సాంగ్‌రే బంగారు రాజా
తొలితరం సుప్రసిద్ధ సంగీత దర్శకుల్లో ఒకరైన సుసర్ల దక్షిణామూర్తి అరుదుగా కొన్ని పాటలకు నేపథ్యగానం కూడా అందించారు. తొలిసారిగా ‘లైలామజ్నూ’ (1949) చిత్రంలో ఘంటసాల, మాధవపెద్ది సత్యంలతో కలసి ‘మనసు గదా ఖుదా’ పాటలో తన గళం వినిపించారు.
పగలే వెన్నెల... జగమే ఊయల... కదిలే ఊహలకే కన్నులుంటే...
నింగిలోన చందమామ తొంగిజూచే... నీటిలోన కలువభామ పొంగిపూచే
ఈ అనురాగమే... జీవనరాగమై... ఎదలో తేనెజల్లు కురిసిపోదా...
పియానో మీద మగవాళ్ల చేతులు కదిలితే ఏమో కాని ఆడవాళ్ల వేళ్లు కదిలితే మాత్రం ఆ రూపం రమ్యంగా ఉంటుంది. ఆ పియానో ఎదురుగా రౌండ్ స్టూల్ పై తేలిగ్గా కూచుని మోకాళ్లు అటూ ఇటూ ఊపుతూ జమున ‘పగలే వెన్నెలా జగమే ఊయల’ అని పాడుతూ ఉంటే సూట్ వేసుకొని సూటిగా చూస్తున్న అక్కినేని మైమరచిపోతాడు. పాట కలిగిస్తున్న పులకరింపుకు పరవశించి పోతాడు. ఇదంతా ఆమె తన పట్ల చూపిస్తున్న ప్రేమ అనుకుని భ్రమిస్తాడు.
‘ఈ అనుబంధమే మధురానందమై ఇలపై నందనాలు నిలిపిపోదా’ అని ఆమె పాడుతున్నది అతనితో అనురాగ బంధం కోసమే తప్ప దాంపత్య బంధం కోసం కాదు. కాని అతడి వైపు నుంచి అపార్థం జరిగిపోతుంది. ‘పూల రుతువు సైగ చూసి పికము’ పాడే... సి.నారాయణరెడ్డి సుందర ప్రయోగం అది. అసలు పగలే వెన్నెల అనడంలోనే ఒక అందం ఉంది.
ఇన్నాళ్లయినా ఈ పాట తెలుగు శ్రోతల మీద వెన్నెల కురిపిస్తూనే ఉంది. అన్నట్టు ఈ సందర్భంలోనే ఇదే సినిమాలోని ‘నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో’ గుర్తు చేయడం తప్పు కాదు. నిన్న లేని అందం నిదుర లేవడం... నిన్నటి పాట ఇవాళ చెవిన పడటం మధురం.. మృదులం... మనోహరం.చిత్రం: పూజా ఫలం (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: సి.నారాయణరెడ్డి
గానం: ఎస్.జానకి
మనసున మనసై బ్రతుకున బ్రతుకై... / తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో...
మహాప్రస్థానం శ్రీశ్రీ వేరు. సినీ మాయాజగత్తు శ్రీశ్రీ వేరు. కవిత్వం వరకూ ఆకలేసి కేకలు వేయడం, అన్నార్తుల పక్షాన నిలవడం... ఇదే శ్రీశ్రీ పని. కాని సినిమా జగత్తులో ఇది కుదరదు. ‘నా హృదయంలో నిదురించే చెలీ’ అంటూ ఒక నిమిషం ప్రేమికుడు కావాలి. మరునిమిషం ఒక బరువైన సన్నివేశానికి భాషనివ్వాలి. ఒక నిమిషం ఒక ఉత్పాతానికి పల్లవిని పల్లకీలా మోయాలి. ఒక నిమిషం ఇదిగో ఇలా చెట్టు కింద ప్రశాంతంగా సితార్ పట్టుకుని కూచుని తన కోసం తాను పాడుకునే భావుకుడు కావాలి. ‘ఆశలు తీరని ఆవేశములో... ఆశయాలలో ఆవేదనలో’..
ఒక తోడు కోరుకునే మనిషికి భావం ఇవ్వాలి. డాక్టర్ చక్రవర్తిలో హీరో నాగేశ్వరరావు ఎంతో మంచి హృదయం ఉన్నవాడు. సావిత్రిలో తన చెల్లెలిని చూసుకుంటున్నవాడు. కాని ఆమె పరాయివాడి భార్య. అనురాగం ప్రదర్శించాలని ఉన్నా ప్రదర్శించలేని నిస్సహాయత. మరోవైపు కట్టుకున్న భార్యతో పొసగడం లేదు. ఇలాంటివాడికి ‘మనసున మనసై బతుకున బతుకై’ నిలిచే తోడు కోసం పరితాపం ఉండటం సహజం.
ఇవన్నీ పక్కన పెట్టండి. శ్రీశ్రీ భావ గాంభీర్యం చూడండి. ‘చీకటి మూసిన ఏకాంతములో’ అంటాడు. అబ్బ... చీకటి మూసిన ఏకాంతం ఎంత భీతావహంగా ఉంటుంది. అలాంటి సమయంలో చిరుదివ్వెలాంటి తోడు కరస్పర్శలాంటి తోడు దొరికితే అంతకు మించిన భాగ్యం ఏముంటుంది. సాలూరి యథావిథి రసాలూరించాడు. మధ్యలో జగ్గయ్య కంఠం కూడా ఒక వాయిద్యమే. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీ కోసమే కన్నీరు నించుటకు... నేనున్నానని నిండుగ పలికే’ ఈ పాటకు కైమోడ్పు.చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: శ్రీశ్రీ
గానం: ఘంటసాల
తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు...
దేవుని స్క్రిప్ట్ రైటింగ్‌లో ట్విస్ట్‌లు చిత్రంగా ఉంటాయి. అదృశ్యరూపంలో ఉండే ఈ స్క్రిప్ట్‌లో తర్వాతి పేజీ ఏమిటో తెలియక మనిషి తికమకపడుతూనే ఉంటాడు. దైవం ఒకటి తలిస్తే తానొకటి తలుస్తూనే ఉంటాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కాని ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్లు గడిచాయి. భర్త కేన్సర్ బారిన పడ్డాడు. వైద్యం చేయాల్సింది మాజీ ప్రియుడే. కాని ఆమెకు అనుమానం.
నేను పెళ్లి చేసుకోలేదు కనుక నా భర్తను చంపేస్తాడా, ఆపరేషన్ సరిగ్గా చేయకుండా మరణం ప్రసాదిస్తాడా... మాజీ ప్రియుడి వైఖరి పట్ల ఆందోళన. అది భర్త గమనిస్తాడు. తాను మరణిస్తే గనుక తన భార్యను వితంతువుగా ఉంచకుండా పెళ్లి చేసుకుని పుణ్యస్త్రీగా పునర్జన్మను ప్రసాదించమంటాడు. కాని అవతల ఉన్నది మానవ రూపంలో ఉన్న దేవుడు. మనసే ఒక మందిరంగా కలిగిన గొప్పవాడు. అతనికి మాజీ ప్రియురాలి మీద ఎటువంటి కోపమూ లేదు.
తన పేషంట్ పట్ల ఎటువంటి విరోధమూ లేదు. చివరకు అతడా పేషంట్‌ను బతికించే పనిలో తానే ప్రాణం విడుస్తాడు. తమిళంలో హిట్ అయిన ‘నెంజిల్ ఒరు ఆలయం’కు రీమేక్ ఈ సినిమా. తమిళంలో హిట్ అయిన పాటను యథాతథంగా వాడితే ఆ భావాల్ని ఆత్రేయ తెలుగు చేశారు. ‘ఎదలో ఒకరే కుదిరిన నాడు మనసే ఒక స్వర్గం... ఒకరుండగ వేరొకరొచ్చారా లోకం ఒక నరకం’ అంటాడు. నిజమే కదా. పి.బి.శ్రీనివాస్ తన గొంతుతో సెట్ చేసిన మూడ్ ఆ పాటను పదే పదే వినేలా చేస్తుంది. ఇది దైవం తలచి చేయించిన పాటే అనిపించేలా ఉంటుంది.చిత్రం: మనసే మందిరం (1966)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
రచన: ఆత్రేయ
గానం: పి.బి.శ్రీనివాస్