'సాంగ్‌'రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

'సాంగ్‌'రే బంగారు రాజా

Published Sun, Jun 19 2016 1:45 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

'సాంగ్‌'రే బంగారు రాజా

'సాంగ్‌'రే బంగారు రాజా

‘మాయాబజార్’లోని ‘వివాహభోజనంబు వింతైన వంటకంబు’ పాట ‘లాఫింగ్ పోలిస్‌మ్యాన్’ అనే పాత ఇంగ్లిష్ పాటకు అనుకరణ. ఆ పాటలోని పోలిస్ నవ్వు ఘటోత్కజుడుకి షిప్ట్ అయిందన్న మాట!
 
దేశమ్ము మారిందోయ్...
కాలమ్ము మారిందోయ్
కష్టాలు తీరేనోయ్...
సుఖాలు నీవేనోయ్...

 
ఆనకట్టలు మన ఆధునిక దేవాలయాలు అన్నాడు నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణాన్ని అందులో ప్రజలు పాల్గొనవలసిన అవసరాన్ని బోధిస్తూ హిందీలో ‘జాగ్తే రహో’, ‘దో ఆంఖే బారా హాత్’ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తెలుగులో రాముడు-భీముడు సినిమాలో కొంత ఆ స్పర్శను చూపిస్తూ ఈ పాటను కల్పించారు దర్శకుడు తాపీ చాణక్య. కొసరాజు

గ్రామీణ సొగసును రాసే కొసరాజు తన శైలికి భిన్నంగా లభించిన ఈ అవకాశాన్ని అవలీలగా సక్సెస్ చేశారు. ‘కండల్ని కరగదీయి బండల్ని విసరి వేయి నీదేలే పై చేయి’ అని చెప్పే ఈ పాట తప్పనిసరిగా ప్రస్తావించదగ్గ మంచి పాట. అన్నట్టు ఎల్.విజయలక్ష్మి ఈ పాటకు ముద్దుచుక్క.
 
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా...
దేశమాత స్వేచ్ఛకోరి
తిరుగుబాటు చేయరా

 
అల్లూరి సీతారామరాజు తెలుగుజాతికి నిత్య స్ఫూర్తి. ‘ఎవడు వాడు ఎచటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు’ అని తెల్లవాడిని ప్రశ్నించిన ధీశాలి. సాధారణ ప్రజలు నిజానికి బ్రిటిష్ అగత్యాలను నేరుగా భరించలేదు. ఆ కష్టాలు పడిందంటే గిరిజనులే. వీరి కోసం మొదటగా గెరిల్లా పోరు సలిపినవాడు అల్లూరి. ఆ వీరుడి మీద సినిమా తీసి నటుడు కృష్ణ చిరకీర్తిని పొందాడు. అతడి తేజాన్ని పాటగా మార్చి శ్రీశ్రీ జాతీయ అవార్డు పొందాడు. సంగీతం ఆదినారాయణరావు. అయితే పాటలో విశేషం ఉంది. అప్పటికే ఘంటసాల అనారోగ్యం బారిన పడ్డారు. శ్రీశ్రీ
అన్ని చరణాలు ఆయన పాడలేకపోయారు. సహాయకునిగా రామకృష్ణ రంగప్రవేశం చేసి పాటను పూర్తి చేశారు. చాలా మంది ఈ పాటను ఘంటసాల ఒక్కరే పాడారని అనుకుంటారు. కాని రామకృష్ణ తోడ్పాటు ఉంది. ఇద్దరూ కలిసి ‘ప్రతి మనిషి సింహాలై గర్జించాలి’ అని తెలుగు వారి గర్జనను వినిపించిన పాట ఇది.
 
ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక / ఒక రాధిక అందించెను నవరాగ మాలిక
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో...
నవ మల్లిక చినబోయెను చిరునవ్వు సొగసులో...

 
జి. ఆనంద్ తెలుగు సినిమాల్లో తక్కువ పాడినా ఆ కొద్ది పాటలతోనే తన ప్రభావం వేయగలిగాడు. మొదట కోరస్ గాయకుడిగా మొదలైతే సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్ ‘అమెరికా అమ్మాయి’లో ఈ పాట పాడే అవకాశం ఇచ్చి నలుగురి దృష్టిలో పడేలా చేశాడు. ‘సిరి వెన్నెల తెలబోయెను జవరాలి చూపులో’....  అని ఆనంద్ పాడుతుంటే  వినబుద్ధేస్తుంది. జి.ఆనంద్

మరో సినిమాలో జి.ఆనంద్ పాడిన ‘దూరాన దూరాన తారాతీరం’ కూడా హిట్టే. ‘దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ’ డ్యూయెట్ కూడా హిట్టే. అన్నట్టు 1975లో ‘చుప్ కే చుప్‌కే’ విడుదలైంది. అందులోని ‘చుప్ కే చుప్‌కే చల్ రే ఫుర్‌వయ్యా’ పాట ఆ 1976లో వచ్చిన ‘ఒక వేణువు వినిపించెను’ పాటకు ఇన్‌స్పిరేషన్.
 
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో...
రవి చూడని... పాడని నవ్యనాదానివో...
ఏ రాగమో తీగదాటి ఒంటిగానిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై...

 
రవి చూడనిది కవి చూస్తాడని అంటారు. ప్రఖ్యాత చిత్రకారుడు రవి వర్మ, పైన నిత్యం తేజస్సును వెదజల్లే సూర్యభగవానుడు వీరిద్దరూ చూడని తాను మాత్రమే చూస్తున్న అందమని తన ప్రియురాలిని ఈ ప్రియుడు బుట్టలో వేసుకుంటున్నాడు. ‘రావణుడే రాముడైతే’ పెద్దగా జనాకర్షణ పొందలేదు కాని ఈ పాట పెద్ద హిట్ అయ్యి నిలిచింది. ‘ఏ గగనమో కురుల జారి నీలమై పోయే... ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే’... వేటూరి భావుకత్వం జి.కె.వెంకటేశ్ కంపోజింగ్ సౌందర్యం... వెరసి ఈ పాట.బాలు

నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి...
నా దాహం తీరనిది...
నీ హృదయం కదలనిది


దీనిని రాసిన ఆత్రేయకు ఈ పాటంటే చాలా ఇష్టం. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం పాడటం ఇష్టం. ‘బాలూ ఫీలవుతూ పాడతాడు. వేరేవాళ్లు పాడటానికి ఫీలవుతారు’ అని ఆత్రేయ జోక్. ‘ఇంద్రధనుస్సు’ సినిమాను అందరూ మర్చిపోయారు. కాని ఈ పాటను ఎప్పటికీ మర్చిపోలేకున్నారు.

ఇందులో ప్రేమికుడి దుఃఖమేదో ఉంది. వేడుకోలు ఉంది. ఎవరికీ చెప్పుకోలేని జీర ఉంది. ‘నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది’... అంటుంటే ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడినవాళ్లంతా ఐడెంటిఫై అవుతారు. కె.వి. మహదేవన్‌ను ప్రత్యేకంగా పొగడాల్సిన పని లేదు. ప్రతిసారీ పొగడాలంటే మన వల్ల కూడా ఎక్కడవుతుంది చెప్పండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement