'సాంగ్‌'రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

'సాంగ్‌'రే బంగారు రాజా

Published Sun, Jun 19 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

'సాంగ్‌'రే బంగారు రాజా

'సాంగ్‌'రే బంగారు రాజా

రాజాజీ నవల ఆధారంగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘దిక్కట్ర పార్వతి’ (1974) తమిళ చిత్రానికి సుప్రసిద్ధ వైణికుడు చిట్టిబాబు సంగీత దర్శకత్వం వహించారు. ఇంకో విశేషం ఏమిటంటే  ఆయన ‘లైలామజ్నూ’ (1949) చిత్రంలో బాల మజ్నూ పాత్ర కూడా పోషించారు.
 
స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరగిపోదు / జీవితాంతమూ....

 
కొన్ని సినిమాలు ఎటు పోతాయో తెలియదు. 1973లో విడుదలైన స్నేహబంధం సినిమా కూడా ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం. దాసరి నారాయణరావు మాటలు. కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ, జమున తారాగణం. ఆ రోజుల్లో యాభై రోజులు ఆడినట్టుగా ఆంధ్రపత్రికలో యాడ్ వచ్చింది. కాని అందులోని ఈ పాట మాత్రం ఇప్పటికీ ఆడుతోంది. ‘స్నేహబంధమూ... ఎంత మధురము... చెరిగిపోదు తరిగిపోదు

జీవితాంతము’... బహుశా స్నేహం అంటే అందరికీ ఇష్టం కావడం వల్ల, స్నేహితుడు లేని మనిషి లేకపోవడం వల్ల, ప్రతి ఒక్కరి బాల్యంలో ఎవరో ఒకరు గాఢంగా స్నేహం చేసి ఉన్నందువల్ల, దానిని అంతే నమ్మకంతో ఆత్రేయ రాయడం వల్ల, ఎంతో మధురంగా సత్యం బాణీ కట్టడం వల్ల ఈ పాట నిలిచింది. ‘మల్లెపూవు నల్లగా మాయవచ్చును... మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును’...

కాని స్నేహం మాత్రం చెక్కు చెదరదు అంటారు ఆత్రేయ ఈ పాటలో. బాలు, సుశీల, ఆనంద్, రామకృష్ణ పాడిన ఈ పాట నిత్య మధురం. ముస్తాఫా.. ముస్తాఫా... డోన్ట్ వర్రీ ముస్తాఫా జనరేషన్‌కు ఈ పాట వినిపించాలి. ‘డోన్ట్ వర్రీ పాట’ను తక్కువ చేసేది ఏమీ లేదు కాని ఇలాంటి మంచి తెలుగు పాటను ఆ పాట చెప్పే బంధాన్ని పిల్లలకు వినిపించకపోతే మాత్రం నిజంగానే వర్రీ.చిత్రం: స్నేహబంధం (1973)
సంగీతం: సత్యం; రచన: ఆత్రేయ
గానం: రామకృష్ణ, బాలు, పి.సుశీల, జి.ఆనంద్

 
స్నేహమే నా జీవితం / స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది / స్నేహమే నా పెన్నిధి

 
‘జంజీర్’ స్క్రిప్ట్ సలీమ్-జావెద్‌లో సలీమ్ రాశాడు. దానిని ముందు ధర్మేంద్రకు అమ్మాడు. ఆ తర్వాత దేవ్ ఆనంద్ యాక్ట్ చేయాల్సింది. చివరకు దాని నొసటన అమితాబ్ బచ్చన్ పేరు రాసి ఉంది. అమితాబ్ కెరీర్‌ని, హిందీలో హీరో క్యారెక్టర్‌ని మార్చిన సినిమా అది. తెలుగులో అంత రౌద్రంగా, పవర్‌ఫుల్‌గా నటించడానికి కొత్త హీరో అక్కర్లేదు. నిప్పులాంటి మనిషి ఎన్టీ రామారావు ఉండనే ఉన్నాడు. అలా రీమేక్ అయ్యింది ‘నిప్పులాంటి మనిషి’.

జంజీర్‌లో ‘యారీ హై ఈమాన్ మేరా’ ఖవ్వాలీ పెద్ద హిట్. గుల్షన్ బావ్రా రాసిన ఈ ఖవ్వాలీని మన్నా డే పాడాడు. విధి నిర్వహణలో పడి ఒత్తిడికి లోనవుతున్న అమితాబ్‌ను అతని స్నేహితుడైన పఠాన్ పాత్రధారి ప్రాణ్ పిలిచి విందు ఇస్తాడు. ఆ సందర్భంలో నీకు నేనున్నాను నా స్నేహం ఉంది అని పాట ద్వారా చెప్తాడు. తెలుగులో ప్రాణ్ పాత్రను సత్యనారాయణ వేశాడు. రాసే పని సహజంగానే సినారెకు వచ్చింది.

‘అల్లాయే దిగి వచ్చి ఆయ్ మియా ఏమి కావాలంటే’.. అని సాకీ రాసి ‘స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం’ అని అద్భుతమైన పల్లవి రాశారు సినారె. పఠాన్‌లు స్నేహం చేస్తే ఖయామత్ తక్ అంటే కలియుగాంతం వరకూ స్నేహమే చేస్తారు. బహుశా స్నేహం పాటలను తెలుగులో ఎంచాలంటే ఖయామత్ తక్ ఈ పాట కూడా ఎంచబడుతూనే ఉంటుంది.చిత్రం: నిప్పులాంటి మనిషి (1974)
సంగీతం: సత్యం
రచన: డా.సి. నారాయణరెడ్డి
గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

 
కుశలమా నీకు కుశలమేనా...
మనసు నిలుపుకోలేక... మరీమరీ అడిగాను...
అంతే అంతే అంతే... కుశలమా నీకు కుశలమేనా...


 ఒక అగ్రహారం అమ్మాయి ఒక దళితుడిని వివాహం చేసుకోవలసి వస్తుంది విధివశాత్తు. తాళి కట్టే సమయం కాసేపే కావచ్చు. కాని ఆ తర్వాత ఏళ్ల తరబడి కాపురం చేయాలి. ఇంట్లో భర్త ఒక్కడే ఉండడు. అత్త ఉంటుంది. మామ ఉంటాడు. ఇంకా వచ్చేవాళ్లు పోయేవాళ్లు ఉంటారు. ‘మీ పద్ధతులు నాకు నచ్చట్లేదు’ అంటే ఎలా? వచ్చింది నువ్వు. వాళ్లు కాదు. అడ్జస్ట్ కావాల్సింది నువ్వే. వాళ్లు కాదు. కాని ఆమె వెళ్లిపోయింది.

భర్తను చులకన చేసి అత్తింటిని పలుచన చేసి... ఆమె నిర్ణయం ఒక బలిపీఠం. అది ఎందరిని బలి కోరింది? మొదటైతే వారి ప్రేమను బలి కోరింది. ఎడబాటుకు ముందు ఆ జంట ఎలా ఉండేది? ఒకరిని మరొకరు చూసి మురిసిపోతూ... ఒక్క క్షణం ఎడబాటు వచ్చినా ఏమో ఎలా ఉన్నారో అంటూ కుశలం తెలుసుకోవాలని ఉబలాట పడుతూ... చేయీ చేయీ పట్టుకుని పాడుతూ... ‘మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే... అంతే.. అంతే’....

చక్రవర్తి, కృష్ణశాస్త్రి కలిసి పని చేయడం కొంచెం విడ్డూరమే. కాని చక్రవర్తి తాను చేసిన పాటల్లో ఈ పాటను ఎంతో లలితంగా మెరిపిస్తాడు. కృష్ణశాస్త్రి మాటకు ఇంతకు మించి ఎవరూ న్యాయం చేయలేరన్నట్టుగా బాణీ కడతాడు. ‘అంతేనా’... అని ఎవరైనా అంటే ‘అంతేలే’.... అనక తప్పదు. బాలూ స్వేచ్ఛ సుశీల సామర్థ్యం మనకు తెలుస్తుంది. శోభన్‌బాబు, శారద కలిసి ‘పూలగాలి రెక్కల పైన నీలిమబ్బు పాయల పైనా’ ఈ పాటను ఎగురవేస్తూ గుర్తుండి ఇలా గుర్తొస్తూనే ఉంటారు.చిత్రం: బలిపీఠం (1975)
సంగీతం: చక్రవర్తి
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement