారిపోతుండగా ఆమె శవయాత్రలో ఈ పాట వస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొడుకు ఆ శవయాత్రలో కలుస్తాడు. ఆ పాడె తన తల్లిదే అని తెలియక భుజం ఇస్తాడు. ‘తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది’... అని ఆత్రేయ ఆ సన్నివేశాన్ని తన పాటలో వెలిగిస్తాడు. జె.వి.రాఘవులు విద్వత్తు ఉన్న సంగీతకారుడు. ఘంటసాలకు శిష్యుడు. ఆయన కెరీర్లో ది బెస్ట్.... మన జీవన తరంగాలలో తారసపడే ఈ జీవన తరంగాలలో... ఆ దేవుని చదరంగంలో...చిత్రం: జీవనతరంగాలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు రచన: ఆత్రేయ గానం: ఘంటసాల -
'సాంగ్'రే బంగారు రాజా
సంగీత ప్రపంచంలో ‘భారతరత్న’ అందుకున్న తొలి వ్యక్తి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి. ఆమె కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. తమిళంలో ‘సేవాసదనం’ (1938) ఆమె తొలిచిత్రం కాగా, హిందీలో ‘మీరాబాయి’ (1947) ఆమెను యావద్దేశానికీ చేరువ చేసిన చిత్రం. పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ... చూపించు చూపునిండా పిసల్ పిసల్... బండ... పట్నంలో శాలిబండ... పేరైనా గోలకొండ... ‘చికిలింత చిగురు సంపెంగె గుబురు చినదాని మనసు చినదాని మీద మనసు’ అని రాశారు మల్లాది రామకృష్ణశాస్త్రి. ‘మనసున మల్లెల మాలలూగెనె’ అన్నారు కృష్ణశాస్త్రి. ‘పడుచుదనం రైలు బండి పోతున్నది’ అన్నారు ఆరుద్ర. ప్రాంతాన్నిబట్టి భాష. భాషను బట్టి నుడి వస్తాయి. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కలం తాలూకు సౌరభం తెలియాలంటే దాశరథి రావాల్సి వచ్చింది. ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’ హైదరాబాదీ ఉర్దూ ప్రభావాన్ని ఆయన చూపించాడు. ‘రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్’ అని రాయాలంటే ఆ ప్రాంతంలో పెరిగిన సినారెకు తప్ప వేరెవరికి సాధ్యమైంది.? అన్ని ప్రాంతాల కవులూ తెలుగు పాటనూ తెలుగు సినీ బాటనూ ప్రభావితం చేశారు. ఈ ప్రయాణంలో ఒక సర్ప్రైజ్ ‘పట్నంలో శాలిబండ’. శాలిబండ, పిసల్‌బండ, బోరబండ... ఇవి హైదరాబాద్ వారికే తెలుస్తాయి. దక్కన్ ప్రాంతానికి చెందిన వేణుగోపాలాచార్యులు ఈ పాట రాసే అవకాశం రావడంతోటే ఆ పేర్లను గమ్మత్తుగా పరిచారు. సంగీతం అందించిన బి.శంకర్ కూడా హైదరాబాదీనే కావడంతో ట్యూన్ బ్రహ్మాండంగా కుదిరింది. ఎల్.ఆర్.ఈశ్వరి గొంతు యథావిధి. ఇలా ఇప్పటికీ చిటికెలు వేయించే పాటల్లో ఒకటిగా నిలిచింది.చిత్రం: అమాయకుడు (1968) సంగీతం: బి.శంకర్ రచన: వేణుగోపాలాచార్యులు గానం: ఎల్.ఆర్.ఈశ్వరి ఓ నాన్నా... నీ మనసే వెన్న అమృతం కన్నా... అది ఎంతో మిన్నా... అమ్మ మీద పాటలకు దిగులు లేదు కాని నాన్న మీద పాటలు తక్కువ. నాన్నంటే అధికారం, దర్పం, పెత్తనం, అజమాయిషీ... అమ్మతో ముడిపడ్డ సెంటిమెంట్, అమ్మ అనగానే వచ్చే ఎమోషన్ నాన్న విషయంలో రాదు. కాని నాన్న ఏం పాపం చేశాడు కనుక? కష్టపడతాడు. మాటలు పడతాడు. సంపాదన కోసం ఆందోళన చెందుతాడు. చివరకు ఎలాగోలా తన కుటుంబాన్ని రెక్కల కింద సాదుకుంటాడు. అయినప్పటికీ పిల్లల చేతిలో భంగపడ్డ తండ్రులు అప్పుడూ ఉన్నారు ఇప్పుడూ ఉన్నారు. ‘ధర్మదాత’లో ఉండేది అలాంటి తండ్రే. ఇది తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘ఎంగ ఊర్ రాజా’కు రీమేక్. అక్కినేని ఆ పాత్ర పోషించారు. అన్నీ బాగుంటే తండ్రిని పొగిడి కాస్త చెడితే తండ్రిని వదిలిపెట్టి అప్పుడూ తండ్రే ఇప్పుడూ తండ్రే... తేడా వచ్చింది పిల్లల్లో తప్ప తండ్రిలో కాదు. నాన్నను పొగిడే ఈ పాటను సినారె రాశారు. అంత్యప్రాసలతో పాటను రాయడం ఆయనకు వచ్చు. నాన్న.. వెన్న... మిన్న... పల్లవి కంటే చరణం బాగుంటుంది. ‘ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాణ్ణం మాకు దాచి ఉంచావు’.... నాన్న కష్టం మీద ఇంకా వందల పాటలు రాయాల్సి ఉంది. వేల భారతాలు రచించాల్సి ఉంది. అసలు సిసలు వెన్నమనిషి నాన్న. ఎన్నదగిన మనిషి నాన్న.చిత్రం: ధర్మదాత (1970) సంగీతం: టి.చలపతి రావు రచన: డా.సి.నారాయణరెడ్డి గానం: ఘంటసాల, పి.సుశీల మాయదారి సిన్నోడు... నా మనసే లాగేసిండు... లగ్గమెప్పుడురా మావా అంటే... మాఘమాసం యెల్లేదాక మంచిరోజు లేదన్నాడే... ఆగేదెట్టాగా... అందాకా ఏగేదెట్టగా... హిట్ పెయిర్ అంటే అక్కినేని, సావిత్రి అనంటారు. ఎన్టీఆర్, జయలలిత అని కూడా అంటారు. హిట్ పెయిర్ అంటే జ్యోతిలక్ష్మి, ఎల్.ఆర్.ఈశ్వరి కూడా. స్క్రీన్ మీద స్ట్రిప్ టీజ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. గళంలో వలువలు వదిలేయాంటే ఎంతో దమ్ము కావాలి. ఈ పని వీళ్లిద్దరూ చేశారు. ఒకరికి మరొకరు భుక్తిగా మిగిలారు. ఇద్దరు స్త్రీల విజయం ఇది. మనుగడలో మునిగిపోకుండా నిలబడగలిగిన విజయం. ‘మరి లగ్గమెప్పుడ్రా మామా’ అని ఎల్.ఆర్.ఈశ్వరి కవ్విస్తే జ్యోతిలక్షి అందమైన కొప్పు పెట్టుకొని వేదిక మీద చకాలున లంఘిస్తుంది. తప్పెట మోగి జానపదం ఝల్లుమంటుంది. ‘అమ్మ మాట’ సినిమా కోసం గీత రచయిత సి.నారాయణరెడ్డి, సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు కూర్చునప్పుడు ఎంతకీ పాట సెట్ కాలేదట. లంచ్ కోసం సినారె బయటకెళితే రమేశ్ నాయుడు ఏం చేయాలో తోచక సినారె ప్యాడ్ మీద ఆయన రాసుకున్న రఫ్ నోట్స్‌నే పల్లవి అనుకుని ఈ పాట కట్టారట. సినారె అది విని అబ్బురపడి చరణాలు రాశారు. ‘సింతచెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజుల్లు తాళం యేస్తుంటే’... చూసేవాడు చెలరేగి ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి లగ్గం చేసుకోవాలి. కాని వీడేమిట్రా బాబూ మొద్దులా ఉన్నాడు బుద్ధావతారంలా వంకలు పెడుతున్నాడు అని కంప్లయింట్ చేసే ఈ పాట మగవాళ్లకు ఆడవాళ్ల దూకుడు తెలియజేసే హైడోస్ శాంపిల్. వాళ్ల కవ్వింపుకు రిటన్ ఎగ్జాంపుల్. కావాలంటే మల్లమ్మనడగండి... కావమ్మనడగండి... రత్తమ్మనడగండి... అదే మాట చెప్తారు.చిత్రం: అమ్మమాట (1972) సంగీతం: రమేశ్‌నాయుడు రచన: సినారె గానం: ఎల్.ఆర్.ఈశ్వరి -
'సాంగ్'రే బంగారు రాజా
ఘంటసాల పాట ఫైనల్ టేక్ ముందు చుట్ట కాల్చేవారట. మధువొలకబోసే నీ చిలిపికళ్లు అవి నాకు వేసే బంగారు సంకెళ్లు... అడగకనే ఇచ్చినచో అది మనసుకందము... వి.రామకృష్ణ అంటే సూపర్‌స్టార్. ఘంటసాల తర్వాత అక్కినేని, కృష్ణంరాజు, శోభన్‌బాబు... వీళ్లందరూ వి.రామకృష్ణనే కోరుకున్నారు. వి.రామకృష్ణ ‘శారద నను చేరదా’... వంటి సూపర్‌హిట్స్ పాడుతున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘ఆరాధన’ తెలుగులో ‘కన్నవారి కలలు’గా రీమేక్ అయ్యింది. అతి కొద్ది సినిమాలు చేసినా గొప్ప పాటలు చేసిన వి.కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. కన్నవారి కలలులో ప్రతి పాట హిట్. ‘ఒకనాటి మాట కాదు... ఒకనాడు తీరిపోదు’... ‘మధువొలకబోసే నీ చిలిపికళ్లు’.... అన్నీ వి.రామకృష్ణ, సుశీల గొంతుల్లో మెరిశాయి.చిత్రం: కన్నవారి కలలు (1974) సంగీతం: వి.కుమార్ గానం: వి.రామకృష్ణ, సుశీల రచన: రాజశ్రీ శివ శివ శంకర భక్తవ శంకర శంభో హరహర నమో నమో.... పుణ్యం పాపం ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు/ ఏ లీల చేయాలి నీ సేవకు... శంకరుణ్ణి స్తుతిస్తూ తెలుగు సినిమాల్లో చాలా పాటలు ఉన్నాయి. కాని భక్త కన్నప్పలో ఈ పాట మాత్రం శివాలయాల్లో మోగే గౌరవాన్ని పొందింది. ఇందులో ఒక గిరిజన భక్తుని ఆమాయకత్వం, సమర్పణ, పరమాత్ముని పట్ల భయభక్తులు కాకుండా అనురాగం కనిపించడమే కారణం. ‘పున్నెము పాపము తెలియని నేను... పూజలు సేవలు తెలియని నేను’... అంటాడు భక్తుడు. ‘గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు’... అనడంలో ఆ దగ్గరితనం చాలా బాగుంటుంది. నటించిన కృష్ణంరాజుకు, తీసిన బాపుకు, పాడిన రామకృష్ణకు, చేసిన సత్యంకు, రాసిన వేటూరికి మారేడు దళాల మాల వేయదగ్గ పాట ఇది. చిత్రం: భక్త కన్నప్ప (1976) సంగీతం: సత్యం రచన: వేటూరి; గానం: వి.రామకృష్ణ -
సాంగ్రే బంగారు రాజా
మాధవపెద్ది సత్యం పేరు వినగానే వెంటనే ‘మాయాబజార్’లో ఆయన పాడిన ‘వివాహభోజనంబు’ పాట గుర్తుకొస్తుంది. నిజానికి ఆయన నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. రామదాసు (1946) చిత్రంలో కబీర్ పాత్ర పోషించారు. అయితే, ఆ తర్వాత గాయకుడిగా రాణించారు. సిపాయి సిపాయి.... సిపాయి సిపాయి.... నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో... ఈ వాలు కనులనడుగు అడుగు చెబుతాయి సిపాయి ఓ సిపాయి... సంగీత దర్శకుడు సి.రామచంద్ర అంటే సూపర్‌స్టార్. ఆయన పేరు చెప్తే మహామహా గాయకులే భయపడేవారు. హిందీలో ఆ రోజుల్లోనే ‘మేరీజాన్ మేరీజాన్ సండే కె సండే’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చాడాయన. ఆయనే హిందీలో ‘అనార్కలీ’ సినిమాకు ‘ఏ జిందగీ ఉసీకి హై’... పాట ఇచ్చి పెద్ద హిట్ చేశాడు. అలాంటి సి.రామచంద్ర తెలుగులో ‘అక్బర్ సలీం అనార్కలి’కి పని చేయడం పాటలు చేయడం చెప్పాల్సిన విశేషం. సినారె రచన, సుశీల-రఫీల గానం సుమధుర అనుభవం. తన తరం హీరోలలో ఎవరికీ దక్కని అదృష్టం నటించిన బాలకృష్ణ పొందారు. రఫీ గొంతుకు లిప్ మూవ్మెంట్ ఇవ్వడం మరి గొప్పే కదా.చిత్రం: అక్బర్ సలీమ్ అనార్కలీ (1978) సంగీతం: సి.రామచంద్ర రచన: సినారె; గానం: రఫీ, సుశీల ఛాంగురే బంగారు రాజా... ఛాంగు ఛాంగురే బంగారు రాజా... మజ్జారే మగరేడా... మత్తై వగకాడా.. అయ్యారే... నీకే మనసియ్యాలని ఉందిరా... రాక్షస కన్యలకు కూడా మనసుంటుంది. మరులుంటాయి. నచ్చినవాడిని వలచడానికి సర్వహక్కులు ఉంటాయి. హిడింబి రాక్షస కన్యే. ఆ పేరు వింటేనే మనకు బలం, ధీమా స్ఫురణకొస్తాయి. అలాంటి కన్యకు భీముడు కాకుండా ఇంకెవరు నచ్చుతారు. హిడింబి తాను వలచిన భీముడిని ఆకర్షిస్తూ పాట రాయాలి. ఇది దర్శకుడు ఎన్టీఆర్ కోరిక. రచయిత సినారె దానిని అందుకున్నారు. కొత్త కొత్త పదాలతో పాటను మెరిపించారు. ‘కైపున్న మచ్చకంటి చూపు... అది చూపు కాదు పచ్చల పిడిబాకు’... వింటుంటే గుండెల్లో తియ్యగా దిగబడినట్టుంటుంది. జిక్కి, టి.వి.రాజు చేసిన స్కోర్ ఇది.చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966) నయనాలు కలిసె తొలిసారి... హృదయాలు కరిగె మలిసారి... తలపే తరంగాలూరి... పులకించె మేను ప్రతిసారి... సలిల్ చౌధురి సంగీతం చేసిన తెలుగు సినిమా ఇది. సలిల్ చౌధురి అంటే హిందీలో మధుమతి, ఆనంద్ వంటి సినిమాలు గుర్తుకు రావాలి. అలాగే ముకేశ్‌కు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన ‘రజనీ గంధ’లోని పాట ‘కహి బార్ యూహీ దేఖాహై’ కూడా గుర్తుకు రావాలి. ఆ పాటనే కొంచెం మార్చి డ్యూయెట్గా చేసి ‘నయనాలు కలిసె తొలిసారి’గా అందించాడాయన. తెర మీద విజయలలిత, చలం నటించారు. మంచి యుగళగీతాలలో ఇది ఒకటి.చిత్రం: చైర్మన్ చలమయ్య (1974) సంగీతం: సలిల్ చౌధురి; రచన: ఆరుద్ర గానం: బాలు, సుశీల, స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతే త్రికాలికే పలికే కుహు గీతిక గాన సరసీ రుహమాలిక... రవిని దక్షిణాదిన బాంబే రవి అనేవారు. సంగీత దర్శకుడిగా హిందీలో ‘బార్బార్ దేఖో హజార్ బార్ దేఖో’ వంటి పెద్ద హిట్స్ ఎన్నో ఇచ్చాడు. యశ్ చోప్రా, బి.ఆర్.చోప్రా సినిమాలకు పాటలు ఈయనే చేశాడు. హిందీ నిర్మాత దర్శకులతో పడలేక కేరళ చేరి అక్కడ మలయాళ సినిమాలు చాలావాటికి సంగీతం ఇచ్చాడు. అక్కడ హిట్ అయిన ఒక సినిమాను క్రాంతి కుమార్ తెలుగులో ‘సరిగమలు’గా తీస్తే సంగీతం రవే అందించాడు. సరిగమలు సరిగ్గా ఆడలేదు. కాని సంగీతాభిమానులందరికీ ఈ పాట ఇష్టం. ఏసుదాస్ గానం పాటకు బలం. వేటూరి కలం కమర్షియల్ పాటలకు మాత్రమే కాదు ఇలాంటి ఉన్నత సందర్భాల గీతానికి కూడా అని ఈ పాట నిరూపిస్తుంది.చిత్రం: సరిగమలు (1994) సంగీతం: రవి రచన: వేటూరి ; గానం: ఏసుదాస్ ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది పూలబాణమేశా ఎద కంది ఉంటది... నీటి వెన్నెల వేడెక్కుతున్నది... పిల్లగాలికే పిచ్చెక్కుతున్నది... మాఘమాసమా వేడెక్కుతున్నది... మల్లెగాలికే... వెర్రెక్కుతున్నది... హంసలేఖ కన్నడలో టాప్ మ్యూజిక్ డెరైక్టర్. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ‘ప్రేమలోక’ కన్నడ సినిమా తెలుగులో ‘ప్రేమలోకం’గా విడుదలైతే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో నేరుగా కొద్ది సినిమాలే చేసినా హిట్ పాటలు ఇచ్చాడు. ‘ముత్యమంత ముద్దు’ యండమూరి రాసిన నవల. దానిని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సినిమాగా తీశారు. హంసలేఖ పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ప్రేమలేఖ రాశా... ఇంకా హిట్.చిత్రం: ముత్యమంత ముద్దు (1989) సంగీతం: హంసలేఖ గానం: బాలు, జానకి రచన: వేటూరి -
సాంగ్రే బంగారు రాజా
వేటూరి రేడియో కోసం రాసిన సంగీత నాటిక ‘సిరికా కొలను చిన్నది’ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం పుట్టిన రోజున మీ దీవనలే వెన్నెల కన్నా చల్లదనం మల్లెల వంటి మీ మనసులో చెల్లికి చోటుంచాలి... ఏ మగాడికైనా స్త్రీ- ముగ్గురు స్త్రీల ద్వారా తెలియాలి. తల్లి ద్వారా, భార్య ద్వారా, చెల్లెలి ద్వారా. తల్లి మీద ఫిర్యాదులు ఉండొచ్చు. భార్య పట్ల అభ్యంతరాలుండొచ్చు. కాని చెల్లెలంటే వేరే ఏమీ ఉండవు. ప్రేమే. చిన్న పట్టీలు వేసుకున్నప్పటి నుంచి చూసి ఉంటాడు... బుజ్జి బుజ్జి గౌన్లు తొడుక్కున్నప్పటి నుంచి చూసి ఉంటాడు... తను ఎత్తుకొని బజారుకు తీసుకెళితే కళ్లు చక్రాల్లా తిప్పుతూ బజారంతా చూడటం చూసి ఉంటాడు... ఆ చెల్లెలంటే అతడికి ప్రేమ. మురిపెం. గారాబం. ఆ చెల్లికి? అన్నయ్యే అపురూపం. నాన్నకు నివేదించలేనివి అమ్మకు చెప్పుకోలేనివి అన్నీ అన్నయ్యకు చెబుతుంది. హక్కుగా అడుగుతుంది. అధికారం చలాయిస్తుంది. అందుకే ప్రతి చెల్లికి మంచి అన్నయ్య దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలం. ‘ఆడపడుచు’ సినిమాలో చంద్రకళకు ఇద్దరన్నయ్యలు. ఎన్టీఆర్, శోభన్‌బాబు. కాని పరిస్థితులు వికటించి తను వారికి దూరమవుతుంది. అంధురాలిగా మారుతుంది. ఆమెలో వారి పట్ల ఉన్న అనురాగమే వారితో ఆమెను తిరిగి కలుపుతుంది. దాశరథి రచనకు టి.చలపతిరావు సంగీతం మాధుర్యం తీసుకువస్తే పి.సుశీల కంఠంలోని లాలిత్యం అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని సన్నటి రాఖీదారంలా శ్రోతలతో ముడి వేసేస్తుంది. తెలుగులో ఇది తప్పనిసరిగా మిగిలే అనురాగభరితగీతం.చిత్రం: ఆడపడుచు (1967) సంగీతం: టి.చలపతి రావు రచన: దాశరథి గానం: పి.సుశీల ‘భైరవద్వీపం’లోని ‘శ్రీ తుంబురనారద నాదామృతం’ పాటని కంపోజ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ‘శివశంకరీ’ పాట. ‘దర్బారీ కానడ’ రాగంలో పెండ్యాల గారు ‘శివశంకరీ’ పాటను కంపోజ్ చేస్తే, పల్లవి, మొదటి చరణం వరకు ‘అభేరి’ రెండవ చరణంలో షడ్జమానికి హంసధ్వని, రిషభానికి కేదారగౌళ, గాంధారానికి సరస్వతి, దైవతానికి చక్రవాకం, నిషాదానికి కల్యాణిరాగాలలో ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాటని కంపోజ్ చేశాను. - మాధవపెద్ది సురేష్ -
సాంగ్రే బంగారు రాజా
తొలితరం సుప్రసిద్ధ సంగీత దర్శకుల్లో ఒకరైన సుసర్ల దక్షిణామూర్తి అరుదుగా కొన్ని పాటలకు నేపథ్యగానం కూడా అందించారు. తొలిసారిగా ‘లైలామజ్నూ’ (1949) చిత్రంలో ఘంటసాల, మాధవపెద్ది సత్యంలతో కలసి ‘మనసు గదా ఖుదా’ పాటలో తన గళం వినిపించారు. పగలే వెన్నెల... జగమే ఊయల... కదిలే ఊహలకే కన్నులుంటే... నింగిలోన చందమామ తొంగిజూచే... నీటిలోన కలువభామ పొంగిపూచే ఈ అనురాగమే... జీవనరాగమై... ఎదలో తేనెజల్లు కురిసిపోదా... పియానో మీద మగవాళ్ల చేతులు కదిలితే ఏమో కాని ఆడవాళ్ల వేళ్లు కదిలితే మాత్రం ఆ రూపం రమ్యంగా ఉంటుంది. ఆ పియానో ఎదురుగా రౌండ్ స్టూల్ పై తేలిగ్గా కూచుని మోకాళ్లు అటూ ఇటూ ఊపుతూ జమున ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ అని పాడుతూ ఉంటే సూట్ వేసుకొని సూటిగా చూస్తున్న అక్కినేని మైమరచిపోతాడు. పాట కలిగిస్తున్న పులకరింపుకు పరవశించి పోతాడు. ఇదంతా ఆమె తన పట్ల చూపిస్తున్న ప్రేమ అనుకుని భ్రమిస్తాడు. ‘ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా’ అని ఆమె పాడుతున్నది అతనితో అనురాగ బంధం కోసమే తప్ప దాంపత్య బంధం కోసం కాదు. కాని అతడి వైపు నుంచి అపార్థం జరిగిపోతుంది. ‘పూల రుతువు సైగ చూసి పికము’ పాడే... సి.నారాయణరెడ్డి సుందర ప్రయోగం అది. అసలు పగలే వెన్నెల అనడంలోనే ఒక అందం ఉంది. ఇన్నాళ్లయినా ఈ పాట తెలుగు శ్రోతల మీద వెన్నెల కురిపిస్తూనే ఉంది. అన్నట్టు ఈ సందర్భంలోనే ఇదే సినిమాలోని ‘నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో’ గుర్తు చేయడం తప్పు కాదు. నిన్న లేని అందం నిదుర లేవడం... నిన్నటి పాట ఇవాళ చెవిన పడటం మధురం.. మృదులం... మనోహరం.చిత్రం: పూజా ఫలం (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: సి.నారాయణరెడ్డి గానం: ఎస్.జానకి మనసున మనసై బ్రతుకున బ్రతుకై... / తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో... మహాప్రస్థానం శ్రీశ్రీ వేరు. సినీ మాయాజగత్తు శ్రీశ్రీ వేరు. కవిత్వం వరకూ ఆకలేసి కేకలు వేయడం, అన్నార్తుల పక్షాన నిలవడం... ఇదే శ్రీశ్రీ పని. కాని సినిమా జగత్తులో ఇది కుదరదు. ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అంటూ ఒక నిమిషం ప్రేమికుడు కావాలి. మరునిమిషం ఒక బరువైన సన్నివేశానికి భాషనివ్వాలి. ఒక నిమిషం ఒక ఉత్పాతానికి పల్లవిని పల్లకీలా మోయాలి. ఒక నిమిషం ఇదిగో ఇలా చెట్టు కింద ప్రశాంతంగా సితార్ పట్టుకుని కూచుని తన కోసం తాను పాడుకునే భావుకుడు కావాలి. ‘ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో’.. ఒక తోడు కోరుకునే మనిషికి భావం ఇవ్వాలి. డాక్టర్ చక్రవర్తిలో హీరో నాగేశ్వరరావు ఎంతో మంచి హృదయం ఉన్నవాడు. సావిత్రిలో తన చెల్లెలిని చూసుకుంటున్నవాడు. కాని ఆమె పరాయివాడి భార్య. అనురాగం ప్రదర్శించాలని ఉన్నా ప్రదర్శించలేని నిస్సహాయత. మరోవైపు కట్టుకున్న భార్యతో పొసగడం లేదు. ఇలాంటివాడికి ‘మనసున మనసై బతుకున బతుకై’ నిలిచే తోడు కోసం పరితాపం ఉండటం సహజం. ఇవన్నీ పక్కన పెట్టండి. శ్రీశ్రీ భావ గాంభీర్యం చూడండి. ‘చీకటి మూసిన ఏకాంతములో’ అంటాడు. అబ్బ... చీకటి మూసిన ఏకాంతం ఎంత భీతావహంగా ఉంటుంది. అలాంటి సమయంలో చిరుదివ్వెలాంటి తోడు కరస్పర్శలాంటి తోడు దొరికితే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది. సాలూరి యథావిథి రసాలూరించాడు. మధ్యలో జగ్గయ్య కంఠం కూడా ఒక వాయిద్యమే. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు... నేనున్నానని నిండుగ పలికే’ ఈ పాటకు కైమోడ్పు.చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: శ్రీశ్రీ గానం: ఘంటసాల తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు... దేవుని స్క్రిప్ట్ రైటింగ్‌లో ట్విస్ట్‌లు చిత్రంగా ఉంటాయి. అదృశ్యరూపంలో ఉండే ఈ స్క్రిప్ట్‌లో తర్వాతి పేజీ ఏమిటో తెలియక మనిషి తికమకపడుతూనే ఉంటాడు. దైవం ఒకటి తలిస్తే తానొకటి తలుస్తూనే ఉంటాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కాని ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లు గడిచాయి. భర్త కేన్సర్ బారిన పడ్డాడు. వైద్యం చేయాల్సింది మాజీ ప్రియుడే. కాని ఆమెకు అనుమానం. నేను పెళ్లి చేసుకోలేదు కనుక నా భర్తను చంపేస్తాడా, ఆపరేషన్ సరిగ్గా చేయకుండా మరణం ప్రసాదిస్తాడా... మాజీ ప్రియుడి వైఖరి పట్ల ఆందోళన. అది భర్త గమనిస్తాడు. తాను మరణిస్తే గనుక తన భార్యను వితంతువుగా ఉంచకుండా పెళ్లి చేసుకుని పుణ్యస్త్రీగా పునర్జన్మను ప్రసాదించమంటాడు. కాని అవతల ఉన్నది మానవ రూపంలో ఉన్న దేవుడు. మనసే ఒక మందిరంగా కలిగిన గొప్పవాడు. అతనికి మాజీ ప్రియురాలి మీద ఎటువంటి కోపమూ లేదు. తన పేషంట్ పట్ల ఎటువంటి విరోధమూ లేదు. చివరకు అతడా పేషంట్‌ను బతికించే పనిలో తానే ప్రాణం విడుస్తాడు. తమిళంలో హిట్ అయిన ‘నెంజిల్ ఒరు ఆలయం’కు రీమేక్ ఈ సినిమా. తమిళంలో హిట్ అయిన పాటను యథాతథంగా వాడితే ఆ భావాల్ని ఆత్రేయ తెలుగు చేశారు. ‘ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం... ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం’ అంటాడు. నిజమే కదా. పి.బి.శ్రీనివాస్ తన గొంతుతో సెట్ చేసిన మూడ్ ఆ పాటను పదే పదే వినేలా చేస్తుంది. ఇది దైవం తలచి చేయించిన పాటే అనిపించేలా ఉంటుంది.చిత్రం: మనసే మందిరం (1966) సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ రచన: ఆత్రేయ గానం: పి.బి.శ్రీనివాస్ -
సాంగ్రే బంగారు రాజా
సంగీతదర్శకుడు రమేశ్‌నాయుడు తొలిచిత్రం తెలుగులోది కాదు. ‘బండ్వల్ పాహీజా’ (1947) అనే మరాఠీ చిత్రంతో ఆయన సంగీత దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పదేళ్లకు గాని తెలుగులో తొలి అవకాశం లభించలేదు. తెలుగులో ఆయన తొలిచిత్రం ‘దాంపత్యం’ (1957). శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ / సిరి కళ్యాణపు బొట్టుని పెట్టి మణిబాసికమును నుదుటిన గట్టి / పెళ్లి కూతురై వెలసిన సీత... సీతారాముల కల్యాణం చూసే భాగ్యం నాడు ఎందరికి దక్కిందో. కాని తెలుగువారు మాత్రం ఈ పాటతో ఆ దివ్యకల్యాణాన్ని తమ ఆత్మ చక్షువులతో దర్శిస్తూనే ఉన్నారు. తమ పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూనే ఉన్నారు. తెలుగు పాటల్లో ఇంతకు మించిన టైమ్ మిషన్ పాట మరొకటి లేదు. ఎప్పుడు విన్నా సరే టైమ్ మిషన్ ఎక్కినట్టై మిథిలా నగరం చేరుకుని ఆ కల్యాణాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. ‘సిరి కల్యాణపు బొట్టును పెట్టి... మణిబాసికము నుదుటున కట్టి... పారాణిని పాదాలకు పెట్టి’... పెళ్లి కూతురు సిద్ధం కాలేదట... కవి ఏమంటాడంటే ‘సీత వెలిసింది’ అంటాడు. అటు రాముడు తక్కువ తిన్నాడా? ‘సంపంగి నూనెతో కురులను దువ్వి కస్తూరి నామము తీసి చెంపన చుక్కను పెట్టి’ ఆయన కూడా వెలిశాడు. ఈ ఇద్దరి పెళ్లి ఎంత వైభవంగా ఉంటుందో చూడండి. ఎన్.టి.ఆర్ గొప్ప నటుడే కాదు ఈ సినిమాతో గొప్ప దర్శకుడు (టైటిల్స్‌లో ఆయన పేరు వేయకపోయినా) అని నిరూపించుకుంటాడు. తెలుగు ముంగిళ్లలో పెళ్లి అనగానే ఈ పాటే గుర్తుకు వస్తుందంటే ప్రతి జంటను ఈ పాటే ఆశీర్వదిస్తూ ఉన్నదంటే అది ఎన్ని జన్మల పుణ్యమో... ఈ పాటకు కారకులైనవారందరూ ఎంత ధన్యులో... వారికి వందనాలు.చిత్రం: సీతారామ కల్యాణం (1961) సంగీతం: గాలి పెంచలనరసింహారావు రచన: సముద్రాల గానం: పి.సుశీల అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే... ఉన్నది కాస్తా ఊడిందీ... సర్వమంగళం పాడింది... పెళ్లాం మెడలో నగలతో సహా తిరుక్షవరమై పోయిందీ... కింగ్ ధర్మరాజు దెబ్బ తిన్నాడు. ఎంపెరర్ నల మహారాజు మట్టి గొట్టుకుని పోయాడు. పాచికలు కాస్త పేక ముక్కలుగా మారాక ఇదిగో ఈ సినిమాలో మన రమణారెడ్డి కూడా పాపర్ పట్టిపోయాడు. అందరిదీ ఒకటే కేస్. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పుడేం చేయాలి? ఇంకేం చేయాలి... కొసరాజు రాసిన పాటను పాడుకోవాలి. ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే’.... అసలు పేకాడేవాళ్ల అంతర్గత వ్యవస్థే చాలా పకడ్బందీగా ఉంటుంది. ప్లేయర్సు సిద్ధంగా ఉంటారు. పేక సిద్ధంగా ఉంటుంది. అప్పిచ్చేవాడు సిద్ధంగా ఉంటాడు. చాప పరిచిన చెట్టు సిద్ధంగా ఉంటుంది. ఇక చేయవలసిందల్లా ఆడి ఓడిపోవడమే. లాస్ వెగాస్ వెళ్లినా, మకావ్ వెళ్లినా, లోకల్‌గా మన గోవా వెళ్లినా అందరూ చేసొచ్చే పని అదే. ఓడిపోయి రావడం. వచ్చాక తమను తాము సపోర్ట్ చేసుకోవడం. ‘మహా మహా నల మహారాజుకే తప్పలేదు భాయి... ఓటమి తప్పు కాదు భాయి’ అని సర్ది చెప్పుకోవడం. ‘ఈసారి చేయి తిరుగుతుందేమో’ అని అనిపించడమే ఈ వ్యసనంలో గమ్మత్తు. ‘ఛాన్సు దొరికితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు’... అని దిగుతారు. మరి ‘పోతే?’.... ‘అనుభవమ్ము వచ్చు’ అని నెత్తిన చెంగేసుకుంటారు. రేలంగి, రమణారెడ్డి... రెండు జోకర్లతో ఛక్మంటూ షో కొట్టిన పాట ఇది. ఆడినవాళ్లు ఓడినా పాడిన వాళ్లు గెలిచిన పాట.చిత్రం: కులగోత్రాలు (1962) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: కొసరాజు రాఘవయ్య గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు వినుడు వినుడు రామాయణ గాథ / వినుడీ మనసారా ఆలపించినా ఆలకించిన / ఆనందం ఒలికించే గాథ ఒక తల్లి, ఇద్దరు పిల్లలు, భర్త అనుమానం, ఆమె అడవుల పాలు... మహిళా ప్రేక్షకులకు కంటతడి పెట్టించడానికి ఇంతకు మించి సబ్జెక్ట్ లేదు. మహిళలంటే తాము మాత్రమే థియేటర్లకు రారు. భర్తను తోడు తెచ్చుకుంటారు. పిల్లలను ఒడిలో కూచోబెట్టుకుంటారు. అలా మహిళలకు నచ్చిన ఏ సినిమా అయినా కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అవుతుంది. ‘లవకుశ’... తెలుగు సినిమాల్లో స్త్రీలు కొంగు బిగించి సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా. వారి కోసమని భర్తలు ఎడ్ల బళ్లు కట్టి థియేటర్ల దగ్గర బస చేసి వందల రోజుల పాటు ఆ సినిమాను ఆడించారు. సీతకు రావణుడితో ఒక గండం గడిచిందని అనుకుంటే ‘ప్రజాభిప్రాయం’ పేరుతో ఇంకో గండం వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి రాముడు భార్యను అడవులకు పంపాడు. నిండు చూలాలు, దీనురాలు, సాధ్వీమణి ఆమెకు దిక్కెవ్వరు? వాల్మీకి సంరక్షిస్తాడు. కంటికి రెప్పలా కాచుకుంటాడు. ఆమె కడుపున పుట్టిన కుశలవులకు రామాయణం పూస గుచ్చినట్టు చెబుతాడు. వాళ్లు గానదురంధరులవుతారు. ఏ తండ్రి తమను అడవుల పాలు చేశాడో ఆ తండ్రినే స్తుతిస్తూ ‘ఆలకించినా ఆలపించిన ఆనందం కలిగించే’ రామాయణగాథను వ్యాప్తి చేస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం ఆ కథను వింటూ ఆ పిల్లలను చూస్తూ అయ్యో వీరు తండ్రి వద్దకు చేరితే బాగుండే అని తలపోస్తూ ఉంటారు. పి.సుశీల, లీల ఎంతో హృదయాత్మకంగా ఆలపించిన ఈ జంట పాట న భూతో న భవిష్యతి.చిత్రం: లవకుశ (1963) సంగీతం: ఘంటసాల రచన: సముద్రాల రాఘవాచార్య గానం: పి.సుశీల, పి.లీల -
సాంగ్రే బంగారు రాజా
సంగీత దర్శకునిగా ఘంటసాల మొదటి చిత్రం ‘లక్ష్మమ్మ’. పిలువకురా... అలుగకురా... నలుగురిలో నను ఓ రాజా... పలుచన సలుపకురా... జానపదం లేని జాతి లేదు. జానపదంతో మెరవకుండా పోయిన సినిమా కూడా లేదు. అల్లంత దూరాన అట... ఆ సరోవరం ఒడ్డున అట... దేవకన్యలు వస్తారట.. స్నానానికి దిగుతారట... ఆమె వస్త్రం ఒకటి గట్టిగా పట్టుకుని వలచి ఉండిపోతారట... జనం చెప్పుకునే ఇలాంటి కథలనే అందంగా మలచి ‘సువర్ణ సుందరి’ కథ రాసుకున్నారు. దేవకన్య అయిన అంజలీదేవిని చూసి రాకుమారుడు అక్కినేని నాగేశ్వరరావు మనసు పారేసుకుంటాడు. మాయా సుందరి అని తెలిసినా పరిణయమాడుతాడు. ఆమె అతనికి వేణువు ఇచ్చి మాయమవుతుంది. దానిని ఊదినప్పుడల్లా ప్రత్యక్షమవుతానంటుంది. ఇక అతను ఆగలేకపోతాడు. విరహం ఊపినప్పుడల్లా వేణువును పెదాల దగ్గరకు చేరుస్తుంటాడు. పైన ఇంద్రసభలో ప్రభువు సమక్షంలో ఆమెకు వినోదపరిచే విధి ఉంటుంది. కింద వలచినవాడి వలపు పిలుపు వినిపిస్తూ ఉంటుంది. నడుమన ఆమెకు నలుగుబాటు. ‘సమయము కాదురా నిను దరిచేరా’ అని మొరపెట్టుకుంటూనే ఉంటుంది. కాని వినడు. ఫలితం ఇద్దరూ అనుభవిస్తారు. శాపానికి లోనవుతారు. ఆ కథ ఎలా ఉన్నా ఈ సందర్భంలో సముద్రాల సీనియర్ రచనకు పి.ఆదినారాయణరావు అందించిన సంగీతం ఆమోఘంగా ఉంటుంది. అప్పటికే హిందీలో ‘ఆవారా’ విడుదలై ‘ఘర్ ఆయా మేర పర్దేశి’ డ్రీమ్ సెట్టింగ్‌తో పెద్ద హిట్టవడం వల్ల ఈ పాట ట్యూన్‌పై, సెట్టింగ్‌పై ఆ ప్రభావం కనిపిస్తుంది. సుశీల గానంతో పాటు పాటలోని కేవలం తబలా చరుపులనే వింటూ ఉండాలి. ఆ అద్భుత తబలా విద్వాంసుడు ఎవరో. ఇప్పటికీ రేడియోలో ఈ పాట వినిపిస్తే చాలు... చేస్తున్న పనులు ఆపి పరిగెత్తి పోవాలనిపిస్తుంది. ఈ పాట వినడానికి ఎన్ని శాపాలైనా పడాలనిపిస్తుంది.చిత్రం: సువర్ణసుందరి (1957) సంగీతం: పి.ఆదినారాయణరావు రచన: సముద్రాల రాఘవాచార్య గానం: పి.సుశీల బీబీసీ నిర్వహించిన ఒక అంతర్జాతీయ సర్వేలో ఇళయరాజా సంగీతదర్శకత్వం వహించిన ‘దళపతి’ సినిమాలోని ‘అరె చిలకమ్మా’ పాట ‘మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్‌టైమ్ 10’లో ఒకటిగా నిలిచింది. -
సాంగ్రే బంగారు రాజా
మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ పాటలు తెలుగు శ్రోతలకు సుపరిచితమే. అయితే, ఆయన తొలి సినిమా పాట తెలుగులో కాదు, హిందీలో పాడారు. గాయకుడిగా ఆయన తొలి చిత్రం ‘మిస్టర్ సంపత్’ (1952). ఆ తర్వాత మూడేళ్లకు గానీ ఆయనకు తెలుగులో పాడే అవకాశం లభించలేదు. కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి దానా... / బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే / వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో... చాలాకాలం ఈ పాటను శ్రీశ్రీ రాశాడని అనుకున్నారు. ఇప్పటికీ అనుకునేవారు ఉన్నారు. కాని ఆత్రేయ దీనిని రాసి తన కలానికి ఈ అంచు కూడా తెలుసని నిరూపించుకున్నాడు. ఈ పాటను చూడకూడదు. వినాలి. చూస్తే కాంటెక్స్ట్ లేకుండా పాడుతున్నట్టు ఉంటుంది. వింటే ఎవరినో నిలదీస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి నేపథ్యం రష్యాలో ఉంది. సోవియెట్ యూనియన్ ఏర్పడ్డాక ప్రపంచ దేశాలలో చాలామంది దానివైపు ఆశగా చూశారు. తమ దేశాలలో కూడా ఇలాంటిది సాధ్యమవ్వాలని ఆకాంక్షించారు. ఉన్నవాడు లేనివాణ్ణి దోచుకోవడం అసమ సమాజం కొనసాగడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? మనదేశంలో కూడా సాహిత్యం, ముఖ్యంగా కవిత్వం ఈ నిలదీతను మొదలెట్టింది. కొందరికి అది ఫ్యాషన్ కూడా అయ్యింది. మంచి సిద్ధాంతం ఎవరికైనా ఆమోదమేనని రాయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా దానికి మద్దతుగా రాయగలరని ఆత్రేయ నిరూపించడానికా అన్నట్టు ఈ పాటను రాశాడు. ‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే... వారి బుగ్గన నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో’ అని కారులో షికారుకెళ్లే అమ్మాయిని ఉద్దేశించి అన్నా అది ప్రతి డబ్బున్నవాణ్ణి తాకుతుంది. ‘చెమట చలువ’ను చేర్చి పేదలెందరో పైవాళ్లకు చలువరాతి మేడలు కడతారట. ‘చిరుగుపాతల బరువూ బతుకుల నేతగాళ్ల’ కష్టం జిలుగు వస్త్రాల వెనుక ఉంటుందట. ఆత్రేయ అదరగొడతాడు. ‘చాకిరొకరిది సౌఖ్యమొకరిది’ అనే చెప్పే ఈ పాట తేలిక మాటల్లో సామ్యవాదం సారాన్ని చెబుతుంది. అనుభవించేవారిని మెత్తటి బెత్తంతో బాదుతుంది.చిత్రం: తోడికోడళ్లు (1957) సంగీతం: మాస్టర్ వేణు రచన: ఆత్రేయ గానం: ఘంటసాల నీ వుండేదా కొండపై నా స్వామి / నేనుండేది నేలపై ఏ లీలా సేవింతినో / ఏ పూల పూజింతునో తెలుగువారి అదృష్టం. వేంకటేశ్వరుడు మన తిరుపతి కొండల్లోనే వెలిశాడు. పెద్ద దూరాభారం లేదు. ఆపద వస్తే రాత్రికి రాత్రి పరిగెత్తుకుని పోవచ్చు. ఆనందం కలిగితే ఉన్నపళంగా బయలు దేరి ఆలింగనం చేసుకోవచ్చు. ఏడుకొండల ఎత్తున ఉన్నాడు. కాని కోరి కొలిస్తే ఎంత దగ్గర. అదివో అల్లదివో ఉన్నాడు. కాని ప్రార్థిస్తే ఎంత సన్నిహితం. తెలుగు సినిమా హాళ్లన్నీ ‘నమో వెంకటేశా నమో తిరుమలేశా’ పాటతోనే తెరను తొలిగించి రోజూ మొదటి ఆటను ప్రారంభిస్తాయి. ఆ స్వామి పేర్లలో ఏదో ఒకదాని మీద ప్రతి ఊళ్లో ఒక థియేటర్ అయినా ఉంటుంది. సినీ నిర్మాణ సంస్థలైతే లెక్కే లేదు. ఇక సినిమాల్లో ఆయనను శ్లాఘిస్తూ స్తుతిస్తూ ఉండే పాటలకూ సన్నివేశాలకు ఏకంగా కథలకు ఏం కొదవ? ‘భాగ్యరేఖ’లో ఈ పాట చాలామంది తెలుగువారికి సుప్రభాతం. దీనిని వింటే ఇంట్లో అగరు పొగలు వెలిగించినట్టుంటుంది. మంద్రధ్వనితో గంట మోగిస్తూ హారతి పడుతున్నట్టుగా ఉంటుంది. తులసి కోట మీద నుంచి మెల్లమెల్లగా వీస్తున్న గాలి ఒకటి మనసును తాకినట్టుగా ఉంటుంది. ‘ఈ పారిజాత సుమాలెన్నొ పూచి’... సుశీల గొంతు ఆయన పాదాల దగ్గర పూలు పెడుతున్నట్టుంటుంది. కృష్ణశాస్త్రి రచన గంధం రాసినట్టుగా. బాణీ పెండ్యాల కట్టాడు. ఇది హిందీలో ‘నా ఏ చాంద్ హోగా నా తారే రహేంగే’ (షర్త్) నుంచి ఇన్స్పిరేషన్ కావచ్చు. కాకపోనూ వచ్చు. ఆ మంద్రం మాత్రం అలాగే అనిపిస్తుంది.చిత్రం: భాగ్యరేఖ (1957) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రీ గానం: పి.సుశీల ముకుందా... మురారీ / జయ కృష్ణా ముకుందా మురారీ జయ గోవింద బృందా విహారీ / కృష్ణా ముకుందా మురారీ ఒక పాట ఎన్ని నిమిషాలుంటుంది? ఇప్పుడైతే మూడు నిమిషాలు. లేదా నాలుగు నిమిషాలు. లేదా అయిదు నిమిషాలు. మరీ అనుకుంటే ఏడు నిమిషాలు. కాని ఆ రోజుల్లో ఒక భక్తి గీతాన్ని ఏకంగా 11 నిమిషాల పాటు రికార్డు చేసి దానిని సినిమాలో ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి కదలకుండా చూపించి హిట్ చేసి అంతటితో ముగిసిపోకుండా కొన్ని తరాలపాటు నిలిచేలా ఒక పాటను నిలబెట్టడం అంటే తమాషా కాదు. ఆ ఫీట్‌ను సాధించింది సంగీత దర్శకుడు టి.వి.రాజు, రచయిత సముద్రాల, గాయకుడు ఘంటసాల. పిల్లలకు శ్రీకృష్ణలీలలు తెలియాలంటే పెద్ద పుస్తకాలు చేతిలో పెట్టక్కరలేదు. ఇప్పుడైనా ఈ పాట చూపిస్తే చాలు. సులభంగా గ్రహిస్తారు. పాండురంగ మహత్యం- జననీ జనకులకు మించిన దైవం లేదు అని పుండరీకుని ద్వారా నిరూపించిన కథ. ఎన్టీఆర్ తన సొంత బేనర్ మీద తీశారు. తండ్రి పాత్ర పోషించిన చిత్తూరు నాగయ్య పాదాలు నొక్కుతూ ఎన్టీఆర్ పాడే ఈ పాట ఘంటసాల అసామాన్య ప్రతిభ వల్ల ఒక్క క్షణం కూడా చెవి మరల్చకుండా వినేలా చేస్తుంది. మనసును భక్తి తరంగాలలో నింపుతుంది. ఇదే సినిమాలోని ‘అమ్మా అని పిలిచినా’ పాట కూడా పెద్ద హిట్. ఇటీవల ఈ సినిమా రీమేక్ కూడా అయ్యింది. ఏమైనా తెలుగు పల్లెటూళ్లల్లో గుడి తలుపులు తీయాలంటే ఇప్పటికీ ఎప్పటికీ ‘కృష్ణా ముకుందా మురారీ’ మొదటి గంటగా మోగాల్సిందే.చిత్రం: పాండురంగ మహత్యం (1957) సంగీతం: టి.వి.రాజు రచన: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల -
సాంగ్రే బంగారు రాజా
సోలో అయినా, యుగళగీతమైనా... పిఠాపురం పాడినవన్నీ దాదాపు హాస్యగీతాలే. ‘హాస్యగీతాల గోపురం’ పిఠాపురం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడారు. మాధవపెద్ది, పిఠాపురం జంటగాయకులుగా ప్రసిద్ధి పొందారు. కల్లాకపటం కానని వాడా... లోకం పోకడ తెలియని వాడా... ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా... నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా... కొసరాజు లేకపోతే తెలుగుపాటకు కొన్ని మొదళ్లు దొరికేవి కావు. మరికొన్ని కొసలు కూడా దొరికేవి కాదు. తెలుగు పాట ఆయనొచ్చాక ముద్దబంతి పూలు కట్టింది. మొగలి రేకు జడను చుట్టింది. పల్లెదేశమైన ఈ దేశంలో పల్లెదనం లేని సినిమాలు రావడానికి వీల్లేని ఆ రోజుల్లో పల్లెపాటకు కేరాఫ్ అడ్రస్‌గా కొసరాజు ఉన్నారు. ‘పెద్ద మనుషులు’ సినిమాలో ‘శివశివ మూర్తివి గణనాథ’ పాటతో మెరిసిన కొసరాజు ఆ వెంటనే వచ్చిన ‘రోజులు మారాయి’ సినిమాలో ఈ పాటతో సినీ కచ్చేరి వేపచెట్టు కింద పర్మినెంట్‌గా కండువా వేయగలిగారు. ‘నవధాన్యాలను గంపనెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకుని ముల్లుగర్రను చేత పట్టుకొని ఇల్లాలిని నీ వెంటబెట్టుకుని’... రైతే కాదు కొసరాజు కూడా పాటల ఏరువాక సాగించారు. భూమిని అదుపులో ఉంచుకుని పేదల్ని కామందులు పీడించుకు తినే రోజులు మారాయి అని చెప్పే ఈ సినిమాలో ఈ పాటకు వహీదా రెహమాన్ నర్తించడం దీనిని క్లాసిక్‌గా మార్చింది. పాట మొదలులో చేతులెత్తి ఆమె కొట్టే వృత్తాలు ఇవాళ్టికీ హీరోయిన్లకు సాధ్యం కాదు. ఇక మాస్టర్ వేణు ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా తప్పెట్ల బృందం తెప్పించి దీనికి మ్యూజిక్ చేశారు. వాళ్లకు తాళం రాకపోతే తానే తాళానికి తగినట్టు తప్పెట కొట్టి చూపించారు. జిక్కి గురించి చెప్పకపోతే కళ్లు పోతాయి. ఆమె ఈ పాటను మీదుమిక్కిలి సౌందర్యంతో పాడింది. పల్లెరైతులకు ఆడపడుచుగా మారింది. కొన్ని అలా కుదురుతాయి. ఈ పాట పంట అలా పండింది అంతే.చిత్రం: రోజులు మారాయి (1955) సంగీతం: మాస్టర్ వేణు రచన: కొసరాజు గానం: జిక్కి నిదురపో... నిదురపో... నిదురపో... / నిదురపోరా తమ్ముడా... నిదురపోరా తమ్ముడా... నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా... కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా... ‘కరుణలేని ఈ జగాన కలత నిదురే మేలురా’.... కాలికి దెబ్బ తగిలి ఏడుస్తున్న పిల్లాడిని ఓదారుస్తూ పాట మొదలవుతుంది. దయామయమైన జూనియర్ శ్రీరంజని ముఖం, ఆమె గొంతు నుంచి వెలువడుతున్న లతా మంగేష్కర్ పాట, తెలుగు వారిని దయదలిచి జోకొట్టిన ఆ మేలిమి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేము. ‘నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా’... అని లతా పాడుతుంటే ఎంతమంది కాసిన్ని లిప్తల పాటైనా తమ గతాన్ని మర్చిపోయారో... గాయపడే ఘటనల నుంచి ఎంత ఓదార్పు పొందారో... లెక్కే లేదు. హిందీలో 1949లో ‘మహల్’ సినిమా వచ్చి లతా ముద్ర ఇది అని ప్రకటించగలిగింది. 1953 ‘ఆహ్’ నాటికి ఆమె పేరు మరింత పాపులర్ అయ్యింది. ఆ సమయంలో అంటే 1955లో లతా పాట తెలుగులో వినిపించగలిగింది. సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి పూనిక వల్ల ఇది సాధ్యమైంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఫార్ములాకు తొలి రూపం ఉన్న సినిమాలలో ‘సంతానం’ ఒకటి. చిన్నప్పుడు విడిపోయిన ఒక తండ్రి బిడ్డలు మళ్లీ కలుస్తారు. పాటే కలుపుతుంది. లతాతో ఘంటసాల గొంతు కలిపారు. ‘లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే’... లైన్లో ఆయన చూపే కరుణ శిలను కూడా కుదుళ్ల నుంచి కుదిపేయగలదు. ఈ పాటతో తెలుగువారిది కరుణారుణం.చిత్రం: సంతానం (1955) సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి రచన: అనిసెట్టి సుబ్బారావు గానం: లతా మంగేష్కర్, ఘంటసాల రావోయి చందమామ... మా వింత గాథ వినుమా... రావోయి చందమామ సామంతము గల సతికీ... ధీమంతుడనగు పతినోయ్ /సతి పతి పోరే బలమై... సతమతమాయెను బ్రతుకే... వింతగాథే మరి. పెళ్లి కాలేదు. కాని దంపతులు. ఒకే చూరు కింద ఉంటారు. కాని శత్రువులు. ఇంతకు మించిన విడ్డూరం ఉందా? దీనిని ఎవరికి చెప్పుకున్నా భుక్తి పోతుంది. భార్యభర్తలం అని అబద్ధం చెప్పి తెచ్చుకున్న ఉద్యోగం పోతుంది. మళ్లీ అప్పుల పాలు కావాల్సి వస్తుంది. అందుకే సర్దుకుపోతున్నారు. అంతలోనే కీచులాడుకుంటున్నారు. అలిగినప్పుడల్లా మీడియేటర్‌గా చంద్రుణ్ణి వాళ్ల మధ్యకు లాగుతున్నారు. ఎమ్టీరావుగా ఎన్టీఆర్, మిస్సమ్మగా సావిత్రి ఆ కస్సుబుస్సుమనే జంట... నవ్వు దాచుకున్న నిండు చంద్రుడు... ఎ.ఎం.రాజా, పి.లీల పాట... తెలుగువారికి శాశ్వతంగా మిగిలిన ఒక ఆహ్లాదకరమైన సందర్భం. పింగళి నాగేంద్రరావు తన మాటలతో ఆడుకుంటాడు. ‘తన మతమేమో తనది మన మతమసలే పడదోయ్’ అనడంలో శ్లేష ఉంది. ఆమె మతం వేరు అనేది ఒక అర్థమైతే ఆమె స్వభావం వేరు అనేది మరో అర్థం. రామారావు ఇంత అందంగా ఏ సినిమాలోనూ లేడు. సావిత్రి ఇంత పెడసరంగా కూడా. సాలూరి ఈ పాటకు బాణీ కట్టే ముందు కాసిన్ని వెన్నముద్దలు తినేసి వచ్చుంటారు. లేకుంటే ఇంత చల్లదనమూ వెన్నెలదనమూ సాధ్యం కాదు. సామంతము గల సతికీ... ధీమంతము గల పతినోయ్... ఓహ్... ఇవాళ ఈ బాణీ వదలదు.చిత్రం: మిస్సమ్మ (1955) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: పింగళి నాగేంద్రరావు గానం: పి.లీల, ఎ.ఎం.రాజా -
సాంగ్రే బంగారు రాజా
వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీ కోసం పాటల ప్రపంచం పాటలో పడి మునిగినోళ్ల కోసం పడిశం పట్టినోళ్ల కోసం మలాం రాసినోళ్ల కోసం సూల్తాన్ కోసం గులాం కోసం పరమపదం కోసం మొదటి పాదం కోసం కూని రాగాల కోసం రాగాలను ఖూనీ చేసేవాళ్ల కోసం కచేరీల కోసం బాత్రూమ్ల కోసం వీళ్ల కోసం... వాళ్ల కోసం మీ కోసం... మా కోసం చెవి కోసుకునే వారి కోసం 'సాంగ్' సాంగ్రే బంగారు రాజా సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు కుర్రతనంలో ఇంట్లో నుంచి పారిపోయి బొంబాయిలో సంగీత వాయిద్యాలు అమ్మే దుకాణంలో పని చేశాడు. అక్కడ ఆయనకు రకరకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం, హిందీ సంగీత దర్శకులతో పరిచయం దొరికింది. ఓహోహో... పావురమా / వెరపేలే పావురమా తరుణ యవ్వనము పొంగి పొరలు / నా వలపు కౌగిలిని ఓలలాడరా హిందీలో కానన్ దేవి, నూర్ జహాన్, సురయ్యా పెద్ద సింగింగ్ స్టార్స్. అంటే తెర మీద పాడుతూ కూడా నటించేవారు. తెలుగులో తొలి తరం నటీనటులు ఇలాగే మొదలైనా స్టార్ డమ్‌ను అందుకుని తిరుగులేని ప్రతిభావంతురాలిగా నిలిచిన నటి మాత్రం భానుమతి రామకృష్ణే. ఒంగోలు ప్రాంతం నుంచి చెన్నై వెళ్లి నటించడం, పాడటం, ఆ తర్వాత నిర్మాత, దర్శకురాలిగా మారడం, సూట్టడియో కట్టడం సామాన్యమైన విషయం కాదు. ఒంటి నిండా బట్ట కట్టుకుని సినిమాల్లో నటిస్తేనే మహా పాపం అనుకునే రోజుల్లో ఈ పాటలో భానుమతి స్లీవ్ లెస్ జాకెట్లో కనిపించి మోడ్రన్‌గా కనిపించదలుచుకుంటే తెలుగువారు ఏం తక్కువ తినరు అని నిరూపిస్తారు. పైగా గానంలో వయ్యారం. ‘తరుణ యవ్వనము... పొంగి పొరలు నా వలపు కౌగిలిని ఓలలాడరా’ అంటూ పాపం తన మానాన తాను ఖద్దరు బట్టల్లో కూచుని ఏదో రాసుకుంటున్న చిత్తూరు నాగయ్య గారిని కవ్వించడం తబ్బిబ్బుగా ఉంటుంది. ‘స్వర్గసీమ’ సినిమాకు చిత్తూరు నాగయ్య సంగీత దర్శకుడే అయినా బాలాంత్రపు రజనీకాంతరావుతో దర్శకులు బి.ఎన్.రెడ్డి ఈ పాటను చేయించుకున్నారు. రచన కూడా బాలాంత్రపే. తెలుగువారి క్లాసిక్.చిత్రం: స్వర్గసీమ (1945) సంగీతం: చిత్తూరు వి నాగయ్య రచన: బాలాంత్రపు రజనీకాంతరావు గానం: భానుమతి రామకృష్ణ ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు / దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు ఏడ తానున్నాడో బావా / జాడ తెలిసిన పోయి రావా / అందాల ఓ మేఘమాల శిల్పానికి ప్రాణం ఉండకపోవచ్చు. కాని వారి ప్రేమకు ప్రాణం ఉంది. జీవం ఉంది. చిన్నప్పటి నుంచి అణువణువునా పెంచుకున్న పాశం ఉంది. మల్లి, బావా వేరు వేరు కాదు. ఆమె నిశ్వాస అతనికి ఊపిరి పోస్తుంది. అతడి స్వేదం ఆమె దప్పిక తీరుస్తుంది. ఈ సంగతి గాలికి తెలుసు. నీటికి తెలుసు. అదిగో ఆకాశాన ఎగిరే ఆ మేఘానికి తెలుసు. అందుకే తమ ఎడబాటును దానితో మొత్తుకుంటున్నారు. ‘జాడ తెలిసిన పోయి రావా’ అని మల్లి అంటోంది. ‘మల్లి మాటేదైనా చెప్పి పోవా’ అని బావ అంటున్నాడు. అతడు సంపాదించుకుని వస్తాను అని వెళ్లినాక విరహంతో వచ్చే పాట ఇది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పల్లకీని పంపి మల్లిని తన అంతఃపురానికి తెచ్చుకుని ఆ ఎడబాటును మరింత పెంచాడు. కృష్ణశాస్త్రి మాట కడితే బదులుగా సాలూరి పాట పుడితే ఘంటసాల గొంతు గాలిలో తేలి ఆడితే భానుమతి గళం జీర పలికితే ఈ పాట తెలుగువారి మనోహరమైన వేదన... ఎడబాటు... తల్చుకుని తల్చుకుని మరీ పొందే హాయైన ఓదార్పు. చిత్రం: మల్లీశ్వరి (1951) సంగీతం: సాలూరి రాజేశ్వరరావు రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి గానం: భానుమతి రామకృష్ణ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... ఓడిపోలేదోయ్... సుడిలో దూకి ఎదురీదకా... మునకే సుఖమనుకోవోయ్... మేడలోనే అల పైడిబొమ్మ... నీడనే చిలకమ్మా... కొండలే రగిలే వడగాలి...(2)... నీ సిగలో పూవేనోయ్... ప్రేమ విఫలమైతే పాట పుడుతుంది. తప్పు ఆమెదైతే నిందించడం సులువవుతుంది. కాని తప్పు మనదైనప్పుడు మనకు చేతగానప్పుడు మన నిస్సహాయతతో ఎదుటివారి కొంప ముంచినప్పుడు ఇక ఆ పాటంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. తెలుగులో ఇంత మార్మికమైన విరహగీతం ఇంకోటి లేదు. ఇలా అర్థం ఉందేమో పర్థం లేదేమో అనిపించే పాట కూడా ఇంకోటి లేదు. కొందరి దృష్టిలో ఇంతకు మించి తాత్వికత ఉన్న పాట కూడా మరొకటి లేదేమో. ‘సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్’... అంటే అదీ ఒక మంచి ఫిలాసఫీనే కదా. ‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పని లేదోయ్’ అని కూడా అంటాడు. ఇదీ ఫిలాసఫీనే. కాని ‘కొండలే రగిలే వడగాలి నీ సిగలో పూవేనోయ్’... అంటే మాత్రం భయం వేస్తుంది. దక్కని ఆమె సిగలోని పువ్వు కూడా అతడి గుండెల్లో వడగాలిలా వీస్తున్నదని అర్థం. ఆమెతో జీవితం కుడి అనుకున్నాడు. అది కాస్త ఎడమ అయ్యింది. పనికిమాలినవాడు కాబట్టి ఎడమే బెటరని సమర్థించుకుంటున్నాడు. పిరికి ప్రియులతో ప్రియులకి హింస. ప్రియురాళ్లకి హింస. చూసేవాళ్లకూ హింస. కాని అందరూ బస్తీమే సవాల్ అనలేరు కాబట్టి నోరు లేని ప్రేమికులందరూ ఈ పాటను ప్రేమించారు. మునకే సుఖమనుకున్నారు. అన్నట్టు ఇద్దరు పండితులు రాజమండ్రిలో రిక్షాలో వెళుతూ ఈ పాటకు అర్థమేమిటా అని తర్కించుకుంటుంటే అంతా విన్న రిక్షావాడు ‘తాగుబోతు మాటలకు అర్థమేముంటుందండీ’ అన్నాడట. ఆ పామరుడి సర్టిఫికెటే ఈ పాటకు ఆస్కార్ అవార్డ్. తాగినవాడు ఇలాగే పాడతాడు... ‘మేడలోన అల పైడిబొమ్మ నీడనే చిలకమ్మా...’...చిత్రం: దేవదాసు (1953) సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్ రచన: సముద్రాల గానం: ఘంటసాల -
కుడి ఎడమైతే...
తెలుగు పాటకు వేయి దళాలు... పదివేల పరిమళాలు... జనకోటి గళాలు... వీపున బుట్ట కట్టుకుని అన్నింటినీ కోసుకు రావడం ఏ ఒక్క తోటమాలికీ సాధ్యం కాదు. తెలుగు సినీ పూలవనంలో మొక్కలు, మహావృక్షాలు, తీగలు, లతలు, గుత్తులుగా పాటలు దాచుకున్న పొదలు అనేకానేకం. వరల్డ్ మ్యూజిక్ డే (జూన్ 21) సందర్భంగా ‘సాక్షి’ దోసిలి పడితే ఇవిగో... ఇవి దక్కాయి... మీరు పూలసజ్జ పడితే మీకు నచ్చినవి దొరుకుతాయి. వేరొకరు కొంగు చాపితే వారికి నచ్చినవి రాలుతాయి. నిజాయితీగా నచ్చేవిగా ఉన్న పాటలను ఇక్కడ రాశి పోశాం. కొందరు మహానుభావులు తప్పిపోయి ఉండవచ్చు. మరెన్నో విలువైన పాటలు మిస్ అయి ఉండవచ్చు. ఈ ఆదివారం ఓలలాడడానికి స్వరాల సముద్రంలో మునకలేయడానికి ఇవి మనకు ప్రాప్తమయ్యాయి. పాటకు వందనం. శిరసు వంచి ప్రణామం. వంద పల్లవుల ముద్దు పాఠక దేవుళ్లకు పాటల నైవేద్యం 1. ఓ హో హో... పావురమా 2. ఆకాశవీధిలో హాయిగా 3. కుడి ఎడమైతే 4. కల్లాకపటం కానని వాడా 5. నిదురపో... నిదురపో... 6. రావోయి చందమామ... 7. కారులో షికారుకెళ్లే 8. నీ వుండెదా కొండపై నా స్వామి 9. ముకుందా... మురారీ 10. పిలువకురా... అలుగకురా... 11. వివాహ భోజనంబు 12. కొండగాలి తిరిగింది... 13. కల కానిది విలువైనది... 14. శ్రీ సీతారాముల కల్యాణం 15. అయ్యయ్యో చేతిలో డబ్బులు 16. వినుడు వినుడు... 17. పగలే వెన్నెల... 18. మనసున మనసై... 19. తలచినదే జరిగినదా 20. అన్నా నీ అనురాగం 21. సిపాయి సిపాయి.... 22. స్వరరాగ గంగా ప్రవాహమే 23. ఛాంగురే బంగారు రాజా... 24. నయనాలు కలిసె తొలిసారి... 25. ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది 26. మధువొలకబోసే నీ చిలిపికళ్లు 27. శివ శివ శంకర భక్తవ శంకర 28. పట్నంలో శాలిబండ... 29. ఓ నాన్నా... నీ మనసే వెన్న 30. మాయదారి సిన్నోడు... 31. కురిసింది వానా... 32. బూచాడమ్మా బూచాడు... 33. ఈ జీవన తరంగాలలో... 34. స్నేహబంధము... 35. స్నేహమే నా జీవితం 36. కుశలమా నీకు కుశలమేనా... 37. పూజలు చేయ పూలు తెచ్చాను 38. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... 39. ఓ ప్రియతమా... ప్రియతమా... 40. పాడనా తెనుగు పాట... 41. చిత్రం భళారే విచిత్రం... 42. యాతమేసి తోడినా... 43. కదలింది కరుణరథం 44. జోరు మీదున్నావు తుమ్మెదా.. 45. మౌనమె నీ భాష... 46. శంకరా నాద శరీరా పరా... 47. మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా... 48. చిన్న నవ్వు నవ్వి వన్నెలెన్నొ 49. దేశమ్ము మారిందోయ్... 50. తెలుగు వీర లేవరా... 51. ఒక వేణువు వినిపించెను 52. రవి వర్మకే అందని... 53. నేనొక ప్రేమ పిపాసిని... 54. చినుకులా రాలి... 55. మౌనమేలనోయి... 56. వందేమాతరం... 57. ఈ తూరుపు.. ఆ పశ్చిమం... 58. జీవితం సప్తసాగర గీతం 59. లాలూదర్వాజ లస్కరు 60. మా పాపాల తొలగించు 61. మనసున ఉన్నది... 62. మౌనంగానే ఎదగమనీ 63. ఆనాటి ఆ స్నేహమానంద గీతం 64. నీ స్నేహం.... ఇక రాను అనీ 65. బండి కాదు మొండి 66. తెల్లారింది లెగండో... 67. రాలిపోయే పువ్వా... 68. పెదవే పలికిన మాటల్లోనే 69. ఉప్పొంగెలే గోదావరి... 70. జగమంత కుటుంబం నాది... 71. పొడుస్తున్న పొద్దు మీద... 72. నీలపురి గాజుల ఓ నీలవేణి 73. గోపికమ్మా... చాలునులేమ్మా 74. ఇటు ఇటు ఇటు అని... 75. మనసొక మధుకలశం... 76. ఓసి మనసా... 77. ఏ కష్టం ఎదురొచ్చినా... 78. భూమికి పచ్చని రంగేసినట్టు... 79. ఆహా ఏమి రుచి... 80. చిగురులు వేసిన కలలన్నీ... 81. జమ్ జమ్మల్ మర్రి ... 82. సుడిగాలిలోన దీపం... 83. విరిసినది వసంత గానం... 84. ముద్దుల జానకి పెళ్లికి... 85. మధుర మధురతర మీనాక్షి... 86. టప టప టప చెమటబొట్లు... 87. రోజావే చిన్ని రోజావే... 88. తళుకుమన్నది కులుకుల తార 89. ఏం పిల్లడో ఎల్దామొస్తవా... 90. పండగలా దిగివచ్చావు 91. ఏ దిక్కున నువ్వున్నా 92. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై 93. మెల్లగా కరగని... 94. ఓం మహప్రాణ దీపం... 95. నిదురించే తోటలోకి... 96. పల్లె కన్నీరు పెడుతుందో... 97. ఎలా... ఎలా... ఎలా... 98. రా రమ్మని... రారా రమ్మని... 99. నిజంగా నేనేనా.. 100. కనిపెంచిన మా అమ్మకే... - కూర్పు వ్యాఖ్యానం సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి