సాంగ్‌రే బంగారు రాజా
సంగీతదర్శకుడు రమేశ్‌నాయుడు తొలిచిత్రం తెలుగులోది కాదు. ‘బండ్వల్ పాహీజా’ (1947) అనే మరాఠీ చిత్రంతో ఆయన సంగీత దర్శకుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పదేళ్లకు గాని తెలుగులో తొలి అవకాశం లభించలేదు. తెలుగులో ఆయన తొలిచిత్రం ‘దాంపత్యం’ (1957).
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండీ / సిరి కళ్యాణపు బొట్టుని పెట్టి
మణిబాసికమును నుదుటిన గట్టి / పెళ్లి కూతురై వెలసిన సీత...
సీతారాముల కల్యాణం చూసే భాగ్యం నాడు ఎందరికి దక్కిందో. కాని తెలుగువారు మాత్రం ఈ పాటతో ఆ దివ్యకల్యాణాన్ని తమ ఆత్మ చక్షువులతో దర్శిస్తూనే ఉన్నారు. తమ పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూనే ఉన్నారు. తెలుగు పాటల్లో ఇంతకు మించిన టైమ్ మిషన్ పాట మరొకటి లేదు. ఎప్పుడు విన్నా సరే టైమ్ మిషన్ ఎక్కినట్టై మిథిలా నగరం చేరుకుని ఆ కల్యాణాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. ‘సిరి కల్యాణపు బొట్టును పెట్టి... మణిబాసికము నుదుటున కట్టి... పారాణిని పాదాలకు పెట్టి’...
పెళ్లి కూతురు సిద్ధం కాలేదట... కవి ఏమంటాడంటే ‘సీత వెలిసింది’ అంటాడు. అటు రాముడు తక్కువ తిన్నాడా? ‘సంపంగి నూనెతో కురులను దువ్వి కస్తూరి నామము తీసి చెంపన చుక్కను పెట్టి’ ఆయన కూడా వెలిశాడు. ఈ ఇద్దరి పెళ్లి ఎంత వైభవంగా ఉంటుందో చూడండి. ఎన్.టి.ఆర్ గొప్ప నటుడే కాదు ఈ సినిమాతో గొప్ప దర్శకుడు (టైటిల్స్‌లో ఆయన పేరు వేయకపోయినా) అని నిరూపించుకుంటాడు. తెలుగు ముంగిళ్లలో పెళ్లి అనగానే ఈ పాటే గుర్తుకు వస్తుందంటే ప్రతి జంటను ఈ పాటే ఆశీర్వదిస్తూ ఉన్నదంటే అది ఎన్ని జన్మల పుణ్యమో... ఈ పాటకు కారకులైనవారందరూ ఎంత ధన్యులో... వారికి వందనాలు.చిత్రం: సీతారామ కల్యాణం (1961)
సంగీతం: గాలి పెంచలనరసింహారావు
రచన: సముద్రాల
గానం: పి.సుశీల
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే...
ఉన్నది కాస్తా ఊడిందీ... సర్వమంగళం పాడింది...
పెళ్లాం మెడలో నగలతో సహా తిరుక్షవరమై పోయిందీ...
కింగ్ ధర్మరాజు దెబ్బ తిన్నాడు. ఎంపెరర్ నల మహారాజు మట్టి గొట్టుకుని పోయాడు. పాచికలు కాస్త పేక ముక్కలుగా మారాక ఇదిగో ఈ సినిమాలో మన రమణారెడ్డి కూడా పాపర్ పట్టిపోయాడు. అందరిదీ ఒకటే కేస్. చేతిలో చిల్లిగవ్వ లేదు. అప్పుడేం చేయాలి? ఇంకేం చేయాలి... కొసరాజు రాసిన పాటను పాడుకోవాలి. ‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే... అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే’.... అసలు పేకాడేవాళ్ల అంతర్గత వ్యవస్థే చాలా పకడ్బందీగా ఉంటుంది.
ప్లేయర్సు సిద్ధంగా ఉంటారు. పేక సిద్ధంగా ఉంటుంది. అప్పిచ్చేవాడు సిద్ధంగా ఉంటాడు. చాప పరిచిన చెట్టు సిద్ధంగా ఉంటుంది. ఇక చేయవలసిందల్లా ఆడి ఓడిపోవడమే. లాస్ వెగాస్ వెళ్లినా, మకావ్ వెళ్లినా, లోకల్‌గా మన గోవా వెళ్లినా అందరూ చేసొచ్చే పని అదే. ఓడిపోయి రావడం. వచ్చాక తమను తాము సపోర్ట్ చేసుకోవడం. ‘మహా మహా నల మహారాజుకే తప్పలేదు భాయి... ఓటమి తప్పు కాదు భాయి’ అని సర్ది చెప్పుకోవడం.
‘ఈసారి చేయి తిరుగుతుందేమో’ అని అనిపించడమే ఈ వ్యసనంలో గమ్మత్తు. ‘ఛాన్సు దొరికితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు’... అని దిగుతారు. మరి ‘పోతే?’.... ‘అనుభవమ్ము వచ్చు’ అని నెత్తిన చెంగేసుకుంటారు. రేలంగి, రమణారెడ్డి... రెండు జోకర్లతో ఛక్‌మంటూ షో కొట్టిన పాట ఇది. ఆడినవాళ్లు ఓడినా పాడిన వాళ్లు గెలిచిన పాట.చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: కొసరాజు రాఘవయ్య
గానం: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
వినుడు వినుడు రామాయణ గాథ / వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించిన / ఆనందం ఒలికించే గాథ
ఒక తల్లి, ఇద్దరు పిల్లలు, భర్త అనుమానం, ఆమె అడవుల పాలు... మహిళా ప్రేక్షకులకు కంటతడి పెట్టించడానికి ఇంతకు మించి సబ్జెక్ట్ లేదు. మహిళలంటే తాము మాత్రమే థియేటర్లకు రారు. భర్తను తోడు తెచ్చుకుంటారు. పిల్లలను ఒడిలో కూచోబెట్టుకుంటారు. అలా మహిళలకు నచ్చిన ఏ సినిమా అయినా కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అవుతుంది. ‘లవకుశ’... తెలుగు సినిమాల్లో స్త్రీలు కొంగు బిగించి సూపర్ డూపర్ హిట్ చేసిన సినిమా.
వారి కోసమని భర్తలు ఎడ్ల బళ్లు కట్టి థియేటర్ల దగ్గర బస చేసి వందల రోజుల పాటు ఆ సినిమాను ఆడించారు. సీతకు రావణుడితో ఒక గండం గడిచిందని అనుకుంటే ‘ప్రజాభిప్రాయం’ పేరుతో ఇంకో గండం వచ్చింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడానికి రాముడు భార్యను అడవులకు పంపాడు. నిండు చూలాలు, దీనురాలు, సాధ్వీమణి ఆమెకు దిక్కెవ్వరు? వాల్మీకి సంరక్షిస్తాడు. కంటికి రెప్పలా కాచుకుంటాడు.
ఆమె కడుపున పుట్టిన కుశలవులకు రామాయణం పూస గుచ్చినట్టు చెబుతాడు. వాళ్లు గానదురంధరులవుతారు. ఏ తండ్రి తమను అడవుల పాలు చేశాడో ఆ తండ్రినే స్తుతిస్తూ ‘ఆలకించినా ఆలపించిన ఆనందం కలిగించే’ రామాయణగాథను వ్యాప్తి చేస్తుంటారు. ప్రేక్షకులు మాత్రం ఆ కథను వింటూ ఆ పిల్లలను చూస్తూ అయ్యో వీరు తండ్రి వద్దకు చేరితే బాగుండే అని తలపోస్తూ ఉంటారు. పి.సుశీల, లీల ఎంతో హృదయాత్మకంగా ఆలపించిన ఈ జంట పాట న భూతో న భవిష్యతి.చిత్రం: లవకుశ (1963)
సంగీతం: ఘంటసాల
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల, పి.లీల