సాంగ్‌రే బంగారు రాజా
సంగీత దర్శకునిగా ఘంటసాల మొదటి చిత్రం ‘లక్ష్మమ్మ’.
పిలువకురా... అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా... పలుచన సలుపకురా...
జానపదం లేని జాతి లేదు. జానపదంతో మెరవకుండా పోయిన సినిమా కూడా లేదు. అల్లంత దూరాన అట... ఆ సరోవరం ఒడ్డున అట... దేవకన్యలు వస్తారట.. స్నానానికి దిగుతారట... ఆమె వస్త్రం ఒకటి గట్టిగా పట్టుకుని వలచి ఉండిపోతారట... జనం చెప్పుకునే ఇలాంటి కథలనే అందంగా మలచి ‘సువర్ణ సుందరి’ కథ రాసుకున్నారు. దేవకన్య అయిన అంజలీదేవిని చూసి రాకుమారుడు అక్కినేని నాగేశ్వరరావు మనసు పారేసుకుంటాడు.
మాయా సుందరి అని తెలిసినా పరిణయమాడుతాడు. ఆమె అతనికి వేణువు ఇచ్చి మాయమవుతుంది. దానిని ఊదినప్పుడల్లా ప్రత్యక్షమవుతానంటుంది. ఇక అతను ఆగలేకపోతాడు. విరహం ఊపినప్పుడల్లా వేణువును పెదాల దగ్గరకు చేరుస్తుంటాడు. పైన ఇంద్రసభలో ప్రభువు సమక్షంలో ఆమెకు వినోదపరిచే విధి ఉంటుంది. కింద వలచినవాడి వలపు పిలుపు వినిపిస్తూ ఉంటుంది. నడుమన ఆమెకు నలుగుబాటు.
‘సమయము కాదురా నిను దరిచేరా’ అని మొరపెట్టుకుంటూనే ఉంటుంది. కాని వినడు. ఫలితం ఇద్దరూ అనుభవిస్తారు. శాపానికి లోనవుతారు. ఆ కథ ఎలా ఉన్నా ఈ సందర్భంలో సముద్రాల సీనియర్ రచనకు పి.ఆదినారాయణరావు అందించిన సంగీతం ఆమోఘంగా ఉంటుంది. అప్పటికే హిందీలో ‘ఆవారా’ విడుదలై ‘ఘర్ ఆయా మేర పర్‌దేశి’ డ్రీమ్ సెట్టింగ్‌తో పెద్ద హిట్టవడం వల్ల ఈ పాట ట్యూన్‌పై, సెట్టింగ్‌పై ఆ ప్రభావం కనిపిస్తుంది.
సుశీల గానంతో పాటు పాటలోని కేవలం తబలా చరుపులనే వింటూ ఉండాలి. ఆ అద్భుత తబలా విద్వాంసుడు ఎవరో. ఇప్పటికీ రేడియోలో ఈ పాట వినిపిస్తే చాలు... చేస్తున్న పనులు ఆపి పరిగెత్తి పోవాలనిపిస్తుంది. ఈ పాట వినడానికి ఎన్ని శాపాలైనా పడాలనిపిస్తుంది.చిత్రం: సువర్ణసుందరి (1957)
సంగీతం: పి.ఆదినారాయణరావు
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల
బీబీసీ నిర్వహించిన ఒక అంతర్జాతీయ సర్వేలో ఇళయరాజా సంగీతదర్శకత్వం వహించిన ‘దళపతి’ సినిమాలోని
‘అరె చిలకమ్మా’ పాట ‘మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్‌టైమ్ 10’లో ఒకటిగా నిలిచింది.