'సాంగ్‌'రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

'సాంగ్‌'రే బంగారు రాజా

Published Sun, Jun 19 2016 2:13 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

'సాంగ్‌'రే బంగారు రాజా

'సాంగ్‌'రే బంగారు రాజా

‘కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది..’ అనే పల్లవిని మొదట యథాలాపంగా రాశారు ఆరుద్ర.
 ఆ తరువాత ఇది పాటగా రూపుదిద్దుకుని ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ పాట పల్లవికి ప్రేరణ ఒక మోటు జానపదగీతం.

 
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా
మమ్ము కరుణించినావయ్యా
జన్మజన్మాల పుణ్యాల పంటల్లె నిన్ను దర్శించినామయ్యా / మేము తరియించినామయ్యా

 
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం సినిమా షిర్డీ సాయిబాబాను తెలుగువారికి మరింత చేరువ చేసింది. సినిమాతో పాటు ఆ పాటలు భక్తులకు మరింత ప్రియమయ్యాయి. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాలని దర్శక నిర్మాతలు అనుకోవడం విశేషం. ఎందుకంటే అప్పటికి ఇళయరాజా పీక్‌లో ఉన్నారు. చిన్న సినిమా భరించలేనంత పారితోషికం అడిగే స్థాయిలో ఉన్నారు.

అయినా సాయిబాబా సినిమా అనగానే ఎంతో మనసు పెట్టి ఆరాధనతో పాటలు చేశారు. ‘దైవం మానవ రూపంలో’, ‘బాబా... సాయి బాబా’, ‘సాయి శరణం బాబా శరణం శరణం’... పాటలన్నీ పెద్ద హిట్. ‘మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా’... పాట సాయి లీలలను గానం చేస్తుంది. మనకు ఆయనపై మనసు మళ్లిస్తుంది.
 
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి సంగతి
బయటికి రాదే ఎలా...

 
సంగీత దర్శకుడు శివ శంకర్ ఈ పాటతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ప్రియమైన నీకు’ విడుదలైనప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే. ప్రతి సంగీత పోటీల్లో ఎవరో ఒకరు ఈ పాట పాడాల్సిందే. బాణి, టెక్స్ట్, చిత్ర గానం... ఈ పాటను శ్రోతలకు చేరువ చేశాయి. ఇప్పటికీ రేడియో అండ్ టీవీల్లో మనసున ఉన్నది శ్రోతల అభిమాన గీతంగా కొనసాగుతోంది.  అయితే శివ శంకర్‌కు వెంటవెంటనే అవకాశాలు రాలేదు. కొంత విరామం తర్వాత  ఇప్పుడు హరిహరన్ పేరుతో పేరు మార్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
 
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది...
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది...


వేమన సులభంగా చెప్పాడు. వంగపండు సులభంగా చెప్పాడు. గోరటి వెంకన్న కూడా సులభంగా చెప్తాడు. పాటను సులభంగా చెప్తే జనం సులభంగా గుర్తు పెట్టుకుంటారు. చేరన్ తమిళంలో ‘ఆటోగ్రాఫ్’ తీశాడు. తెలుగులో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’గా రీమేక్ చేశారు. నిరుద్యోగం వల్ల దారీ తెన్ను లేకుండా తిరుగుతున్న హీరోని ఉత్తేజపరచాలి. అందుకు ఈ పాట. అంధులై ఉండి కూడా సంగీతం నేర్చుకుని కచ్చేరీలు ఇస్తూ జీవిక వెతుక్కునే వాళ్లు ఉన్నప్పుడు అన్నీ బాగుండి కూడా నిరర్థకంగా ఉండటం ఏం సమంజసం? అందువల్ల నిరాశ చెందక ముందుకు సాగమని ఈ పాట చెప్తుంది. ‘అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది... ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది’ అని చెప్పిన ఈ పాట తమిళంలోని మూలం కంటే ట్యూన్ రీత్యా భావం రీత్యా తెలుగులోనే బెటర్ పాట అనిపిస్తుంది. చంద్రబోస్, కీరవాణిలకు నూటొక్క మార్కులు.
 
ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మునుముందిక రావేమిరా....

 
వయసు మళ్లిందంటే అర్థం కేవలం వయసు మళ్లిందనే. అంతే తప్ప జీవితం అంతమైందని కాదు. ఇక మరేమీ లేదనీ కాదు. జ్ఞాపకాలుంటాయి. కథలు ఉంటాయి. తల పండిన అనుభవాలుంటాయి. కొత్తతరాలకు వినిపించాల్సినవి ఉంటాయి. తెలుగులో ఇద్దరు వయసు మళ్లిన స్నేహితులు తమ గత రోజులను తలుచుకుంటూ పాడుకునే పాట ఇదొకటేనేమో. అనుబంధంలో అక్కినేని, ప్రభాకర్‌రెడ్డిల మీద చిత్రీకరించిన ఈ పాట చూడటానికే కాదు వినడానికి కూడా చాలా బాగుంటుంది. గతం అనగానే జ్ఞాపకం అనగానే ఆత్రేయ కలం ఉరకలు వేస్తుంది. ‘నేను- మారలేదు... నువ్వు- మారలేదు... కాలం మారిపోతే- నేరం మనదేమి కాదు’ అనే పాట పెద్దల ఉనికికి విలువనివ్వమంటుంది. ‘ఈ గాలి మోస్తున్న వీరి కథ’లను వినమంటుంది.
 
 
నీ స్నేహం.... ఇక రాను అనీ
కరిగే కలగా అయినా
ఈ దూరం...  నువ్వు రాకు అనీ
నను వెలి వేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే...
నా మనసంతా నువ్వే...


రీ రికార్డింగ్‌లో ఫీల్ కోసం చేసిన ఒక బిట్ సాంగ్ ఆ సినిమాకు  ఒక ప్లస్ పాయింట్‌గా మారడం విశేషం. ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘నీ స్నేహం’... అని ఆర్.పి.పట్నాయక్ చేసిన ఈ సాంగ్ ముందు అనుకున్నది కాదు. ఆర్.ఆర్ చేస్తుండగా స్ఫురించింది. ఏదో ఒక బరువైన భావనను గాఢంగా ముద్ర వేసేలా ఈ ట్యూన్ ఉంటుంది. ఆర్.పి. గానం కూడా. ఎప్పటికైనా ఇది ఆర్.పి.కి ఐడెంటిటీ కార్డ్.
 
దురలవాట్ల మీద సూపర్‌హిట్ పాటలు రాశారు కొసరాజు. (సరదా సరదా సిగరెట్టు, అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...మొదలైనవి). ఇన్ని పాటలు రాసిన కొసరాజుకు పదేపదే కాఫీ తాగడం తప్ప మరే వ్యసనం లేదు.
 
బండి కాదు మొండి ఇది సాయం పట్టండి / పెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి... / గోపాలా... గోవిందా...
నాయికా నాయికలు బండెక్కి పాడే పాటలు చాలానే ఉన్నాయి. కాని బండి మీద కంప్లయింట్ చేస్తూ వచ్చిన ఈ పాట ఫేమస్. హిందీలో ‘ఖట్టా మీఠా’ సినిమా ఆధారంగా బాలచందర్ పర్యవేక్షణలో తమిళంలో సినిమా తీశారు. దాని రైట్స్ కొనుక్కుని మురళీమోహన్ తెలుగులో ‘రామదండు’గా తీశారు. సినిమా ఉల్లాసంగా ఉంటుంది. ఆత్రేయ రాసిన ఈ పాట కూడా. ‘ఎక్కడికి వెళ్లాలయ్యా... వెళ్లినాక చెప్తానయ్యా చెప్పకుంటే ఎలాగయ్యా... చెప్పినాక తంటాలయ్యా’....
 
తెల్లారింది లెగండో... కొక్కరొక్కో / మంచాలింక దిగండో... కొక్కరొక్కో....
ఒక కవి తన పాటను తానే సినిమాలో పాడుకోవడం తెలుగులో ఇంతకు ముందు ఉందా? సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఆ అవకాశం దక్కింది. గొల్లపూడి మారుతీరావు నాటకం ‘కళ్లు’ను సినిమాటోగ్రాఫర్ రఘు అంతే సమర్థంగా సినిమాగా మలచగలిగారు. నలుగురు అంధ భిక్షువుల కథ ఇది. అందరూ కలిసి ఒకరికి చూపు రప్పిస్తే ఆ వచ్చినవాడు కళ్లున్న వాళ్లు చూపే పాడుబుద్ధులన్నీ చూపిస్తాడు. చివరకు అందరూ కలిసి వాడి గుడ్లు పీకేసి దారికి తెస్తారు. ఆ సినిమాలో ఒక విశాఖ ఉదయాన్ని వర్ణించే పాట ఇది. ‘పాము లాంటి సీకటి పడగ దించి పోయింది... సావు లాంటి రాతిరి సూరు దాటి పోయింది’ అని చెప్పి చీకటి వదిలి వెలుగులోకి వెళ్లమని చెప్పే పాట ఇది. చెడును కాదు మంచిని చూడమని చెప్పే పాట. బాలసుబ్రహ్మణ్యం సంగీతం సుందరం. సుమధురం.
 
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే

చివరి ఆశ ఎప్పుడూ బీభత్సంగా ఉంటుంది. మరి కొద్ది క్షణాల్లో కొడిగడుతుందనుకున్న దీపపు వెలుగు ప్రజ్వలంగా ఉంటుంది. నెమ్మదించబోయే ముందు తుఫాన్ వేగం... ఆఖరు శ్వాస వదిలే ముందు అయినవారి వర్చస్సు... చాలా బీభత్సంగానే ఉంటాయి. ఈ దేశంలో ప్రతి కులం, మతం ఏదో ఒక మేరకు తమ హక్కును అడుగుతాయి. కాని ఈ దేశంలో ఏ కుల పెద్ద లేని కులం, ఏ దేవుడూ లేని మతం ఒకటి ఉంది.

ఏమిటో తెలుసా? అనాథ. తల్లిదండ్రీ లేనివాళ్లు, ఉన్నా వదిలిపెట్టవేయబడినవారు, అభాగ్యులు, దీనులు... ఎవరూ లేని అనాథలు... వారు ఏ హక్కూ అడగరు. ఏ రిజర్వేషన్ కోసమూ పోరాడరు. పూస్తుంటారు. రాలి పోతుంటారు. కాసింత నీలిమను వెతుక్కుంటూ వాలే పొద్దులైపోతుంటారు.

మాతృదేవోభవ అనాథలు కాబోతున్న పిల్లల కోసం తల్లి పడే వేదన. చివరి దీపావళిని తన పిల్లలతో చేసుకోవాలనుకుంటుందా తల్లి. అప్పటికే విడివిడిగా పరాయి పంచన చేరిన పిల్లలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు ఈ పాట వస్తుంది. పాటలో ఆ తల్లిని వేటూరి ‘పగిలే ఆకాశం’తో ‘మిగిలే ఆలాపన’తో పోలుస్తారు. కీరవాణి స్వరం హార్మోనియం మీదా మైక్ ముందూ ఆర్ద్రతను నింపుకుంది. తాకే పాట ఇది.
 
చిత్రం: మాతృదేవోభవ (1993)
రచన: వేటూరి
గానం, సంగీతం: కీరవాణి

 
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ / కదిలే దేవత అమ్మా... కంటికి వెలుగమ్మా
 ఏఆర్ రెహమాన్ తండ్రి రహెమాన్ చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లే సర్వస్వంగా పెంచింది. ఎవరూ చెప్పకుండానే దేశమాతకు కృతజ్ఞతగా వందేమాతరం ఆల్బమ్ చేసేవాడు ఎవరైనా చెప్తే అమ్మ మీద పాట ఎంత మనసు పెట్టి చేస్తాడు. మహేశ్‌బాబు సొంత సినిమా అయిన ‘నాని’లో అలాంటి సందర్భం వచ్చింది.

తల్లి తనను తిడుతోంది అని భావించే కొడుకు నిజానికి అది తిట్టడం కాదని తల్లి మనసు నిండా ఎప్పుడూ ఉండేది ప్రేమే అని గ్రహించినప్పుడు వచ్చే పాట ఇది. ఒక్కోసారి పాండిత్యాన్ని పరిహరిస్తే మామూలు మాటల్లోనే మంచి పాట పుడుతుంది. ‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలే దేవత అమ్మ’ అన్న వెంటనే అవును కదా మనకెందుకు అనిపించలేదూ అనిపిస్తుంది.

పాటతో కనెక్టివిటీ వచ్చేస్తుంది. ‘ఎనలేని జాలి గుణమే అమ్మ... కరుణించే కోపం అమ్మ... వరమిచ్చే తీపి శాపం అమ్మ’... అనడం అమ్మ గొప్పదనాన్ని కవి తిరగేసి చెప్పడమే. పాడిన ఉన్ని కృష్ణన్ ధన్యుడు. రాసిన చంద్రబోస్ ధన్యుడు. ఏం... వింటున్న మనం మాత్రం ధన్యులం కామా?
 
ఉప్పొంగెలే గోదావరి... / ఊగిందిలే చేలో వరి/ భూదారిలో నీలాంబరి / మా సీమకే చీనాంబరి
అమ్మ గోదావరి... తల్లి గోదావరి... తెలుగు జాతిని వొడిన కూచోబెట్టుకుని నాలుగు ముద్దలు కుడిపే గోదావరి... అన్నం పెట్టే గోదావరి... గొంతున నాలుగు గుక్కలు పోసే గోదావరి.... గోదావరి మీద పాట గోదావరి ఒడ్డున పాట... గోదావరితో పాటుగా పాట... తెలుగువారికి దక్కిన వరం. శేఖర్ కమ్ముల ‘గోదావరి’ మెల్లగా ఎక్కువమందికి నచ్చిన సినిమా.

అప్పుడెప్పుడో బాపు ‘అందాల రాముడు’ సినిమాను మొత్తం గోదావరి మీద తీశారు. ఇంత కాలానికి శేఖర్ కమ్ముల అదే పని అంతే అందంగా చేయగలిగాడు. ‘ఏసెయ్ చాప జోర్సెయ్ నావ వార్సెయ్ వాలుగా.... చుక్కానే చూపుగా’.... ఇలా ప్రవాహోద్వేగంతో పాడటం బాలూకే సాధ్యం. ‘ఆరేసిన మిరపలు గోదారమ్మకు కుంకుమ బొట్టు దిద్దాయని’ అనడం వేటూరికే సాధ్యం. రాధాకృష్ణన్ చాలా మంచి పాటలు ఇవ్వగల సంగీత దర్శకుడు. ఈ పాట అతడికి పుష్కర స్నాన పుణ్యం ఇచ్చి ఉంటుంది. గ్యారంటీ.
 
కొసరాజు పాటలు రాసే విధానం చిత్రంగా ఉండేది. ఆయన ఎక్కువగా నడిచేవారు. జేబులో ఎప్పుడూ స్లిప్పులు ఉండేవి. అలా నడిచివెళుతున్నప్పుడు ఏదైనా ఆలోచన వస్తే స్లిప్పుల్లో రాసుకునేవారు.
 
జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది / సంసారసాగరం నాదే... సన్యాసం శూన్యం నాదే...

నాటి హిందీ సూపర్‌స్టార్ రాజ్‌కపూర్, దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. రాజ్‌కపూర్ మిగిలిన హీరోల్లా కాకుండా నచ్చింది తింటూ కోరింది తాగుతూ మెచ్చింది చేస్తూ ఉండేవాడు. ఇది హృషికేశ్‌కు ఆందోళన కలిగించేది. ‘ఇలా ఉంటే ఎలా... నీకేమైనా అయితే?’ అనేవాడు. ‘అయితే ఏమవుతుంది? హాయిగా పోతాం.

అంతేకదా. అంతవరకూ మనం హ్యాపీగా ఉంటూ నలుగురినీ హ్యాపీగా ఉంచడానికి మించి కావలసిందేముంది’ అనేవాడు రాజ్‌కపూర్. ఆ మాటల స్ఫూర్తితోనే హృషికేశ్ హిందీలో ‘ఆనంద్’ సినిమా తీశాడు. మరో ఆరునెలల్లో కేన్సర్ వల్ల చనిపోబోతున్న రాజేష్ ఖన్నా ఆ ఆరునెలల్లో అందరికీ ఆనందం పంచడం కథ. ఇది ఎందరినో ప్రభావితం చేసి ఎన్నో సినిమాలకు మూలం అయ్యింది.

తెలుగులో ‘చక్రం’కు కూడా. అయితే తెలుగుకు దక్కిన మేలిమి చేర్పు ఈ పాట. ప్రకృతిలో ఉండే ‘యాక్సెప్టెన్స్’ను అన్యాపదేశంగా బోధిస్తుంది ఈ పాట. చెట్టు వాన కావాలని తుఫాన్ వద్దని అనదు. నేల పైరు కావాలని క్షామం వద్దని అనదు. నది ప్రవాహం కావాలని సంగమం వద్దని అనదు. వాటికి రెండూ సమానమే. మనిషి మాత్రం జీవం కావాలని మృత్యువు వద్దని సంతోషం కావాలని దుఃఖం వద్దని ఘటన కావలని దుర్ఘటన వద్దని అంటాడు. అది ఉన్నప్పుడు ఇదీ ఉంటుంది.

ఇదీ సూత్రం. కాని చివరి గడియలకు అది తెలుస్తుంది. అప్పటికే సమయం మించిపోయి ఉంటుంది. ‘నాకు రేపు లేదు... ఇవాళే’ అనుకున్నవారికి ఈ జగతి ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అందరూ ప్రేమాస్పదులుగా కనిపిస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ వంటి అల్పమైన విషయాలన్నీ కరిగిపోయి ఉత్త ప్రేమే మిగులుతుంది. జరామరణాల చక్రాన్ని ఎవరూ తప్పించుకోలేరు.

ఈ వృత్తాన్ని వీలైనంత ఆహ్లాదంగా సంతోషంగా మలుచుకో అని చెబుతుంది ఈ సినిమాలో ఈ పాట. ‘సంసార సాగరం నీదేననుకో సన్యాసం శూన్యం కూడా నీదేననుకో’ అంటుందీ పాట. సంగీత దర్శకుడు శ్రీ దీనిని పాడాడు. చక్రి ట్యూన్ చేశాడు. ఇద్దరూ తమ జీవితకాలంలో మనకు నాలుగు పాటలు మిగిల్చి దివ్యసంగీతంలోకి మరలిపోయారు.
 
చిత్రం: చక్రం (2005)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: చక్రి
గానం: శ్రీ కొమ్మినేని

 
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా... పోరు తెలంగాణమా...(2) కోట్లాది ప్రాణమా...
ప్రజా ఉద్యమంలో పాట కూడా దండే. అది సైన్యం. అది ఆయుధం. అది కవాతు. అదే మిలీనియం మార్చ్. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ప్రజల ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసింది. కళలు దానిని అందుకున్నాయి. దానిని అందించాయి. ఒకరొక మాట. ఒకరొక పాట. పాటల యుద్ధనౌక గద్దర్ ఈ హోరుకు మరో హోరు అవుదామను కున్నాడు. ఈ పోరుకు పాటను ‘వేరు’ చేద్దామనుకున్నాడు.

వాగ్గేయకారుడు, అనుకున్నంతలోనే పాటను అందుకో గలిగినవాడు, దార్శనికుడు పాట అందుకున్నాడు. ‘మా భూమూలు మాకేనని మర్లబడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా’... లక్ష గొంతులు దీనికి వంత పాడాయి. కోటి స్వరాలు దీనిని ప్రతిధ్వనించాయి. ‘మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా... కన్నీటి గానమా’... అని గద్దర్ పాడుతుంటే ఉద్వేగంతో కంఠనాళాలు పొంగించాయి. ఉద్రేకంతో కంటి ధారలు కురిపించాయి.

ఈ పాట ఇక్కడ ఒక ప్రాతినిధ్యం మాత్రమే. ఇంకా వందలాది గాయకులు ఉన్నారు... వందలాది పాటలు ఉన్నాయి. ఉద్యమం సాఫల్యమై తెలంగాణ సాకారమయ్యాక ప్రతి పువ్వుకు ప్రతి పుప్పొడికి ఈ జాతి కృతజ్ఞత ప్రకటిస్తోంది! ‘మా పాలన మాకేనని మండుతున్న గోళమా అమరవీరుల స్వప్నమా... అమర వీరుల స్వప్నమా...’
 
చిత్రం: జై బోలో తెలంగాణ (2011)
సంగీతం: చక్రి
రచన- గానం: గద్దర్

 
నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటె కృష్ణవేణి / లంగఓణి వేసుకుని నడుస్తువుంటే నిలవలేనె బాలామణి... నడుము చూస్తె కందిరీగ నడక చూస్తె హంసనడక

ప్రియురాలిని మెచ్చే ప్రియుడు ఇప్పటి వరకూ చాలా ఎక్స్‌ప్రెషన్సే వెతికాడు కాని- ‘నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి కలిగెనమ్మ ఏదో కోరిక’ అని చెప్పడం జనానికి నచ్చింది. ‘మహాత్మ’ సినిమాలో ఈ పాట హిట్. తను రాసిన పాటను తనే పాడే లక్కీ చాన్స్‌ను కాసర్ల శ్యామ్ కొట్టేశాడు. ఎఫ్‌ఎమ్‌లో బాగా మోగిన పాట ఇది.
 
గోపికమ్మా... చాలునులేమ్మా నీ నిదర / గోపికమ్మా... నిను విడనీమ్మా మంచుతెర
ఇటీవలి కాలంలో అత్యధికులు తమ రింగ్ టోన్‌గా పెట్టిన పాట ఇది. ‘ముకుందా’ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా మ్యూజికల్‌గా ఈ పాటతో నిలబడిపోయింది. మిక్కీ జె మేయర్ స్వరానికి సిరివెన్నెల పదం మేలిమి జతైంది. ‘కడవల్లో కవ్వాలు సడి చేస్తున్నా వినకా... గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలకా’... ఆ గోపికమ్మ నిదుర పోతుంటే నిదుర లేపే ఈ పాట శ్రోతల ఆహ్లాదాన్ని కూడా తట్టి లేపుతుంది. ఎందరు కొత్తవాళ్లు వచ్చినా చిత్ర చిత్రే అని నిరూపించిన పాట ఇది. గోపికమ్మా చాలును లేమ్మా...
 
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో... ఏమో... / అటు అటు అటు అని నడకలు ఎక్కడికో... ఏమో...
మనుషుల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, ప్రేమించే రెండు మనసుల మధ్య కంచె ఉండకూడదు అని తీసిన ఈ సినిమాలో ఈ పాట కూడా చాలా కంచెలను తీసేసింది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ గుజరాతీ. పాడినవాళ్లలో శ్రేయా ఘోషాల్  బెంగాలీ, అభయ్ జోధ్‌పుర్కర్ మధ్యప్రదేశీ. తీసిన దర్శకుడు తెలుగువాడు. వీళ్లందరూ కలిసి చేసిన పాట ఇది. కాని ఒక మార్కు ఎక్కువ సిరివెన్నెలకు పడుతుంది. ‘ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీథెలా ఎటు పోతుందో నిదుర ఎపుడు నిదరోతుందో మొదలు ఎలా మొదలవుతుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైందో’ అని రాసి కొత్త ప్రేమికుల అవస్థను అవస్థ లేకుండా వివరించినందుకు ఒకటి చాలదంటే రెండు కూడా వేయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement