సాంగ్‌రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

సాంగ్‌రే బంగారు రాజా

Published Sat, Jun 18 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

సాంగ్‌రే బంగారు రాజా

సాంగ్‌రే బంగారు రాజా

వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మీ కోసం పాటల ప్రపంచం

పాటలో పడి మునిగినోళ్ల కోసం
పడిశం పట్టినోళ్ల కోసం
మలాం రాసినోళ్ల కోసం
సూల్తాన్ కోసం గులాం కోసం
పరమపదం కోసం
మొదటి పాదం కోసం
కూని రాగాల కోసం
రాగాలను ఖూనీ చేసేవాళ్ల కోసం
కచేరీల కోసం బాత్రూమ్ల కోసం
వీళ్ల కోసం... వాళ్ల కోసం
మీ కోసం... మా కోసం
చెవి కోసుకునే వారి కోసం
'సాంగ్' సాంగ్రే బంగారు రాజా


సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు కుర్రతనంలో ఇంట్లో నుంచి పారిపోయి బొంబాయిలో సంగీత వాయిద్యాలు అమ్మే దుకాణంలో పని చేశాడు. అక్కడ ఆయనకు రకరకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం, హిందీ సంగీత దర్శకులతో పరిచయం దొరికింది.
 
ఓహోహో... పావురమా / వెరపేలే పావురమా
తరుణ యవ్వనము పొంగి పొరలు / నా వలపు కౌగిలిని ఓలలాడరా

 
హిందీలో కానన్ దేవి, నూర్ జహాన్, సురయ్యా పెద్ద సింగింగ్ స్టార్స్. అంటే తెర మీద పాడుతూ కూడా నటించేవారు. తెలుగులో తొలి తరం నటీనటులు ఇలాగే మొదలైనా స్టార్ డమ్‌ను అందుకుని తిరుగులేని ప్రతిభావంతురాలిగా నిలిచిన నటి మాత్రం భానుమతి రామకృష్ణే. ఒంగోలు ప్రాంతం నుంచి చెన్నై వెళ్లి నటించడం, పాడటం, ఆ తర్వాత నిర్మాత, దర్శకురాలిగా మారడం, సూట్టడియో కట్టడం సామాన్యమైన విషయం కాదు.

ఒంటి నిండా బట్ట కట్టుకుని సినిమాల్లో నటిస్తేనే మహా పాపం అనుకునే రోజుల్లో ఈ పాటలో భానుమతి స్లీవ్ లెస్ జాకెట్‌లో కనిపించి మోడ్రన్‌గా కనిపించదలుచుకుంటే తెలుగువారు ఏం తక్కువ తినరు అని నిరూపిస్తారు. పైగా గానంలో వయ్యారం. ‘తరుణ యవ్వనము... పొంగి పొరలు నా వలపు కౌగిలిని ఓలలాడరా’ అంటూ పాపం తన మానాన తాను ఖద్దరు బట్టల్లో కూచుని ఏదో రాసుకుంటున్న చిత్తూరు నాగయ్య గారిని కవ్వించడం తబ్బిబ్బుగా ఉంటుంది. ‘స్వర్గసీమ’ సినిమాకు చిత్తూరు నాగయ్య సంగీత దర్శకుడే అయినా బాలాంత్రపు రజనీకాంతరావుతో దర్శకులు బి.ఎన్.రెడ్డి ఈ పాటను చేయించుకున్నారు. రచన కూడా బాలాంత్రపే. తెలుగువారి క్లాసిక్.చిత్రం: స్వర్గసీమ (1945)
సంగీతం: చిత్తూరు వి నాగయ్య
రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
గానం: భానుమతి రామకృష్ణ


ఆకాశవీధిలో హాయిగా  ఎగిరేవు / దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావా / జాడ తెలిసిన పోయి రావా / అందాల ఓ మేఘమాల

 
శిల్పానికి ప్రాణం ఉండకపోవచ్చు. కాని వారి ప్రేమకు ప్రాణం ఉంది. జీవం ఉంది. చిన్నప్పటి నుంచి అణువణువునా పెంచుకున్న పాశం ఉంది. మల్లి, బావా వేరు వేరు కాదు. ఆమె నిశ్వాస అతనికి ఊపిరి పోస్తుంది. అతడి స్వేదం ఆమె దప్పిక తీరుస్తుంది. ఈ సంగతి గాలికి తెలుసు. నీటికి తెలుసు. అదిగో ఆకాశాన ఎగిరే ఆ మేఘానికి తెలుసు. అందుకే తమ ఎడబాటును దానితో మొత్తుకుంటున్నారు. ‘జాడ తెలిసిన పోయి రావా’ అని మల్లి అంటోంది.

‘మల్లి మాటేదైనా చెప్పి పోవా’ అని బావ అంటున్నాడు. అతడు సంపాదించుకుని వస్తాను అని వెళ్లినాక విరహంతో వచ్చే పాట ఇది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పల్లకీని పంపి మల్లిని తన అంతఃపురానికి తెచ్చుకుని ఆ ఎడబాటును మరింత పెంచాడు. కృష్ణశాస్త్రి మాట కడితే బదులుగా సాలూరి పాట పుడితే ఘంటసాల గొంతు గాలిలో తేలి ఆడితే భానుమతి గళం జీర పలికితే ఈ పాట తెలుగువారి మనోహరమైన వేదన... ఎడబాటు... తల్చుకుని తల్చుకుని మరీ పొందే హాయైన ఓదార్పు. చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

 
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్... ఓడిపోలేదోయ్...
సుడిలో దూకి ఎదురీదకా... మునకే సుఖమనుకోవోయ్...
మేడలోనే అల పైడిబొమ్మ... నీడనే చిలకమ్మా...
కొండలే రగిలే వడగాలి...(2)... నీ సిగలో పూవేనోయ్...

ప్రేమ విఫలమైతే పాట పుడుతుంది. తప్పు ఆమెదైతే నిందించడం సులువవుతుంది. కాని తప్పు మనదైనప్పుడు మనకు చేతగానప్పుడు మన నిస్సహాయతతో ఎదుటివారి కొంప ముంచినప్పుడు ఇక ఆ పాటంతా కన్ఫ్యూజన్‌గా ఉంటుంది. తెలుగులో ఇంత మార్మికమైన విరహగీతం ఇంకోటి లేదు.

ఇలా అర్థం ఉందేమో పర్థం లేదేమో అనిపించే పాట కూడా ఇంకోటి లేదు. కొందరి దృష్టిలో ఇంతకు మించి తాత్వికత ఉన్న పాట కూడా మరొకటి లేదేమో. ‘సుడిలో దూకి ఎదురీదకా మునకే సుఖమనుకోవోయ్’... అంటే అదీ ఒక మంచి ఫిలాసఫీనే కదా. ‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పని లేదోయ్’ అని కూడా అంటాడు. ఇదీ ఫిలాసఫీనే. కాని ‘కొండలే రగిలే వడగాలి నీ సిగలో పూవేనోయ్’... అంటే మాత్రం భయం వేస్తుంది. దక్కని ఆమె సిగలోని పువ్వు కూడా అతడి గుండెల్లో వడగాలిలా వీస్తున్నదని అర్థం.

ఆమెతో జీవితం కుడి అనుకున్నాడు. అది కాస్త ఎడమ అయ్యింది. పనికిమాలినవాడు కాబట్టి ఎడమే బెటరని సమర్థించుకుంటున్నాడు. పిరికి ప్రియులతో ప్రియులకి హింస. ప్రియురాళ్లకి హింస. చూసేవాళ్లకూ హింస. కాని అందరూ బస్తీమే సవాల్ అనలేరు కాబట్టి నోరు లేని ప్రేమికులందరూ ఈ పాటను ప్రేమించారు. మునకే సుఖమనుకున్నారు. అన్నట్టు ఇద్దరు పండితులు రాజమండ్రిలో రిక్షాలో వెళుతూ ఈ పాటకు అర్థమేమిటా అని తర్కించుకుంటుంటే అంతా విన్న రిక్షావాడు ‘తాగుబోతు మాటలకు అర్థమేముంటుందండీ’ అన్నాడట. ఆ పామరుడి సర్టిఫికెటే ఈ పాటకు ఆస్కార్ అవార్డ్. తాగినవాడు ఇలాగే పాడతాడు... ‘మేడలోన అల పైడిబొమ్మ నీడనే చిలకమ్మా...’...చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్.సుబ్బురామన్
రచన: సముద్రాల
గానం: ఘంటసాల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement