'సాంగ్‌'రే బంగారు రాజా | On June 21 World Music Day Special | Sakshi
Sakshi News home page

'సాంగ్‌'రే బంగారు రాజా

Published Sun, Jun 19 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

'సాంగ్‌'రే బంగారు రాజా

'సాంగ్‌'రే బంగారు రాజా

ఉర్రూతలూగించే సినిమా పాటలే కాదు ‘ఇళయరాజా క్లాసికల్స్ ఆన్ మాండోలిన్’ ఆల్బమ్‌లో కొన్ని కృతులను కర్ణాటక సంప్రదాయంలో స్వరపరిచారు ఇళయరాజా.
 
పూజలు చేయ పూలు తెచ్చాను / నీ గుడి ముందే నిలిచాను...
తీయరా తలుపులను రామా... ఇయ్యరా దర్శనము... రామా...

 
దొరికిన దేవతను పూజించు. కరుణించని దేవతను వదిలిపెట్టు. వశమైన ప్రభువునే సేవించు. జారిపోయిన విభుడిని వదిలిపెట్టు. వివాహానికి ముందు మనసు అనే అద్దంలో ఎన్నో ప్రతిబింబాలు కనపడుతూ ఉంటాయి. కవ్విస్తూ ఉంటాయి. ఉలికులికి పడేలా చేస్తుంటాయి. కాని వివాహం అయ్యాక ఒకే ప్రతిబింబం స్థిరపడిపోతుంది. అదే చిత్తరువులా మారి గోడకు వేలాడుతుంది. ‘పూజ’లో హీరో రామకృష్ణ వేరొకరిని ప్రేమిస్తాడు. కాని వాణిశ్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇది కుండ అని ఈ నీరు చల్లనైనవని గ్రహించడు.

ప్రవాహం కోసం అర్రులు చాస్తుంటాడు. ఆ ప్రవాహం తన మానాన తాను ప్రవహించిపోయిందని తెలుసుకున్నాక తాను ఇంతకాలం ఏం కోల్పోయాడో తెలుసుకుని లెంపలేసుకుంటాడు. వాణీ జయరామ్ ఈ పాటను తన లగ్న పరిచిన గానంతో పవిత్రం చేస్తుంది. దాశరథి రచన అందుకు కావలసిన తులసి పదాలను అందిస్తుంది. ఇక రాజన్ - నాగేంద్ర శ్రద్ధ తెలుస్తూనే ఉంటుంది. 1971లో హిందీలో ‘గుడ్డీ’ వచ్చింది. అందులో వాణీ జయరామ్ పాడిన ‘బోల్ రే పపీహరా’ పాట పెద్ద హిట్. దానిని కొంచెం సులభం చేసుకుంటే ‘పూజలు చేయ పూలు తెచ్చాను’...చిత్రం: పూజ (1975)
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: దాశరథి
గానం: వాణీ జయరామ్

 
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి... ఇక ఊరేల? సొంత ఇల్లేల? ఓ చెల్లెలా / ఏల ఈ స్వార్థం..? ఏది పరమార్థం...?
నన్నడిగి తలిదండ్రి కన్నారా..? నా పిల్లలే నన్నడిగి పుట్టారా? / పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా...
 
ఈ దేశంలో మధ్య తరగతి ఒక పెద్ద బజార్. అక్కడే సరుకులుంటాయి. కొనలేము. అక్కడే మనుషులుంటారు. అమ్మలేము. సరుకులు కావాలంటే డబ్బులు కావాలి. పెళ్లి కావాలంటే కట్నం ఇవ్వాలి. ఆడపిల్లలున్న తండ్రి పరారవుతుంటాడు. బాధ్యత మోయాల్సిన అన్న తాగుబోతు అవుతుంటాడు. ఉన్న చెల్లెలికి ఎప్పటికీ పెళ్లి కాదు. తల్లికి జబ్బు అసలే తగ్గదు. ఒక తమ్ముడికి పోలియోనో చూపు ఉండదో.

ఇక బజారు ఎలా నడవాలి? ఈ ఇంట్లో కనీసం అరవై కాండిళ్ల బల్పు ఎలా వెలగాలి? అలాంటప్పుడే ఎవరో ఒకరు మోస్తారు. అన్నీ తలకెత్తుకుంటారు. పంటి బిగువున బాధ దిగమింగుతూ ఇంటిని ఒంటి చేత్తో లాగుతారు. ‘అంతులేని కథ’లో జయప్రద లాంటి అక్క అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉంటుంది ఈ దేశంలో. ఏమో... అందరం బాగుపడతామేమో... ఎప్పటికైనా మంచి జరుగుతుందేమో... కాని మర్యాదల మధ్యతరగతి తెగించలేదు.

అలాగని పతనమూ కాలేదు. ‘ముళ్ల చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా... కళ్లు లేని కబోది చేతి దీపం నువ్వమ్మా’... అవును అది నిజం. అందుకే తాగుబోతైనా నిజం చెప్పాడు ‘నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా’... కాని ఆమె తన స్వార్థం తాను చూసుకోదు. కథంతా అయిపోయాక మళ్లీ అదే బస్‌స్టాప్ దగ్గర నిలబడుతుంది. అదే టికెట్‌ను మళ్లీ తీసుకుంటుంది. తెలుగు శ్రోతలు దశాబ్దాలుగా ఈ పాట వింటున్నారు. ఇప్పటికీ హాంట్ చేస్తూనే ఉంది. కె.జె.ఏసుదాస్, ఆత్రేయ, ఎం.ఎస్.విశ్వనాథన్... అందరివీ మధ్యతరగతి ఆత్మలు. అందుకే ఈ పాట మాయని ఆత్మతో రింగుమంటూనే ఉంటుంది.చిత్రం: అంతులేని కథ (1976)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
రచన: ఆత్రేయ
గానం: కె.జె.ఏసుదాస్

 
ఓ ప్రియతమా... ప్రియతమా... ప్రియతమా...
 నా మది నిన్ను పిలిచింది గానమై... వేణుగానమై నా ప్రాణమై...

 
ముఖేశ్‌ను తెలుగులో వినే భాగ్యం రాలేదు. కిశోర్‌నూ రాలేదు. కాని రఫీతో భాగ్యం వచ్చింది. అంతా నిర్మాత పుండరీకాక్షయ్య పట్టుదల, పుణ్యం. ‘భలే తమ్ముడు’లో ‘ఎంతవారు కాని వేదాంతులైన కాని’ అని రఫీ పాడితే తెలుగువారు విని తబ్బిబ్బయ్యారు. ఉత్‌నా బడా సింగర్ తెలుగులో పాడతాడా అని మురిసిపోయారు. ఆ తర్వాత ఆ చెన్నై-ముంబై బంధం కొనసాగింది. ఎన్టీఆర్- రఫీల బంధం...

నిమ్మకూరు కాయ- ఉత్తరాది ఉప్పులాగా కలగలసిపోవాలని తిరుమలేశుడు నిర్ణయిస్తే చేసేదేముంది? ‘నా మది నిన్ను పిలిచింది గానమై’... అని పాడుకోవడం తప్ప. హిందీలో రామానంద్ సాగర్ తీసిన ‘జీత్’ పెద్ద హిట్ అయితే తెలుగులో రీమేక్ చేశారు. అందులో కల్యాణ్‌జీ-ఆనంద్ జీ చేసిన బాణీలను తెలుగులో సాలూరు హనుమంతరావు యథాతథంగా వాడారు.

ఉర్దూలో పండితుడైన సినారెకు ఆ హిందీ బాణీకి తగిన తెలుగు వరస రాయడం చిటికెలో పని. ‘తలపులలోనే నిలిచేవు నీవే తొలకరి మెరపుల రూపమై’... అని చేతిలో పిల్లనగ్రోవితో కులూ లోయ ప్రవాహం అంచున కూచుని ఎన్టీఆర్ పాడటం... మెరుపు తీగలా ఉన్న వాణిశ్రీ అతణ్ణి వెతుక్కుంటూ ఆ సానువుల్లో కుతూహలపడటం... ఒక తాజా ఆపిల్‌బుట్టలాంటి జ్ఞాపకం. రఫీ... నీ పాటకు మేం ఆల్వేస్ హ్యాపీ.చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: సాలూరి హనుమంతరావు
రచన: సి.నారాయణరెడ్డి
గానం: రఫీ, ఎస్.జానకి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement